ఒకరోజు కళ్యాణీ , కాంతారావు కలిసి భోజనం చేస్తుంటే కళ్యాణి మధ్యలో చటుక్కున లేచి, బయటకు వెళ్ళి, భళ్ళున డొక్కుంది. ఆ చప్పుడుకు కాంతారావు కూడా బయటకు పరుగెత్తుకు వచ్చి 'అయ్యో. కళ్యాణి! ఏమిటిది? ఏమయింది?" అనడిగేడు కంగారుగా.
'ఇంకా ఏమవ్వాలండి! నెల తప్పింది మళ్ళీ నాకు.' అంటూ భోరున ఏడ్చేసింది కళ్యాణి.
కాంతారావు కి ఆ వార్త నమ్మ శక్యం కాకుండా ఉంది. ఐనా నిజాన్ని నమ్మనంత మాత్రాన అబద్ధమవుతుందా? అందుకే అతనికి నమ్మక తప్పలేదు. ఇప్పటికే యీ యిద్దరు పసి పిల్లలతోనూ నానా అవస్థలు పడుతుంటే అంతలోనే మూడో పిల్లాడా? దారుణం. ఐతే తాము అనుకున్నట్లు వచ్చేయేడు ప్రదేశాలను చూట్టానికి వీల్లెదన్న మాట. ఈ యిద్దరు పిల్లలతోనే ప్రయాణం అంత కష్టమయింది. యిక రెండు నెలల పసి గుడ్డును తీసుకుని ప్రేమ యాత్రలెం చేస్తారు?'
'నిజమా కళ్యాణి!' ఎంత పని జరిగి పోయింది!' అంటూ తల పట్టుకుని కూలబడి పోయేడు కాంతారావు. అతని కళ్ళముందు గత రెండు సంవత్సరాలలో జరిగిన కార్యక్రమమంతా కదిలింది. విటమిన్ టాబ్లెట్లు, ఐరన్ టానిక్కు లు, దోకులు, చికాకులు, నిద్రపట్టని ఒంటరి రాత్రిలు, హాస్పిటల్లో కాన్పు, డాక్టర్లు, మందులు, నర్సులు, పనివాళ్ళు ఆ రణగోణధ్వని తరువాత కళ్యాణి బాలెంత గా మంచం మీద మూడు నెలలు పడుకుని ఉండటం అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే అతని వళ్ళు జలదరించింది.
కళ్యాణి ఏడుస్తూనే ఉంది. 'నేననుకుంటూనే ఉన్నాను ఓ వారం రోజుల నుండి నాకు అనుమానం గానే ఉంది. మీరు దగ్గరకు వచ్చినప్పుడల్లా మీ 'వాసన' నాకు గిట్టటం లేదు. సెంటు రాసుకుంటున్నప్పుడల్లా వాంతి వచ్చేస్తోంది. అప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని. ఇంకేం, యిప్పుడు స్పష్టంగా తేలిపోయింది. మళ్ళీ ఆ తొమ్మిది నెలల వేవిళ్ళు, ఆ నరక బాధ డాక్టర్లు, అన్నీ తలచుకుంటానికే భయం వేస్తోంది నాకు. నేనుచచ్చిపోతాను. నేనింక బ్రతకను. ఈ ముగ్గురు పసిపిల్లలతో నేనే మాత్రం వేగలేను. ఏ విషమో తిని చచ్చిపోతాను.' అంటూ ఏడవటం ప్రారంభించింది కళ్యాణి.
ఆమె ఏడుపును చూసేసరికి, తను కూడా డీలాపడిపోవటం మంచిది కాదని పించింది కాంతారావు కి. ఎలాగో ధైర్యాన్ని కూడదీసుకుని, కళ్యాణి ని దగ్గరకు తీసుకుని ఆమె కన్నీళ్ళ ను తుడిచేడు. 'ఏడవకు కళ్యాణీ! ఇప్పుడు ఏడిచి నందువల్ల ప్రయోజనం కూడా లేదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. మనం ఆ పది హీను రోజుల పాటు అనుభవించిన మధురానుభూతులకు ప్రతిఫలంగా యీ చిహ్నాన్ని మనం అంగీకరించక తప్పదు' అన్నాడు ఓదార్పుగా.
దాంతో కళ్యాణి కి అతని మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. అతని నుండి విడిపించుకుని దూరంగా వచ్చేసి, దీని కంతటికి కారణం మీరు. ఆ పదిహేను రోజులు పిచ్చి పట్టినట్లు వళ్ళు తెలియకుండా ప్రవర్తించేరు మీరు. సమయాసమయాలు చూడకుండా, చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మర్చిపోయి నన్నొక అట బొమ్మగా చేసి, మీ యిష్టం వచ్చినట్లు అనుభవించేరు. దీనికి మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మీరు నా దగ్గరకు రాకండి. నాతొ మాట్లాడకండి.' అంటూ అరచింది.
కోపంలో ఆమె అంటున్న మాటలను వింటుంటే కాంతారావు కి నవ్వు, ముద్దు రెండూ కలిగినాయ్. కళ్యాణి వైపుకు రెండు చేతులు చాచి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. తన ఛాతి మీద ఉన్న ఆమె తలను, ఆమె భుజాలను ప్రేమగా నిముర్తూ 'పిచ్చి కళ్యాణి! ఎందుకలా ఆవేశ పడతావు అనవసరంగా? మనం ఎటు పడీ ముగ్గురు పిల్లలుంటే ముద్దుగా ఉంటుందని అనుకున్నాం కదా! ఒక్క తొమ్మిది నెలల పాటు కళ్ళు మూసుకుంటే సరి, ముచ్చటగా మనం కోరుకున్న ముగ్గురు పిల్లలూ మన కళ్ళ ముందు ఉంటారు. మూడో పిల్ల పుట్టగానే మనం ఫామిలీ ప్లానింగ్ పెట్టేద్దాం. నాకు ఎటు పడీ యిద్దరు కొడుకులు, ఒక కూతురు కావాలని చాలా కోరికగా ఉంది. నేను గట్టిగా కోరుకున్నదేదీ జీవితంలో నాకు లభించకుండా ఎప్పుడూ పోలేదు. అలాగే యీసారి నేను కోరుకున్నట్లు అబ్బాయే పుడ్తాడు. మరో విశేషం ఏమిటో తెలుసా? ఈసారి పుట్టబోయే అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. మహాబలిపురం, బీచ్ లో, మైసూర్ లోని బృందావన్ గార్డెన్స్ లో, ఊటీ లోని ప్రకృతి ఒడిలో మనం పొందిన అందమైన మధుర భావాలకు చిహ్నంగా పుట్టబోయే అబ్బాయి, ఏ చీకు చింతా లేకుండా పచ్చని ప్రకృతి మధ్య రంగురంగుల పూల సమక్షంలో వెన్నెల రాత్రుళ్ళు మనల్ని ఏకం చేసిన ఆ మధుర క్షణాల ఫలితమైన అ అబ్బాయి గొప్ప కళా కారుడౌతాడు. నామాట తప్పక నిజమవుతుంది చూడు. ఏదీ ఒక్కసారి నా వంక చూసి నవ్వు.... ఈ పిల్లలు చిన్నతనంలో ఉండగానే మనకి అన్ని కష్టాలు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయేరంటే ముగ్గురూ ఒక్కసారి చేతి కంది వస్తారు. అప్పుడు వీళ్ళను వదిలేసి మనిద్దరమే హాయిగా హనీమూన్ చేసుకోవచ్చు . సరేనా? నవ్వు మరీ! గుడ్ గర్ల్! అలా నవ్వాలి' అంటూ ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు కాంతారావు.
ఆ రాత్రి ఆ దంపతులిద్దరికీ ఒక తియ్యని కల వచ్చింది. 'ఆరడుగుల ఎత్తు పెరిగిన బాబిగాడు రోజూ సాయంత్రం క్రికెట్ అట అడెంత పెద్దవాడయ్యెడు. ఒకరోజు జీన్సు, ఒకరోజు పరికిణీ ఒణి, మరో రోజు షర్టు , లుంగీ -- యిలా రకరకాలుగా డ్రెస్సులు మారుస్తూ అందాల లోకంలో విహరించే వయసు లోకి అడుగు పెట్టింది పాప. మూడవ వాడు రేడియో ట్యూన్ చేసి, రంగులతో బొమ్మలు వేస్తూ కూర్చునే చిత్రకారుడు గానో, చల్లని సాయింత్రం వేళ విరహగీతాలు రాసుకుంటూ కూర్చునే కవిగానో మారిన నూనుగు మీసాల యువకుడై నాడు. వాళ్ళు ముగ్గురినీ యింటి దగ్గర వదిలేసి , తామిద్దరూ వయసు మళ్ళినా, తరగని ప్రేమతో, చెట్టాపట్టా లేసుకుని బృందావన్ గార్డెన్స్ లో డ్యూయెట్లు పాడుకుంటూన్నారుట. మహాబలి పురం బీచ్ లో యిసుక లో పడుకుని యీ లోకాన్ని మర్చి పోతున్నారుట!
(అయిపొయింది)
