Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 37


    టాంక్ బండ్ దగ్గర గడిపి, ఆశ్రావీలో డిన్నర్ తీసుకొని ఇంటికి  వెళ్ళారు.
    మొట్టమొదటిసారి....విధిలేని పరిస్థితిలో శ్రీచరణ్ తో పాటు అతని గదిలోకి నడిచింది ప్రనూష.
    "ఏంటక్కా.....ఇంకా ఇక్కడే నిలబడ్డావ్.... లోపల బావ నీకోసం విరహ తాపంతో ఎదురు చూస్తున్నట్టున్నాడు" అంది ప్రియ ప్రనూషతో.
    రాత్రి ..." పదిన్నర అయింది. అయినా ప్రనూష తల్లితోను, తండ్రితోనూ హాలులో కూచొని మాట్లాడుతూనే వుంది.
    "అవునమ్మా...అల్లుడు గారు ఫీలవుతే బాగోదు. ఇందాకే రెండుసార్లు హాలులో అటూ, ఇటూ తచ్చాడ్డం కూడా చూశాను" శర్మ అన్నాడు కూతురితో.
    ప్రనూష మొహం ఎర్రబడింది.
    "అబ్బేం....అదెం లేదు నాన్నా....నేను మీరు వెళ్ళే వరకూ మీ దగ్గరే పడుకుంటా మనం కలిసి చాలా రోజులైందిగా..అందుకే అందరికీ హాలులోనే పడకలు వేసా..." అంది తెలివిగా ప్రనూష.
    "అదేం కుదర్దమ్మా...పద్దతి పద్దతే అయినా కొత్తగా పెళ్ళయింది. తప్పమ్మా...అల్లుడు నీకోసం గదిలో ఎదురు చూస్తుంటాడు. వెళ్ళు....వెళ్ళమ్మా....ప్రియా! అక్కయ్యను బావ గదిలోకి పంపిరా..." అన్నాడు.
    "పదక్కా...... నేనూ లోపలి వరకూ వచ్చి బావకు నిన్నప్పగించి వస్తా..." అంటూ బలవంతంగా అక్కను లేవదీసింది.
    తప్పించుకునే మార్గం లేక లేచింది ప్రనూష.
    
                                                                 * * *
    
    ప్రనూష శ్రీచరణ్ గదిలోకి అడుగుపెట్టగానే ప్రియ శ్రీచరణ్ ను ఉద్దేశించి.
    "ఏంటి బావా....అక్కకోసం విరహంతో కాలిపోతున్నావా?" అంది కన్నుగీటి.
    "మరే! చూడు నా వళ్ళు వెయ్యిన్నూట పదహార్ల డిగ్రీలతో కాలిపోతోంది. ఏకంగా వంద గుడ్లు ఒకేసారి ఆమ్లెట్ వేసుకోవచ్చు" అన్నాడు ప్రనూష వంక చూస్తూ.
    "పో.... బావా.... నువ్వు మరీ చిలిపి" అంది ప్రియ.
    "ఇంకెక్కడికి పోను. ఇప్పటికే చాలా దూరం వెళ్ళాను" అన్నాడు.
    "ఏమో అనుకున్నానే అక్కా, బావ మంచి రొమాంటిక్కే...." అంది శ్రీచరణ్ వైపు చూస్తూ అడ్మయిరింగ్ గా.
    వెంటనే శ్రీచరణ్ తన ఛాతీని రెండు అంగుళాలు పొడిగించి, ప్రియ దగ్గరికి వచ్చి ఆమె కళ్ళలోకి అదో టైపులో చూస్తూ..."థాంక్యూ ప్రియ..." అన్నాడు.
    ప్రనూషకు వళ్ళు మండింది.
    వెంటనే ఆ వళ్ళు మంటని ప్రియ పై చూపిస్తూ.
    "బావతో ఏంటే ఆ సరసాలూ, జోకులూ....వెళ్ళు....వెళ్ళి పడుకో..." కోపంగా అంది.
    "నువ్వు మరీ చాదస్తం ప్రనూ...సరసాలు బావతో ఆడక, పక్కింటి సుబ్బారావుతో. ఎదురింటి వెంకారావుతో, వేలు విడిచిన పెద్ద నాన్న కొడుకుతో, కాలువిదిచిన చిన్నాన్న అల్లుడితో ఆడతారా?" అన్నాడు శ్రీచరణ్.
    ప్రనూష కు మరింత మంట తలకెక్కింది. అయినా తమాయించుకుని "ప్రియా... నువ్వెళ్ళు....నాకు నిద్రస్తోంది" అంది.
    "గుడ్ నైట్ అక్కా.....బావా గుడ్ నైట్" అంది ఆ గదిలో నుంచి వెళ్తూ.
    "బైబై టా..."టా....చీరియో" అన్నాడు తలుపు దగ్గరికి వచ్చి మరీ.
    
                                                                 * * *
    
    "ఇంకా శుభరాత్రి....గుడ్ నైట్....లాంటి పదాలు కూడా చెప్పిరాకపోయారా?" అంది కోపంగా లోనికి వచ్చిన శ్రీచరణ్ ని.
    అడ్డెడ్డె....మరిచేపోయాను. ఉండు చెప్పొస్తా..." అంటూ లేవబోయి, ప్రనూషమొహంలోని సీరియస్ నెస్ గమనించి "ఆర్యూ సీరియస్" అని అడిగాడు.
    వళ్ళు మండింది ప్రనూషకు.
    "కాను... అయామీ వెరీ వెరీ హాపీ వెళ్ళి ముఫ్ఫై రెండు పళ్ళు, ఇకిలించి... మా అమ్మకి, నాన్నకి కూడా గుడ్ నైట్. బై.... టాటా....చీరియో, చెప్పిరండి" అంది.
    "మీ అమ్మకు ఫర్లేదు. మీ నాన్నక్కూడా చెప్పాలా?" ఆమెను టీజ్ చేస్తూ అన్నాడు.
    కోపంగా దిండు తీసి అతని మీదకి విసిరింది.
    
                                                                * * *


    ఇద్దరికీ నిద్ర రావడం లేదు.
    రెండు సింగిల్ కాట్లు దగ్గర దగ్గరగానే వేసారు అనుమానం రాకుండా.
    చెరో వైపూ పడుకున్నారు.
    మెల్లిగా వెనక్కి తిరిగి...శ్రీచరణ్ వైపు చూసింది ప్రనూష. అటువైపు తిరిగి వున్నాడు. అతని ఫీలింగ్స్ కనిపించడానికి అవకాశం లేదు.
    కొంపదీసి....ఏ అర్ధరాత్రో తన దగ్గరికి వచ్చి కమిటైపోడు కదా...అన్న ఆలోచన వచ్చింది ప్రనూషకు.
    అసలే తల్లిదండ్రులు హాలులో వున్నారు. తను అరిచి గోల చేసినా అసహ్యంగా వుంటుంది.
    ఓసారి అటువైపు వెళ్ళి శ్రీచరణ్ ఫీలింగ్స్ చూస్తే...?
    మెల్లిగా లేచి, శబ్దం చేయకుండా మంచం దిగి అవతలి వైపుకు వెళ్ళి శ్రీచరణ్ మొహంలోకి చూసింది.
    నిద్రపోతున్నాడు.
    దొంగ నిద్ర నటించడం లేదు కదా? అనుకుంది.
    ఏం చేయాలి? ఎక్కడో సినిమాలో చూసిన సీన్ గుర్తొచ్చింది.
    "పడుకునే ముందు పాలల్లో నిద్రమాత్రలు వేసి ఇచ్చినా బావుండేది?" అనుకుంది ప్రనూష.
    "పోనీ క్లోరోఫామ్ ఉన్నా ఇంకా బావుండేది. కాసేపు క్లోరోఫామ్ ఉన్న కర్చీఫ్ అతని ముక్కు దగ్గర పెడితే, నిద్రపోతాడనుకుంది.
    ఇలా రకరకాలుగా ఆలోచిస్తోంది.
    ఓ అర్ధరాత్రి శ్రీచరణ్ లేచి తన దగ్గరకు వచ్చినట్టు. తను అరవబోయినట్టు... అరస్తే మీ పేరంట్స్ వస్తారు. నీ ఇష్టం అని శ్రీచరణ్ బ్లాక్ మెయిల్ చేసినట్టు.... అలా... అలా....తనను ఆక్రమించుకుని....
    సన్నగా కేకవేసింది. ఆ ఆలోచన రావడంతోనే ప్రనూష.
    ఉలిక్కిపడి లేచి, లుంగీ సర్దుకుని, ఎదురుగా ఉన్న ప్రనూషవైపు చూసి...
    "అదేంటి.... నువ్వింకా నిద్రపోలేదా? నన్నేధైనా చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నావా? ఆ పప్పులేం ఉడకవు. నా శీలాన్ని నువ్వేమీ చేయలేవు. నువ్వేమైనా చేస్తే నేను అరుస్తా..." అన్నాడు శ్రీచరణ్.
    "నీ కళ్ళకు నేనెలా కనిపిస్తున్నాను" అడిగింది కోపంగా ప్రనూష.
    "అందంగా, స్టయిల్ గా నాలా వున్న మగాళ్ళు కనిపిస్తే మీదపడి, కమిటై, రేప్ చేసే ఆడరౌడీలా కనిపిస్తున్నావు" అన్నాడు శ్రీచరణ్.
    "షటప్" అంది ప్రనూష.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS