Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 36


                                                          19

    "వెంకటేశం....అరేయ్ వెంకటేశం" వదిన కస్తూరి మాటలకు మెలుకువ వచ్చింది మాధవరావుకు. అంటే అప్పుడే తెల్లారిందన్నమాట. వెంటనే మాధవరావుకు దిగులు ప్రారంభమైంది. తమ అపురూపమైన ఉమ్మడికుటుంబ సౌధం ఎందుకో నేలకు వొరిగిపోతుందనే భావన కలుగుతుంది అతనికి. అసలు తమ్ముడు ఆ విధంగా చేస్తున్నాడని తను ఇప్పటికి నమ్మలేకపోతున్నాడు. ఎంతో క్రమశిక్షణతో, భయభక్తులతో అన్నయ్యా, అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించే తమ్ముడు తాగుబోతుగా, తిరుగుబోతుగా మారాడనే విషయాన్ని మాధవరావు జిర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకిలా జరిగింది. ఈ విషయం అన్నయ్యకు, వదినకు తెలిస్తే ఎంత కృంగిపోతారు?

    పాపం! శివపార్వతి అమాయకురాలు, ఆమె ఎంతగా తల్లడిల్లిపోతోంది? పిల్లలింకా పసివాళ్ళు....ఆస్తినంతాతాగి తందానాలకు తగలేస్తుంటే, ఇక వారి భవిష్యత్తు మాటేమిటి? అమ్మా నాన్న చనిపోయినప్పటినుంచి పాపం పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఎంత శ్రమపడి, తను కష్టంతో ఆస్తినంతా పెంచుకుంటూ వచ్చారు. చిన్నవాడనే కారణంతో వాడ్ని ఎంతో అపురూపంగా చూశారు. ఇప్పటికి వాడంటే అందరికి ప్రత్యేకమైన ప్రేమే. అలాంటి వ్యక్తీ ఇలా చెడు తిరుగుళ్ళకు అలవాటు పడటం, హహ్....మాధవరావు తల విదిలించాడు. అతనికి మళ్ళి తలనొప్పి ప్రారంభమైంది, ప్రక్కకు చూశాడు. పాపం ఎంతో అమాయకంగా ఆదమరచి నిద్రపోతోంది దాక్షాయణి. తనకు చెప్పినా బాధపడటం తప్ప ఏం చేయగలదు? ఎలా వీడిని ఎలా దారిలోకి తీసుకురావాలి? అన్నయ్యకు చెప్పాలా వద్దా? చెపితే అయన తట్టుకోగలడా? కోపంతో వాడిని తన్ని తగలేస్తాడేమో? దాన్తో సమస్య మరింత జటిలమవుతుంది. ఇది చాలా సున్నితమైన విషయం. ఎవరికి తెలియనంతవరకూ వాడికి భయంగానే వుంటుంది. ఒకసారి అందరికి తెలిసిపోతే, వాడిలో ఒక విధమైనటువంటి తెగింపు వస్తుంది. అప్పుడు అందర్నించి విడిపోయి వేరే కాపురం పెట్టినా పెట్టొచ్చు. అప్పుడు మన కుటుంబ పరువు ప్రతిష్టలు ఏం కావాలి? అసలే అన్నయ్య ఊరికి ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇంటిని చక్కదిద్దలేనివాడు, ఊరుని ఏ విధంగా బాగుచేస్తాడని, ఆ గోపాలరావు ప్రచారం చేస్తాడు. ఆ విమర్శని తట్టుకుని అన్నయ్య నిలబడగాలడనే నమ్మకం నాకులేదు. అసలే ఆయనిది సున్నితమయిన మనస్తత్వం. భగవంతుడా! ఎందుకయ్యా మాకు ఇంతటి క్లిష్టమైన పరిస్థితిని కల్పించావు? మొన్ననే కదా అమ్మాయి పెళ్ళి అంతా ఘనంగా జరిపించింది. ఊరు ఊరంతా ఎంత గొప్పగా చెప్పుకుంది. ఆ అనందం చెరిగిపోకముందే ఇంతటి విషాదాన్ని కలిగించావు? ఎన్నాళ్ళ నుంచి సాగుతుందో ఈ భాగోతం? నాకయినా కోటేశ్వరరావు చెప్పబట్టి తెలిసింది. చెప్పటంతోనే అతనికి చెంప పగలకొట్టాను. పాపం ఏమి అనలేకపోయాడు. మంచి మిత్రుడు కావటంచేత నా బాధను అర్ధం చేసుకోగలిగాడు. ఆ దొంగముండా ఇంటి సందులోనే వాడు వుండేది. తరుచూ తమ్ముడు అక్కడికి రావటం వాడి కంటపడటంతో నన్ను హెచ్చరించాడు. నెలరోజుల నుంచి గమనిస్తూనే వున్నాడట.....నాకు ఎలా చెప్పాలా ఈ విషయం అని పాపం నెల రోజుల నుంచి మాధనపడుతున్నాడట. చివరకు పరిస్థితి చేయి దాటిపోయేటట్లుందని , నిన్న నా దగ్గరకు వచ్చి వాడికి భయం చెప్పు మాధవా, వారంలో రెండు మూడుసార్లు వస్తున్నాడు. అది ఉత్త ముదనష్టపుముండ .దానికి మనవాడు ఒక్కడే కాదు, చాలా మందితో పరిచయం వుంది అని చెప్పిపోయాడు.

    ప్చ్-ఎలా ఏం చేయాలిప్పుడు? వాడా చిన్నవాడు కాదు, పెళ్ళయి పిల్లలు కూడా వున్నారు.

    "ఎంటండి ఎంత సేపయింది మీరు లేచి? ఏంటి అంత తీవ్రంగా అలోచిస్తున్నారేంటి?" ఆందోళనగా అడిగింది దాక్షాయణి.

    మాధవరావు నిశ్శబ్దంగా నవ్వాడు.

    "చెప్పండి రాత్రి నుంచి మీరు అదోలా వున్నారు. ఏమైంది?" అంది దాక్షాయణి.

    "ఏంలేదు దాక్షాయణి! హటాత్తుగా మెలుకువ వచ్చింది. ఏదో ఆలోచిస్తూ వున్నాను. అంతే" అన్నాడు నవ్వుతూ.
    "కాదు మీరేదో ఆలోచిస్తున్నారు....ఎప్పటిలా లేరు మీరు" అంది నిదానంగా మాధవరావు జుత్తును మెల్లగా సవరిస్తూ.

    ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. దాక్షాయణి భర్త చేతుల్లో గువ్వలా వోదిగిపోయింది. వాళ్లిద్దరూ అలానే కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయారు. ఆ గాడ పరిష్వంగంలో మాధవరావు కాసేపు సర్వస్వం మర్చిపోయి, హాయిగా కళ్ళు మూసుకున్నాడు. దాక్షాయణి పరిస్థితి కూడా అలానే వుంది.

                                        *    *    *    *

    సురేంద్ర బావిలోనుంచి నీళ్ళు తోడి పోస్తూ ఎడ్లను శుభ్రంగా కడుగుతున్నాడు. అవి బలంగా, తెల్లగా, పుష్టిగా వున్నాయి. ఎండు గడ్డిని బక్కెట్లో ముంచి శుభ్రంగా కడుగుతున్నాడు. యజమాని స్పర్శతో అవి ఆనందంగా, ఆప్యాయంగా తోక వూపుతూ, అతని వొంటిని నాలుకతో నాకుతున్నాయి. సురేంద్ర కూడా పరిసరాలను మర్చిపోయి, వాటిని ఆప్యాయంగా అంగుళం మేరకూడా వదలకుండా వాటిని శుభ్రం చేస్తున్నాడు.

    "ఏంటి బావా! నీ ఎడ్లను కడుగుతూ, వాటి సేవలో సర్వం మర్చిపోతున్నావు" అంది జయంతి పళ్ళపొడితో పళ్ళు తోముతూ.

    "అవునే జయంతి! ఇవంటే నా ప్రాణం" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.

    "అంటే గిరిజక్క కంటేనా?" అంది నవ్వుతూ.

    "గిరిజ నా జీవితం అయితే, ఇవి నా జీవనాధారం" అన్నాడు వాటి మెడలో గంటలు కడుతూ.

    "అబ్బో బావగారు పెళ్ళయిన తరువాత మాటలు నేర్చారే" అంది ఎగతాళిగా.

    " నీ అంత మాటకారిని కాదులే" అన్నాడు.

    "మాటకారివి కాకపోయినా పనోడివిలే....ఒంటి రెక్కతో పాపం వ్యవసాయం చేస్తున్నావు" అంది మెచ్చుకోలుగా.

    "నీ పొగడ్తలు నాకవసరంలేదు" అన్నాడు సురేంద్ర.

    "ఇది పొగడ్త కాదు బావా వాస్తవం" అంది జయంతి నవ్వుతూ.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS