Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 36


    "ఇక్కడేం చేస్తున్నారూ?" ప్రదీప్ నన్ను వెదుకుతూ వచ్చాడు. అతని చేతిలో ప్లేటుంది. అందులో శాండ్ విచెస్.....వెజిటబుల్ బర్గర్స్ వున్నాయి.
    
    "ఉదయం మిమ్మల్ని బస్సెక్కించి పంపేస్తాను. ఈ రాత్రి నన్ను రూంలో పెట్టి బయటనుంచి లాక్ చేసి తాళం చెవి మీదగ్గర పెట్టుకోండి. సరేనా....కానీ ఏం తిననని మాత్రం మొరాయించకండి. మర్యాదలు పక్కనపెట్టి రెండు తగిలించాల్సొస్తుంది" అన్నాడు.
    
    ఆ అధికారం మల్లెపూల వర్షంలా వుంది. సృష్టిలో ఆనందం, ఆప్యాయతా, ఆకర్షణా మూడూ కలిసి అతను అయ్యాడేమో అనిపించింది.
    
    లోపల బంగళాలోంచి రవిశంకర్ సితార్ వినిపిస్తోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఇద్దరం లాన్ లో కూర్చున్నాం. చుట్టూ మావిడి చెట్లు ఇద్దరమే ఏకాంతంగా వున్నాం. రాగానే స్నానం చేసానేమో జుట్టింకా తడి ఆరలేదని వీపుమీద జారవిడిచేసాను. కాటన్ చీర ఒకింత నలిగి ఎంతో అందంగా వుంది. ఎదురుగా అతను....తెల్లని లాల్చీ పైజామాలో పారిజాతం నేల రాలకముందున్నంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. నా ముంగురులు గాలికి ఎగిరి కళ్ళల్లో పడుతున్నాయి. అతను తన చేతివేళ్ళు నా చెంపకి తగలకుండా వాటిని సవరించాడు. గడ్డిమీద పరుచుకున్న నా పైటచెంగుని తన చేతిలోకి తీసుకుని పోగులు లాగుతున్నాడు.
    
    మగవాడు ఒక స్త్రీ ఒంటరిగా దొరికినప్పుడు ఇంత మృదువుగా కూడా ప్రవర్తించగలడా అని ఆశ్చర్యంగా తోచింది.
    
    ఆనంద్ నా మీదకి రాగానే పిల్లి వెంటపడిన పిట్టలా గిలగిలలాడతాను నేను మాటలు కానీ లాలన కానీ వుండవు. నెప్పి....అసహ్యం....కోపం....ఛీ! ఇంతటి అద్భుత సమయంలో అవన్నీ ఒద్దన్నా కూడా గుర్తు వస్తాయి ఎందుకనీ! నాలో విచారం గడ్డకట్టిందనుకున్నాను....కాహ్డు....జరుగుతోంది.....బుగ్గల మీద నుంచి కారుతోంది! అమ్మమ్మ పోయిన తరువాత ఇంత ఆపేక్ష మళ్ళీ పొందినందుకా.....లేక ఎన్నో రాత్రులు నేను కన్నకల సాకారమై అతను నాకింత దగ్గరగా వున్నందుకా?

    అతడు నా కన్నీళ్ళని వేరేగా అర్ధం చేసుకున్నాడు.
    
    "సుమతీ! ఏమిటీ కన్నీళ్ళు? నేనేం చెయ్యను స్త్రీ అందంగా వుంటే మగవాడికి ఆనందం ఇవ్వడానికే అనీ, బలం వుంటే మగవాడికి సేవ చేయడానికే అనీ, సంగీతమొస్తే అతన్ని ఉల్లాసపరిచేటందుకే అనీ, చదువుకున్నదైతే సంపాదించి పెట్టేందుకే అనీ ఈ శతాబ్దిలో కూడా అనుకునే వాళ్ళు వుండచ్చు! కానీ నేనలా అనుకోను. ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె కాపాడుకుంటుంటే నాకు చాతనైన సహాయం చేస్తాను. ఆమెలోని అభిమానం, పట్టుదలా నాకెంతో ముచ్చటగా అనిపిస్తాయి. ఆమెని ఎలాగైనా సంతోష పెట్టాలనిపిస్తుంది. నీకెలా సంతోషమో చెప్పు....అలాగే వుంటాను....!" అన్నాడు.
    
    ఆ అపురూపమైన క్షణాలు అలాగే కళ్ళల్లో నిక్షిప్తం చేసుకునే శక్తివుంటే ఎంత బాగుండును.
    
    రేపు ప్రొద్దుట ఇంతటి స్వర్గాన్ని వదిలి మళ్ళీ ఆ నరకానికి వెళ్ళిపోవాలన్న ఊహే నాకు దుఃఖాన్ని తెప్పిస్తోంది. పశువులని కొడుతున్నా, కుక్కలని హింసిస్తున్నా కూడా మేనకాగాంధీలాంటి వాళ్ళు వూర్కోవడం లేదు! కానీ ఎంతోమంది ఆడవాళ్ళు పడక గదుల్లో భర్తల చేతుల్లో నరకమనుభవిస్తున్నా వారి శరీరాల నుండీ మనసుల నుంచీ రక్తాలు కారుతున్నా, భార్యాభర్తల విషయాల్లోకి గబుక్కున తల దూర్చరు. నాగరికతగల దేశం కదా!
    
    "ఎక్కువ కారం, పులుపూ లేని భోజనం చేశాం కదా! నిద్రపడుతుంది....వెళ్ళి పడుకుందామా? ఎవరి గదుల్లో వాళ్ళం!" అన్నాడు నవ్వుతూ.
    
    నాకు లేవాలనిపించటం లేదు. చలి వణికిస్తున్నా హాయిగా ఉంది. ఆకాశం వైపు చూస్తుంటే చివరిదాకా చూడాలనిపిస్తోంది. దూరంగా వున్న నీళ్ళవైపు చూస్తుంటే మొత్తం తాగెయ్యాలనిపిస్తోంది! అతను కదలకుండా నా ముందు అలాగే కూర్చుంటే బావుంన్ను అనిపిస్తోంది. ఏవిటో మత్తు? పూలగంధాలు తాగిన గాలి కూడా తూగుతూ ఏదో సంగీతం పాడుతోంది. అల్లరి మబ్బులు కుదురులేకుండా ఆటలాడుతున్నాయి! చంద్రుడు శాంతంగా చూస్తున్నాడు.
    
    అతను లేచి నిలబడ్డాడు.
    
    నేనూ లేచి పక్కగా నడవసాగాను.
    
    "గుడ్ నైట్" అతను రూంలోకెళుతూ అన్నాడు.
    
    "గుడ్ నైట్!" అన్నాను.
    
    అతను తలుపు మూసుకుంటుండగా గబుక్కున పరిగెత్తి అతడ్ని కౌగలించుకోవాలనిపించింది. కానీ కదల్లేకపోయాను. అలాగే శక్తి చాలనట్లు చూస్తూ నిలబడిపోయాను.
    
    'ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిమీద నిలపరాని ప్రేమ కలుగుతుంది. మన హృదయాలూ ఎవరికోసం చేయబడ్డాయో అటువంటివారిని కలిసినప్పుడు...ఆ మహాగ్నిలో ప్రేమా, నీతి, విశ్వాసమూ అన్నీ దగ్ధమౌతాయి....' చలం మనసుల్ని మధించి వెలికి తీసిన నగ్న సత్యాల్లాంటి వాక్యాలు గుర్తొచ్చాయి.
    
                                                                   * * *
    
    నేను కళ్ళు తెరిచాను. చుట్టూ చూస్తే అంతా కొత్తగా ఉంది. గాలికి కదుల్తున్న ఊదారంగు తెరలూ కొద్దిగా కొట్టుకుంటూ సంశయంగా ఆగిన కిటికీ తలుపూ....లోపలికి కుతూహలంగా చొచ్చుకువస్తున్న సూర్యకాంతీ, అన్నీ సరికొత్తగా వున్నాయి.
    
    నాకు అప్పుడు గుర్తొచ్చింది నేనున్నది ఎక్కడో...ఇది చాలా అందమైన చోటు.....భూలోకంలో కెల్లా!
    
    నౌకర్ కాఫీ తీసుకొచ్చాడు.
    
    "అయ్యగారు నిద్రలేచారా?" అడిగాను అందుకుంటూ.
    
    "ఆ! బయట లాన్ లో కూర్చున్నారు" అని వెళ్ళిపోయాడు.
    
    కాఫీ కప్పుతోనే ఉత్సాహంగా నడిచాను. నా మనసు అతన్ని చూడడం కోసం, అతని సామీప్యాం కోసం ఉవ్విళ్ళూరుతోంది. నన్ను రాత్రంతా విడిగా వుంచి అతను నిలువునా కాల్చాడు. ఆ చల్లని చూపులతో గాయాలకి మందు పూయాలని తొందరగా వుంది! గబగబా అడుగులేస్తున్న నేను లాన్ లో అతన్ని చూసి అక్కడే నిలబడిపోయాను..... అతని ఎదురుగా ఒక స్త్రీ కూర్చుని వుంది. ఆమె తలమీంచి కొంగు కప్పుకుని అతని అభిముఖంగా కూర్చుని వుంది. అతని చెయ్యి ఆమె భుజం మీద వుంది. చాలా దగ్గరగా....మాట్లాడుకుంటున్నారు. అడుగు ముందుకి వెయ్యాలో వద్దో అర్ధంకాలేదు! అతని కళ్ళల్లో ఏదో ఆప్యాయత...ప్రేమా, మొహం మించిన భావం.....నా మనసులో ఏదో గుచ్చుకున్న ఫీలింగ్! దాన్ని ఈర్ష్య అంటారా? మరి మాధవిని చేసుకుంటే బావుణ్ణు అనుకున్నానే...అది నిజాయితీగా అనుకున్న మాట కాదా? మనసనేదే ఒక సందేహాల పుట్ట! సమస్యల తోరణం!
    
    ప్రదీప్ తలెత్తి చూసినట్లున్నాడు. వెంటనే మొహంలోకి నవ్వు తెచ్చుకుని "సుమతీ!...రండి" అంటూ ఒక చైర్ చూపించాడు.
    
    నాకు అస్సలు ముందుకి వెళ్ళాలని లేదు. కానీ అతను చూసేశాడు కాబట్టి తప్పదు. అడుగులు భారంగా వేస్తూ వెళ్ళాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS