Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 35

   
    ఇప్పుడు ఈ సంబంధం చెడితే కలిసివచ్చే ఆస్థి చేజారిపోవడం అలా ఉంచి, అరుణ్ చేస్తున్న బిజినెస్ కు ఒక్క కుదుపు తప్పదు. ఆ కుదుపుకి బిజినెస్ తలక్రిందులైనా ఆశ్చర్యంలేదు.

     శ్రీపతి అన్నట్టుగా ఈ సమస్యను త్వరగానే పరిష్కరించాలి అనుకొంది జానకమ్మ.

                       *        *        *

    సంధ్య ఇక్కడికి వచ్చి నెలరోజులు గడిచిపోయాయి. పరాశ్రయంలో ఉన్నభావం రోజు రోజుకు అధికం అవుతూందేగాని తగ్గడంలేదు. నర్సమ్మత్త దగ్గర ఉన్నప్పుడు ఇలా అనిపించేదికాదు ఏమిటో ఇక్కడ ముళ్ళమీద ఉన్నట్టుగా చెప్పకుండా ఇక్కడినుండి పారిపోతే బాగుండేదన్నట్టుగా అనిపిస్తూంది.

    ముఖ్యంగా జానకమ్మ ఉదాశీన ప్రవర్తన సంధ్యని ఇబ్బంది పెడుతూంది. 'ఇదెక్కడి తద్దినం మా నెత్తికెక్కింది?' అన్న భావం ఆమె ముఖంలో కనిపిస్తున్నట్టుగా అనిపించేది. 'నా కోడలు నాకోడలు' అంటూ తనని ప్రాణంలా చూచే ఆ జానకి అత్తేనా యీవిడ అని ఆశ్చర్యంవేస్తూ ఉంటుంది సంధ్యకు. అరుణ్ కి మాత్రం తనని ఏదో ఉద్దరించి స్నేహధర్మం నెరవేర్చాలన్న తాపత్రయం కనిపిస్తుంది అతడిలో.

    సంధ్యకి ఆరోజు ఏమీ తోచకపోతే, తనతో తెప్పుకొన్న ట్రంకు పెట్టె తెరిచింది. తల్లివి రెండు పాత చీరలు, తండ్రి కప్పుకొనే పట్టు ఉత్తరీయం ఉన్నాయి. పెద్ద పట్టుచీర మడతల్లో ఉన్న అమ్మా నాన్న ఫోటో తీసుకొంటుంటే కొన్ని పాత ఉత్తరాలు క్రిందపడ్డాయి. అందులో, తల్లి చనిపోవడానికి ముందు జానకమ్మత్తకి వ్రాసిన ఉత్తరం కూడా ఉంది.

    సంధ్య ఉత్తరం విప్పి చదువుకొంది. ఈ ఉత్తరం నిజంగా జానకమ్మత్తకి చేరితే ఏం చేసేది? మూతి మూడొంకలు త్రిప్పి ఉత్తరాన్ని ముక్కలుచేసి బాయ్ లర్ లో వేసేది. అంతకుమించి విలువ ఇచ్చేది కాదా ఉత్తరానికి. ఆ ఉత్తరం పోస్టు చేయకుండా తను మంచి పని చేసింది, అమ్మని ఒక అపహాస్యం నుండి తప్పించింది.

    "ఏం చేస్తున్నావు, సంధ్యా?" అరుణ్ గదిలోకి వచ్చాడు.

    సంధ్య చప్పున ఉత్తరం తీసి చీర మడతల్లో పెట్టేసింది.

    "ఏమిటి దాస్తున్నావు నేను చూడకుండా?"

    "ఏం లేదు."

    "లేకపోవడం ఏమిటి? ఆ చీరలో ఏదో దాచావు" అరుణ్ వంగి పెట్టెలో ఉన్న పట్టుచీర పైకి తీశాడు. తీస్తుంటే క్రిందపడ్డాయి - ఉత్తరం. సంధ్య తలిదండ్రులున్న ఫోటో.

    ఉత్తరం, ఫోటో తీసుకొన్నాడు.

    "ముందు ఆ ఉత్తరం ఇలా ఇవ్వు."

    "చదివి ఇస్తాను."

    "అలా ఒకళ్ళ ఉత్తరాలు చదువొచ్చా?"

    సంధ ముఖంలో గాబరా చూస్తుంటే ఆ ఉత్తరంలో ఏముందో చూడాలన్న కుతూహలం రేగింది అరుణ్ లో. "ప్రేమలేఖా? నేను చూడకూడదా?"

    "చూడకూడదు."

    "అయితే నేనుచదివి తీరాల్సిందే!" పట్టుదలతో ఉత్తరం మడిచి జేబులో పెట్టుకొన్నాడు.

    "మర్యాదగా ఉత్తరం ఇచ్చేసెయ్, అరుణ్."

    "ఇస్తాను చదివాక."

    "ఇతర్ల ఉత్తరాలు చదవకూడదని తెలియదా?"

    "చూడమ్మాయ్! ఇప్పుడు నీకు నేను గార్డియన్ని! నీ మంచిచెడ్డలు చూసే బాధ్యత నాది. నేను చదవొచ్చు."

    ఉత్తరం అరుణ్ చదవకముందే తీసేసుకోవాలన్న తాపత్రయంతో అరుణ్ జేబులో చెయిపెట్టబోయింది సంధ్య. అరుణ్ ఆ చేతిని అలాగే పట్టుకొన్నాడు. "ఇదేదో ప్రేమలేఖే కావాలి. లేకపోతే నువ్వింత గాబరా పడవు." కుడిచేత్తో ఉత్తరం పైకితీసి పట్టుకొని చదివాడు. "ప్రియమైన జానకికి... అరె! ఇది మా అమ్మకి వ్రాసినట్టుగా ఉందే? ఎరు వ్రాశారబ్బా?" క్రింద సంతకం చూశాడు. 'రుక్మిణి' అని వుంది. "మీ అమ్మ మా అమ్మకి వ్రాసిన ఉత్తరం! నేనెందుకు చదవకూడదు?"

    ఉత్తరం పైకి ఎత్తి పట్టుకొని అతడు చదువుతూంటే సంధ్య ఎగిరి అందుకోవాలని చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS