"ఇప్పుడు మన పిల్లలు చదువుకునే చదువు ఎందుకైనా పనికొస్తుందా? వీళ్ళకి తెలుగురాదు. తెలుగు పుస్తకాలు చదవరు. తెలుగులో గొప్పకవులెవరో, ఏంచేశారో ఎరగరు. పదిహేనుళ్ళు చచ్చేట్టు ఇంగ్లీషు భాషా, ఇంగ్లీషు పుస్తకాలూ, ఇంగ్లీషు కవిత్వమూ చదువుతారు. చదివి ఏమన్నా చెయ్యాటానికుందా? ఒక వృత్తవిద్య ఉందా! ఏమీ లేదు. ట్రెయినింగయితే గాని మేష్టరీరాదు. 'లా' చదివితేగాని ప్లీడరీలేదు. ఇంజనీరింగూ వైద్యమూ వేరే చదవాలిసిందే గదా! నూటికి ఒకడు కూడా ఉద్యోగాలు చెయ్యడు. చాలామంది వృత్తులు చేసుకుంటారు. వ్యవసాయం, వడ్రంగం, కుండలూ కూజాలూ చెయ్యటం, నేయటం, నగలు చెయ్యటం మొదలైనవి నేర్పేటందు కెక్కడనా ఒక్కబడి ఉందా? లేదు. ఈ బళ్ళలో ఎవరికీ పనికిరాని చదువు నేర్పుతారు గనుకనే మనదేశంలో చదువింత తక్కువ, మనజాతిని నిర్జీవంచేసి, ఎందునాకాకుండా చెయ్యటానికే ఇంగ్లీషువారీ చదువు ప్రవేశపెట్టారు... పై పెచ్చు, 'దేశ చరిత్ర' అని పేరుబెట్టి అబద్దాలు రాశారు. బ్రిటిషువాళ్ళను ఎదిరించిన మన రాజులనందర్నీ వొఠ్ఠి దుర్మార్గులుగానూ, బ్రిటిషువారికి సాయబడ్డ అధములందర్నీ చాలా గొప్ప వాళ్ళుగానూ చరిత్రలో రాస్తాడు. మన కర్మగాలితే మనం దేశభక్తి చూపించాలంటే దేశద్రోహులనందర్నీ ఆరాధించాలిసిన గతి పట్టింది యీ పాపిష్టి చదువువల్ల "
తన ఈ ఉపన్యాసాన్ని ఆడవాళ్ళూ, పిల్లలూ ఎంతవరకు అర్ధం చేసుకున్నారో శేషగిరికి తెలీదుగాని ఆయన మాత్రం ఇప్పట్నుంచే ఉపన్యాసానికి తయారు తింటున్నాడు.
* * * *
మామూలుగా పెళ్ళిళ్ళకూ, పండుగులకూ, శోభనాలకూ పెట్టినట్టుగానే జాతీయ విద్యాలయానికి పంచాంగం చూసి ముహూర్తం పెట్టారు. సత్రానికి సున్నంవేసి, తోరణాలూ, రంగుకాగితాల తోరణాలూ కట్టారు. సన్నాయి పెట్టారు. శేషగిరీ, కామేశ్వరీ పీటలమీద కూచుని మంత్రోక్తంగా విద్యాలయ ప్రారంభంచేశారు. అప్పుడే విద్యాలయానికి పన్నెండు మంది పిల్లలూ, ఒక మేష్టరూ ఏర్పడ్డారు. తరువాత బీదకీ బిక్కకీ అన్నదానం జరిగింది.
సాయంకాలం గ్రంథాలయం ప్రారంభోత్సవమూ బహిరంగసభా.
సుందరానికి ఇదంతా చూస్తుంటే ఏదో పెద్దఎత్తున జరుగుతున్నట్టూ, అందులో తానుకూడా పాల్గొని అలసిపోతునట్టూ అనిపించింది.
సాయంకాలపు సభకు దాదాపు ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు. ఊళ్ళోవాళ్ళూ, పై ఊళ్ళవాళ్ళూకూడా వచ్చి మాట్లాడారు. శేషగిరి జాతీయవిద్యను గురించి ఇంట్లో ఇచ్చిన ఉపన్యాసమే మరింతసేపు ఇచ్చాడు. మిగిలినవాళ్ళు శేషగిరి త్యాగాన్నీ, దీక్షనూ, కృషినీ ప్రశంసించారు. ఒక్కొక్క ఉపన్యాసకుడే తన మావయ్యను మెచ్చుకుంటున్న కొద్దీ ఆయనలో తనకు తెలియని కొత్త గొప్పతనం కనిపిస్తునట్టుగా తోచి, సుందరం అయిదు నిమిషాల కొకసారి శేషగిరి మొహంకేసి చూడసాగాడు. కాని శేషగిరి ఇదంతా వినిపించుకుంటున్నట్టు లేదు. హడావుడిగా తిరుగుతూ ఎవరెవరితోనో ఏమేమిటో మాట్లాడుతున్నాడు, క్షణం తీరకుండా.
ఆ మర్నాడు విదేశ వస్త్రదహనం. శేషగిరి భార్యకు చాలా ఖరీదైన చీరెలున్నాయి. శేషగిరికి ఖరీదైన కోట్లూ, మల్లుపంచెలూ ఉన్నాయి. వీటన్నిటినీ తగల బెట్టాలనేసరికి కామేశ్వరి కంటనీరు పెట్టింది. సీతమ్మగారిక్కూడా ఇది చాలా
అఘాయిత్యంగా కనిపించింది.
"అదేమిటర్రా, చక్కని బట్టలు తగలేసుకోవటం? పోతేమళ్ళీ వస్తాయా? ఎంతేసీ డబ్బుపోసి కొనుక్కున్నవో గదా! మీరు కట్టుకోకపోతే పెట్టెలో దాచిఉంచండి. లేదూ ఎవరికన్నా ఇవ్వండి" అన్నది సీతమ్మగారు.
"భ్రమ! కేవలం వ్యామోహం! మహత్ముడేమన్నాడు? కుళ్ళిపోయిన పండని ఇంకొకరి కిస్తామా? చాలా తప్పు, కల్మషం. దీన్ని దహించవలసిందే. అప్పుడుగాని మన ఆత్మల్లో అంటిపెట్టు కున్న స్వార్దం కడిగేసుకు పోదు" అన్నాడు శేషగిరి.
ఇంకా చాలామంది ఇళ్ళనుంచి విదేశవస్రాలు వచ్చాయి. అన్నిటినీ చెరువు గట్టునపోగేశారు. బీదా బిక్కీ వచ్చి కాస్సేపు మొరపెట్టుకున్నారు, తమ కేమన్నా ఇప్పించమని కాని ఆ వస్రాలు దగ్దమై తీరాలిసిందే. దగ్డమే అయాయి. ఆ మంటలు చూస్తున్న సుందరానికి జాతీయోద్యమమంటే ఏదో వికారభావం కలిగింది. "ఇది తప్పు! దారుణం! అన్యాయం!" అని వాడి అంతరాత్మ చెప్పసాగింది. ఈ మాటలే ఊళ్ళో చాలామంది నోట ధ్వనించాయి.
జాతీయ విద్యాలయం_ అందరూ పిలిచేది "స్వరాజ్యంబడి"_ గురించి చిక్కులు ఆరంభమయాయి. అందులోకి అస్పృశ్యులను చేర్చు కోవాలా వద్దా అనే విషయం ఇళ్ళల్లోనూ, అరుగులమీదా సత్రంలోనూ, ఆఖరకు శేషగిరి మేడ మీదా మీటింగులు జరిగాయి.
"ఇందులోకి ఈ అస్ప్రుశ్యులను ఎందుకు తెస్తావు శేషగిరీ? వాళ్ళ సంగతి తరవాత చూద్దాం. వాళ్ళకు కావాలంటే వేరే బడి పెడదాం. అందులోకి వాళ్ళను చేర్చకు."
శేషగిరి కిది ఆదర్శపతనంగా కనిపించింది.
ఇంకా అస్ప్రుశ్యులూ, అస్ప్రుశ్యులూ ఏమిటి? అంతా గాంధిమయమై పోతుంటేనూ? అంతా గాంధిమయం? జగమంతా గాంధిమయం."
"అయితే వద్దన్నదెవరూ? ఇప్పుడు మనం అస్పృశ్యుల్ని తెచ్చిపెట్టామో, సంసార్ల పిల్లలు ఒక్కరు చేరరు. కార్యవాదం కావాలి. మనం ఏ పరిస్థితిరావాలని కోరుతున్నామో అది వచ్చేసినట్టే పనిసాగిస్తే మొదలుకే చెడుతుంది."
ఈ వాదాన్ని సమర్దిస్తూ నలుగురూ నాలుగు మాటలు మాట్లాడారు.
"సంస్కారం మెల్లిగా వస్తుంది. తొందరపడరాదు."
"అసలే ప్రజలలో ఇంకా జాతీయోద్యమం నాటుకో లేదు. పంచములు లేకపోయినా పిల్లలు వచ్చేట్టులేరు. ఈ ఊళ్ళోవాళ్ళకు ఏ చదువూ ఇష్టంలేదు."
