నిర్లిప్త అనీజీగా కదిలింది చైర్లో.
"భార్గవదే కదా! ఆయన మా ఫామిలీ ఫ్రెండ్ బాబిగాడి ఫాదర్. భార్గవ నాక్కూడా నిన్ననే చెప్పాడీ విషయం! నేనింకా పత్రిక చూళ్ళేదు గాని....ఒక పాత్రకు ప్రాణం వచ్చి ఆ రచయితనే బెదిరించటం....రియల్లీ సూపర్బ్" అంది నిర్లిప్త.
"సూపర్భా? సాహిత్యంలో అయితే త్రిల్లింగ్ గా వుండేదేమో కాని, ఇది జీవితం తల్లీ! మరో విషయం తెల్సా? అది తెలిస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడతావ్! ఆ హెచ్చరిక వచ్చిన లెటర్స్ ని ఇండర్ పోల్ డిటెక్టివ్ అమితేష్ గారు ఫింగర్ ప్రింట్స్ తీయిస్తే...అచ్చు మౌనిక పాత్రలాగే...బొటన వ్రేలు లేక నాలుగు వేళ్ళ గుర్తులే కన్పించాయట."
"ఈజిట్? అయితే నవల కంటే, ఈ హెచ్చరికల వల్లే భార్గవ మరింత ఫేమ్ అవుతున్నాడన్న మాట. అప్ కోర్స్! ఆ సీరియల్ కూడా ఫెంటాస్టిక్ గా వుంది కదా! నాకెక్కువ నచ్చింది. మౌనిక కురూపితనం లోని మూగదాని మానసిక వ్యధ, మాటలురాని వ్యక్తి మానసిక వ్యధ తెలుపటం భార్గవకే సాధ్యం. మౌనిక పాత్రే మాటల్లేని పాత్ర. మాటల్లేకుండా ఒక నాయికను సృష్టించి నవల రాయటం ఎంత కష్టం? గుండెలవిసేలా రాసాడు కదూ ఒక్కోచోటా" అంది నిర్లిప్త.
"ఈ భాగంలోని మౌనికకు మాటలొస్తాయి ఒక షాపింగ్ యాక్సిడెంట్ వల్ల. అంటే రాను రాను మౌనిక మంచి జీవితాన్ని గడుపుతుందన్న మాట ముగింపు నాటికి. నిజానికి పాఠకుల్ని ఆ భ్రమకు తెచ్చి మలుపు త్రిప్పటం భార్గవప్రత్యేకత.
సుగాత్రి మాటకు నిర్లిప్త మరేం చెప్పలేదు.
"ఈ సీరియల్ మాస పత్రికలో రావటం వల్ల సస్పెన్స్ భరించటం సాధ్యం కావటం లేదు. కనీసం దినపత్రికలో కాకపోయినా ఏదయినా వారపత్రికలో వచ్చినా బావుండేది. సస్పెన్స్ బెడద తప్పేది" అంది సుగాత్రి మళ్ళీ.
"నిజమే. నెలంతా వేచివుండటం బాధగా వుంది."
"నువ్వీ పత్రిక చూస్తుండు. నేనీలోగా కాఫీ కలుపుకొస్తాను ఆ సీరియల్ చూడు, మౌనిక పేరుతో వచ్చిన లెటర్స్ కూడా వేసారు" అని పత్రిక నిర్లిప్త చేతిలో పెట్టింది సుగాత్రి.
"ఒక పాత్ర బతికొచ్చి ఒక రచయితను తనను చంపొద్దని ప్రాధేయపడటం సాధ్యం కాదంటారా?"
వెళ్తున్న ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి నిర్లిప్త వైపు చూసింది ఆశ్చర్యంగా.
"ఏమిటి నువ్వంటున్నది? నవల్లోని పాత్ర లెక్కడయినా బ్రతికొస్తాయా? కనీసం నిరక్షరాస్యులు కూడా గుడ్డిగా నమ్మలేని హెచ్చరిక ఇది. ఈ రచయితలున్నారు చూశారా? వీళ్ళ కుండేది సున్నితమైన మనస్సే కానీ సమయానుసారంగా, పాత్రపరంగా, క్రూరంగా, భయంకరంగా ఆలోచిస్తారు ఆ ప్రభావమే 'మలుపు' అనే తొడుగుతో పాత్రల మీద చూపిస్తారు. వాళ్ళ కలానికున్న ధైర్యం ఆ రచయితలో వుండదు ఇంగ్లీష్ నవలలోని ట్రిక్స్ ఆధారంగా హత్యలు చేసి ఎందరో పాఠకులు హంతకులై పోయారు. ఆ హంతకుల్ని తయారుచేసే రచయితల్ని దేనితో పోల్చొచ్చు? అలాగే....ఈ సొసైటీలోని వ్యక్తుల్ని స్టడీచేసే దాకా వాళ్ళు పాత్రల్ని సృష్టించేది. ఇక్కడే అర్ధం చేసుకోండి మన మౌనిక పాత్ర కూడా అలాంటిదే కావచ్చు. ఆ పాత్ర ద్వారే బ్రతుకును సరిదిద్దుకుంటూ వుండొచ్చు. అందుకే ఆ పాత్రను చంపొద్దని హెచ్చరిస్తుందేమో?"
నిర్లిప్త మాటలకు అలాగే చూస్తుండి పోయింది సుగాత్రి.
"నువ్వన్న దాంట్లో నిజం వుండొచ్చు. ఆ అమ్మాయికి కూడా బొటన వ్రేలుండదంటావా మరి. ఫింగర్ ప్రింట్స్ లొ నాలుగు వేలు ముద్రలు పడటమే విచిత్రంగా వుంది" అంది.
"అది నాకూ వింతగానే వుంది. కానీ సీరియల్ కాకముందే....ముగింపులో చంపొద్దని బెదిరించిందంటే__భార్గవ ఆలోచన ఒకవేళ అదే అయి వుంటే.....పసిగట్టి హెచ్చరించిందా? అలా అయితే ఆమె అతని గురించి పూర్తిగా తెల్సిన వ్యక్తైవుండాలి" అలా అంటున్నప్పుడు నిర్లిప్త మోములో ఏ భావమూ లేదు నిర్లిప్తంగానే అంది.
"భార్గవ గురించి తెల్సి వుండక్కరలేదు. ఒక రచయిత సాహిత్యం మొదట్నుంచీ పొల్లు పోకుండా చదివి, అతని మనస్తత్వాన్ని అంచనా వేయగల తెలివితేటలుంటే ముగింపును సైతం వూహించొచ్చు ఇది కొందరు పాఠకులకు సాధ్యమే. కానీ కాపీ చేసే రచయితలయితే మాత్రం మూలం మనం చదువలేనిదయినప్పుడు కష్టం. కానీ భార్గవ కాపీ రైటర్ కాదుకదా" అంది సుగాత్రి వంటింట్లోకి వెళ్తూ.
సరిగ్గా అధ సమయంలో__
నిఖిల్ దగ్గరకు వచ్చాడు భార్గవ చేతిలో మాసపత్రికతో. పూర్తిగా మనశ్శాంతిగా వున్నప్పుడు, పూర్తి వేదనగా వున్నప్పుడు సిగరెట్ త్రాగటం నిఖిల్ కి అలవాటు. ఇప్పుడెలా వున్నా మొత్తానికి సిగరెట్ కాలుస్తున్నాడు నిఖిల్.
** ** ** **
ఫోన్ రింగవటంతో 'హలో' అన్నాడు వేణు రిసీవర్ ఎత్తి.
"మిస్టర్ వేణూ నేను అమితేష్ ని. నేను కొంచెం సేపట్లో బెంగుళూరు నుండి వస్తున్నాను. నేను వచ్చేలోగానే నీ ఇన్వెస్టిగేట్ ఇన్ ఫర్ మేషన్స్ ఏమైనా ఉంటే ఫైల్ చేసి పెట్టు. భార్గవ కేసులో ఇంకొద్ది రోజుల వరకూ సరైన ఆధారాలు దొరక్కపోవచ్చు. బైదిబై భార్గవ నా కోసంగానీ వచ్చాడా?"
"నో సార్ రాలేదు. కానీ మీరు ఫాలో అయినా వ్యక్తి గురించేమైనా...?"
"అతడి విషయంలో మనం భయపడవచ్చు భార్గవ చెప్పిందాన్ని బట్టి కొద్దిరోజులుగా శరత్ కోరిక కోరుతున్నాడు. అదేమిటో కోరేలోగానే అవాంతరాలు వచ్చేస్తున్నాయి. అయితే భార్గవ వూహ ప్రకారం శరత్....బాబీని దత్తత కోరుతున్నాడేమో నన్పిస్తూంది. ఆ కోరిక ఖరీదు ట్వంటీలాక్స్ అట. నా గెస్ ప్రకారం....భార్గవ ఆ కోరికను తిరస్కరిస్తే భార్గవను ఈ రూపకంగా హతమార్చి బాబీని స్వంతం చేసుకోవాలనేమో...అతడీ విధంగా ఫోన్స్ చేయిస్తుండొచ్చు. డబ్బున్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. శరత్ ని ఫాలో అయి రిస్కీగా తిరిగినా ఫలితమే కన్పించలేదు. అతడు బెంగుళూరు వచ్చింది సెమినార్ కొరకే. అందుకే నేను వచ్చేస్తున్నాను. అయితే ఓ విచిత్ర మేమిటంటే...శరత్ ని ఫాలో అయినా శూన్యమని బెంగుళూరు ఏరో డ్రోమ్ కు మౌనిక అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పింది."
