అలా అనుకున్న శీతల్ కి తెలియదు ఏ వెధవలకి రోగం కుదిర్చానన్నదీను.
బిలబిలమంటూ నలుగురు లోపలికి వచ్చారు. మారు మాట్లాకుండా ఓ యంత్రంలా పనిచేసుకుపోతూ.... పగిలినవి, విరిగినవి సామాన్లు తీసేసి వాటి స్థానంలో అలాంటివే కొత్తవి తెచ్చి పెట్టారు.
"ఇదేంటి తల్లీ! ఇంత సామాను ధ్వంసం చేశావు?" అని వాళ్ళడిగితే-
"మీరోగం కుదర్చాలని చేశాను. ఇంకా చేస్తాను. ఇంకా ఇంకా చేస్తాను" అని తిక్కతిక్కగా సమాధానం ఇద్దామనుకుంది శీతల్.
శీతల్ ఆశ నిరాశ అయింది.
దాంతో-
ఇప్పుడు శీతల్ కి నిజంగానే తిక్క పుట్టింది. లేచి నడిమంచం మీద కూర్చుని వాళ్ళందరిని వరసపెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.
ఆ తిట్లు వాళ్ళమీద పనిచెయ్యలేదు. ముఖకవళికల్లో మార్పు లేదు. రేడియోలో సంగీతం వస్తుంటే అది ఓ చెవిన వింటూ తన పని తాను చేసుకుపోయే ఇల్లాలి లాగా వుంది వాళ్ళ ప్రవర్తన.
వచ్చిన నలుగురు చక్కగా సర్ది, వినయంగా చేతులు ఊగిస్తూ నమస్కారం లాంటిది పెట్టి కంగాళి భాషలో చేతులు ఊగిస్తూ మాటలు రెండు, మూడు పలికి గదిలోంచి వెళ్ళిపోయారు.
తను ఈ గదిలో ఇలా ఎన్నాళ్ళు వుండాలో తెలియదు. ఏదో బలీయమైన కారణం ఆశించే తనని ఇలా ఇక్కడ బందీ చేయడం జరిగింది. ఇంకొక్క రోజు చాలు తనకి పిచ్చిపట్టడానికి తనని పిచ్చిదాన్ని చేసే ప్రయత్నమా యిది?
ఒక మనిషికి పిచ్చి పట్టాలంటే-కాదు కాదు ఒక మనిషిని పిచ్చిదాన్ని చేయాలంటే ఈ విధంగా బందీగా వుంచి రాచ మర్యాదలు చేయనక్కరలేదు. రోజుకి గుప్పెడు మెతుకులు పెడుతూ, మనిషి అనేవాడు దరిదాపుల్లో కనిపించకుండా చీకటి కొట్లోపడేస్తే చాలు... నాలుగు రోజులు చాలు- కారణం తెలియక విపరీతమైన టెన్షన్ కి లోనయి పిచ్చివాళ్ళు కావడం ఖాయం.
ఈ చిన్న విషయం తనకి తెలుసు.
ఈ లెక్కన వీళ్ళెవరో తనకి పిచ్చి పట్టించాడానికి చూడడం లేదు. తన నుంచి ఏదో ఆశించే చూస్తున్నారు.
కనుక.
తాను కూడా వెర్రి మొర్రి ఆలోచనలతో బుర్ర చెదలు పట్టించుకోక, ఏం జరిగినా ఎదుర్కొనడానికి సిద్దముగా వుండడం మంచిది. మనసెప్పుడు మన చెప్పు చేతల్లోనే వుండాలి.
ఈ గదిలో తోచడం లేదు నిజమే. ఫుడ్ ప్రాబ్లమ్ లేదు. వెరీగుడ్ గా వుంది. రాచమర్యాదలు ఎన్ని జరిగినా మనిషికోరేది స్వేచ్చ బంగారు పంజరంలో వున్నానని చిలక ఏమన్నా సంతోషిస్తుందా! ఇదీ అంతే.
చాలాసేపు ఆలోచించి శీతల్ ఒక నిర్ణయానికి వచ్చింది ముఖ్యంగా తను మనోధైర్యం కోల్పోరాదు అని.
శీతల్ డీప్ గా ఆలోచించి బాత్ రూమ్ లోకి వెళ్ళి ఓ చిన్న పనిచేసి వచ్చింది. ఆపని ఏదో ఈపెద్ద గదిలోనే చేయవచ్చు. తనకి తెలియకుండా గదిలో ఏదో ఓమూల కెమెరా అమరిస్తే బాత్ రూమ్ లో కెమెరా వుండక పోవచ్చని కాస్త ధైర్యం చేసింది.
ఆ తర్వాత శీతల్ కి ఏం చేయాల్సింది కనపడలేదు. గుమ్మం దాటి వెళ్ళడానికి లేదు. రేడియో వినడానికి లేదు. పేపరు చదవడానికి లేదు.
'కానియ్యి యిది ఎంతవరకో'
అలా అనుకున్న శీతల్ మంచం మీద పడుచుని మళ్ళీ ఆలోచించసాగింది.
దులపర బుల్లోడ, దుమ్ము దులపర బుల్లోడ...
భానుమతి రేడియోలో చేరి ఎవరి దుమ్మో దులుపుతున్నది. అది భానుమతి కంఠస్వరం. దూరం నుంచి లీలగా పాట వినిపిస్తున్నది. టక్కున కళ్ళు తెరిచింది శీతల్.
"తెలివి వచ్చింది. ఇంక ఫరవాలేదు." శీతల్ బెడ్ పక్కనే కుర్చీలో కూర్చున్న డాక్టర్ పరంజ్యోతి అన్నాడు.
పరంజ్యోతి డాక్టర్ అనడానికి గుర్తుగా మెడలో స్టెతస్కోపు, షర్టు మీద డాక్టర్ వేసుకునే కోటు వున్నాయి.
"ఏమ్మా! ఎలా వుంది. పూర్తిగా తెలివి వచ్చిందా" శీతల్ ముఖంలోకి ఆదుర్దాగా తొంగి చూస్తూ అడిగాడు లోకేశ్వరరావు.
బెడ్ మీద నుంచి గబుక్కున పైకి లేవబోయింది శీతల్. కళ్ళు తిరిగాయి. దాంతో తిరిగి వెనక్కి వాలి పడుకుంది. తనకి బాగా నీరసంగా వున్నట్టు గ్రహించింది.
"లేవకమ్మా! చాలా నీరసంగా వున్నావు ఈ పూటకి రెస్టు తీసుకుంటే తగ్గిపోతుంది." అన్నాడు డాక్టర్ పరంజ్యోతి.
"నాకేమైంది?" శీతల్ అడిగింది.
"మనం ఎక్కిన కారు యాక్సిడెంట్ కి గురయింది డ్రైవర్ అక్కడికక్కడే చచ్చిపోయాడు. మనం చిన్న చిన్న గాయాలతో బతికి బైటపడ్డాము. నీకు గాయం అయింది. నాకేమో ఈ చేతికి, మోకాలుకి కాస్తదెబ్బలు తగిలాయి."
లోకేశ్వర్రావు చెపుతుంటే అప్పుడు చూసింది శీతల్ ఆయన చేతికి కట్టు చేత్తో తల తడుముకుంది. తలకి చిన్న కట్టుకట్టి వుంది తనకి.
"పైకి చిన్న గాయమే అయింది. కాని," అంటూ లోకేశ్వర్రావు అడిగాడు.
"కాని....ఏమయింది అంకుల్?" ఆమె ఆదుర్దాగా అడిగింది.
"రెండు రోజుల నుంచి పూర్తి స్పృహ లేదమ్మ నీకు"
