Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 36

 

    మర్నాడు ప్రసాదరావు మా ఇంటికి వచ్చాడు. అప్పటికి నేను తగు సరంజామాతో సిద్దంగానే ఉన్నాను. అతన్ని కూర్చోబెట్టి మర్యాద చేశాను."
    "బాగుందండీ మీఇల్లు-" అన్నాడతను మర్యాదకి.
    "మరికాస్త అద్దె ఇస్తే -- ఇంకా మంచి ఇంట్లో ఉండవచ్చు -" అన్నాను నేను.
    అతను అదోలా నవ్వాడు. ఈలోగా నేనతనికి మా ఇంట్లో సభ్యుల్ని పరిచయం చేశాను. వినయ పూర్వకంగా నవ్వాడతను.
    ఆ నవ్వు నా గుండెల్ని పిండింది. మరో గంటలో మరణించబోతున్న ప్రసాదరావు ముఖం చిందించే చివరి చిరునవ్వు లవి.
    ప్రసాదరావుకి కాఫీ కలపడానికి మా చెల్లెలు లోపలకు వెళ్ళింది. దాన్ని కాఫీ కలపనిచ్చి -- ఆ గ్లాసు తీసుకుని నేను ప్రసాదరావు దగ్గరకు వచ్చాను. వంటింటి నుంచి అతన్ని చేరేలోగా నేననుకున్న బిళ్ళ కాఫీలో కలిసింది.
    "కాఫీ తీసుకోండి-" అన్నాను.
    "సారీ -- నేను కాఫీ తాగను --" అన్నాడతను.
    ఉలిక్కిపడ్డాను. "ఈరోజుల్లో కాఫీ తాగని వారేవరండీ" అన్నాడు మా తమ్ముడు.
    "నేను" అన్నాడతను నవ్వుతూ.
    వీడి అదృష్టం మండిపోనూ -- ప్రతిసారీ తప్పించుకు పోతున్నాడే -- అనుకున్నాను.
    "కొంచమైనా తీసుకోవాలి. తప్పదు " అన్నాను బలవంత పెడుతూ.
    "లేదు. ఇంతవరకూ ఒక్కసారి కూడా కాఫీ తాగలేదు. ఆ బావన కూడా భరించలేను-" అన్నాడతను. నేను హతషుడి నై కుర్చీలో కూలబడి పోయాను.

                           *    *    *    *
    సాయం సమయానికి మా ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళని చూస్తూనే నాకు భయం వేసింది. వస్తూనే వాళ్ళు నా గురించే అడిగారు- నాన్నగారూ , అందరూ కంగారు పడ్డారు.
    నన్ను పోలీసు స్టేషను కు తీసుకు వెళ్ళారు.
    ప్రసాదరావు మరణించాడట. ఆరోజు అతను మా ఇంటికి వేడుతున్నాట్లు ఇంట్లో చెప్పాడుట. తర్వాత మరి రాలేదు. ఊరి చివర ఆలయం దగ్గర అతని శవం దొరికింది. అతను హత్య చేయబడ్డాడని పోలీసులు నిర్ధారణ చేశారు. అనుమానం పై నన్ను అరెస్టు చేశారు.
    అమ్మ, నాన్న, చెల్లాయి, తమ్ముళ్ళు అందరూ లబోదిబో మని ఏడ్చారు. వాళ్ళ కళ్ళలో ఆశ ఇప్పుడూ పూర్తిగా హత్య కావించబడింది. వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అంధకారమై పోయింది.
    ఆ సమయంలో ఒకతను నా దగ్గరకు వచ్చి -- "మీకు - నేను జీవితాంతం కృతజ్ఞుడినై ఉంటాను- " అన్నాడు.
    "ఎందుకు?" అన్నాను ఆశ్చర్యపోతూ.
    "నన్ను మీరు గుర్తు పట్టలేదనుకుంటాను. నా పేరు సంజీవ కుమార్. కొద్ది రోజుల క్రితం మనమందరం ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ కెళ్ళాం. అందులో సెలక్టయిన ప్రసాదరావు ని మీరు హత్య చేసారు. వెయిటింగ్ లిస్టు లో మొదటి పేరుగా ఉన్న మీరు అరెస్ట య్యారు. నేను వెయిటింగ్ లిస్టు లో రెండో వాడిని. మీరిద్దరూ తప్పుకోవడంతో ఇప్పుడు నాకా ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం రావడానికి కారణం మీరు" అన్నాడతను.
    నాకు నెత్తిన పిడుగు పడినట్లయింది.
    హత్య చేస్తే - హతుడూ, హంతకుడూ కూడా నష్టపోతారు. ప్రయోజనం మూడో వాడికే!
    నాకు ఏడుపు వచ్చింది. రెండు చేతులతో ముఖం కప్పుకుని బోరుమని ఏడ్చాను. అలా ఎంతసేపు ఏడుస్తుండి పోయానో నాకే తెలియదు. పోలీసు నా భుజం తట్టి "పద!" అన్నాడు.
    నేను కదలలేదు.
    పోలీసు ఇంకా నా భుజం తడుతున్నట్లే ఉన్నాడు. అయితే ఈసారి నాకు "అన్నయ్య" అని వినబడింది.
    
                           *    *    *    *

    ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.
    ఇంతవరకూ జరిగింది నిజం కాదు. కల! పీడ కల!
    కానీ ఈ కలలో ఒక జీవిత సత్యం ఇమిడి ఉంది. భవిష్యత్తు గురించి నేను కంటున్న బంగారు కలలు నేల మట్టం కాకుండా సహకరించిన కల! నన్ను హంతకుడు కాకుండా అపిల కల!
    జీవితంలో మరెన్నడూ నేను హత్య విషయం తలపెట్టాను.
    ఒక భయంకర సత్యాన్ని కలగా మార్చి నన్ను బ్రతికించి నందుకు దేవుడికి మనసులోనే జోహారు అర్పించు కున్నాను.
    మర్నాడు ప్రసాదరావు నిజంగానే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన కొద్ది క్షణాలలోనే అరమరికలు లేకుండా అందరి తోనూ కలిసిపోయాడు. మాఇంటి పరిస్థితుల నెంతో చక్కగా అర్ధం చేసుకున్నాడు.
    ఆక్షణంలో అతనెంతో మంచివాడనిపించింది నాకు.
    ఆ తర్వాత నేలా పదిహేను రోజులకు నాకు అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆశ్చర్యపోయాను. ఉద్యోగంలో చేరిన వారం రోజులకు ప్రసాదరావు తలిదండ్రులు వచ్చి - మా చెల్లాయిని చూసుకు వెళ్ళినట్లు నాన్నగారు ఉత్తరం రాశారు. మరో నెల రోజులకీ- కానీ కట్నం లేకుండా మా చెల్లెల్ని చేసుకుందుకు ప్రసాదరావు తయారుగా ఉన్నట్లు తెలిసింది.
    నేను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెల్లకి మాచెల్లాయి వివాహం జరిగింది. వివాహ సమయంలో కళ్యాణ మంటపంలో కూర్చున్న చెల్లెలి కళ్ళలోని వెలుగులు చూశాను. నా మనసేదోలా అయిపొయింది.
    వివాహ సమయంలోనే ప్రసాదరావు నాకు చెప్పాడు.
    "అప్పుడు నాకా ఉద్యోగం మా నాన్నగారి ఇన్ ప్లుయన్సు వల్ల వచ్చింది. ఆరోజే ఎంక్వయిరీ చేసి నేనుసేలక్టయినట్లు తెలుసుకున్నాను. మీరు వెయింటింగ్ లిస్టు లో ఉన్నట్లు కూడా నాకు తెలుసు. మీ ఇంటికొచ్చాక - మీ ఉద్యోగం గురించి మీ ఇంట్లో అందరూ ఎంత ఆశతో ఉన్నారో అర్ధమయింది నాకు. అదే క్షణంలో మీ చెల్లాయి నన్ను ఆకర్షించింది. ఒక స్నేహితుడిగా కాక - కాబోయే నా భార్యకు అన్నగా మిమ్మల్ని గుర్తించాను. అటువంటి వారికి నా ఇన్ ఫ్లుయన్సు తో అన్యాయం చేయారాదనిపించింది. ఫలితంగా న్యాయంగా మీకు రావలసిన ఉద్యోగం మీకే వచ్చింది."
    నేను ఆనందంతో ప్రసాదరావు ని కౌగలించుకున్నాను.
    ప్రసాదరావు ఇప్పుడు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడూ మంచి మనసుతో ఉన్నాడు.
    నా ఉద్యోగం కోసం అతన్నీ లోకం నుంచి తప్పించాలనుకున్నాను. కానీ అతనే దారి తప్పుకున్నాడు. నా చెల్లెలి కళ్ళలో ఆశలు బ్రతికించడానికి అతన్నిచంపాలను కున్నాను. కానీ అతనే ఆ ఆశలకు కొత్త వెలుగులు సంతరింపజేశాడు.

                                      ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS