Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 36


    అలా ఇంట్లోకి వెళ్ళిన మనుషులు తనకు సంబంధించినవాళ్ళుగా అనిపించలేదు సాంబయ్యకు. ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో తోచక మెట్లమీద అలాగే నిలబడిపోయాడు సాంబయ్య. బలహీనంగా వున్న అతని కాళ్ళు గుంజాయి. వెళ్ళి పడకకుర్చీలో జారగిలపడ్డాడు. కారులోనుంచి అట్టపెట్టెలూ, కాగితంపొట్లాలూ లోపలకు పట్టుకొచ్చాడు కారు డ్రైవరు. సాంబయ్యకు కళ్ళు బైర్లుకమ్మాయి.
    కారు డ్రైవరుకు డబ్బిచ్చి పంపి, లోపలికొస్తున్న వెంకటపతికి తండ్రి గొంతుక కర్కశంగా విన్పించి ఠక్కున ఆగిపోయాడు.
    "ఏవిట్రా నీ వేషాలు నువ్వు?"
    కొడుకు తల వంచుకుని నిలబడ్డాడు. వెంకటపతి గుండెల్లో గూడు కట్టుకున్న భయం కరిగిపోసాగింది. తండ్రి ఎదుట పడటానికే జంకుతున్న వెంకటపతికి, మెల్లాలో అట్టపెట్టెలూ, పొట్లాలూ విప్పి చీరెలు సర్దుతోన్న వరూధిని కన్పించగా అడుగులు ముందుకు వేశాడు.
    "ఎక్కడికిరా అటుపోతావ్? నిన్నేరా అడిగేది? అసలు నీకేమైనా బుద్ది వుందంటారా?" తర్వాత సాంబయ్యకు ఏమనాలో తోచలేదు.
    "ఇప్పుడేమయిందేంటీ?"
    తనకొడుకేనా ఆ మాట అన్నది? సాంబయ్య నొసలు చిట్లించి కొడుకు ముఖంలోకి చూశాడు. వాడు తన కొడుకు వెంకటపతికాడు. వరూధిని మొగుడు వెంకటపతి! బలరామయ్య అల్లుడు వెంకటపతి!
    "కలుపుతీసేరోజుల్లో వెళ్ళి వారంరోజులు బస్తీలో కూర్చుంటావట్రా? నీకేమన్నా జ్ఞానముందా?" తోచినంతవరకూ అన్నాడు సాంబయ్య. అందులో తన బలహీనత తనకే వేలెత్తిచూపినట్టుంది. కొడుకు బుర్ర బద్దలుకొట్టాలనీ, వరూథిన్ని బయటకు నెట్టాలనీ ఆక్రోశించిన సాంబయ్య అంతకంటే ఏమీ అనలేకపోయాడు.
    "ఊఁ వెళ్తాలే పొలం!" అంటూ వెంకటపతి మెల్లాలోకి వెళ్ళాడు.
    "ఇంకానయం, నేనెందుకూ అన్నాడుకాదు! ఆమాత్రమైనా అన్నాడు" అనుకొన్నాడు సాంబయ్య.
    బూట్లు విడిచి కాళ్ళు చూసుకొన్నాడు వెంకటపతి. పాదాలు బొబ్బలెక్కి వున్నాయి.
    "ఇటు చూడు, వద్దంటే కొన్నావ్! కాళ్ళంతా పుండ్లుపడ్డాయి. వెధవ బూట్లు!" పెళ్ళానికి  కాలిబొబ్బలు చూపిస్తూ అన్నాడు వెంకటపతి.
    "కొత్తబూట్లు కదండీ! అలాగే వుంటుంది అలవాటయేదాక." మందహాసం చేస్తూ అంది వరూధిని.
    పొలం వెళ్ళబోతూ చెప్పులు తొడుక్కుని నడవలేక, చెప్పులు విడిచి కర్ర తీసుకొని బయలుదేరాడు వెంకటపతి.
    భర్తకు అడ్డం నిలబడి మొహంలోకి చూస్తూ అన్నది వరూధిని:
    "ఇంత ఎండలో ఎలా వెళ్తారు?"
    "ఎండాగిండా! కలుపుతీస్తున్నారు, త్వరగా వెళ్ళాలి!"
    "అయ్యోరాత! ఇలా వెళతారా? ఉండండి!" అని వరూధిని వెంకటపతి చేతిలోని కర్రలాగి అవతలపడేసి గొడుగు అందించింది. విడిచినబూట్లు తుడిచి భర్త కాళ్ళకు తొడిగింది.
    "ఇప్పుడు చూడండి ఎలా వున్నారో!" ఊడిన చొక్కాగుండీలను పెడుతూ అంది వరూధిని.
    మంత్రించిన బొమ్మలా వెంకటపతి బూటుకాళ్ళతో కుంటుకుంటూ, గొడుగు తీసుకొని పొలం బయలుదేరాడు.
    అలా వెళ్తున్న కొడుకుని చూసి "వీడు నా కొడుకు వెంకటపతా!" అనుకొన్నాడు సాంబయ్య.
    ధోవతి కాళ్ళమీదకు ఎగగట్టి, ముతకచేతులబనీనుతో, తలకు పైపంచ బిగించి, కిర్రుచెప్పులు తొడుక్కుని, ముల్లుకర్ర చేత్తో పట్టుకొని పొలం వెళ్ళే ఆ వెంకటపతి....తన వారసుడు......వెంకటపతి-తన కొడుకు వెంకటపతి ఏడి?.....వాడేమయ్యాడు? వాడెక్కడికి పోయాడు? సాంబయ్య పెదవులు వణికాయి. కనుగుంటల్లో ఎర్రటి జీరలు ఉబికాయి.
    మానసిక సంక్షోభంలోపడిన సాంబయ్య ఆరోగ్యమూ అంతంత మాత్రంగానే వుంది. ఇంట్లో వుండటమంటే ముళ్ళమీద ఉన్నట్లుగా ఉంది. కొడుకూ కోడలూ విడిచిన గాలి సోకినా కంపరం ఎత్తిపోతూంది. వాళ్ళు కళ్ళకు కనిపిస్తే ఖాండ్రించి వాళ్ళమీద ఉయ్యాలన్నంత అసహ్యపడేవాడు. ఆ పని అప్పుడప్పుడూ గోడమీద కానిచ్చేవాడు. వాళ్ళకుతోడు బుచ్చమ్మ ఒకతి. దాన్నయితే మొహం మీదే ఊసినంతపని చేసేవాడు. ఒంట్లో బాగా లేకపోయినా ఇంట్లో ఒక్కక్షణం వుండేవాడుకాదు. పొలానికో, రామాలయందగ్గరకో వెళ్ళి కూర్చొనేవాడు.
    ఓ రోజు రచ్చబండమీద కూర్చున్న సాంబయ్యను లక్ష్మీపతి పలకరించాడు.
    "సాంబయ్యా! మొన్న మీ ఇంటిముందు చిన్నకారు ఆగివుండటం చూశాను. అది కనకయ్యదేనా ఏమిటి?"
    "కనకయ్యా? కనకయ్య కారుకొన్నాడా ఏమిటి?" సాంబయ్య ఆశ్చర్యానికి అవధులు లేవు.
    "నీకు తెలియదా ఏంటి? వారంరోజులయిందని విన్నాలే. బస్తీనుండి ఊళ్ళకు బాడిగలకు తిప్పుతున్నాడటగా?"
    "ఏమోనయ్యా! నాకు తెలియదే!"
    "అయితే మొన్న మీ ఇంటికొచ్చింది కనకయ్య కాదన్నమాట?"
    "మా కోడలూ అబ్బాయీ వచ్చారయ్యా! మా వియ్యంకుడికి సుస్తీగా వుంటే వెళ్ళి చూసివచ్చారు" సాంబయ్య కంఠంలో గర్వం దోబూచులాడింది. 'బోడి కనకయ్య కారు కొనటమేమిటి? వాడు నా ఇంటికి కార్లోరావటం ఏమిటి? నా కొడుకూ కోడలే ఆ వచ్చినవాళ్ళూ, రాగలిగినవాళ్ళూ' అన్న ధోరణిలో అహంకారంగా మాట్లాడాడు సాంబయ్య.
    ఇంటికి తిరిగొస్తున్న సాంబయ్యకు అలా కొడుకూ కోడలూ కార్లో రావడం గొప్పగానే అన్పించింది. ఊరంతా ఆ విషయాన్నే చెప్పుకొంటున్నారన్న ఆలోచన సాంబయ్యకు ఆనందాన్నే కలిగించింది. వెంకటపతి బూట్లు తొడుక్కొని గొడుగు వేసుకొని వీధుల్లో నడుస్తుంటే ఊళ్ళోవాళ్ళు ఎట్లా చూసి వుంటారు? షావుకారు సాంబయ్య కొడుకు వెంకటపతి అంటున్నారా? షావుకారు బలరామయ్య అల్లుడు వెంకటపతి అంటున్నారా? సాంబయ్యకు ఏదీ తేలలేదు.
    కోతలు మొదలు పెట్టారు. వెంకటపతి గొడుగు వేసుకొనిగట్టుమీద కూర్చొని తూరుప్పొలం కోతలు అజమాయిషీ చేస్తున్నాడు. అప్పుడే పొలం వచ్చిన సాంబయ్య, కొడుకును ఓరగా చూసి పొలంలో దిగాడు. కూలీలమధ్య నిలబడి పనివాళ్ళను హెచ్చరించి వోదెలు మట్టసంగా వేయిస్తున్నాడు. అడ్డం దిడ్డంగా పడ్డ పైరుకంకుల్ని ఏరి వోదెల మీదకు విసురుతున్నాడు. లేని ఓపిక తెచ్చుకొని వరిచేలో తిరగసాగాడు. వెంకటపతి తండ్రి ఎండలో నిలబడటం చూసి జీతగాడికి గొడుగు ఇచ్చి పంపించాడు.
    జీతగాడు సాంబయ్య పక్కన నిలబడి గొడుగు పట్టుకున్నాడు.
    "ఏమిట్రా అదీ?" విసురుగా అడిగాడు సాంబయ్య.
    "చిన్దొరగారు చెప్పారయ్యా!"
    సాంబయ్యకు వళ్ళుమండిపోయింది. జీతగాడి చేతిలోనుంచి గొడుగులాగి విసిరి బురదలో పారేశాడు.
    "వాడికే పట్రా గొడుగు! నా కెందుకూ?" అని సాంబయ్య గట్టుకేసిచూశాడు. వెంకటపతి అప్పటికే గనందాటి కాలవ గట్టెక్కి ఇంటి తోవ పట్టాడు.
    "ఏంరా? అబ్బాయికి అన్నం తీసుకురాలేదా?" జీతగాడ్ని చూసి అడిగాడు.
    "దొరసానమ్మగోరు చిన్దొరగార్ని భోజనానికి ఇంటికే రమ్మన్నారు" అన్నాడు రాముడు, కిందపడ్డ గొడుగుఎత్తి బురద దులుపుతూ.
    "గాడ్దికొడకా, నీకు సుతారాలెక్కువై నట్టున్నాయ్ రా! అదవతల పెట్టి వోదెలెయ్యరా!" సాంబయ్య జీతగాడ్ని గద్దించాడు. వాడు బెదిరిపోయి చకచకా కోసిన వరి వాటాలు వాటాలుగా పట్టి వోదెలు వెయ్యడం మొదలుపెట్టాడు. వాడికీ అర్ధం అయింది తిట్టింది తననుకాదని కొంతసేపటికి.
    కుప్పలు వేయించటం పూర్తయింది. ఆరోజే సాంబయ్యకు తీరిక చిక్కింది. మనిషి పనిఎద్దడిలో సగం అంబపోయాడు. పళ్ళబిగువు మీద ఎలాగో కుప్పలు వెయ్యటం పూర్తి అయిందాకా తిరిగాడు. పనిలో వున్నంతవరకూ సాంబయ్యకు నీరసం అంతగా అన్పించలేదు. కాని ఆ రోజు స్నానంచేసి భోజనానికి లేవబోయిన సాంబయ్య తూలి పడబోయాడు. ఎలాగో నాలుగు మెతుకులు తిని, మంచంమీద మేను వాల్చాడు. అంతవరకు ఎవరో లాగి సందించివుంచిన నరాలు, సడలి విడిపోయినట్టుగా వుంది సాంబయ్య పని. "తిన్న అన్నం ఏమయిందో మరి, ఇంత నీరసంగా వుందేం?" అనుకుంటూ మాగన్ను వేశాడు సాంబయ్య. ఎంతసేపు పడుకున్నాడో, అసలు నిద్రపోయాడో లేదో తెలియకముందే కనకయ్య మాటలు విన్పించాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS