శారద తిన్నగా ఇంటికొచ్చింది. మేడమీద సుబ్బలక్ష్మిగారు నిలుచుంది 'శారద. నీకోసం ఎవరో వచ్చి వెళ్ళారు' అంది వచ్చి వెళ్ళారా. ఎవరూ ఇంకెవరూ నీరజ దినేష్ అయివుంటారు- "పిన్నిగారూ" - "ఒక ఆడ, ఒక మగ" - పిన్నిగారు లైటు! ఆర్పి లోపలకెళ్ళిపోయింది. ఆ.. వాళ్ళే మళ్ళీవస్తారులే !!- తాళం తీసిలోపలకెళ్ళింది. శారద కలతనిద్రలోవున్నట్టుగావుంది.
* * *
వారం రోజులయింది రామం ఉత్తరం రాసి మేష్టారికి సమాధానం రాలేదు. ఇంకరాదనుకుంటే మంచిది - ఎదురు చూడటం వుండదుకదా! - రామం పోస్టుమాన్ కోసం చూట్టం మానేశాడు.
ఉత్తరం చదివిన మేష్టారు నిర్ఘాంతపోయాడు. తన కళ్ళను తను నమ్మలేని స్థితిలోవున్నాడు. ఆవేశంతో అంటున్నాడా, ఆదర్శంతో అంటున్నాడా - అవసరానికి అంటున్నాడా - రామం గురించి చిన్నప్పట్నుంచీ తెలుసు మేష్టారికి - ఈ ఉత్తరం యశోదమ్మకి చూపించాలా వద్దా - గాయత్రి ఇప్పుడే చెప్పాలా వద్దా, ఇలా చాలా రోజులు సతమతమయ్యాడు మేష్టారు. ఉత్తరంలో పిల్లాడి విషయమేలేదు - మరి ఆ విషయం ఎలా తెలియాలి. ఇన్ని సంగతులు తెలుసుకోవలసినవివుండగా తనేం సమాధానం రాస్తాడూ రామానికి - పదిహేను రోజులు గడిచాయి. మేష్టారికి ఉన్నట్టుండి మెరుపులాటి ఆలోచన వచ్చింది - తనే రామం దగ్గర వెడితే !!
రామం శని ఆదివారాలు రాగానే స్నేహితులతో కలసి పిక్ నిక్ కి వెళ్ళాడు రామప్పదేవాలయం చూట్టానికి.
కృష్ణమూర్తి మేష్టారు వచ్చేసరికి తలుపుకి తాళం కనిపించింది. పక్క గుమ్మంలో పేపరు చదువుతూ ముసలాయన కనిపించాడు.
'ఈ అబ్బాయి లేడా అండి' అన్నాడు.
'ఆ - రేపు వస్తాడు - రామప్పగుడి చూడటానికెళ్ళాడు - కూర్చోండి' మేష్టారు కూర్చున్నారు. ఆ మాటలు ఈ మాటలు అయ్యాయి. వెంకట్రామయ్యగారు తనగోడు చెప్పుకోటం మొదలుపెట్టాడు తన కొడుకులెవరూ తనని పట్టించుకోరు అన్నాడు. తన కూతురికి పెళ్ళిచేయటం ఎంతో కష్టంగా వుంది, ఆఖరికి భార్య పోయినవాడో, భార్యను వదిలినవాడో కుదిరినా చాలు అని చూస్తున్నాం అన్నాడు. ఆ మాట అనగానే కృష్ణమూర్తి గారు తన సంతానం గురించి, గాయత్రి గురించి చెప్పాడు.
"ఎవరూ చేసుకోరంటారా వెంకట్రామయ్యగారూ"
'ఆ - నాకయితే అలానేతోస్తోంది. మీరు మరోలా అనుకోకండి' ఆ సంభాషణ అక్కడితో పూర్తయింది. లలిత కూరలు తెచ్చి లోపల పెట్టింది 'ఇదే మా ఆమ్మాయి - అమ్మాయి - అమ్మా, రామంకోసం వచ్చారట - రేపుపొద్దున్నవస్తాడు - వారిని ఇక్కడే వుండమంటాను. భోజన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు వెంకట్రామయ్య.
'మీరు ఇప్పుడెక్కడికెళ్ళితింటారూ - ఒక్కపూటకి మరేం ఫరవాలేదులెండి - ఆ మధ్య మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. ఇద్దరు పిల్లలున్నారు చిన్నవాళ్ళు - అతను చేసుకుందుకు ఇష్టంగానే వున్నాడట -కానీ మా అమ్మాయి చేసుకోను పొమ్మంది - ఏం చేయను చెప్పండి' -వెంకట్రామయ్య కృష్ణమూర్తితో తన బాధ చెప్పుకున్నాడు.
'నాన్న - ఏమిటి నీగోల - ఇంటికెవరొచ్చినా నాగొడవేనా' లలిత లోపల్నుంచి అరిచింది.
'అమ్మా - తండ్రులందరి సమస్య ఒకటే తల్లి - ఇప్పుడు నేనూ ఆ పరిస్థితుల్లోనే ఇక్కడకొచ్చాను' అన్నాడు మేష్టారు.
అంటే, రామం కోసం వచ్చాడా - కూరతరుగుతున్న లలిత వేలు రక్కున తెగింది. బొటబొట రక్తం కారింది.....తడిగుడ్డ గట్టిగా చుట్టి వేలుగట్టిగా పట్టుకుంది. ఆ కత్తిపీట ముందర అలాగే కూచునిపోయింది. లలిత ఎంతోసేపు రామంకి డైవోర్సు అయిందని, పెళ్ళిచేసుకుంటాడని అప్పుడే ఈయనకి ఎలా తెలిసిందో!!
'నాన్న - రామం రేపు వస్తానని చెప్పాడా మీతో' అంది లోపల్నుంచి లలిత.
'రాకేం చేస్తాడూ, - ఎల్లుండి ఆఫీసుకెళ్ళద్దూ - ఉద్యోగం విషయంలో చాలా బాధ్యత గలవాడు - ఈ మధ్య తల్లిని చూసి ఆమెకి పనులలో సహాయం చేసి వస్తానని పదిహేనురోజులు సెలవు పెట్టి వెళ్ళినవాడు, నాలుగురోజులలో వచ్చేసాడు. ఊరికే సెలవులు ఎందుకు పెట్టాలీ అంటాడు - చాలా డ్యూటీమైండెడ్ బాయ్ - మంచివాడు - ఏదో ఆపిల్లకి కుదరలేదంతే' వెంకట్రామయ్య రామాన్ని మహమెచ్చుకుంటుంటే కృష్ణమూర్తి మేష్టారికి చాలా సంతోషమేసింది.
"మా ఊరి అబ్బాయే" అన్నాడు మనసు దాచుకోలేక.
లోపల లలిత ఉలిక్కిపడింది. రామం వీళ్ళవూరి అబ్బాయా అంటే ఈ మధ్య నాలుగు రోజులు అక్కడికే కదా వెళ్ళి వచ్చాడు మరి ఇంతలోనే ఈ ముసలాయన ఎందుకొచ్చినట్టు - రామానికి పెళ్ళిచూపులయి పోయాయా - ముహూర్తాలు పెట్టుకుందుకు వచ్చాడా ఒకవేళ!! - లలితకి వంటింట్లో వుండబుద్ది పుట్టలేదు. స్టౌ తగ్గించి వచ్చేసింది.
"రామానికి చిన్నప్పట్నుంఛీ మా పిల్లలందరూ తెలుసు" మేష్టారి మాటలు అర్ధంకాలేదు లలితకి, రామం ఒక్కసారయినా ఈ అమ్మాయి గురించి చెప్పలేదే - చిన్నప్పట్నుంఛీ తెలుసు అంటున్నారీయన - లలిత వంటపని చేసుకునేందుకు లోపలకెళ్ళింది. అంతలోనే వచ్చి 'అమ్మాయి ఏం చదువుకుందీ' అంది. 'ఆ - అదే చదువు - పదోతరగతి' -లలిత మళ్ళీ లోపల కెళ్ళి కూరకలియబెట్టింది.
పదోతరగతి, మూడో మూడో తరగతి చదువుకున్న వాళ్ళని రామం ఎలాగూ పెళ్ళి చేసుకోడులే - ఈయన తాపత్రయం కానీ - కూరమాడిపోయింది - గబగబాకిందికి దించేసింది స్టౌమీదనుంచి.
వెంకట్రామయ్య, కృష్ణమూర్తి మేష్టారూ భోజనాలు చేశారు.
'బాబాయిగారూ - మీ అమ్మాయి' - లలిత ఏదో అనబోయింది.
'మా అమ్మాయి గురించి ఏం చెప్తానమ్మా. ఏడాది పిల్లాడు" - "పిల్లాడా" అంది వెంటనే.
'భర్త పోయాడు - మరి దాని బతుకెలాగ' - మేష్టారు భోజనం పూర్తిచేసి చెయ్యికడుక్కున్నారు.
