Previous Page Next Page 
ఎండమావులు పేజి 35


    స్వాతి తలారా స్నానం చేసింది. తపతప లాడుతూ తడి చీరెతో యసరు పెట్టింది. తడితల పిదప వేసుకోకుండా అట్లాగే నీరు కారుతూ కూర్చుంది. అట్లాగే అన్నం కూర, పప్పు, పులుసు, వండింది. దేవుడి పటాల ముందు ఆ వంటకాలన్నీ ఉంచి "ఆలకించవయ్యస్వామీ" అన్నది.
    కృష్ణమూర్తి అంతా చూస్తూనే ఉన్నాడు. అతనికి పొట్ట ఉబ్బిపోతూన్నది. నవ్వు ఆపుకోలేక.
    పీటవేసి విస్తరి వేసింది. కృష్ణమూర్తి వచ్చి కూర్చున్నాడు. అన్నం వడ్డించింది. ఔపోసన పట్టాడు కృష్ణమూర్తి.
    "ఎలాగున్నాయ్యి వంటకాలు "వీపు మీద జీరాడే నల్లటి కురులు చిందర వందలుగా వీపంతా పరుచుకొన్నవి, తడిచీర వంటిమీదనే ఆరిపోయింది.
    "ఇసరమంటారా"
    "పిండా? పప్పా ఇసిరేది."
    స్వాతి మళ్ళా అభిమానముతో కుంచించుక పోయింది. "విసరమంటారా అని అనాలి స్వాతీ. ఇసరటం వేరు, విసరటం వేరు" చిరునవ్వుతో పప్పుకే కలిపాడు.
    "మీకు కావలసినంత నెయ్యి వేసుకోండి" అంటూ నేతిగిన్నె విస్తరికి ఆనించి పెట్టింది.
    "స్వాతీ"
    తలెత్తి చూసింది. ఆ సమయంలోనే అన్నపు గిన్నె అవతల ఉంచి, ఆ చేత్తోనే పెరుగు గిన్నె ఇవతల పెట్టింది. అట్లాగే జుట్టు ముడివేసుకుని "పప్పు కావాలా" అని అంత పప్పు చేత్తో తీసి విస్తట్లో వేసి "అబ్బో చెయ్యి చుర్రు మన్నది" అంటూ కాలిన వేళ్ళు నోట్లో పెట్టుకుని, విదిలించి "అరెరే మరిచి పోయాను వంకాయి కూర వెయ్యలేదు" అంటూ ఆ చేత్తోనే గిన్నెలో కూర విస్తట్లో వేసింది.
    అట్లాగే మళ్ళీ ఆ చెయ్యి చీరకు తుడ్చుకుని నవ్వుతూ "వంటకాలు రుచులు ఎట్లా ఉన్నయ్యి స్వామీ" అన్నది ఎదురుగా కూర్చుని.
    "బాగున్నది స్వాతీ. వంటకాల విషయం అట్లా ఉంచు. అంటూ ఎంగిలి అనే ఆచార వ్యవహారాలు ఎప్పుడైనా విన్నావా" అన్నాడు ముభావంగా.
    స్తబ్దురాలైంది స్వాతి. ఆమె గుండెలు దడ దడలాడసాగినయి. ఇంతవరకూ ఆ సంగతులే స్వాతి మనసుకు తట్టలేదు.
    "క్షమించండి. నాకా సంగతులే గుర్తులేవు. మంచాల మీద కంచాలు ఉంచి ఒక చేత్తో తింటూ మరోచేత్తో నంజుడు ముక్కలు కొరుక్కుతినే వాళ్ళకు అంటు, ఎంగిలి ఏం తెలుస్తయ్యి. నేను పొరబాట్లు చాలా చేసాననుకుంటాను వడ్డించేటప్పుడు."
    మనస్సు చిన్న బుచ్చుకుంది స్వాతి.
    "అన్నపు గిన్నె ముట్టుకున్న చేత్తో పెరుగు ముట్టుకున్నావు. నేతిగిన్నె నా విస్తరికి ఆనించావు. చెయ్యి కాలిందని వేళ్ళు నోట్లో పెట్టుకుని ఆ చేత్తోనే వంకాయకూర వేశావు. ఆ చెయ్యి కడుక్కోకుండా చీరేకి తుడ్చుకున్నావు. అంటూ, ఎంగిలి అంటే తెల్సిందికదూ" అన్నారు.
    "అవునండీ పొరపాటే. ఎంగిలి చేత్తో మీకు వడ్డించాను. పాపిష్టిదాన్ని. ఆ విస్తరి వదిలేసి ఇవతల కూర్చోండి ఇంకో విస్తట్లో వడ్డిస్తాను" అన్నది.
    "అదీ తప్పే స్వాతీ. తింటూ తింటున్న విస్తరి వదిలేసి లేచివెళ్ళి ఇంకో విస్తరి ముందు కూర్చోరాదు. అదీ తెల్సుకో తగిన, తెల్సుకో వలసిన ఆచారమే."
    "అట్లాగా, జీవితానికి ఆత్మ, మనస్సు అందమూ మాత్రమే ప్రధానం కావని ఈరోజున తెల్సుకున్నాను. గృహస్త జీవితం గడపటానికి అనేక విషయాలు ఆచరణలో ఉంచుకోవాలి. అనేక సాంఘిక కట్టుబాట్లకు లొంగి ఎవ్వరి మనస్సూ నొప్పించకుండా, ఎవ్వరినీ అవహేళన చెయ్యకుండా జీవిత మార్గాన్ని పూలబాటగా మలచుకోవాలి. ఇలాంటి గౌరవనీయమైన గార్హ్యస్త జీవితం గడపటంలో మీకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పంచమురాలినైనా, వంచకురాల్ని మాత్రం కాదు. న అవార్ని నేను దూరం చేసుకోటంలో ప్రత్యేకత లేదు. కన్నతల్లి దండ్రుల నుంచీ, బంధు మిత్రుల నుంచీ ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన తోబుట్టువుల నుంచీ, మిమ్ముల్ని విడదీశాను. ఈ పాపానికి పరిసమాప్తి ఈ జన్మలో లేదు. మరుజన్మలో నైనా మచ్చలేని జీవితం ఇరువురకూ ప్రసాదించమని ఆ పరమ శివుని వేడుకుంటాను. పుట్టింది పంచమజాతి గృహంలో, మెట్టినది మీ ఇంట్లో, నా సర్వస్వం మీకు ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాను. నన్ను తీర్చి దిద్దుకునే బాధ్యత మీదే." అన్నది స్వాతి. ఆమె హృదయంలో పరవళ్ళు తొక్కుతున్న ఆవేదన కట్టలు తెంచుకుని ప్రవహించే మహానదిలా నురుగులు కక్కుతూ పెల్లుబికింది. ఈ పరివేదనా అఘాతానికి తట్టుకోలేక నిర్జీవురాలిలా భర్త చెంత పడిపోయింది స్వాతి.

                                                          *    *    *

    "జరిగి పోయిన సంఘటనలనూ, మనోభావాలనూ మళ్ళీ ఈనాడు జ్ఞాపకం చేశావు స్వాతీ. ఆ నాటి స్వాతి తన సర్వస్వము నాకు ఆత్మార్పణ చేసింది. ఈ నాడు నా జీవితాన్ని నీ హృదయ పీఠం మీద నిలిపాను. నీ పసుపు, కుంకుమకు ఏ దేవతా, ఏ దేవుడూ ఆశించరు. ఎవ్వరూ చేరపలేరు. ఈ గుండెజబ్బు నన్నేమీ చెయ్యలేదు. స్వాతీ, నన్నేమీ చెయ్యలేదు" అన్నాడు కృష్ణమూర్తి.
    తలుపు కొట్టిన చప్పుడయింది. స్వాతివెళ్ళి తలుపు తీసింది. విచార వదనంతో జయలక్ష్మి లోపలికి వచ్చింది. జయలక్ష్మి పరిస్థితి చూస్తే ఏం ప్రమాదం సంభవించిందోనని స్వాతి ఆదుర్దా పడ్డది.
    "ఏం జరిగింది జయా" అన్నాడు కృష్ణ మూర్తి ఏమీ చెప్పలేక ఏదో చెప్పింది జయలక్ష్మి. ఆరు కళ్ళూ సంతతధారా పాతంగా వర్షించినయ్యి. ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కూర్చున్నమనిషి కూర్చున్నట్లే పడి పోయింది స్వాతి.
    
                                   26

    జానకిరాం ఆ ఊరు వచ్చి రెండు రోజులయింది. మారుమూల ఉన్న ఒక చిన్న హోటల్లో గదితీసుకున్నాడు. ఆ రెండు రోజులూ గది విడిచి బయటికి రాలేదు. పైన పంకా తిరగటానికీ, తన మనస్సులోని ఆలోచనల పరిభ్రమణకూ ఏమైనా సామరసుమున్నదా అనుకున్నాడు జానకిరాం. పంకాకన్న వేగంగానే అతని ఆలోచనలు దొర్లిపోతున్నయ్యి. నేనెవరికోసం ఈ ఊరు వచ్చినట్లు? ఎవర్ని ఉద్దరించటానికి ఈ పని చేసినట్లు? కట్టుకున్న భార్యకు దూరమయ్యాను. కన్నవారి మనస్సు కష్టపెట్టాను. నా మనస్సును నేను సంతృప్తిగా సమాధాన పర్చుకోలేక పోతున్నాను. నా నొష్టని భగవంతుడు ఉద్యోగం చేసే గీతను దిద్దలేదేమో ఎవరి కోసం నేను జీవించాలి? నా భార్య కోసం బ్రతకాలా, నా కన్న తల్లితండ్రులకోసం బ్రతకాలా? అన్నయ్య కృష్ణమూర్తి కోసం బ్రతకాలా? ఎవరికోసం ఏం చేయాలి? ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఈ రకంగా వచ్చేసి ఈ హోటల్లో దాక్కునే పరిజ్ఞానం సంపాదించటానికి నా ఎమ్మే డిగ్రీ ఆధార భూతమైందా? నా ఉద్యోగ సమస్య నన్నంత పిరికివానిగా, పనికి మాలిన వానిగా చేసిందా? ఈ సమస్యల్ని నేను వదిలించుకుని, వాటినుంచి దూరం కాలేనా? నాలోని మేధత్వమే నా జీవితాన్ని ఈ దారిని పట్టించిందా? అతని ఆలోచనలకు ఒక దారీ తెన్నూ ఏర్పడలేదు.
    మెల్లిగా పక్కమీదనుంచి లేచి పంకా కట్టే శాడు. కాసేపయినా ఈ ఆలోచనలనుంచి దూర మవుదామని కళ్ళు మూసుకున్నాడు. పక్కగదిలో పకపకలు వినిపించినయ్యి.
    "రోజూ, రేపటి ఇంటర్వ్యూలో నువ్వు నెగ్గి ఉద్యోగం సంపాయించావంటే నాకు పరమ సంతోషంగానే ఉంటుంది కాని ఒక్కటే అనుమానం" అన్నది మగ గొంతుక.
    "రాజా, ఏమిటా అనుమానం, నామీద అనుమానం ఏమిటో" అన్నది ఆడ గొంతుక.
    "ఏమీలేదు ఉద్యోగం మోజులోపడి నన్ను మర్చిపోతావేమో, నాకు నాకు ఇప్పుడు వచ్చే జీతం నూటపాతికా చాలకనేగా నువ్వు ఉద్యోగం చేసి పది డబ్బులు వేస్తే మన సంసారం ఏ వడుదుడుకులూ లేకుండా సాగిపోతుందని ఈ నిర్ణయానికి వచ్చాం. నువ్వూ సంపాదిస్తున్నావు కనక నామీద నీ ఆధిక్యత ఏమిటని నువ్వంటావా రోజా" అన్నది మగ గొంతు.
    "రాజాగారికి ఆ భయమేమీ అక్కర్లేదు. నా ఉద్యోగమూ, నా సంపాదనా నా ఒక్క దానికోసం కాదు. మన ఇద్దరి కోసం, పుట్టబోయే మన పిల్లల కోసం. మన సంసారం సుఖంగా సాగటంకోసం, అంతేగాని మీ మీద ఆధిక్యత చూసి, మిమ్మల్ని దూరం చేసుకోటానికి కాదు. మీకు దూరమయ్యే ఉద్యోగం నేనెన్నడూ చెయ్యను. ఉద్యోగ రీత్యా మీనుంచి నన్నెవరూ దూరం చెయ్యలేరు, తెల్సిందా స్వామీ" అన్నది ఆడ గొంతు.
    జానకిరాం మనస్సు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. భార్య ఉద్యోగం తాలూకు ఇంటర్యూకు భర్త కూడా వచ్చాడన్న మాట. ఉద్యోగం కోసం భర్తని దూరం చేసుకోనని మన స్పూర్తిగా చెప్పింది. వారెంత ధన్య జీవులో అనుకున్నాడు జానకిరాం. అతని భావనా ప్రపంచంలో గౌతమి మెదిలింది. ఉద్యోగంకోసం తనని దూరం చేసుకుంది. తనని దూరం చేసుకుని ఆమె సంపాదనతో తృప్తి పడుతున్నది. ఆమెకు ఉద్యోగం తప్ప తను అక్కర్లేదేమో? గౌతమి అభిప్రాయం అదేనా? ఆ దంపతులు ఆదర్శ ప్రాయమైన ధన్యజీవులు. తాము ఎందుకూ కొరగాని వారు. యుక్తా యుక్త విచక్షణాజ్ఞానం లేనివారు. మమతల్ని చంపుకుని, మనస్సుని రాయి చేసుకుని, తన గుండెల్లో ఒక రాయి పారేసి వెళ్ళింది గౌతమి. ఆమెను తను ఆదరించగలడా? సంసార జీవితం గడపగలడా? గౌతమి మనస్సులో తానింకా నిలిచి ఉన్నట్లేనా? తనకు హితవు చెప్పేలా కనువిప్పు కలిగించ టానికే ఈ విధంగా దూరమయి ఉద్యోగం చేస్తున్నదా? తను ఉద్యోగం చెయ్యక పోయినా, ఆమె సంపాదనలో తను జీవించాలని గౌతమి కోరికా? గౌతమి పట్టుదలా? గౌతమి ఉద్దేశ్యమే అదయితే ఆమె ఉత్తరానికి తను ఇన్నాళ్ళనుంచి జాబు రాయక పోతే, ఆమె మళ్ళీ ఉత్తరం రాయలేదేం? తను మంచివాడుకాదు, సంపాదించిభార్యను పోషించలేని వాడని అందరి అంచనా, అది నిజమే అనుకుంటే గౌతమి భావనలేమిటి? ఈ భర్త నన్ను పోషించలేదు కనక నా దారి నేను చూసుకోవచ్చుననే ఉద్దేశ్యంతోనే ఇట్లా చేసిందా? గౌతమి భావం అదే అయితే తనతో భవబంధాలు తెంచుకున్నట్లేనా? ఈ పరిస్థితి ఏమిటో ఇదమిద్ధమని తేల్చుకుంటే?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS