అనుమానంగా చూసింది ప్రసూనాంబ.
వెళ్ళేప్పుడు లేచి జడలోని గులాబీ, వచ్చేప్పుడు వుండడం గమనించింది. ప్రనూష పరధ్యానం కూడా ఆమె నోటీస్ లోకి వచ్చింది.
కామాక్షి కూడా అనుమానంగా ప్రనూషవైపు చూసింది. ఆ రోజు లంచ్ లో కామాక్షి, ప్రసూనాంబలతో ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు ప్రనూష.
ఎక్కడ ఆ టాపిక్ వాళ్ళు తీసుకువస్తారేమోనని భయం వేసింది.
ప్రనూష ఇంటికొచ్చేసరికి అందరూ తయారవుతున్నారు శ్రీచరణ్ తో సహా.
"యిదేమిటమ్మాయి....ఇంతాలస్యంగా అల్లుడుగారు వచ్చేసరికి నువ్వు ఆఫీసునుంచి ఇంటికి బయల్దేరావట..." అన్నాడు తండ్రి.
ప్రనూష శ్రీచరణ్ వైపు చురచుర చూసింది. శ్రీచరణ్ అదేమీ గమనించనట్టు వున్నాడు.
"ఉదయం నుంచి ఒకటే బోర్ కొట్టిందనుకో....పాపం అల్లుడుగారు ఏమనుకున్నారో..."మామయ్య అలా ట్యాంక్ బండ్ కు వెళ్ళివద్దామా?" అన్నాడు. నువ్వు కూడా త్వరగా తయారవ్వు...." అంటూ కూతుర్ని తొందర చేశాడు శర్మ.
తనకు ఒక్క మాటైనా చెప్పకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన శ్రీచరణ్ మీద కోపం పీకల్దాక వచ్చినా, సమయం కాదని కామ్ గా వుండిపోయింది.
అరగంటలో తయారై వచ్చింది.
అందరూ టాంక్ బండ్ కు బయల్దేరారు.
* * *
సత్యా....ఆ బుద్దుడు చూశావటే...ఎంత నిశ్చలంగా వున్నాడో..." టాంక్ బండ్ మధ్యలో" వున్న బుద్దుని విగ్రహాన్ని భార్యకు చూపిస్తూ అన్నాడు శర్మ.
"అవునవును. మీరెప్పుడు అలా నిశ్చలంగా వుంటారో...ఎప్పుడు చూసినా చిటపటలేకదా..." అంది మూతి విరిచి సత్యవతి.
"నీకు పొరపాటున చెప్పానే..." అన్నాడు శర్మ.
ప్రియ రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలను చూస్తోంది. చీకటిపడ్డంవల్ల మెర్క్యురీ లైట్లతో నగరం మెరిసిపోతోంది. డబుల్ డెక్కర్ బస్సులు, స్కూటర్లు, ఆటోలు, వాహనాలు వెళ్తూ వస్తూ వుంటే ఆ దృశ్యం మనోహరంగా ఉంది.
యువతీయువకులు, భార్యాభర్తలు, టాంక్ బండ్ మీదుగా నడుస్తుంటే, ఆహ్లాదకరంగా ఉంది.
శ్రీచరణ్, ప్రనూష ముందు నడుస్తున్నారు.
"ఇలాంటి ప్రోగ్రామ్స్ నన్ను అడక్కుండా పెట్టకండి" అంది ప్రనూష.
"నేనేం కావాలని పెట్టలేదు....మీ అబ్బే నా గడ్డం పట్టుకుని బ్రతిమిలాడితే సరే నన్నాను. సంతోషించు. దీనికి చార్జీ చేయలేదు. అన్నట్టు నా నాలుగువందల సంగతేం చేశావు? వాటెబౌట్ మై నాలుగువందలూ..." సాగదీసి ఆడిగాడు కావాలనే శ్రీచరణ్.
"ఇస్తాన్లే బోడి నాలుగువందలతో నేనేం పారిపోను."
"ఏమో..ఎవడికి తెలుసు...." కావాలనే అన్నాడు శ్రీచరణ్.
కోపంగా శ్రీచరణ్ వైపు చూసింది ప్రనూష.
"ఏంటీ....వాతావరణం సీరియస్ గా వుంది" అన్న మాటలు వినిపించడంతో ఇద్దరూ వులిక్కిపడ్డారు.
ఎదురుగా ప్రియ.
"నువ్వా....ప్రియా...ఇదేంటే...నువ్వెప్పుడొచ్చావు?" అడిగింది ప్రనూష. తన మాటలు విన్నదేమోనని అనుమానంతో.
"నేనిప్పుడు రావడమేంటి? మీరిద్దరూ సరదాగా నడుస్తూంటే, అసలు కొత్తగా పెళ్ళయిన భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో ఇన్వెస్టిగేట్ చేద్దామని మీ వెనకే వచ్చాను.....ప్చ్..." అంది పెదవి విరిచి ప్రియ.
"అర్ధమైందా?....మీ అక్కకు రొమాంటిక్ సెల్స్ చాలా వీక్. అప్పుడప్పుడు ఇలా టాంక్ బండ్ దగ్గరకు తీసుకొచ్చి రీ-ఛార్జ్ చేస్తాను....నువ్వేనయం ప్రియా..." అన్నాడు ఆరాధనంగా ఆమె కళ్ళలోకి చూస్తూ.
"అబ్బా.... నాకు మళ్ళీ....మళ్ళీ సిగ్గేస్తోంది బావా..." అంది ప్రియ.
"ఏంటి మళ్ళీ మళ్ళీ అంటోంది" అనుమానంగా శ్రీచరణ్ వైపు చూసి అడిగింది ప్రనూష.
"ఉదయం రెండుసార్లు సిగ్గేసిందట. ఇప్పుడు మరోసారి సిగ్గేస్తుందంటూంది.... అయినా నన్నడుగుతావేంటి? సిగ్గు పడేది మీ చెల్లెలు....కదూ ప్రియా..." అన్నాడు శ్రీచరణ్.
"నువ్వు బాగా చిలిపిబావా..." అంది ప్రియ కళ్ళు టపటపలాడిస్తూ బిత్తరపోయింది ప్రనూష.
"ఏంటీ అది "నువ్వు చిలిపి అంటోంది ఏం చేసావసలు..." అనుమానంగా అడిగింది శ్రీచరణ్ వైపు పరిశీలనగా చూస్తూ.
"ఆలోచించుకొని చెప్తా" అన్నాడు శ్రీచరణ్.
వెంటనే కోపంగా చెల్లెలు వైపు చూసి "ఏంటే... బావ నిన్నేం చేసాడు." అడిగింది.
"అబ్బ.....పో అక్కా....నాకసలే సిగ్గు..." అంటూ రెండు చేతుల్లో తన మొహాన్ని దాచుకొని అక్కడ్నుంచి తుర్రుమంది.
శ్రీచరణ్ తాపీగా వెళ్ళి ఓ సిమెంట్ బెంచీ మీద కూచున్నాడు.
ప్రనూష కోపంగా వచ్చి శ్రీచరణ్ పక్కనే కూచొని. "మిమ్మల్నే....మా చెల్లెలిని ఏం చేసారు?" అడిగింది అతని భుజాలు కుదుపుతూ.
"ఆ.... ఝనక్ ఝనక్ పాయిల్ బాజీ చేసాను. ఉదయమే చేసాను. ఇప్పుడు పదహారోనెల...మరో అయిదారు సంవత్సరాల్లో డెలివరీ అవుతుందిట. ఇద్దరు ఆడ, ఇద్దరుమగ పిల్లలట..." అన్నాడు కసిగా ఒక్కోపదాన్ని వత్తి పలుకుతూ.
"అంటే" అయోమయంగా అడిగింది.
"కాదల్ మరియాడే....ఏక్ దూజే కేలియే... మెకనస్ గోల్డ్....!
"మీకు....మీకేమైందసలు..." అంది కంగారుగా.
"కంకర పాసు....అయింది. లేకపోతే ఒకటే నస....మీ చెల్లెలేం చిన్న పాపాయి? డ్యాష్ కిందికి ఇరవయ్యేళ్ళు వచ్చాయి. అన్నీ అనుమానాలే హమ్మో....లక్కీఫెలోని నీతో కమిటయ్యాను కాదు. బ్రతికి పోయా....లేకపోతే పొద్దస్తమానం నన్నేం చేసారు. నన్నేంచేసారనే... చంపుకు తినేదానివి" అన్నాడు శ్రీచరణ్.
ప్రనూష కోపంగా ఏదో అనబోయింది.
తల్లిదండ్రులు రావడంతో ఆ టాపిక్ ఆగిపోయింది.
