"ఛీ... ఏమిటండీ మీరు?... పొద్దున్న లేవగానే ఆ చిలిపిచేష్టలూ, ఇంక కన్ను కొట్టడం ఆపండి..." అంది రాధ గోపీని మందలిస్తూ...
గోపి అయోమయంగా రాధవంక చూశాడు... ఆ తర్వాత తల్లి వంక చూశాడు.
సరస్వతి హఠాత్తుగా ఆక్రోశించింది.
"బాబూ!- ఏంటి నాయనా ఇది?... నేను నీకు తల్లినిబాబూ... తల్లంటే దైవస్వరూపం బాబూ... అలాంటి దైవస్వరూపిణికి కన్ను కొట్టొచ్చా?" అంది సరస్వతి చీరకొంగు నిండుగా కప్పుకుంటూ.
"హమ్మా!... నేను కన్ను కొట్టడంలేదమ్మా... నా ఎడమకన్ను దానంతట అదే కొట్టుకుంటుందమ్మా... అదే కొట్టుకుంటూంది.... నా ఎడమకన్ను అదుర్తూందమ్మా... అందుకే అలా కొట్టుకుంటుందమ్మా." జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి.
"అవునా నాయనా?..." అంది సరస్వతి నిండుగా కప్పుకున్న పైటకొంగును మళ్ళీ తీసేసి మామూలుగా వదిలేస్తూ.
గోపికి ఏదో విషయం గుర్తుకువచ్చి అతని మొహం వివర్ణమైంది.
"అమ్మా! ఇందాక హారతి తీసుకుంటుంటే హారతి ఆరిపోయింది. ఇప్పుడేమో ఎడమకన్ను అదుర్తూంది... ఏదో కీడు జరగబోతూందమ్మా... ఏదో కీడు జరగబోతూంది..." భయం భయంగా అన్నాడు.
అతని మాట పూర్తిగా అయీఅవగానే గూడెంమనిషి ఒకడు కేకలు పెడ్తూ వచ్చాడు.
"బాబూ... గోపీ బాబూ... కొంపలు మునిగిపోయాయ్ గోపీ బాబూ..." అన్నాడు ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటూ.
"ఇది మరీ బాగుందయ్యా... ఏదో రాయుడి రౌడీలు మీ పనులకి అడ్డం తగుల్తుంటే నేనేమైనా చెయ్యగల్నుగానీ - వరదొచ్చి కొంపలు మునిగిపోతే నేనేం చెయ్యగల్ను?-"
విసుగ్గా మొహం పెట్టి అన్నాడు గోపి.
"కొంపలు మునగడం అంటే మీరనుకుంటున్నట్టు మునగడంకాదు బాబుగారూ-"
"మరి?"
"సీతాలు చచ్చిపోయింది బాబూ -సీతాలుని ఎవరో చంపేశారు బాబూ-" ఘొల్లుమన్నాడు.
ఆ వార్తవినగానే గోపి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అతని మనసులో అగ్నిపర్వతాలు ధణేల్ మని బ్రద్దలయినట్టు అనిపించింది.
"సీతాలూ!-"
గావుకేక పెట్టి ఆ తర్వాత భోరుమని ఏడుస్తూ జుట్టుపీక్కున్నాడు గోపి.
"ఎవరండీ ఆ సీతాలూ? - అదెవరో చస్తే మీరెందుకు ఇంత బాధపడ్తున్నారు?- దానికి మీకూ ఏం సంబంధం? - కొంపదీసి ఇంకో ఫామిలీగాని సెటప్ చేశారా ఏంటి?-" లబ్బున మొత్తుకుంటూ అంది రాధ.
"చాల్లే నోర్ముయ్ - సీతాలంటే ఎవరనుకున్నావ్ - ఓ దేవత! సీతాలు నాకు చెల్లెలు అవుతుంది..." ఏడుపాపి కసురుకున్నాడు గోపి.
రాధ నాలుక కరచుని చెంపలేస్కుంది.
"సీతాలూ"
మరోసారి గావుకేక పెట్టి వీధిలోకి పరుగుతీశాడు గోపి.
29
గోపి పరుగు పరుగున సీతాలు గుడిసెని సమీపించాడు.
గుడిసె బయట అతనికి ఓ హృదయవిదారక దృశ్యం కనిపించింది.
గుడిసె బయట గంగ కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తూంది.
"గంగా... గహాంగా.."
గంగ మెడను కావలించుకుని భోరున ఏడ్చాడు గోపి.
"భే - అంభే - భే భే -" గంగ కూడా ఏడ్చింది - భోరున.
"నన్నూ గంగనీ అనాధల్ని చేసిపోయావా సీతాలూ-" భోరుమన్నాడు గోపి.
"భే - భే -"
"ఏది గంగా? - సీతాలు ఏది? ఏది ఏది ఏది?-" గంగ పీక పట్టుకుని ఊపేస్తూ ఆవేశంగా అడిగాడు గోపి.
గంగ కొమ్ములు ఊపి, ఆ తర్వాత గుడిసె గుమ్మంవైపు తలవిరుస్తూ చూపించింది.
"సీతాలూ"
గోపి గంగ పీకొదిలిపెట్టి లోపలికి పరుగెత్తాడు.
లోపలి దృశ్యంచూసి గోపి గట్టిగా "కెవ్వు" మని అరిచాడు.
బయట నుండి గంగ "భే-" అంది.
సీతాలు నేలమీద వెల్లకితలా పడివుంది. ఆమె చాతీలో పదునైన కత్తి దిగబడి ఉంది. ఆమె జాకెట్ చిరిగిపోయి వుంది. మొహంనిండా రక్కులు.
ఎవరో ఆమెని దారుణంగా రేప్ చేసి తర్వాత కత్తితో పొడిచి చంపేశాడు.
"సీతాలూ!-"
సీతాలు శపంమీద పడి భోరున ఏడ్చాడు గోపి.
"ఈ అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయావా సీతాలూ - వెళ్ళి పోయావా? నిన్ను చూడకుండా ఈ అన్నయ్య ఎలా ఉండగలడమ్మా? హయ్యో భగవంతుడా - దేవతలాంటి సీతాలుని నీ దగ్గరకు తీస్కెళ్ళిపోయావా తండ్రీ?!-హయ్యో!-"సీతాలు మొహానికి మొహం ఆనించి ఘొల్లుమన్నాడు.
గోపీ మొహానికీ, చేతులకీ, బట్టలకీ మొత్తం రక్తం అంటుకుంది.
ఓ నిముషం ఏడ్చిన గోపి తర్వాత ఏడుపాపి మెల్లగా తల ఎత్తాడు.
అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మెరుస్తున్నాయ్. అతను వణికే చేతుల్తో సీతాలు ఛాతీలోని కత్తి బయటకు లాగాడు.
కుడిచేత్తో పట్టుకుని, పైకెత్తి, దానివంక కళ్ళు పెద్దవిచేసి చూశాడు-తర్వాత సీతాలువంక చూశాడు.
"సీతాలూ-"
ఆవేశంగా అరిచాడు గోపి.
ఆ అరుపుకి సీతాలు శవం కూడా ఉలిక్కిపడింది.
"సీతాలూ! నిన్ను దారుణంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరైనాసరే వాడిని కత్తికొక కండగా నరికి చంపుతూ సీతాలూ చంపుతూ"
గోపి రక్తం కారుతున్న కత్తివంక మళ్ళీ చూశాడు.
"అవును. కసిదీరా చంపుతా. పొడిచి చంపుతా" ఆవేశంగా అరిచాడు.
అంతలో అరడజను మంది పోలీసులు బిలబిలా ఆ గదిలోకి ప్రవేశించారు.
వాళ్ళని చూస్తూనే గోపీ ఉలిక్కిపడి చేతిలోని కత్తిని క్రిందికి జారవిడిచాడు. అంతేకాదు. ఆ హత్యేదే తనే చేసినట్టు భయంగా మొహం పెట్టి గడగడా వణికిపోతూ "నాకేం తెలియదు... నేను ఈ హత్య చెయ్యలేదు. నాకేం తెలీదు" అని అంటూ మెల్లమెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ గోడ మూలకి చేరుకున్నాడు.
ఇన్ స్పెక్టర్ రెండడుగులు ముందుకువేసి రివాల్వర్ తీసి గోపి గుండెలకు గురిపెట్టి "గోపి... యూ ఆర్ అండర్ అరెస్ట్!" అన్నాడు.
"ఇన్ స్పెక్టర్! నాకేం తెలియదు. నేను సీతాలును హత్య చెయ్యలేదు. నేనే పాపం ఎరుగను ఇన్ స్పెక్టర్..." అన్నాడు గోపీ దీనంగా మొహంపెట్టి.
"హ్హ... హ్హ... హ్హ...."
ఇన్ స్పెక్టర్ వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి సీతాలుశవం మరోసారి ఉలిక్కిపడింది.
"నువ్వు హత్యచేయలేదంటే నమ్మడానికి నేను పిచ్చోడిననుకున్నావా గోపి? నీకూ సీతాలుకీ కనెక్షన్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒంటరిగా నువ్వూ... సీతాలు శవం!
నీ చేతిలో రక్తంలో తడిచిన కత్తి, నీ ఒంటికీ, బట్టలకీ సీతాలు రక్తం... ఇవి చాలు దోషిగా నిన్ను ఉరికంబం ఎక్కించడానికి, ఏ నేరస్థుడూ చట్టం నుండి తప్పించుకోలేడు. చట్టం చేయి చాలా పెద్దది గోపీ... చాలా పెద్దది" అన్నాడు ఇన్ స్పెక్టర్ ఆవేశంగా ఊగిపోతూ.
"కానీ మీ చేతులు చాలా పొట్టిగా ఉన్నాయ్!" ఆశ్చర్యంగా అన్నాడు గోపి.
"నేను చెప్తుంది చట్టం చేతులు గురించి!... నా చేతుల గురించి కాదు!! ఏయ్ ఫోర్ ట్వంటీ గోపీ చేతికి బేడీలు వెయ్యి" గర్జించాడు ఇన్స్ పెక్టర్.
కానిస్టేబుల్ గోపి చేతికి బేడీలు వేశాడు.
"ఇన్ స్పెక్టర్" ఆవేశంగా అరిచాడు గోపి. "ఒక అమాయకుడికి శిక్ష వేసే మీ న్యాయం న్యాయమూ కాదు. ఈ చట్టం చట్టమూ కాదు. అంతిమవిజయం ఎప్పుడూ సత్యానిదే ఇన్ స్పెక్టర్ సత్యానిదే!! ఆ విషయం గుర్తుంచుకో!"
"సత్యమా? వాడెవడు?
` ఏయ్ ఫోర్ ట్వంటీ ఆ సత్యంగాడూ, గోపీ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసివుంటారు. మనం ఇప్పుడు ఆ సత్యంగాడిని కూడా అరెస్టు చేయాలి!" హుషారుగా అన్నాడు ఇన్ స్పెక్టర్.
"యస్సార్! కానీ అంటున్న సత్యం మనిషికాదు సార్ సత్యం అంటే ట్రూత్ అనే అర్థంతో చెప్తున్నాడు సార్" అన్నాడు కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ.
"ఓ"ఇన్ స్పెక్టర్ ఇరిటేట్ అయిపోతూ టోపీమీద గట్టిగా ఓ మొట్టు మొట్టుకున్నాడు. "నువ్వు ఇలా అర్థంకాని మాయమాటలు చెప్పి తప్పించుకుని పోదామని అనుకుంటున్నావేమో అదేం కుదరదు. నీకు ఇందాకే చెప్పానుగా చట్టం చేయి చాలా పెద్దదని. కానిస్టేబుల్స్ ఇతన్ని లాక్కెళ్ళి జీపులో ఎక్కించండి."
