చిన్నగా ముకుందం పెదవులు ఉచ్చరించాయి. తనువు పులకించింది. మనస్సు పరుగులు తీసింది. గుండె వేగం హెచ్చింది. మెదడు ఆలోచనలతో ఈగలు ముసిరి బెల్లంగడ్డంలా వుంది.
అవును నిజమే. ఆమె తన సుధారాణియే! అతిత్వరలోనే తన హృదయ రాణి కాబోతూంది. పట్టుమని పది కథలైనా వ్రాయని తనను సుధారాణి అంతగా అభిమానించడం నిజంగా తన అదృష్టమే.
అభిమానం! తనమీద సుధారాణికి ఉన్నది వట్టి అభిమానమేనా? లోతుగా ఆలోచిస్తే అభిమానానికీ, ప్రేమకూ అట్టే దూరం లేదు. శబ్దభేదమే కాని భావభేదం అట్టేలేదు.
అంటే....అంటే....? సుధారాణి తనను అభిమానిస్తుందంటే.... తనను ప్రేమిస్తుందనేగా?
మిస్టర్ ముకుందానికి ఎలాగో "ఎలాగో" ఉంది. వెంటనే ఏదో సినిమాలో పాట గుర్తొచ్చింది.
"ఎలాగో ఎలాగో ఉన్నదీ....ఇలాగే ఉంటదా .... తొలిప్రేమ అన్నదీ."
ఎవరబ్బా ఈ పాట వ్రాసిందీ. నారాయణరెడ్డికాదూ; ఏమో సరిగా జ్ఞాపకం వచ్చి చావటంలేదు. ఎవరైతే ఏంగానీ, తస్సాదియా. భలే రాశాడులే. అచ్చంగా తనకు ఇప్పుడు లాగే ఉంది. పాడాలని ఉంది. గెంతాలని ఉంది. నవ్వాలని ఉంది. ఏడ్వాలని ఉంది.... ఇంకా ఏదో....ఏదో....చెయ్యాలని వుంది.
ఒకవేళ సుధారాణి తనను ప్రేమించటంలేదేమో?
ఆ ఆలోచన రాగానే మిస్టర్ ముకుందానికి తాను కూర్చున్నచోటు అరంగుళం భూమిలోకి కుంగిపోయినట్లనిపించింది.
ప్రేమించకపోవడం ఏమిటి అంత ఇదిగా "అభిమాన రచయిత" అని రాస్తేనూ?
"కాస్త దోర ముదిరిన అభిమానమే ప్రేమ."
అన్న వాక్యాలు తను ఎక్కడో చదివినట్లు బాగా గుర్తు.
ఎవరబ్బా రాసింది? అరే తన మతిమరుపు మండిపోను? తనేగా తన మొదటి కథలో రాసింది?
ముకుందం వాలుకుర్చీలో వెనక్కు వాలి సుధారాణి రూపాన్ని ఊహించుకోసాగాడు.
స్కూలు ఫైనల్ పాసు కాగానే ముకుందం పైచదువుల జోలికి పోక యల్.డి. గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. ముకుందానికి తనపేరుకు ముందు మిస్టర్ అని చేర్చుకోవడం చాలా ఇష్టం. అతన్ని మిస్టర్ ముకుందం అని పిల్చేవాళ్ళంటే మరీ ఇష్టం. ఆఫీసుకు రాగానే మిస్టర్ ముకుందం అని పిల్చినవాళ్ల పంట ఆరోజు పండిందే. మధ్యాహ్నం లంచ్ అవర్ లో హోటల్లో వేడి వేడి పెసరట్టు, కాఫీ ఇప్పిస్తాడు. ఒక్కొక్కనాడు ఒక్కొక్కరిమీద ముకుందానికి ఎందుకంత అభిమానం పుట్టుకొస్తుందో అర్థం అయ్యేదికాదు ఎవరికీ.
మిస్టర్ ముకుందానికి చిన్నప్పటినుంచి కథలు చదవడం, ముఖ్యంగా ప్రేమ కథలు చదవడం చాలా ఇష్టం. ఓ శుభోదయాన అతని మనసులో కథలు వ్రాయాలనే కోర్కె తలెత్తింది. ఆ వెంటనే తను చదివిన నాలుగైదు మంచికథల్లోని సంఘటనల్ని ఏర్చికూర్చి ఒక కథ వ్రాసేశాడు. దాన్ని ఒక ప్రముఖ పత్రికకు పంపించాడు. నెల తిరక్కుండానే అది అతని చేతిలోకే వచ్చి వాలిపోయింది చెక్కుచెదరకుండా.
ముకుందానికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తను ఆడపేరుతో పంపిస్తే?
వెంటనే "అనూరాధ" అనే పేరుతో మరో పత్రికకు పంపించాడు. ఆ పత్రికలో చాలావరకు ఆడవాళ్ళ కథలే వేస్తారని తెలుసు ముకుందానికి. నెలతిరక్కుండానే కథ అచ్చయింది. "అనూరాధ" పేరుతో తాటికాయంత అక్షరాల్లో కనిపించేసరికి ముకుందానికి మూర్ఛ వచ్చినంత పనయింది.
ఆ తర్వాత నుంచి ముకుందం అడపా దడపా "అనూరాధ" పేరుతోనే కథలు వ్రాస్తున్నాడు. అవి అచ్చు అవుతున్నాయి.
తన కథలకేం? ఎందుకు అచ్చుకావు? ఇప్పుడొస్తున్న ఎన్ని కథలు తెల్లవారేసరికి గుర్తుంటున్నాయి గనక. ప్రతి కథా ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది. తన కథకు ఏవో ఆధారాలు ఉంటేమాత్రం ఏమిటి? తన కథలు గుర్తులేకపోయినా పాఠకలోకంలో "అనూరాధ" అనే పేరు గుర్తుంటే చాలదు?
ముకుందానికి ఆత్మవిశ్వాసం బాగానే కుదిరింది.
ఆమాటకొస్తే ఈనాటి గొప్ప రచయితలుగా చలామణి అయ్యే.... పేరెందుకులే.... ఎందరి కథలకు మూలకథలున్నాయని చెప్పుకోవడం లేదు ?
భావ చౌర్యంతో బాధపడే అంతరాత్మను ఇలా అప్పుడప్పుడు జోకొట్టి నిద్ర పుచ్చటానికి ప్రయత్నిస్తుంటాడు మిస్టర్ ముకుందం.
ఇది ఇలా ఉండగా ఒకనాడు ఒక స్త్రీ పాఠకురాలి నుంచి పాన్ ఉత్తరం వచ్చింది మిస్టర్ ముకుందానికి - అనూరాధా పేరుమీద పత్రిక అడ్రసుకు వ్రాసిన ఉత్తరం అది.
ఆ అభిమాన పాఠకురాలి పేరు సుధారాణి. ఆమెకు ముకుందం కథలంటే చాలా ఇష్టంట. తను. అనూరాధ పరిచయ భాగ్యంకోసం ఆమె తహతాహలాడి పోతోందిట. జవాబు తప్పక వ్రాసి తనకు సంతోషాన్ని తప్పక కలిగించాలట.
ఉత్తరం చదివిన ముకుందానికి జాక్ పాట్ లో లక్షరూపాయలు వచ్చినట్టనిపించింది. తిరుగుటపాలో జవాబిచ్చాడు ముకుందం. సుధారాణి గురించి యెన్నో ప్రశ్నలు వేస్తూ ఉత్తరం వ్రాశాడు.
తను బి.ఏ. చదువుతున్నాననీ, తను ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసరు కూతుర్ననీ, సుధారాణి జవాబిచ్చింది.
బాబోయ్! అంత పెద్ద ఆఫీసరు కూతురే? పైగా పెద్ద చదువు చదువుతోందాయె? అనుకొని మళ్ళీ ఉత్తరం వ్రాయటానికి ముకుందం భయపడ్డాడు? కాని సుధారాణి నుంచి ఉత్తరాలమీద ఉత్తరాలు రాసాగాయి.
క్రమంగా అతనిలోని బెదురుపోయింది. తను రచయిత! రచయితకు డిగ్రీలెందుకు! రచయితగా తనకు సమాజంలో ఓ విశిష్టమైన స్థానం వుంది.
రచయిత్రిగానే తనను అంత ఆరాధిస్తున్న ఆ అమ్మాయి తనను రచయితగా తెలుసుకుంటే అమాంతం ప్రేమించి వేయదూ?
ఆ భావం రాగానే ముకుందానికి ఎలాగో ఎలాగో అనిపించింది. ఈమధ్య ప్రతి చిన్న విషయానికి తనకు యెలాగో యెలాగో ఉంటుంది. యెందుకో ? యెందుకేమిటి తను రచయితగా ? రచయిత హృదయం ప్రతి చిన్న విషయానికి స్పందించాలిగా మరి!
ఇద్దరిమధ్యా ఓ రెండు మూడు నెలలు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయ్. ముకుందం సినిమాలో హీరోలా పగటి కలల్లోనే సుధారాణితో వనవిహారాలూ, వెన్నల పాటలూ బోటు షికార్లూ బోలెడన్ని చేశాడు.
సుధారాణి ఓదివ్య సుందర విగ్రహంగా ముకుందం కనుపాపల్లో నిలిచిపోయింది.
ఇన్నాళ్ళకు తన సుధారాణిని, తన హృదయరాణిని చూసే క్షణం రానేవచ్చింది. ఆ అమ్మాయికి చాలా ధైర్యం. తిన్నగా తన యింటికే వస్తానని రాసింది. అది చదివి తనకు చెమట్లు పట్టాయి. ఇంత చిన్న యింట్లోని ఓ చిన్న గదిలో.... నెలకు పదిహేను రూపాయల అద్దె గదిలో....తనను చూసి సుధారాణి ఏమనుకొంటుంది? 'ఫాస్ట్ ఇంప్రెషన్ యీజ్ బెస్ట్ ఇంప్రెషన్' అన్నారు. ప్రేమ ప్రథమ దృష్టిలోనే ఏర్పడుతుందట. మొదటిసారి పరిచయం అందమైన ప్రదేశంలో జరిగితేనే దానికి ఓ అందం చందం-అర్థం. తను చాలా బీదవాడనీ, యల్.డి. గుమాస్తా అనీ ముందుగానే తెలియకూడదు.
తమ మొదటి పరిచయం పబ్లిక్ గార్డెన్స్ లో ప్రకృతి ఒడిలో జరగాలని తన అభిలాష అని వ్రాశాడు. అందుకు సుధారాణి అభ్యంతరం చెప్పలేదు.
ముకుందం వాచీ చూసుకున్నాడు. కుర్చీ క్రింద ఏదో ప్రేలబోతున్నట్లు లేచి నిల్చున్నాడు. అయిదున్నర అయింది. అర్ధగంటలో తను పబ్లిక్ గార్డెన్స్ కు చేరాలి.
