Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 37


    తమిళంలో ఆగిపోయిన రెండు సినిమాలలో నటించిన పావని ఈ మధ్యనే రెండు తెలుగు సినిమాలలో నటించింది. అందులో ఓ సినిమా యిప్పుడు బాగా ఆడటంతో యిప్పుడిప్పుడే బిజీ అవుతున్నట్టు ఆఫర్స్ వస్తున్నాయి. "మీ అమ్మాయి కెమెరా ముందుకన్నా వెనకే బాగుంటుందని ఇద్దరు పెద్ద నిర్మాతలు కాంప్లిమెంట్ యివ్వడంలో ముచ్చటపడిన పావని ఆ 'వెనకే' వెసులుబాటు లేకుండా ప్రోత్సహించడం ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో తల్లి ఆలోచనల్ని మించి ఎదిగిపోయిన పావని నిర్మాత, దర్శకులు, నటులకేకాక విటులకి సంతృప్తినిచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
    "శెట్టిగారి సినిమాకి నేను డైరెక్టర్ని నా పేరు శివ"
    "విన్నాను" అంది. పావని శివని ఆపాదమస్తకం చూస్తూ "చెప్పండి"
    శివ ఆమె చూపుల్ని పట్టించుకోకుండా క్లుప్తంగా కథ గురించి, కథలోని ఆమె పాత్ర గురించి చెప్పి మరో వారంలోగా ప్ర్రారంభించబడే సినిమాకి కాల్ షీట్స్ కావాలన్నాడు.
    "అన్నీ సరే...." అంతసేపూ ద్వారం మాటున నిలబడ్డ పావని తల్లి కామాక్షి రంగప్రవేశం చేసింది. "మీరు రేటు మాట్లాడలేదు."
    శివ తొణకలేదు. అప్పటికే తన బడ్జెట్ ఎంతో పేపరుపై రాసుకున్న శివ "ఏభైవేలు. మీరు సరేనంటే శెట్టిగారు అడ్వాన్స్ పంపుతారు" అన్నాడు.
    పాతికవేలు యిస్తామని చెప్పిన రిలీజైన సినిమా నిర్మాత అప్పటికీ పావన్ని ఎడాపెడా వాదేసుకున్నాడు. పదివేలు మించి ముట్టచెప్పలేదు. శివ చెప్పిన రెమ్యూనరేషన్ చాలా ఎక్కువే.
    "మేము లక్ష అడుగుదామనుకుంటుంటే మీరు యాభై అంటున్నారు. పైగా మా అమ్మాయి సినిమా ఇప్పుడు సూపర్ హిట్టు" చెప్పింది కామాక్షి.
    "సూపర్ హిట్టయినా అందులో మీ అమ్మాయి హీరోయిన్ కాదు. అయిదుగురు అమ్మాయిల పాత్రల్లో తనూ ఒకరు. కానీ నా సినిమాలోని యిద్దరు హీరోయిన్స్ లో ఒకరు. అంటే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకునే అవకాశమున్న పాత్ర."
    "అలా అంటే కుదరదు"
    "మీ యిష్టం" పైకి లేచాడు.
    కంగారుపడిపోయింది కామాక్షి. ఒకటే బేరమన్నట్టు తేల్చేసి బింకముగా వెళ్ళిపోవాలనుకుంటుంటే అడ్డుపడింది. "అదికాదు డైరెక్టరు గారూ! మీరంతా ఖండితంగా వుండటం ఏం బాగుంటుంది. వేషం వేయడమంటే వేషం ఒక్కటే కాదుగా మీకూ కొన్ని సర్ధాలుంటాయి. అవుట్ డోర్ షూటింగ్ లకి వెళ్ళినప్పుడు మా అమ్మాయి కంపెనీ మీకు అవసరమవుద్ధి రాత్రిపూట మాటా ముచ్చటలుంటాయి."
    నిశ్చలంగా చూశాడు శివ. సిగ్గువదిలి యిక్కడో నటి తల్లి తన కూతురు నుంచి ఎలాంటి ఆనందాన్ని పొందొచ్చో వివరంగా తెలియచేస్తూంది. కోపం రాలేదు. ఈ సినీరంగ కాలుష్యంలో అడుగుపెట్టి ఆ కంపుని సుగంధంలా భావిస్తూ మాట్లాడటాన్ని చూసి జాలిపడ్డాడు. అంతే.    
    "ఈ సినిమా వరకూ....." మృదువుగా అన్నాడు పావన్ని చూస్తూ "మీరు వేయాల్సింది వేషం మాత్రమే. మీరనే వేషాలు కాదు. నా పరంగా మీకలాంటి యిబ్బంది వుండదని హామీఇస్తున్నాను."
    కామాక్షికే కాదు పావనికి మొహం వాచిపోయినట్టయింది.
    "అదికాదు సర్...." పావని ఏదో చెప్పబోయింది.
    "చూడండి మిస్ పావనీ" అర్దోక్తిగా అన్నాడు "నేనో ప్రవరాఖ్యుడ్ని అవునో కాదో నాకూ తెలీదు. కానీ యిప్పటికింకా నేను నేనుగానే మిగిలివున్నవాడ్ని. కాబట్టి మీ నుంచి అలాంటి సుఖాలు అవసరం లేదంటున్నాను. ఓ.కే."
    అవకాశం జారిపోయేట్టుందనిపించిందేమో వెంటనే అంది కామాక్షి.
    "మీరేమిటో తెలుసుకోవాలని అలా అన్నానే తప్ప మాకు మాత్రం అవన్నీ యిష్టమా డైరెక్టరుగారూ....సరే.....మంచి పాత్రంటున్నారుగా అడ్వాన్స్ పంపించండి"
    శివ వెళ్ళిపోయాడు తల్లీ కూతుళ్ళకిద్దరికీ షాకిచ్చి.
    అతడు వెళ్ళి పది నిమిషాలైనా కాలేదు. సుదర్శనరావు నుంచి ఫోన్ వచ్చింది.
    ఫోన్ రిసీవ్ చేసుకున్నది పావనే. "సర్....మీరు...." బోలెడంత తొట్రుపడిపోయింది. "నిజంగా డైరెక్టరు సుదర్శనరావుగారేనా?"
    కూతురి కంగారు చూసిన కామాక్షికే మతిపోయింది. భారీ చిత్రాల డైరెక్టర్ సుదర్శనరావేమిటి? యింటికి ఫోన్ చేయడమేమిటి?
    "నేనే పావనీ"
    "నమ్మలేకపోతున్నాను సర్ నేనే కాదు. మా అమ్మ కూడా"
    "నాకు అవసరం మీ అమ్మతో కాదు"
    కిసుక్కున నవ్వింది పావని.
    "నీతో"
    "నిజంగానా?" గారాలు పోయింది ఇరవైయేళ్ళ పావని. "నేను చాలా అదృష్టవంతురాల్ని."
    "అవునో కాదో తేల్చుకోవాలీ అంటే నువ్వు అర్జెంటుగా నా గెస్ట్ హౌస్ కి రావాలి."
    "తప్పకుండా"
    "అరగంటలో మా కారు డ్రైవర్ మీ యింటికి వస్తున్నాడు"
    ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS