Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 35

                                         టికెట్ కలెక్టర్స్
    రైలు స్టేషనుకి హడావిడిగా పరుగులుతీసి రిజర్వేషను ఛార్టులో తనపేరుందో లేదోనని చూసాడు అంకారావు.
    ఊహూ... అందులో తన పేరులేదు.
    వెయిటింగ్ లిస్టులో చూసాడు.
    అందులో అంకారావు పేరు ఉంది. ఆ లిస్టులో పదోపేరు అతనిది.అంటే తన టిక్కెట్టు కన్ ఫర్మ్ కాలేదన్నమాట!!
    గబగబా రిజర్వేషను కౌంటర్ దగ్గరికెళ్లి కౌంటర్ లోని మనిషిని అడిగాడు "నా టిక్కెట్టు కన్ ఫర్మ్ కాలేదు ఎలా?"
    "మేం ఇక్కడేం చెయ్యమండీ... మీరు టి.సి.నే  అడగాలి! ఏవైనా లాస్ట్ మినిట్ కాన్సిలేషన్స్ ఉంటే టిక్కెట్ కలెక్టర్ మీకు బెర్త్ ఎలాట్ చేస్తాడు..."అన్నాడు కౌంటర్ లో మనిషి.
    అంకారావు ఫ్లాట్ ఫాం మీదికి సూట్ కేసు పట్టుకుని వచ్చాడు.
    అప్పుడే అతను ఎక్కాల్సిన గోదావరి ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫాం మీదికి వచ్చింది.
    రైలు ఇంకో అరగంటలో కదుల్తుంది.ఈలోగా టికెట్ కలెక్టర్ని పట్టుకుని బెర్త్ ని సంపాదించాలి అనుకున్నాడు అంకారావు.
    అతను ఫ్లాట్ ఫాం మొత్తం కలియచూసాడు. టికెట్ కలెక్టర్ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని.
    టికెట్ కలెక్టర్ కనిపించలేదుగానీ కాస్త దూరంలో ఓ పెద్ద గుంపు ఉంది. వాళ్లు ఒకరినొకరు తోసుకుంటున్నారు.
    ఎవరో సినిమా యాక్టర్!...
    అంకారావుకి ఆ సినిమా యాక్టర్ ఎవరో చూడాలని కూతూహలం కలిగింది.
    గబగబా గుంపు దగ్గరికి వెళ్లి, జనాన్ని తప్పించుకుంటూ లోపలికి చొచ్చుకుపోయాడు అంకారావు.
    ఆ గుంపు మధ్యలోని మనిషిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను సినిమా యాక్టర్ కాదు.
    అతను టిక్కెట్ కలెక్టర్!
    అక్కడ రిజర్వేషన్ లేని జనాలపాలిటి దేవుడు!!..
    "హర్రే!... ఈయనా?... నేనింకా ఈ జనాన్ని చూసి సినిమా యాక్టరేమో అనుకున్నా..." అన్నాడు అంకారావు ఆశ్చర్యంగా.
    ఆ మాట వింటూనే తల తిప్పి సీరియస్ గా అంకారావు వైపు చూసాడు టిక్కెట్ కలెక్టర్.
    "ఏం?... సినిమా యాక్టరైతే ఏమైనా గొప్పా?..."అన్నాడు.
    "గొప్పే కదండీ మరి?..." అమాయకంగా అన్నాడు అంకారావు.
    అతను వాక్యం పూర్తిచేసీ చెయ్యగానే టిక్కెట్ కలెక్టర్ చుట్టూ ఉన్న జనం అంకారావుమీద విరుచుకుపడ్డారు.
    ఒకడేమో అంకారావు జుట్టుపట్టుకుని పీకాడు. ఇంకోడు చొక్కా చింపేసాడు. మరొకడు వెనకనుండి జల్లకాయి కొట్టాడు. మరో మనిషి ముందునుండి ముక్కుమీద గుద్దాడు.
    "ఆపండి... ఆపండి..." గట్టిగా అరిచాడు టిక్కెట్ కలెక్టర్ జనాన్ని ఉద్దేశించి.
    అందరూ ఠక్కున ఆగిపోయారు.
    అంకారావు టికెట్ కలెక్టర్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసాడు.
    "ఏం... ఈయన గొప్పా?సినిమా యాక్టర్ గొప్పా??..." జనం గుర్రుగా చూస్తూ అంకారావుని ప్రశ్నించారు.
    "ఈయనే గొప్పలా ఉన్నాడు" బుర్ర తడుముకుంటూ గొణిగాడు అంకారావు.
    టిక్కెట్ కలెక్టర్ 'అట్టారా దారికి'అన్నట్టు నవ్వాడు.
    ఇప్పుడు జనం అంకారావు మీదినుండి టిక్కెట్ కలెక్టర్ మీదికి దృష్టిని పోనిచ్చారు. "సార్... నాకు ఓ బెర్తు కావాలిసార్..." అన్నాడు ఒకడు టిక్కెట్టు కలెక్టర్ మొహంలోకి దీనంగా చూస్తూ.
    "సార్ సార్... నాకు రెండు బెర్తులు కావాలిసార్..."అన్నాడు మరొకడు రెండు చేతులూ జోడించి దీనాతి దీనంగా.
    "సార్ సార్ సార్... నాకు మూడు బెర్తులు కావాలి సార్" ఇంకొకతను సాష్టాంగపడి నమస్కారం చేసాడు.
    వాళ్లందరూ అలా అడుగుతూ ఉంటే అంకారావుకి తన రిజర్వేషను గురించి గుర్తు వచ్చింది.
    "సార్... సార్... మరి నాకో?..."అన్నాడు చిర్నవ్వు నవ్వుతూ.
    పక్కనున్నాయన అంకారావు డొక్కలో ఓ పోటు పొడిచాడు.
    "వావ్వోయ్!..." అని బాధగా అరిచి"ఎందుకయ్యా అట్టా పొడిచావ్?" అంటూ కోపంగా అరిచాడు.
    "నీ మంచికోసమేనయ్యా... టిక్కెట్ కలెక్టర్ని బెర్తు అడిగేది అలనేనా?.... నమస్కారమైనా పెట్టకపోతే ఎలా?" అన్నాడతను.
    అంకారావు నాలుక కర్చుకుని టిక్కెట్ కలెక్టర్ వైపు తిరిగాడు.
    టిక్కెట్ కలెక్టర్ తనవైపే సీరియస్ గా చూస్తూ ఉన్నాడు.
    "నమస్కారం సార్... హిహిహి"అన్నాడు అంకారావు.
    టికెట్ కలెక్టర్ మొహంలోని సీరియస్ నెస్ పోయింది. అతను భళ్లున నవ్వేసాడు.
    "నాక్కూడా బెర్తు కావాల్సార్..."అన్నాడు అంకారావు.
    "నాకు... నాకు... నాకు... నాకు..."అందరూ అరిచారు.
    "ఏంటి నాకాలి?... నేను నాకను పొండి..."కోపంగా అరిచాడు టిక్కెట్ కలెక్టర్.
    అందరూ ఘొల్లుమని నవ్వి అంతలోనే అతనికి కోపం వచ్చిందని గ్రహించి నాలుక కర్చుకుని "కాద్సార్... మాకు బెర్తులు కావాల్సార్..."అన్నారు కోరస్ గా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS