వెన్నెల వెలుగు లో చల్లబడిన ఆమె కనుపాపలు మరింత నల్లగా , ఆర్ద్రంగా కనపడినాయ్ అతనికి.
'ఏమీ లేదు, నా ఒంట్లో బాగానే ఉంది.' అని సమాధాన మిచ్చింది కళ్యాణి.
'మరి అలా ఉన్నావెందుకు?' ఆమె కళ్ళ లోతులలోకి చూస్తూ అడిగేడు ప్రేమగా కాంతారావు.
'ఎందుకో యీ వాతావరణం చూస్తుంటే. నా మనసు ఒక అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. నా జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతత నన్నావరించి ఉంది యీ సమయం లో.అమాయికంగా విచ్చుకున్న యీ పూలు, క్రమబద్దంగా పెరుగుతున్న యీ చెట్లు, నిశ్చలంగా ఉన్న యీ కోనేరు, చల్లగా ఉన్న యీ వెన్నెల, అన్నిటి కన్నా మిన్నగా ప్రశాంతంగా, గంబీరంగా ఉన్న యీ ప్రదేశం లోని రాత్రి ......యివన్నీ ' చూస్తుంటే యీ క్షణాలిలాగే కదలకుండా నిశ్చలంగా నిల్చిపోతే బాగుండుననిపిస్తోంది ' అన్నది వేదాంత ధోరణి లో.
కాంతారావు ఓసారి చుట్టూ కలియ జూసేడు. తరువాత కళ్యాణి వదనం లోకి దీర్ఘంగా చూసేడు. వెంటనే గట్టిగా నవ్వి 'చూడు కళ్యాణీ! ఈ రాత్రి ఎంతో అందంగా ఉన్నమాట నిజమే! ఈ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉన్నమాట అంతకన్నా నిజం. కాని యీ సౌందర్యం , ప్రశాంతత , ఊరికే వృధాగా గడిచి పోతుంటే చూస్తూ కూర్చునే శక్తి నాకు లేదు. ఆ అపూర్వ సౌందర్య సమక్షం లో . యీ పచ్చని ప్రకృతి మధ్య, యీ వెన్నెల క్రింద , యీ నిశ్చలమైన కొలను పక్క నిన్ను నాలో లీనం చేసుకోనీయ్ కల్యాణీ!' అంటూ ఆమెను తన బిగి కౌగిలి లో బంధించి వేసేడు.
అంతవరకూ చల్లని వెన్నెల లోని ప్రశాంతతకు వేదాంత ధోరణి ని అలవర్చు కుని కరుడు గట్టిన ఆమె హృదయం , తన ప్రియుని వెచ్చని స్పర్శ సోకినంతనే మెల్లగా కరిగి, మహా ప్రవాహం లా మారి, వెంటనే జలపాత వేగంతో స్పందించసాగింది.
కొంతసేపు గడిచిన తరువాత యిద్దరూ ఒకరి నొకరు అనుకుని, ఎత్తుగా నడుస్తూ , హోటలు రూములోకి వెళ్ళి తలుపేసుకుని నిద్రపోయేరు.
తెల్లవారేక టిఫిను తీసుకుని బయటకు వెళ్ళేరు కాంతారావు కుటుంబం. అప్పటికే రాజస్థాన్ విద్యార్ధులు, ప్రొఫెసరు 'ప్లాంట్ కలెక్షన్' కోసం వచ్చి బిజీగా ఉన్నారు. వీళ్ళను చూస్తూనే 'హల్లో గుడ్ మార్నింగ్!' అంటూ అందరూ ఉత్సాహంగా ఆహ్వానించేరు.
మరుక్షణమే బాబిగాడు, పాప తల్లుదండ్రులను వదిలి ఆ విద్యార్ధుల చేతుల్లోకి వెళ్ళి పోయేరు. ఆ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టి మచ్చిక చేసుకుని, ఆ పిల్లల నడ్డం పెట్టుకుని విద్యార్ధులంతా ఒకటే అల్లరి చెయ్యటం మొదలెట్టేరు.
ప్రొఫెసర్ కి మాత్రం కాంతారావు రాక చాలా ఆనందాన్ని కలిగించింది. అతని సమక్షం లో కొంతవరకైనా విద్యార్ధుల బాధలు తప్పవచ్చునని అతని ఆశ.
ఫ్లవర్ హవుస్ దగ్గర, కొలను దగ్గర , మరో జలాశయం దగ్గర, ఇండియా మాప్ ఆకారంలో పూల మొక్కలు కత్తిరింపబడిన చోట, రకరకాల కోణాల్లో కాంతారావు ని, కళ్యాణి నీ, పిల్లలను ఫోటోలు తీసేరు విద్యార్ధులు.
కాంతారావు ప్రోఫ్రేసర్ ని, విద్యార్ధులను కలిపి ఒక ఫోటో తీసేడు. ఆ ఫోటో ని తాను వారితో గడిపిన రోజులకు చిహ్నంగా తానుంచుకుంటానని అనేసరికి వాళ్ళందరి కీ ఎంతో ఆనందమయింది.
గులాబీ పూలు పెంచే చోటుకు వచ్చే సరికి ఒక విద్యార్ధి లేత పసుపు రంగులో ఉన్న గులాబీ పువ్వు కోసి కళ్యాణి కిస్తూ 'భాభీ! మీరిప్పుడు కట్టుకున్న చీరకు యీ పువ్వు బాగా మాచ్ అవుతుంది. పెట్టుకోండి.' అన్నాడు.
'మీకు ఆడవాళ్ళ 'మాచింగ్' ని గురించి బాగా తెలుసునట్లుందే!' అంటూ ఆ పువ్వు అందుకుని తలలో పెట్టుకుంది కళ్యాణి.
'నాకు ఒక అక్కయ్య, యిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు చీరెలు, జాకెట్లు ఏ రంగులో ఉంటె ఆ రంగులోని పూలు, ఆ రంగు జాకెట్లు, అ రంగు జోళ్ళు ఉంటేనే తప్ప బయటకు వెళ్ళమంటారు. వాళ్ళ చీరాలకి తగ్గ మిగతా మాచింగ్ వస్తువులన్నీ తీసుకు రాలేక నా ప్రాణం పోతుంది. వాళ్ళ వల్లనే 'మాచింగ్' లో మంచి ఎక్స్ పర్టు నయిపోయెను లెండి' అన్నాడు.
అతని మాటలకు అందరూ నవ్వేరు.
కాని ప్రొఫెసర్ కి మాత్రం కంగారుగా ఉంది. ఇక్కడ గార్దేన్సు లోని పూలు కోయటం నిషిద్దం. ఎవరైనా చూసేరంటే ఆ కోసిన 'విద్యార్ధి కి కాక చివాట్లు తనకి తగుల్తాయ్. కాని అదృష్టం కొద్దీ యెవరూ చూడలేదు.
పాత ప్ల్హవర్ హౌస్ లో మాత్రం బాబిగాడు పూల కుండిని దొర్లించేసరికి అక్కడ కాపలా ఉన్నవాడు గట్టిగా అరచేడు.
విద్యార్ధులు అతని కంటే గట్టిగా అరచి 'చిన్నపిల్లడికి యేమి తెలుస్తుందోయ్! ఎందుకలా గొంతు చించుకుంటావు? ఆ కుండీ ని కావాలంటే తీసి పైన మేమేపెడ్తాం లే!' అంటూ ఆ కుండీని యధాస్థానం లో ఉంచేసేరు.
ఇక అతను మళ్ళీ కిక్కురు మనలేడు. ఎవరితో నైనా వాదనకు దిగవచ్చు కాని, విధ్యార్ధులతో మాత్రం వాదనకి దిగి, గెలిచిన వాడు యీ భూ ప్రపంచంలో -- అందునా యీ యిరవయ్యే శతాబ్దం లో ఎవరూ ఉండరని అతనికి బాగా తెలుసు.
మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా గార్డెన్స్ లో కులాసాగా కాలక్షేపం చేసేరు. తరువాత కాంతారావు దంపతులు 'వుడ్ లాండ్స్' హోటలు కి, విద్యార్ధులు , ప్రొఫెసర్ 'దాస్ ప్రకాశ్ హోటలు కి' వెళ్ళి పోయేరు ఒకరి కొకరు 'టాటా ' ' చీరియో' లతో వీడ్కోలు చెప్పుకుంటూ.
'ఆ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు రెస్టు తీసుకుని వెంటనే బస్సులో మైసూరు చేరుకున్నారు కాంతారావు దంపతులు. అక్కడ సాయంత్రం టిఫిను తీసుకుని టాక్సీ లో బెంగుళూరు చేరుకున్నారు. అక్కడ నుండి సరాసరి బస్సులో హైద్రాబాద్ కి వెళ్ళి యింట్లో పడ్డారు.
కళ్యాణి , కాంతారావు తమ యిద్దరు పిల్లలనూ వెంట పెట్టుకుని పదిహేను రోజుల పాటు చేసిన ప్రేమ యాత్ర ఫలితాలివి:
1. పిల్లలిద్దరూ ప్రయాణం లో తిండీ తిప్పలూ సరీగ్గా లేనందున చీపురు పుల్లల్లా తయారైనారు. వాళ్ళు కోలుకోవటానికి పది రోజులు పట్టింది.
2. కాంతారావు కి ఫ్లూ జ్వరం వచ్చి మూడు రోజులు పీడించుకు తింది. ఆ తరువాత మరో పది హీను రోజుల వరకు బలహీనత ఆవరించు కుంది.
3.కళ్యాణి వస్తూనే బూజు పట్టిన గోడలను, దుమ్ము కొట్టిన యింటిని స్వయంగా తనే శుభ్రపరచు కోవలసి వచ్చింది. వాళ్ళు యాత్రలకు వెళ్ళి 'ఫలానా రోజు' కి తప్పకుండా తిరిగి వస్తామని పనిమనిషి కి చెప్పినా, వాళ్ళు వచ్చినట్లు ఆమెకు తెలిసినా, తెలియనట్టే నటించి పనిలోకి నాలుగు రోజుల వరకు రాకపోయేసరికి ఆ నాలుగు రోజులూ యిల్లంతా బాగుచేసి, యింటి పనంతా చేసుకునేసరికి నడుం నొప్పితో మూడు రోజులు పడుకోవలసి వచ్చింది కళ్యాణి కి.
4. కంచి లో కొన్న పట్టు చీరను నీళ్ళలో ముంచగానే పిగిలిపోయి నామరూపాలు లేకుండా చెడిపోయింది. ఆ తరువాత కొందరు మిత్రుల వల్ల కాంతారావు కి తెలిసిందేమంటే యాత్రల కోసం కంచికి వెళ్ళిన వాళ్ళందరి ని దుకాణ దారులు నాసిరకం బట్టలిచ్చి మోసం చేస్తారని, పైగా 'మీరు పది రూపాయలు ఎడ్వాన్సు గా యిస్తే చాలు. ఇంటికి వెళ్ళి డబ్బు పంపెరంటే చీరను పార్సెలు చేసి పంపుతా' మని చెప్పి తమ మీద నమ్మకం కలిగేట్టు చెయ్యటం వల్ల యాత్రికులందరూ వాళ్ళను నమ్మి అప్పుడే చీర కోనేస్తారనీ, అధవా అప్పుడు కొనకుండా యింటికి వెళ్ళి డబ్బు పంపినా పార్సెలు లో వచ్చే ఆ పట్టు చీరకు కూడా అదే గతి పటుతుందని తేలింది. యాత్రికులను ఆయా దుకాణాలకు తీసుకు వెళ్ళిన రిక్షా వాళ్లకి కూడా కొంత కమిషన్ ముడ్తుందిట.
5. కళ్యాణి, మైసూరు , బెంగుళూరు వెళ్ళినప్పుడు శాండల్ వుడ్ సోపులు డజను, శాండల్ వుడ్ ఫేస్ పవుడరు పెట్టెలు మూడు, సెంటు సీసాలు రెండు, హైర్ ఆయిల్ సీసా ఒకటి, శాండిల్ వుడ్ అగర వత్తుల కట్ట , శాండిల్ వుడ్ తో చెయ్యబడిన ఫవర్ వాజ్ వగైరా కొనటం వల్ల యిల్లంతా మంచి గంధం సువాసనలతో నిండిపోయింది కొన్నాళ్ళ వరకు. ముఖ్యంగా సాయింత్రం పూట కళ్యాణి నెత్తికి మంచి గంధం నూనె రాసుకుని , శాండల్ వుడ్ సోపుతో స్నానం చేసి, అదే పౌడరు రాసుకుని జాకెట్టు మీద అదే సెంటును చిలకరించుకుని, గదిలో అగరువత్తులు వెలిగించి, భర్త దగ్గరకు రావటం వల్ల తెల్లవారే సరికి కాంతారావు శరీరం అంతా కూడా మంచి గంధపు వాసనలను విరజిమ్ము తుండేది.
6. పైన చెప్పిన మార్పుల నుండి తేరు కోవటానికి, అలవాట్లు పాతబడటానికి కొద్ది టైము మాత్రమే పట్టింది. వీటన్నిటి కన్న మరో విషయం కళ్యాణీ, కాంతారావు లను ఎలక్ట్రిక్ షాక్ ల నిరత్తరులను చేసింది.
