"మరి ఆ ఇద్దరమ్మాయిలు...."
"ఒకరు పావని..... రెండో అమ్మాయి....." ఆగాడు.
"చెప్పు."
"ఈ మధ్యనే సినిమా రంగంలో అడుగుపెట్టిన సుకృతి ఆమె బెటరనుకుంటాను."
చివుక్కుమంది శెట్టి మనసు. అది సుకృతిని తను కాకుండా అతను రికమెండ్ చేసినందుకు కాదు. శివని డైరెక్టరుని చేయమన్న సుకృతి శివే సజెస్ట్ చేస్తున్నందుకు.
ఇద్దరికీ అంత బలమైన పరిచయముందా? సుకృతి కేవలం సొత్తు మాత్రమే అనుకునే శెట్టి ఆ క్షణంలో యువకుడైన శివని చూస్తూ ఎంతటి అసూయతో నలిగిపోయిందీ శివకీ తెలీదు.
"సుకృతి యింకా ప్రూవ్ చేసుకోవాలిగా" అన్నాడు శెట్టి సుకృతి ని చూస్తూ.
మృదువుగా నవ్వేశాడు శివ.
"ప్రూవ్ చేయాల్సింది నేను."
"అది కాదు శివా! అసలు యిమేజ్ లేని నటిని తీసుకోవడం ఎంత వరకూ సమంజసమా అని?"
"నా కథలో ప్రేక్షకులకి కనిపించాల్సింది పాత్రలు నటుల యిమేజ్ కాదు."
"అలాంటప్పుడు పావని, నరేంద్రలని ఎందుకెన్నుకున్నావు?"
"వాళ్ళకి సినిమా రంగంలో అనుభవమున్నా యింకా ఓ యిమేజ్ అన్నది ఫార్మ్ కాలేదు కాబట్టి. సుకృతిలో ఏ ప్రెష్ నెస్ నేను కోరుకున్నానో అదే ఫ్రెష్ నెస్ నరేంద్ర, పావనిల్లో వుంది."
సుకృతి గురించి అంత ఎక్కువగా అతడు ఆలోచించడం శెట్టికి నచ్చలేదు. అయినా సుకృతి కోసం యీ సినిమా తీయాలనుకుంటున్నాడు కాబట్టి శివనీ అంగీకరించాడు.
మరో అరగంట వ్యవధిలో సినిమా జర్నలిస్టుల్నందర్నీ పిలిపించిన శెట్టి వెంటనే శివ దర్శకత్వంలో తను తీయబోతున్న సినిమా గురించి అనౌన్స్ చేశాడు. అందులో పాత్రధారుల వివరాల్నీ తెలియచేశాడు.
నారాయణశెట్టి తొలిసారి నిర్మిస్తున్న చిత్రాన్ని సుదర్శనరావు కాదని తరిమేసిన శివ డైరెక్ట్ చేయడం ఎంత వేగంగా యిండస్ట్రీని పాకేసింది అంటే సాయంకాలానికల్లా చాలామంది ప్రముఖులు యిదే విషయం గురించి చర్చించుకోవడం ప్రారంభించారు.
"పూటప్రేమ" సెట్ లో ఆఖరి షాట్ కి ఏర్పాట్లు చేయిస్తూ అన్నాడు సుదర్శనరావు రమ్యశ్రీతో "నీ అంచనా తప్పుకాలేదు రమ్యా.....మొత్తానికి సుకృతి శెట్టిని పూర్తిగా ముగ్గులోకి దింపేసింది."
ఇప్పుడు ధైర్యం చెప్పడం రమ్యశ్రీ వంతైంది. "ఇల్లలకగానే పండగ కాదుగా పావనికి వద్దూ అని మీరో మాట చెబితే చాలు-నరేంద్ర సంగతి నేను చూసుకుంటాను."
"ఎలా" అని అడగలేదు.
నరేంద్ర ఎదుగుతున్న నటుడు కాబట్టి ఒకటీ అరా రమ్యశ్రీ వున్న సెట్ లోకి రావడం, ఆమెకు విష్ చేయడమూ తరచూ జరుగుతున్న విషయమే. అయితే రమ్యశ్రీ ముభావంగా నవ్వేది తప్ప అంతగా మాట్లాడేది కాదు. దానికి కారణం ఆమె చాలా పెద్దనటి కావడమే.
ఇప్పుడు పనిగట్టుకుని తనే మాట్లాడాలనుకుంటూంది. కేవలం శివ, సుకృతుల్ని సాధించాలని మాత్రమే కాదు. స్వతహాగా పెద్ద ఫేమిలీ నుంచి వచ్చిన నరేంద్ర ,మగసిరితో మెరిసిపోతుంటాడు. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రంలో కాలేజీ అమ్మాయిలు విపరీతంగా అతడ్ని మోజు పడటం ప్రారంభించారని తెలిసింది. అలాంటివాడ్ని ప్రోత్సహించడం రేపు తనకి చాలా అవసరం. ఇప్పుడు యిండస్ట్రీలో తనెక్కువ నటిస్తున్నది తాతలైనా నటులు లేకపోతే ముక్కూ మొహం సరిగా లేని నిర్మాతల కొడుకులతో.
నరేంద్ర మీద నిక్షిప్తంగా వున్న కోరిక ఇప్పుడు ఒంటిని సెగలతో నింపేస్తుంటే రహస్యంగా కారు డ్రైవర్ని పిలిచి నరేంద్రకి కబురు పెట్టించింది.
సరిగ్గా ఇదే సమయంలో.
పావని యింటికి వచ్చాడు శివ. అప్పటికే ఓ జర్నలిస్టు ద్వారా శెట్టి సినిమా గురించి నిన్న పావని శివ రాకకి ఆశ్చర్యపోలేదు. అయినా చాలా ఆశ్చర్యాన్ని ప్రకటించింది. అలా నటించడం నేర్పింది వాళ్ళమ్మే. ఇంటికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకూడదన్నది ఆమె తల్లి సిద్దాంతం. ఓ నర్సింగ్ హోమ్ లో ఆయాగా పనిచేసిన పావని తల్లి బెడ్ దగ్గర పేషెంట్స్ కి సపర్యలు చేస్తూ కూతుర్ని పెద్ద చేసింది. ఒడ్డూ పొడవూ బాగున్న కూతుర్ని చూసి కట్టుకున్న మొగుడికంటే వుంచుకున్న డాక్టర్ అందం కూతురిలో కనిపిస్తుంటే డాక్టర్ని చేయలేకపోయినా "ఏక్టర్"ని చేయాలని తీర్మానించి సినిమా రంగంలో అడుగుపెట్టింది.
