స్వప్న సమాధానం యివ్వలేదు.
"బాండ్స్ లాటివి వుంటే చూడటం మంచిది."
"నగలూ, డబ్బూ దాచుకునే బీరువా తప్ప అన్నీ చూశాం కదా!"
"అదే చూద్దాం యిప్పుడు."
స్వప్న మళ్ళీ సమాధానం యివ్వలేదు.
ఆమె మనస్సేమిటో తెలియలేదు అతనికి. "పోనీ నువ్వు ఒక్కత్తివే చూడు!" పొడిగా అన్నాడు రవి.
చప్పున తలెత్తి చూసింది స్వప్న. ఆ కళ్ళల్లో ఏ భావమూ చదవలేకపోయింది. రవికీ స్వప్న అంతరంగం అర్ధం కాలేదు.
"చూద్దాం పద!"
రవి లేచాడు పదమన్నట్టుగా.
కానీ స్వప్న లేవలేదు.
అసహనంగా కదిలేడు రవి.
స్వప్నకూడా మరో ప్రశ్నకి అవకాశం యివ్వకుండా లేచి నుంచుంది. ఇద్దరూ ఆ గదివైపు నడిచారు.
ఇద్దరూ గదిలోకి వెళ్ళారు.
రవి లోపలికి రాగానే ఆటోమేటిక్ తలుపులు మూసున్నాయి. తరువాత లోపల గడియ పెట్టింది స్వప్న.
ఆశ్చర్యంగా ప్రశ్నార్ధకంగా చూశాడు రవి.
"ఇది అమ్మమ్మ ప్రత్యేక గది. దీనిలోనికి ఎవ్వరినీ రానిచ్చేది కాదు. ఆమె స్వర్వస్వం ఇందులో వుంది. ఇక్కడికి మనిద్దరరమే వచ్చాం. ఈ బీరువాలు తెరిచిచూస్తూ వుంటే యితరులు సడన్ గా వచ్చేస్తే ఈ సంపదను చూస్తే అసూయపడతారు. అందుకే గడియవేశాను. పైగా ఇలాచేయమని అమ్మమ్మ రాసి వుంచింది ఏనాడో. చూడండి"
మౌనంగా చదివాడు ఆ చిరు ఉత్తరాన్ని.
"స్వప్నా! ఇది మన సర్వస్వం ఆస్తి తరిగిపోయినా, ఇతరుల పాలయినా, కంపెనీలు దివాలాతీసి షేర్లు అన్నీ పోయినా, బ్యాంకుల్లో డబ్బు కరిగిపోయినా మనం భయపడక్కర్లేదు. ఈ బీరువాలలో వున్న సంపద మన కుటుంబాలు యెన్ని తరాలు అనుభవించినా తరగదు. అందుకే ఏ నాటికయినా నే పోయాక నా తర్వాత దీన్ని చూడదలచుకున్నపుదు నీవూ, నీకు కావాలసినవాడూ ఏకాంతంగా తలపులు బిగించుకుని చూడండి. ఈ బీరువాలు అందరూ తెరవలేరు.
ఇవి ప్రత్యేకంగా ఇంగ్లండ్ లో మీ తాతయ్య చేయించి తెప్పించారు. వాటర్ ఫ్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ యివి. వీటిని తెరిచే మార్గం నువ్వు మాత్రం తెలుసుకో, దీనితో జతపరిచిన పేపర్లో ఆ సూచనలు వున్నాయి."
అతను చదవగానే స్వప్న మరో పేపరు అందించబోయింది.
హఠాత్తుగా అన్నాడతను "వద్దు స్వప్నా! నువ్వే తెరువు!"
ఆ మాటలకి విస్తుబోయి "యెందుకు?" అని అడిగింది.
మృదువుగా నవ్వేశాడతను.
ఆ నవ్వే సమాధానమై మరేమీ అడక్కుండా ముందు మొదటిబీరువా తెరిచింది. అందులో నాలుగు అరలున్నాయి. పై అరనిండా బంగారు నాణేలు. రెండో అరలో ముత్యాలు, వజ్రాలు తాపిన బంగారునగలున్నాయి. మూడో అరలో వెండి సామాను వుంది. నాలుగో అరలో అన్నీ వెండి రూపాయలు. రికార్డుకు సంబంధించిన ఒక్క కాగితమూ లేదు.
తిరిగి బీరువా మూసేసి మరో బీరువా తెరిచింది స్వప్న.
అది చిన్న బీరువా! మూడే అరలున్నాయి. రెండు అరల నిండా వంద రూపాయల నోట్ల కట్టలున్నాయి. ఆఖరి అరలో అంతా రికార్డే. అదంతా బయటికి తీసింది స్వప్న.
అందులో తాత ముత్తాతల కాలం నుంచీ వున్న ఆస్తి వివరాలు, పంపకాల దస్తావేజులూ వున్నాయి. అన్నీ తిరిగి జాగ్రత్తగా కట్టకట్టేడు. ఆఖర్న ఓ క్రింది అర తెరిచాడు రవి. స్వప్నకి అక్కడ అరవున్నట్టే తెలియదు. రవికి ఏదో అనుమానం వచ్చి అక్కడ వున్న ఓ బటన్ నొక్కేడు. సర్రున దూసుకొచ్చింనట్టుగా తెరుచుకుంది అర.
అందులో ఒకే ఒక కవరుంది. అది కృష్ణవేణమ్మ గారి పేరిట రెండు లక్షల రూపాయలకి తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్ రసీదు.
అది చూసిన స్వప్న సంభ్రమాశ్చర్యాలకి లోనయింది. రవివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసి "థాంక్స్!" అంది.
నవ్వేడు రవి.
"నువ్వు రాకపోయి వుంటే ఈ ఎస్.డి. విషయమే తెలిసేది కాదు. అసలు ఎకౌంట్స్ లో కూడా ఎక్కడా ఇలా ఎఫ్.డి. యెంట్రీయే లేదు. యెందుకింత గుంభనంగా వుంచిందో?"
స్వప్న ప్రశ్నకి జవాబుగా "పెద్ద వాళ్ళ తీరే అంత! ఎందుకలా చేస్తారో మనకి తెలియదు!" అన్నాడు. తర్వాత గది నుంచి యిద్దరూ బయటికివచ్చారు-దూరంగా వెంకట్రామయ్య నుంచుని దొంగలాగా చూస్తున్నవాడల్లా యిద్దర్నీ చూడగానే తప్పుకున్నాడు. స్వప్న ముఖం బిగుసుకుంది.
