Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 36


    కిరణ్ గతుక్కుమన్నాడు. ఏదో వకటి మాట్లాడక పోతే కామిని మరింత అనుమానిస్తుంది అనుకున్నాడు. "కామినీ! నీవు చాలా తెలివికలదానివి అయ్యుండీ నన్ను చాలా అపార్ధం చేసుకున్నావు. జరిగిన సంఘటన ఇంకా నా మనసుని తొలచివేస్తుంటే, పదే పదే అది ఇంకా గుర్తుకు వస్తూంటే, మరచిపోవాలని ప్రయత్నిస్తూ మరచిపోలేక, ఇంకా ఆ షాక్ నుంచీ తేరుకోలేక ఇలావున్నాను. ఇపుడిపుడే మనిషిని అవుతున్నాను. త్వరలోనే పూర్వపు నీ చిలిపి కిరణ్ ని చూద్దువుగాని" అమాయకంగా మొహంపెట్టి చాలా జాలిగా ప్రేమగా చెప్పాడు కిరణ్.
    కిరణ్ చెప్పింది నిజమే అనిపించగా కామినీ కొద్దిసేపు మాట్లాడలేక పోయింది.
    కొద్ది క్షణాలు ఆగి ఇరువురు చక్కగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు.
    "ఇలా నువ్వు రోజూ వుంటే నిన్ను ఎందుకు అనుమానిస్తాను కిరణ్!" మనస్ఫూర్తిగానే అంది కామిని.
    "రోజూ వుండటంకాదు, ఈ క్షణంనుండే వుంటాను. నేను మామూలు మనిషిని కావాలంటే నీవొక పని చేయాలి."
    "ఏం చెయ్యాలి?" కామిని అడిగింది.
    "నేనడిగిన తరువాత నువ్వేమీ అనుకోవుగా!"
    "ఊహు....."
    "కామినీ! నీవారోజున నా మాటలు రికార్డు చేశానన్నావు. ఆ కేసెట్ రహస్యంగా తీసిన ఫోటోస్ నాకొక సారి చూపిస్తే..."
    "ఓహో ఈ ఎత్తంతా దానికోసమన్నమాట."
    "ఛ. ఛ. అపార్ధం చేసుకుంటున్నావు కామినీ! ఊరికినే చూద్దామని అంతే!"
    కామిని మరోసారి చాలా తెలివిగా దూరదృష్టితో ఆలోచించింది. "ఉన్నట్టుండి కిరణ్ లో ఇంతమార్పా?" అనుకుంది.
    "ఫోటోస్ చూపించమంటే చూపిస్తాను. వాటిని తగలబెట్టమన్నా తగలబెడతాను. కాని నెగిటివ్స్ ని మటుకు నాశనం చెయ్యను. అవి రహస్యమైన ఆ చోటులో పదిలంగా వుండవలసిందే."
    నోరుజారి కిరణ్ అనేశాడు. "అయితే నిజంగా ఫోటోస్ వున్నాయన్నమాట!" ముకుళించుకుని, నల్లపడ్డ మొహంతో అడిగాడు.
    కిరణ్ మొహం నల్లపడటం గమనించింది కామిని.
    "అర్ధమయింది. నా దగ్గర సాక్ష్యాధారాలు వున్నాయో, లేవో అని తెలుసుకోటానికి మంచి ప్లానే వేశావ్! చలచల్లగా మాట్టాడుతూ అసలు విషయంలోకి వచ్చావ్! అవునా!" అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అడిగింది కామిని.
    "లేదు లేదు" కంగారుగా అన్నాడు కిరణ్.
    "లేదో కాదో నీ కంగారు చూస్తుంటే తెలుస్తున్నది." కామిని వ్యంగ్యంగా అంది.
    "నా మీద నమ్మకం లేదన్న మాట!"
    "నమ్మకమనేది ఎలా వుంటుంది. ప్రవర్తనబట్టి వుంటుంది. నీవు మంచిగా మాట్లాడే సరికి నమ్మాను. నీ మాట తీరు ప్రవర్తనా అంత చక్కగా వుంది. కాబట్టి నమ్మానూ నువ్వు విషయం బైటపెట్టడంతో, నీ పధక మేమిటో అర్ధమయింది. దేనికన్నా అలవాటు పడ్డవాళ్ళు ఆ అలవాటుకి బానిస అవుతారు కాని విముక్తి పొందలేరు. ఒకసారి అబద్దం అడినవాడు, మళ్ళీ మళ్ళీ అబద్దాలు ఆడతాడు కాని, సత్యం పలుకుదామని అనుకోడు. ఒకసారి తప్పు చేసినవాడు ఆ తప్పును సరిదిద్దుకోడు. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి మరిన్ని తప్పులు చేస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఆ పనే." చాలా నిర్లక్ష్యంగా కఠినంగా అంది కామినీదేవి.
    తనగురించి కామిని నిజం గ్రహించడంతో కిరణ్ కి ఉక్రోషం వచ్చింది. చేతకాని కసి, కోపం బయటపడ్డాయి. ఆవేశంతో మనసులో వున్నది బయట పెట్టేశాడు.
    "నీవు ఆ రోజు నా మాటలు రికార్డు చెయ్యలేదు. ఫోటోస్ తియ్యలేదు. అంతా అబద్దం. లేనివి వున్నట్టు నటించి నన్ను భయపెట్టి నన్ను లొంగదీసుకున్నావు. ఏదీ నీ దగ్గర సాక్ష్యాధారాలు వుంటే చూపించు. లేనివి వున్నాయి అంటూ బుకాయించి చాలా పెద్ద డ్రామా ఆడావు."
    "ఈ విషయం నీ వెలా కనిపెట్టావు కిరణ్!" తెల్లబోయినట్లు మొహంపెట్టి అడిగింది కామిని.
    కామిని మొహం చూస్తూంటే మహా ఆనందం వేసింది కిరణ్ కి. "ఎలాగో అలాగ కనిపెట్టాను. అది నీ కనవసరం. నీవు పెదవి కదిపి చెపితే తప్ప వస్తురూపేణా అంటే ఫోటోలు కాని, కాసెట్ కాని లేవు. నీవు నిజం చెప్పలేవు. చెబితే నాతో పాటు నువ్వు కటకటాలు లెక్కపెట్టవలసి వుంటుంది. కనుక నీవు చెప్పవు. నీ దగ్గర కాసెట్, ఫోటోలు లేవు కాబట్టి, ఇంకా నేను నీకు భయపడక్కరలేదు. ఇంక తెలివి తక్కువగా నన్ను వాడుకోవాలని చూడకు. మంచిగా వుంటే సరే లేదా తన్ని తగలేస్తాను. జాగ్రత్త! ఇహపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించను. నిన్ను ఏం చెయ్యటానికైనా నేను రెడీ." కసిగా అన్నాడు కిరణ్.
    కామిని విరగబడి నవ్వింది.
    "ఎందుకు నవ్వుతావ్?" కిరణ్ కోపంగా అడిగాడు.
    "నీ తెలివితక్కువతనానికి!" ఇంకా నవ్వుతూనే అంది కామిని.
    "ఏమిటి తెలివితక్కువతనం?"
    "నీ మనసులోదంతా కక్కేసావు చూడు అంది."
    "కక్కడం ఏమిటి?"
    "ఒక మనిషిని రెచ్చగొడితే ఆవేశం పట్టలేక మనసులో రహస్యంగా దాచుకున్న మాటలని కక్కేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందో, తెలుసా కిరణ్! అలా కక్కటంవల్ల మనసులో ఏముందో పూర్తిగా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు కోపంతో ఏదేదో వాగావు చూడు! దానితో ఒక విషయం బాగా తెలిసింది. ఇకపై నేను మరింత జాగ్రత్తగా వుంటాను.
    "మరింత జాగ్రత్తగా అంటే నేనేమన్నా నీ ప్రాణం తియ్యబోతున్నానా!"
    "తీసినా తీస్తావ్! అది నీకేమంత పెద్ద విషయం కాదు. నా ప్రాణాల మీద నాకు తీపి కాబట్టి నేను జాగ్రత్త వహించక తప్పదు. అయినా జాగ్రత్తకూడా అనవసరమేమో. నా దగ్గర నీ ఫోటోస్, కేసెట్ వున్నంత వరకూ నా ప్రాణానికి ఏమీ ఢోకా లేదు." కామిని వ్యంగ్యంగా నవ్వుతూ అంది.
    "నీ దగ్గర ఫోటోస్ కాని కాసెట్ కాని ఏవీ లేవు. మాటకుముందు వాటిపేరెత్తి నన్ను బుకాయించకు. ఏదీ వుంటే చూపించు."
    "చూపించకపోతే నమ్మవన్న మాట."
    "నమ్మను."
    "నీ నమ్మకంతో నాకు పనిలేదు. నీవు నమ్మూ నమ్మకపో నాకనవసరం. నీ మనసులో మాట తెలిసింది కాబట్టి, ఇహ అసలు చూపే ప్రసక్తే లేదు. ఫోటోస్ చూపి నిన్ను నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. నీవు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకోవటం ఎప్పుడు మానేశావో అపుడే గ్రహించాను నీకు నాపై ఎంత కసివుందో నీవు సమయం చూసి తెగించి నా ప్రాణం తీస్తావని కూడా తెలుసు. అందుకే ముందు జాగ్రత్త వహిస్తూ ఒక పని చేశాను. మూడు కేసెట్ లు తయారుచేయించి మూడు చోట్ల, ఫోటోస్ ఎనిమిది చోట్ల, నెగిటివ్స్ ని అతి రహస్యప్రదేశంలొ దాచిపెట్టాను. నేను హత్య చేయబడ్డా యాక్సిడెంట్ లో మరణించబడ్డా, లేక సహజంగా మరణించినా, నా ప్రాణం ఎలా పోయిన సరే. పోయిన మరుక్షణం పోలీసుల చేతిలోకి ఆటోమాటిక్ గా ఫోటోస్, కాసెట్స్ వెళ్ళిపోతాయి. ఆ ఏర్పాట్లు పకడ్బందీగా చేసివుంచాను. ఇంక నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు నువ్వు." కామిని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS