వాడు నాలాంటివాడు కాదే.....తల్లి సంస్కారాన్ని పుణికిపుచ్చుకుని అవసరమైతే భూగోళమంత నిజాయితీని ప్రదర్శించగల కాంతి బిందువు.....నాలాంటి తండ్రి వూహకందని ఒక మేధాగ్రంధాలయం.....బహుశా వాడి ముందు పిపిలికంలా, వాడంత ఉన్నతుడ్ని కాదన్న బావంతోనే వాడ్ని తులనాడటాన్ని యిష్టపడుతున్నానేమో కూడా నేను వ్యక్తిగా ధన్వి ఔన్యత్యాన్ని అంగికరించినా గానీ తండ్రిగా వాడ్ని ఎలా సమర్ధించగలను? గాంధిలు హత్య కావించబడే సమకాలిన సమాజంలో సంస్కర్తలా బ్రతకడం సాధ్యంకాదురా అనేగా నేను తిట్టేది.
ఇప్పుడు నాకు అన్ని సమస్యలే. నన్ను నమ్మిన సావిత్రి.....అప్పుడప్పుడు ఏ కేంప్ పేరో చెప్పి సుమిత్రని కలుసుకోటానికి వెళ్ళినపుడు ఆ కుటుంబం అనుభవించే పేదరికం.....జీవిత రంగస్థలం మీద నటించాల్సిన అవసరం లేదనే కొడుకు.....ఉడికిపోతున్న నా జవసత్వాలు ......నా కధకి ముగింపేమిటి?
లాభం లేదు ....ధన్వితో మాట్లాడాలి.....క్షమాగుణాన్ని ప్రదర్శించడం కూడా నీ నైతిక విలువల్లో ఓ భాగం అయితే క్షమించరా అంటూ వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడి నా కధని చెప్పాలి.....పరిష్కారం వాడికే వదలాలి.....ఎందుకంటే వాడు అందరిలాంటి బిడ్డ కాదుగా. అందుకే అందరు కొడుకుల్లా ఆలోచించడు......"
* * * *
"సర్...."
కండక్టరు పిలుపుతో చదువుతున్న డైరీలో నుంచి తల పైకెత్తి చూసిన ధన్వి బస్సు అగటాన్ని గమనించాడు.
"తుంపాల వచ్చింది సర్...."
కండక్టరు గుర్తుచేశాడు.
బడలికగా బస్సు దిగాడు ధన్వి.
తెల్లవారే సరికల్లా గోదావరి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు నుంచి అనకాపల్లి చేరుకున్న ధన్వి సిటి బస్సులో అయిదు కిలోమీటర్ల దూరం వచ్చాడు. అప్పటికి చాలాసార్లు డైరీ చదివిన ధన్వి అందులోని ఎడ్రసుని మరోసారి చూశాడు.
సుమిత్ర వాళ్ళుండేది తుంపాల గ్రామానికి మరో నాలుగైదు కిలోమీటర్ల దూరం వున్న వెంకుపాలెంలో.
ఇప్పుడిప్పుడే నాగరికతని నేర్చుకుంటున్నట్లు కనిపించే జనాన్ని సమీపంలో వున్న పెంకుటిళ్ళని పరిశీలనగా చూస్తూ ఓ పాన్ షాపు దగ్గరికి వెళ్ళి వెంకుపాలెం కి దోవ తెలుసుకున్నాడు......
నడక తప్ప మరో మార్గం లేదని బోధపడింది.
షుగర్ ప్యాక్టరీని, సమీపంలో వున్న చెరుకుతోటల్ని దాటుకుంటూ పచ్చని తోటల మధ్య మూడు కిలోమీటర్లు నడిచాడు.....ఎండిపోయిన నది లాంటిది కనిపించింది.
శారదా నది అన్నారెవరో,
ఆ నది దాటితే వచ్చేదే వెంకుపాలెం.....
ఇసుక మీద నడుస్తుంటే పాదాలు దిగబడిపోతున్నాయి. దూరంగా తాటి కమ్మలతో కట్టిన గుడిసెల్లాంటి నివాసాలు, ఒకటి అరా మట్టిగోడల్తో నిర్మించిన ఇళ్ళు.....
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అది తండ్రి మీద సానుభూతో లేక డైరీ లోని వాక్యాలు చదివాక సుమిత్రనే స్త్రీ మీద ఏర్పడ్డ జాలో, అది కానినాడు అమ్మకి జరిగిన ద్రోహం గురించి తెలుసుకోవాలన్న ఉద్రేకమో తెలీదు.
వచ్చేశాడు, బయలుదేరి వెళ్ళాలని అనిపించిన వెంటనే.....
మట్టిరోడ్డు మీద నడుస్తుంటే వూరి జనం చిత్రంగా చూస్తున్నారు. పొలాలకి వెళుతున్న రైతులు, మకిలి పట్టిన ఇళ్ళు, పేదరికానికి మరో పేరుగా అనిపించే పరిసరాలు, స్వతంత్రం యింకా మా వూరిదాకా రాలేదనిపించే జనంవేషభాషలు.....
ఎడ్రసు ఎవర్ని అడగాలి?
అదికాదు.....
నాన్న చనిపోయిన విషయం ఎలా చెప్పాలి?
ధన్వి ఆలోచనల నుంచి యింకా తేరుకోలేదు.
ఎవరో తరుముతున్నట్టుగా ఓ కోడిపెట్ట వచ్చి ధన్వి కాళ్ళు మధ్య నుంచి పరుగెత్తింది.....
వెనువెంటనే కోడిని తరుముకుంటూ వచ్చిన పదిహేడేళ్ళ అమ్మాయి ధన్విని డీ కొనబోయి ఆగింది.
ధన్విని రెప్పలార్పకుండా చూసింది రెండు క్షణాలపాటు వెంటనే "అమ్మా" అని పిలవడంతో బాటు "అన్నయ్యోచ్చాడు" అంది సమీపంలో వున్న పూరిగుడిసెకేసి చూస్తూ.
ధన్వి పాదాల కింద భూమి కంపించినట్టయ్యింది.
'అన్నయ్య' అంటూ పిలిచింది సుమిత్ర కూతురు క్షితిజేనా? అది కాదు.....అసలు తనను చూడగానే ఎలా గుర్తుపట్టింది?
అప్పుడు చూశాడు అక్కడ పిల్లలకి ట్యూషను చెబుతున్న ఓ మధ్యవయస్కురాలీని.....
క్షితిజ కేకతో ఉలికిపడ్డ సుమిత్ర ఎంత వుద్వేగంగా ముందుకు నడిచింది అంటే ముందామే నోటి నుంచి మాటరాలేదు.
కళ్ళనుండి నీళ్ళు ఉబుకుతున్నాయి ఆనందభాష్పాల్లా, "రా నాన్నా నువ్వు ధన్వివి కదూ....."
ట్యూషన్ చదువుతున్న పిల్లల్తోపాటు సమీపంలోని యిళ్ళనుండి నిలబడి వున్న ఆడా, మగా అంతా విస్తుపోయి చూస్తున్నారు.
"నీలకంఠంగారి కొడుకా?"
వయసు మళ్ళిన ఓ వృద్దుడు ఆప్యాయంగా సుమిత్రని పలకరించగానే భోధపడింది.
నాన్నగారితో బాటు నాన్నకి యిద్దరు భార్యలున్న విషయం కూడా అక్కడ అందరికి తెలిసినట్టుగా వుంది.
ధన్వి బదులు చెప్పకముందే సుమిత్ర ఆప్యాయంగా చేయి పట్టుకుని ఇంటిలోకి లాక్కుపోయింది.
