14
బస్సు ఎన్నో మెలికలు తిరిగి మెల్లగా ప్రయాణం చేస్తోంది కొండ మీద. ప్రకృతి లోని అందమంతా అక్కడ కుప్పగా పోసినట్లుంది. కొండల మీద ప్రతి అంగుళం పచ్చని చెట్లతో నిండిపోయి ఉంది.
చివరకు బస్సు 'ఊటీ' చేరుకున్న తరువాత 'ఉడ్ లాండ్స్' హోటలు లో రూము తీసుకున్నాడు కాంతారావు.
తమ ప్రొఫెసరు తో కాంతారావు మాట్లాడటం చూసిన కుర్రవాళ్ళు అతను దిగుతుంటే 'సాయింత్రం 'లేక్' దగ్గరకు రండి సార్! సర్దాగా 'బోటింగ్ చేద్దాం!' అన్నారు కొందరు.
కాంతారావు నవ్వుతూ 'అలాగే! నంటూ చెయ్యి ఊపేడు.
హోటలు లో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం అయేసరికి 'లేక్' దగ్గరకు వెళ్ళేరు. లేక్ దగ్గర దదృశ్యాలన్నిటి ని వివిధ కోణాల్లో ను తీయటానికి కెమెరా లో ఒక పూర్తి ఫిలిం అయిపొయింది. కళ్యాణి ని , కాంతారావు ను బొటులో కూర్చోమని ఒక ఫోటో, పిల్లలతో కలిసి ఒక ఫోటో తీసేరు. తరువాత స్టూడెంట్స్ అంతా తలో బోటు జట్లుగా ఎక్కేరు. కొందరు సేల్ప్జ్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే మరికొందరు చేతకాని వారు ఊరికే కూర్చుని బిగ్గరగా పాటలు పాడుతూ , చేతులతో నీళ్ళను ఒకరి మీద ఒకరు చిమ్ముకుంటూ కాలక్షేపం చేసేరు. ఒకడు విజిల్ వేస్తుంటే మరొకడు గుర్రం లా సకిలించేడు. ఒకడు బిగ్గరగా పాడుతుంటే మరొకడు నోటి తోనే మద్దెల చప్పుడును చేయసాగేడు. ఈ కోలాహలం మధ్యా అప్పుడప్పుడు "శాండల్ ఉడ్ షొప్' అనీ 'కాస్ట్రాయిల్ ఫేస్' అనీ కూడా ఎవరో గుర్తు తెలియని కంఠలు అరుస్తుంటే ప్రొఫెసర్ ముఖం కోపంతో నిస్సహాయితతో కందగడ్డలా అవటం గమనించిన కాంతారావు ప్రొఫెసర్ ముఖం అచ్చు శాండల్ ఉడ్ సోప్ రంగులో , అదే ఆకారంలో ఉందనీ, అయన ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని ముఖం లోని ఎక్స్ ప్రేషన్స్ అచ్చు ఆముదం తాగిన ముఖం లాగే ఉంటుందని గ్రహించేడు.
ఎంతైనా అతను కూడా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నవాడే కనుక వెంటనే ఆ రెండూ ప్రొఫెసర్ గారి నిక్ నేమ్స్ అని గ్రహించి నవ్వుకున్నాడు కాంతారావు.
పిల్లలకు మాత్రం ఆ బోటు షికారు మహా హుషారుగా ఉంది. తమకంటే పెద్ద వయసు లో ఉండి తమకన్నా ఎక్కువగా అల్లరి చేస్తున్న ఆ విద్యార్ధులను 'ఎడ్మి రేషన్' తో చూస్తూ కూర్చున్నాను. అమ్మా నాన్నాల వెంట కలిసి చేసిన యీ యాత్రలో యీ సమయం లో పొందినంత ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడూ పొందలేదు. అందువల్ల వాళ్ళు కూడా ఉత్సాహంతో కేకలేస్తుంటే విద్యార్ధులు వాళ్ళను తీసుకుని ఒక బోటులో నుండి మరొక బోటు లోకి విసిరేస్తూ యింకా పిల్లలను నవ్వించేరు.
కాంతారావు కళ్యాణి ఒక బోటులో కూర్చున్నారు. పిల్లలు తల్లిదండ్రులను వదిలి విద్యార్ధులతోనే ఒకరి నుండి మరోకరి దగ్గరకు మారుతున్నారు. ప్రొఫెసర్ గారు కూర్చున్న బోటులో మరొక స్టూడెంటు కూర్చుని బోటును నడుపుతున్నాడు. ప్రొఫెసరు బోటు కాంతారావు బోటు పక్కపక్కనే ఉండటం వల్ల వాళ్ళిద్దరూ అవీ ఇవీ మాట్లాడుకోసాగేరు.
ఇంతలో హటాత్తుగా ప్రొఫెసర్ కూర్చున్న బోటు తల్లక్రిందులయింది. 'అరే బాప్ రే బాప్! మరగయా!' అంటూ ప్రొఫెసర్ నీళ్ళలో మునుగుతూ , తేల్తూ అరుస్తున్నాడు. ఆ ప్రొఫెసర్ కి యీత రాదని తెలిసింది కాంతారావు కి. వెంటనే నీళ్ళలో కి ఉరికి ఆయనను పట్టుకుని తమ బోట్లో పడుకో పెట్టేడు. అప్పటికే అయన నీళ్ళు మ్రింగటం , భయంతో స్పృహ తప్పి పడిపోవటం కూడా జరిగిపోయింది. ఐతే కాంతారావు కో ఆశ్చర్యాన్ని కలిగించిన విషయమేమంటే విద్యార్ధు లెవరూ ఆ సంఘటన కు భయపడలేదు కదా, పొట్ట చెక్కలయ్యేలా విరగబడి నవ్వసాగేరు. ఆ నవ్వు తున్న వాళ్ళలో ప్రొఫెసర్ బోటును నడిపిన కుర్రవాడు కూడా ఒకడు. అప్పుడర్ధమయింది కాంతారావు కి. ప్రొఫెసర్ కి యీత రాదని తెలిసే, ముందుగా ప్లాను వేసుకుని విద్యార్ధులందరూ కలిసి కట్టుగా ఆ పని చేసేరని. అది చూడగానే కాంతారావు కి కొంచెం కోపం కూడా వచ్చింది.
'ఇదిగో అబ్బాయిలూ! ఇటు చూడండి ఒకసారి. నేనూ నిన్న మొన్నటి దాకా మీలాగే విద్యార్ధి నే! మీలాగానే నేను కూడా ప్రొఫెసర్లను ఏడిపించిన వాడినే! కాని హాస్యం యింత క్రూరంగా ఉండటం చాలా భరించరాని విషయం. నేనుండబట్టి సరిపోయింది. ఆయనో పక్క లబోదిబో మని అరుస్తుంటే వినకుండా అలాగే నవ్వుకుంటూ చూస్తుంటే ఆలోపల అయన ప్రాణాలు పొతే యేమయ్యేది? ఈ వయసులో కొంత కొంటెతనం అల్లరితనం ఉండటం మంచిదే కాని అది మితిమీరితే దారుణమైన ఫలితాలకు దారి తీయగలదు.' అంటూ సన్నగా చివాట్లు పెట్టేడు.
ప్రొఫెసర్ ని దగ్గర్లోనే ఉన్న హోటలు కి తీసుకు వెళ్ళి ప్రధమ చికిత్స చేయించాక ఆయనకు స్పృహ వచ్చింది.
అయన కళ్ళు తెరవగానే ఎదురుగా ఎరువు తెచ్చి పెట్టుకున వినయ విధేయతలతో చేతులు కట్టుకుని నిల్చున్న శిష్య రత్నాలను చూస్తూనే సిగ్గుతో చితికి పోయి, వెంటనే కళ్ళు మూసుకున్నాడు. కాంతారావు వాళ్ళందరినీ బయటకు వెళ్ళమని సంజ్ఞా చేసేసరికి ఒక్కోరోక్కరే మెల్లగా బయటకు పోయేరు. వెంటనే పెద్ద పెట్టున నవ్వులు వినిపించేసరికి ఆ శబ్దాలు వచ్చి ప్రొఫెసర్ గారి గుండెకు సమ్మెట పోటులా తగిలినాయ్. అవమానంతో , సిగ్గుతో అయన హృదయం దహించుకు పోతుంటే పైకి మాత్రం చిరునవ్వు నవ్వుతూ 'థాంక్యూ' వెరీ మచ్ జెంటిల్ మన్ ! యు హావ్ సేవ్ డ్ మీ - యు హావ్ సేవ్ డ్ మై ఫామిలీ!' అన్నాడు.
.jpg)
కాంతారావు హృదయం ఆర్ద్రమైంది. 'నెవర్ మైండ్! నెవర్ మైండ్! మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి.' అని లేచి బయటకు వచ్చేసాడు.
ఐతే అప్పటికీ, ఆ తరువాత కాని ఆ ప్రొఫెసర్ కి తను నీళ్ళలో పడింది ప్రమాదవశాత్తు అనే తప్ప విద్యార్ధులే కావాలని తననలా 'ఫూల్' ని చేసేరని తెలియదు.
'పాపం! బ్రతకలేని బడిపంతులు!' అనుకున్నాడు కాంతారావు బయటకు వస్తూ.
'బడిపంతులు ఉద్యోగం చెయ్యాలంటే వట్టి బుర్ర ఉన్నంత మాత్రాన చాలదు. గుండె ధైర్యం కూడా బాగా ఉండాలి. లేకపోతె కష్టం!' అనుకున్నాడు కాంతారావు.
ఆ రాత్రి హోటలు కు వెళ్ళేక నీళ్ళలో తడవటం వల్ల కాంతారావు కి కొంచెం జలుబు చేసింది. తల దిమ్ముగా ఉంటె కణతలకు అమృతాంజనం , గొంతు దగ్గరా, చాతీ దగ్గర 'విక్సు' రాసుకుని పిల్లలతో పాటు తాను కూడా పడుకుని వెంటనే నిద్రపోయేడు.
కళ్యాణి కయితే నిద్ర పట్టలేదు. ఎంత అలసిపోయినా అలవాటు ప్రకారం రాత్రి పది గంటలవుతే గాని ఆమెకు నిద్ర పట్టదు. పోనీ- యేమైనా పుస్తకం చదువుకుందామా అంటే లైట్ వేసినట్ల యితే భర్తకి, పిల్లలకు నిద్రా భంగమవుతుందన్న భయంతో ఆ ఉద్దేశ్యాన్ని విరమించు కుంది.
కాలక్షేపం ఎలాగో తెలియక లేచి, తలుపులు తీసి, బయటకు వచ్చింది. ఎత్తుగా ఉన్న ఆ హోటలు రూము ముందు నిలబడి చూస్తె ఎదురుగా వెన్నెల వెలుగు లో మధురంగా వెలిగి పోతున్న ఆ ప్రకృతి సౌందర్యం ఆమెను పరవశింప జేసింది. వెంటనే శాలువ కప్పుకుని, తలుపులు దగ్గరగా వేసి, బయటకు వచ్చింది కళ్యాణి. హోటలు దాటి కొన్ని గజాలు దిగి రాగానే మైన్ రోడ్డు.ఆ రోడ్డుకి అవలి వైపున విరగబూచిన ప్రకృతి సౌందర్యం. అనాలోచితంగా నే ఆ సౌందర్యసీమ వైపుకు ఆమెను లాక్కుపోయినాయ్ ఆమె కాళ్ళు.
ఎక్కడ చూసినా కుదురుగా కత్తిరించబడిన చెట్లు, రంగు రంగుల పూలు, పచ్చని గరిక, దూరంగా విచ్చలవిడిగా పెరిగిన సరుకు చెట్టు....అన్నిటికీ పైన నిండు పున్నమి జాబిలి. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ప్రకృతి కాంత తన సౌందర్యానికి తానే మిడిసి పడుతూ విరగబడి నవ్వుతోందా అనిపిస్తోంది.
కళ్యాణి వెళ్ళి పచ్చగడ్డి మీద చతికిలబడింది. ఆమె కెదురుగా ఒక చిన్న జలాశయం. అ జలాశయానికి మధ్యగా బిందె చంకన పెట్టుకుని యౌవనాన్ని , శరీరపు హోయలను ఒలకబోస్తూ వయ్యారంగా నిలబడిన ఒక రాతి ప్రతిమ ఉంది. ఆ ప్రశాంత వాతావరణం లో ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా అలాగే కూర్చుండి [పోయింది కళ్యాణి. తనకి బుద్ది తెలిసి నప్పటి నుండి యింత ఒంటరిగా, యిలా రాత్రి పూట ప్రశాంత మైన వాతావరణం లో ఎప్పుడూ కూర్చోలేదు. ఆధునిక జీవితంలో ప్రశాంతత లేదు. అందులో వేగం ఉంది. ఉద్రేకం ఉంది. అందునా వివాహమయిన తరువాత తన జీవితం లోని వేగం మరింత రెట్టింప యింది. రోజూ సూర్యుడుదయించగానే ఒకదాని వెంట మరొక పని యాంత్రికంగా చేసుకుపోవటం, నిద్రపోవటం , మళ్ళీ తెల్లవారగానే మామూలు దినచర్యను ప్రారంభించటం. స్త్రీ కాని, పురుషుడు కాని ఏ హోదాలో ఉన్నా, ఏ ప్రదేశం లో ఉన్నా , నాగరిక జీవనం లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకే రకమైన రొటీన్, వేగం ఉంటాయి.
ఎప్పుడైనా విశ్రాంతి కోసం దూర ప్రదేశాలకు వచ్చినా రైలు ప్రయాణాల్లో , హోటలు గదుల్లో ఉద్వేగిభరితమైన అనుభవాలు మనిషిని మానసికంగా , శారీరకంగా మరింత అలసి పోయేటట్లు చేస్తాయే తప్ప, తాము కోరుకున్న విశ్రాంతి ని మాత్రం యేమాత్రం యివ్వవు. ఇలా ప్రయాణాలు చేసేవాళ్ళ జీవితంలో 'మార్పు' అనేది లభిస్తుందేమో కాని 'విశ్రాంతి' అనేది లభించటం కల్ల ఈ యాత్రలో తాను కనుక్కొన్న సత్యాలతో అదొకటి. అందుకే అలా వంటరిగా చుట్టూ ప్రక్కల నరసంచారం లేని ఆ ప్రదేశం లో , పూల మొక్కల మధ్య, నక్షత్రాల వెలుగు క్రింద కూర్చునేసరికి ఆమె మనశ్శరీరాలు రెండూ విశ్రాంతి ని పొంది, ఒక రకమైన తన్మయస్థితి లోకి తీసుకు పోయినాయ్ కళ్యాణి ని.
'కళ్యాణి !' అన్న పిలుపు విని హటాత్తుగా ఉలికిపడి చూసింది కళ్యాణి ఎదురుగా కాంతారావు నిలబడి ఉన్నాడు. 'ఇక్కడ కూర్చున్నావేమిటి?' ఆశ్చర్యం , ఆతృత రెండూ మిళితమైన స్వరంతో అడిగేడు.
"ఏం లేదు. నిద్ర పట్టకపోతే యిలా వచ్చెను.' అన్నది కళ్యాణి.
అప్పుడు భర్త రాక ఆమెకు ఏ మాత్రం ఆనందాన్ని కలిగించలేదు. పైగా తన మనస్సు కు భంగం కలిగినందుకు కొంచెం కోపం కూడా కలిగింది.
కాంతారావు ఆమె పక్కనే కూర్చున్నాడు.
కళ్యాణి ఎంతసేపటికి అతనితో మాట్లాడక ఎటో చూస్తూ కూర్చునేసరికి అతనికి ఎందుకో భయం వేసింది.
'ఏమిటి కళ్యాణి! ఎందుకలా ఉన్నావు? నీ ఒంట్లో బాగాలేదా?' అనడిగేడు ఆమె రెండు భుజాలు పట్టుకుని, ఆమె కళ్ళ లోకి చూస్తూ.
