"ఇదిగో చూడండీ. ఆ అమ్మాయి డబ్బింగ్ పూర్తయ్యేవరకూ మీరు థియేటర్లోకి వస్తే నేను యింటికి వెళ్ళిపోతాను" అన్నాను.
"సరే - రాన్లే" అన్నారు.
పాత పందికొక్కులు బాగా మరిగాయి. శ్రీశ్రీగారిని పెనవేసుకొని బంధించాలనుకుంటున్న ఈ దుష్టశక్తుల్ని ముందు అణగదొక్కాలి. శ్రీశ్రీగారి నొక మనిషిని చెయ్యాలంటే, మన మొదటి దండయాత్ర ఇక్కడితోనే ప్ర్రారంభించాలి.
'అనుమానం కలిగిన ప్రతి పందికొక్కుకీ బుద్ది చెప్పడమే' - అని ఆరోజు నిశ్చయించుకొని నడుం కట్టుకున్నాను.
ఆ అమ్మాయి ధుమధుమలాడిపోతోంది. 'సాహసవీరుడు' ఆఖరి కాల్ షీట్ మూడు గంటలసేపు పొడిగించి వర్క్ పూర్తి చేసేద్దామనుకున్నాం.
అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.
రాత్రి ఒంటిగంట అయ్యింది. మొత్తం పిక్చర్ పూర్తిచేశాం. అందరూ శ్రీశ్రీగారి దగ్గర శెలవు తీసుకొని వెళుతూ, నన్ను కూడా పలకరించి నమస్కరించి వెళ్ళిపోతున్నారు. "ఏవండీ వెళ్ళొస్తానండీ. తరువాత పిక్చర్లో వారికి జ్ఞాపకం చెయ్యండి" - అన్నదామె.
"ఆ పనేదో మీరే చేసుకోండి" అన్నా.
"మీరు కూడా జ్ఞాపకం వుంచుకోండి" - అందామె.
"అధిక ప్రసంగాలు లేకుండా వుంటే, ఎవరి స్థానాలు వారివేనమ్మా! వాటి నెవ్వరూ ఆక్రమించరు. అది మీకే కాదు. నాకు కూడా వర్తిస్తుంద"న్నాను.
అంతలో శ్రీశ్రీగారు వచ్చారు.
"మీరెందుకొచ్చారండీ" - అన్నా.
"ఊరికే" - అని నవ్వారు.
"వస్తానండి శ్రీశ్రీగారూ మీ పిక్చర్లో నన్ను వెయ్యడం మరచిపోకండి" అందామె.
"ఆ మాట ఈవిడతో కూడా చెప్పు" అన్నారు శ్రీశ్రీగారు.
"చెప్పారులెండి. అయినా ముఖ్యులు మీరుండగా నాతో చెప్పి ఎంత, చెప్పక ఎంత?" అన్నాను.
"వెళ్ళొస్తానండి" - అందామె.
"బెస్టాఫ్ లక్! మళ్ళీ త్వరలో కలుసుకుందాం" అన్నాను.
"థాంక్సండీ" - అంటూ తలదించుకొని వెళ్ళిపోయింది.
"ఏమిటన్నావేమిటి?" - అని నన్ను అడిగారు.
"అనడానికే ఏముందీ! ఆడవాళ్ళం ఏదో మాట్లాడుకున్నాం. అయినా మీకెందుకంత ఇంట్రస్ట్?".
"వెళదామాని?" మాట మార్చేశారు.
ఇంతలో ప్రొడ్యూసర్లు వచ్చి, "చాలా సంతోషం అమ్మా! ఏ గొడవలూ లేకుండా పిక్చర్ పూర్తి చేశార"న్నారు.
"నాదేం వుందండీ! అంతా శ్రీశ్రీగారి దయ" అన్నాను.
అక్కడి నుండి వెళ్ళి వరండాలో సిగరెట్టు వెలిగించి కూర్చున్నారు శ్రీశ్రీగారు.
ప్రొడ్యూసర్లు ఆరోజు పిక్చర్ పూర్తయిపోతుందని అనుకోలేదు.
చాలా మెచ్చుకున్నారు. "అమ్మా! ఒక్కమాట. మీరు కోపగించకూడదు" అన్నారు.
"నాకు కోపం వస్తుందనుకున్న మాట అయితే చెప్పకండి సార్!" అన్నాను.
అది "కాదమ్మా! శ్రీశ్రీగారు చాలా కష్టపడి మా పిక్చర్ పూర్తి చేశారు. వారికీ విస్కీ ప్రజంట్ చేద్దామనుకుంటున్నాం" - అన్నారు.
"వారికి ప్రజంట్ చేయడానికి మీకు మరేమీ దొరకలేదా?" - అని ఠక్కున అనేశాను.
అది కాదమ్మా "వారికది చాలా ప్రీతి అయిన వస్తువు" కదా అన్నారు.
"అని మీతో చెప్పారా? కొంపదీసి ఈ మాట మీరు వారితో అనలేదు కదా?"
"లేదమ్మా! ముందు మిమ్మల్ని అడిగి తెప్పించాలనుకుంటున్నాం".
"మంచిపని చేశారు. చూడండి సార్" నాదో రిక్వెస్ట్ నేనిప్పుడే సినీ ప్రపంచంలో అడుగుపెట్టాను. అది కూడా శ్రీశ్రీగారి దగ్గరే నాకు అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం లభించింది.
నాకొచ్చిన చాలా అవకాశాలు వదులుకొని, వారి దగ్గరే పని కావాలని ఎంచుకున్నాను. వారి దగ్గర పని నాకో అగ్నిపరీక్ష లాంటిది. అందుకు మీ అందరి సహకారం నాకు ఎంతయినా అవసరం. మధ్యలో మీరిలాంటి మర్యాదలు కూడా ప్రవేశపెడతామంటే డబ్బు కోసం అని కూడా ఆలోచించకుండా, కొన్ని కంపెనీలకి మేం పనిచెయ్యడం మానుకోవలసి వస్తుంది. మీ పిక్చర్ పూర్తయిందన్న సంతోషంతో మీరిది ఆఫర్ చేస్తున్నారు. నిజంగా మీకు వారిమీద అంత అభిమానం, గౌరవం వుంటే, మీరు చేసే మర్యాద ఇంకో విధంగా కూడా చెయ్యొచ్చు. మీరున్నవాళ్ళు అయిదు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి వారిని సత్కరించండి సార్!
అన్ని విధాలా అది అందరికీ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ పిక్చర్ తీసి, మమ్మల్నే పెట్టుకుంటే మాత్రం మీరు ఆఫర్ చేస్తామన్న డ్రింక్ సంగతి కూడా ఒక క్లాజుగా అగ్రిమెంట్లో చేర్చాల్సి వస్తుంది, అధిక ప్రసంగం చేస్తున్నందుకు మన్నించాలి. నేను జీవితాన్ని సవాలుగా తీసుకొని శ్రీశ్రీగారి దగ్గర పనికి చేరాను. నేను వారి దగ్గర పనిచేసినంతకాలం కేవలం డబ్బులూ, పిక్చర్లే కాదు ముఖ్యం. వారి ఆరోగ్యంతోపాటూ, ఆరోగ్యకరమైన జీవితం, పేరూ కూడా ముఖ్యమే.
నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి ముందు ముందు చాలా సంఘర్షణల్ని ఎదుర్కోవలసి వుంటుంది. అందుకు మీ అందరి అండదండలు చాలా అవసరం"- అన్నాను.
ప్రొడ్యూసర్లు చాలా మెచ్చుకున్నారు. ఇంతలో శ్రీశ్రీగారొచ్చి "ఇంకా ఏమిటి ఆలస్యం?" అని అడిగారు.
"ఎడిటింగ్ అయి ఫస్టు ప్రింట్ వచ్చిన తర్వాత పిక్చర్ చూద్దాం సార్!" - అన్నారు ప్రొడ్యూసర్లు.
"తప్పకుండా.' చూద్దాం, అన్నారు శ్రీశ్రీగారు.
"మరి సెన్సార్ స్క్రిప్ట్ మాట ఏమిటి సార్?" అని వాళ్ళు అడిగారు.
"దానికి మీరు వేరే పేమెంట్ ఇస్తే సరోజ రాస్తుంది" అన్నారు శ్రీశ్రీగారు.
"అయితే ఉదయం కారు పంపిస్తాం. ఆఫీసుకి రండ"ని చెప్పారు.
"అలాగే" అని కిందికి దిగి కారు ఎక్కిపోయాం.
* * *
ఉదయం కారు వచ్చింది. పదకొండు గంటలకి ఆఫీసుకి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి 'వణంగాముడి' పిక్చర్ ప్రొడ్యూసర్ ఆఫీసులో మా కోసం ఎదురు చూస్తున్నారు.
"శ్రీశ్రీగారూ! ఈ పిక్చర్ అయిపోయిందిట. ఇక మనం పిక్చర్ ప్రారంభిద్దామా" అని అడిగేరు.
"మీరు మధ్యాహ్నం మూడు గంటలకి కారు పంపండి. మేం ఆఫీసుకొస్తాం. అక్కడ మాట్లాడుకుందాం" అన్నారు శ్రీశ్రీగారు.
సెన్సార్ స్క్రిప్ట్ గురించి డిస్కషన్ అయింది. "టైం వుంది కనుక మేము మైసూరు నుండి వచ్చాక సరోజ రాస్తుంద"ని చెప్పారు. వాళ్ళూ ఒప్పుకున్నారు.
ఇద్దరం డబ్బులు తీసుకొని బయలుదేరాం.
మధ్యాహ్నం రెండో కంపెనీ ఆఫీసుకు వెళ్ళాం.
"శ్రీశ్రీగారూ! మొదట మాకు పిక్చర్ టైటిల్ కావాలండీ. మేం అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వాలి" అన్నారు.
"నేను యింటికి వెళ్ళేలోగా చెప్తాను" అని సమాధానమిచ్చారు శ్రీశ్రీగారు.
మాకు స్క్రిప్ట్, పెద్ద పుస్తకం, పేపర్లూ, కార్బన్లూ, పెన్నులూ వగైరాలు ఇచ్చేశారు. మాకొచ్చిన చిత్రాలు ఒకటిని మించినట్టు ఇంకొకటి వుంది. అందులోనూ ఈ చిత్రంలో సావిత్రిగారున్నారు. అంటే లిప్ కి కరువేలేదు. ఫుల్ లిప్ మూమెంట్.
ఏదైనా పిక్చర్ స్క్రిప్ట్ తన చేతికి రాగానే శ్రీశ్రీగారు నా చేతికిచ్చేసేవారు. నేను తీసుకొని పెద్ద బైండ్ పుస్తకం ఓపెన్ చేసి, మొదటి పేజీమీద వారు సంతకం పెట్టిన తర్వాత, 'మాటలు-పాటలు - శ్రీశ్రీ' అని రాయించి పిక్చర్ టైటిల్ కూడా వారి చేతే రాయించేదాన్ని అది నా సెంటిమెంట్ అన్నీ రాశారు. "టైటిల్ ఏమిటి పెడదాం సరోజా?" అనడిగారు.
"ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతారేమిటి?" అన్నాను.
"నువ్వూ ఆలోచించు సరోజా!" అన్నారు.
"దీనిక్కూడా ఏదైనా 'వీరుడు' అని తగిలించండి" అన్నాను.
నవ్వుతూ "వెరీగుడ్ మంచి అయిడియా ఇచ్చావు" అని, "మధురై వీరన్ చిత్రానికి 'సాహసవీరుడు' అని పెట్టాంకదా! ఈ 'వణంగాముడి' చిత్రానికి 'తలవంచుకుని వీరుడు' అని పెడదాం" అన్నారు.
"బ్యూటిఫుల్ గా వుంద"న్నాను.
"ఉండు సరోజా! తొందరపడకు. ఇంకా ఆలోచిద్దాం".
"వద్దండీ. మీరిప్పుడు చెప్పిన టైటిల్ పిక్చర్ కి సరిగ్గా సరిపోతుంది. నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ టైటిల్ ప్లీజ్! ఈ పేరే వుంచండి" - అని గొడవ చేశాను.
"అయితే వెళ్ళి వాళ్ళని పిలిచి చెప్పు" అన్నారు.
"ఇక్కడికే పిలిచి మీ ఎదుటే చెప్తాను" అన్నాను.
* * *
