Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 35

 

    క్రమంగా నాకు నిద్రపట్టింది.
    మర్నాడు మెలుకువ వచ్చేసరికి నాలోని ఆవేశం కొంత వరకూ తగ్గింది. ప్రసాదరావుని హత్య చేయాలన్న ఆలోచన వచ్చినందుకు నన్ను నేనే నిందించుకున్నాను.
    అయితే ఆరోజు ఉదయం 8 గంటలకు బస్సు స్టాండులో ప్రసాదరావుని చూడగానే మళ్ళీ నాలో అసూయ పొంగి పొరలింది. ఉద్యోగానికి నాకూ మధ్య శనిగాడిలా నిలబడ్డాడు. ఈ శని వదిలితే గానీ ఉద్యోగం దొరకదు నాకు.
    ముందుగా అతనే నన్ను పలకరించాడు. మాటలు కలిసేక ఒక విచిత్ర విషయం తెలిసింది. అతనూ నేనూ ఇప్పుడు ఒకే బస్సులో ఒకే ఊరు వెడుతున్నాం. మా ఊళ్ళో అతని మేనత్త ఉందిట. వాళ్ళింట్లో ఓ నాలుగు రోజులుండి వెడదామని ఉద్దేశ్యం. నాదీ అదే ఊరని తెలిసేక అతనికి ఎంతో ఆనందం కలిగింది.
    "పోనీలెండి -- మరో నాలుగు రోజులు మనం కలిసి కాలం గడపవచ్చు-- " అన్నాడతను.
    నాలుగు రోజులు బోలెడంత కాలం. తెలివిగా నా పధకాలను అమలు జరపడానికి గడువు చాలు. వద్దు వద్దనుకుంటున్నా భగవంతుడే నాకు ఈ అవకాశాన్నిస్తున్నాడేమో ననిపించింది.
    ప్రసాదరావు చావు నా చేతిలో రాసి పెట్టి ఉందేమో!
    ఇద్దరం ఒకే బస్సులో పక్క పక్కనే కూర్చున్నాం. బస్సు కదిలింది. ప్రసాదరావు ఉత్సాహంగా ఏవేవో కబుర్లు చెపుతున్నాడు. నేను మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నాతొ అరమరికలు లేకుండా సరదాగా కబుర్లు చెపుతున్న ఈ వ్యక్తిని చంపడానికి సులభ మార్గమేమిటా -- అని?
    బహుశా ఒక గంట కాలం ప్రయాణం చేశామేమో .... అంతే .......బస్సు హటాత్తుగా ఆగిపోయింది.
    "ఇంజను ట్రబులిస్తోంది. డిఫెక్టేమిటో తెలియదు"------- అన్నాడు డ్రైవర్.
    ప్రయాణీకులందరూ గొణుక్కుంటున్నారు. కొంతమంది విసుగ్గా బస్సు దిగారు. మరో పది నిముషాల్లో తెలిసింది. బస్సు రిపేరు కి కనీసం గంటయినా పడుతుంది. అదయినా అదృష్టవశాత్తూ బస్సులో మెకానిక్కు ఉండడం వల్ల!"
    ఇంచుమించు ప్రయాణికులందరూ బస్సు దిగారు. నేనూ ప్రసాదరావు కూడా దిగాం. ఆ ప్రాంతం అంతా బాగోలేదు. రోడ్డు కిటూ అటూ దట్టంగా చెట్లు.
    'సరదాగా లోపలకు వెడదామా " అన్నాను నేను. ప్రసాదరావు నవ్వుతూ అంగీకరించాడు.
    రోడ్డు పక్క నున్న అడవి ప్రదేశంలో అడుగుపెట్టాం మేము.
    తుప్పలు, పొదలు, ముళ్ళ మొక్కలు- నేల నిండా ఎండుటాకులు . కొంచెం దూరంగా బహుశా చెరువు కాబోలు కనబడుతోంది.
    నా మనసు పరిపరివిధాల పోతోంది. నెమ్మదిగా చెరువు వైపు దారి తీస్తున్నాను నేను. ప్రసాదరావు నన్ను అనుసరిస్తున్నాడు -- ఏవేవో కబుర్లు చెబుతూ.
    ఇతగాడు కబుర్ల పోగులాగున్నాడు. విశ్రాంతి లేకుండా వాగే ఇతని నోటికి పూర్తీ విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాను నేను. నా దృష్టంతా దూరంగా కనబడుతున్న చెరువు మీదనే ఉంది. నా ఆశయం చెరువు ప్రాంతాల తీర వచ్చునని బలంగా అనిపిస్తోంది.
    అడుగులు వేస్తుండగా హటాత్తుగా నేను పాతాళం లోకి పోయినట్లు అనిపించింది. చూసుకోకుండా ఒక పెద్ద గోతిలో పడ్డాను నేను. "ప్రసాదరావు గారు!" అంటూ అరిచాను.
    అంతలోనే ఒక చేయి గోతిలోనికి వచ్చింది. నాకు ఊతగా నిల్చిన ఆ చేయి సహాయంతో గోతి లోంచి బయట పడ్డాను. పైకి రావడానికి నేను చేసిన ప్రయత్నంలో నా బట్టలన్నీ మట్టి కొట్టుకు పోయాయి.
    ప్రసాదరావు సహాయంతో నేను ఒక గండం గడిచి బయట పడ్డాను. ఈ ప్రసాదరావునా చంపాలను కుంతున్నాది?" అంది మనసు. ముందు సిగ్గు పడ్డాను. కానీ క్రమంగా నా ఆలోచన మారింది. ఉద్యోగంలో నేను సెలక్టయి ఉండి -- ప్రసాదరావు వెయిటింగ్ లిస్టులో ఉండి వుంటే! ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకుని ఉండేవాడు.
    అప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. ప్రసాదరావు ని చంపేక ఈ గోతిలో పడేసి -- పక్కనే ఉన్న ఇంత మట్టి పోస్తే -- నరమానవుడి కి కూడా తెలియదు ప్రసాదరావు సంగతి.
     దేవుడు నా చేతిలో ప్రసాదరావు మరణం రాసి పెట్టాడని నాకు అనిపించింది. లేకుంటే గోతిలో పడ్డ నన్ను రక్షించి తను చావు తనే కోరి తెచ్చుకోడు ప్రసాదరావు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం.
    మేము చెరువు గట్టు సమీపించాం.
    చుట్టూ ఎవ్వరూ లేరు - మేమిద్దరం తప్ప ప్రసాదరావు ని చెరువులోకి తోసేద్దామనిపించింది.
    "మీకు ఈత వచ్చా?" అడిగాను. నా ప్రశ్నలోని ఉద్దేశ్యం తెలియదు ప్రసాదరావు కి. అందుకే అతని ముఖంలో రంగులు మారలేదు.
    "వచ్చినా ఏం ప్రయోజనం లెండి. ఏ క్షణంలోనైనా బస్సు కదలవచ్చు -" అన్నాడు.
    "మీకు ఈత వచ్చా అని అడిగాను" అన్నాను.
    "బ్రహ్మాండంగా వచ్చు. గోదావర్లో ఒకోసారి లంకదాకా ఈదుకు పోతుండే వాడిని. మరి మీకు?" అనడిగాడతను.
    రాదనీ చెప్పటానికీ భయం వేసింది. ఏమో - ఏ క్షణంలో ఎవరికి ఏబుద్ది పుట్టవచ్చునో - చెప్పలేము . అందుకే నాకూ వచ్చునని అబద్దమాడేశాను.
    ప్రసాదరావు నిజంగా అదృష్టవంతుడు. ఏ పధకం వేసుకున్నా అతని పట్ల ఫలించడం లేదు. ఇంక ఒక్కటే మార్గముంది. బలవంతంగా పీక పిసికి చంపడం.
    అయితే మేమిద్దరం సమ వయస్కులం. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే పర్సనాలిటీ . ఒక పిసరు అతనే నాకన్నా బలంగా ఉన్నాడు. గోతి లోంచి బయటకు లాగినప్పుడు అతనిలో పెద్ద అలసట కనబడలేదు. అటువంటి వాడి మీద చేయి చేసుకుని అనవసరంగా వెలితి  పడవలసి వస్తుందేమో ననిపించింది. మరి ఏం చేయాలి!
    "పదండి పోదాం-" అన్నాడతను.
    అంతలోనే బస్సు హరన్ వినబడ సాగింది. ఇద్దరం రోడ్డు చేరుకొని బస్సు ఎక్కాం. రిపేర్ పూర్తయింది. బస్సు బయల్దేరింది.
    బస్సు వేగంగా పోతోంది. ప్రసాదరావు హుషారుగా కబుర్లు చెబుతున్నాడు. కానీ నేను సరాగా వినడం లేదు. చేజారిపోయిన బంగారు అవకాశాల గురించి ఆలోచిస్తున్నాను.
    బస్సు ఆగిన విషయం ప్రసాదరావు నా భుజం తట్టి చెప్పే వరకూ తెలియలేదు. "వచ్చేశాం. మీరు మంచి ఆలోచనలో ఉన్నట్లున్నారు-" అన్నాడతను.
    నేను నవ్వుతూ బస్సు దిగాను.
    "మీ ఇంటి అడ్రసు ఇవ్వండి -- వీలుంటే రేపొకసారి వస్తాను" అన్నాడు ప్రసాదరావు.
    అతనికి నా అడ్రసు ఇవ్వడమే కాకుండా- అతని అడ్రసు కూడా తీసుకున్నాను.
    ఇంటికి వెళ్ళేసరికి - నన్ను చూడగానే నాన్నగారి ముఖంలో కొట్టవచ్చినట్లు ఆత్రుత కనబడింది- "ఎరా - ఏమయింది?' అన్నారాయన ఆత్రుత నంతనీ మాటల్లో వ్యక్త పరుస్తూ.
    నేను మాట్లాడలేదు. మిగతా వాళ్ళందరి కళ్ళలోనూ కనబడుతున్న ఆశను ఆక్షణంలో నిరాశగా మార్చడానికి నాకు మనసొప్ప లేదు. "రావడానికి అవకాశాలున్నాయి" అంటూ కుర్చీలో కూలబడ్డాను.
    పద్దెనిమిదేళ్ళ పెళ్ళి కావలసిన చెల్లాయి నాకు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. "కాస్త మడత మంచం వాల్చి పెట్టమనవే తమ్ముణ్ణి --" అన్నాను.
    "ఈ మాత్రం దానికి తమ్ముడెందుకు? నేనే వేస్తాను-" అంటూ మంచం వాల్చి పక్క వేసింది చెల్లాయి.
    పక్క మీద మెనూ వాల్చాను. నా కళ్ళ ముందు ప్రసాదరావు నవ్వుతున్నాడు. నాకుద్యోగం వస్తుందన్న ఆశ - మా ఇంట్లో అందరి కళ్ళలో ఉంది. నేను సెలక్టు కాలేదని తెలిస్తే - ఆ ఆశ హత్యగావించబడుతుంది. ఈ హత్యను ఆపాలంటే -- ప్రసాదరావు ను హత్య చేయాలి. ఎంతో పకడ్భందీగా పధకం వేసుకుని చేయాలి.
    తర్వాత నెమ్మదిగా నిద్ర పట్టేసింది.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS