Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 35


    బుచ్చమ్మ లాంతరు వెలిగించి చూరుకొక్కేనికి తగిలించి వెళ్ళబోతుండగా "బుచ్చమ్మా? ఇంకా వున్నావేం? మొన్ననే వెళ్ళమని చెప్పాగా?" అన్నాడు సాంబయ్య.
    "ఈ రోజే వెళ్దామని బయలుదేరా. కాని చినబాబుగారు నువ్వెళ్ళడానికి వీల్లేదంటే ఉండిపోయా!" సాంబయ్యకేసి సరిగా చూడకుండానే సమాధానంచెప్పి, సాంబయ్య మళ్ళీ మాట్లాడేలోపునే తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది బుచ్చమ్మ.
    సాంబయ్యకు బుర్ర తిరిగిపోయింది! తనుకాక ఆ ఇంట్లో మరో అధికారి వున్నాడనేది చాలా కొత్తగా, కటువుగా తోచింది. తన మాటకు ఇంతకాలంగా ఎదురులేదు. తనలోని భాగమే తన కొడుకు అనుకున్నాడు. ఆ ముండ....ఆ.....ఎంత పొగరుగా మాట్లాడింది?
    సాంబయ్య బుచ్చమ్మను పిల్చి "వాడ్ని పిలువ్, మాట్టాడాలి!" అని చెప్పాడు. అరగంట గడిచిపోయింది. గంట గడిచిపోయింది. సాంబయ్యకు వెర్రులెత్తిపోయాయి. ఎంతకీ వెంకటపతి రాడు!
    "ఏమేవ్ బుచ్చమ్మా! ఏడే వాడూ?" బుచ్చమ్మను గదమాయించాడు.
    "నన్ను కసురుకొంటారెందుకు బాబుగారూ?" అంటూ మూతి విరుచుకుండది.
    "అంటవెధవ!" అనుకొని సాంబయ్య రామాలయం దగ్గిర కెళ్ళాడు. పురాణం వింటున్న సాంబయ్యకు ఆ మంధరే బుచ్చమ్మగా పుట్టిందేమో ననిపించింది! ఇంతకీ ఈ బుచ్చిముండ వెంకటపతికి తను పిలుస్తోన్నట్టు చెప్పిందా? అంత పెద్ద అనుమానం పీడిస్తూంటే సాంబయ్యకు పురాణం వంటబట్టలేదు. ఇంటికి వస్తూ...." తెల్లారనీయ్. వాడిసంగతేదో తేల్చుకుంటాగా?" అనుకొన్నాడు సాంబయ్య.
    తెల్లవారి చావిట్లోకి వెళ్ళిన సాంబయ్యకు గాట్లో ఎద్దులు కన్పించలేదు. చేతిలోవున్న గడ్డిపస పడేసి చావిడంతా కలియజూశాడు. ఈరోజు నాగలి కట్టే పనిలేదే అనుకొంటుండగా నాగలి కన్పించింది. అయితే ఎద్దులేమయినట్టు? చావిడి పెన్నెంకూడా తీసివుంది. ఆదుర్దాగా దొడ్డి వెనకదోవలోకి వచ్చాడు. అక్కడ జీతగాడు సవారిబండికి ఎద్ధులుకట్టి పగ్గాలు పట్టుకొని నిలబడి వున్నాడు.
    "ఒరేయ్! సవారి కట్టావెందుకురా?" అన్నాడు సాంబయ్య అయోమయంలో పడి.
    "చిన్న దొరగోరూ దొరసానిగోరూ ఊరికిపోతున్నారు గదయ్యా?"
    "ఊరికి పోతున్నారా? ఏ ఊరు?"
    "బస్తీకి! వంతెనకాడ బస్సు ఆగుద్ధి చూడండి. ఆడదాకానే! దొరసానమ్మ గోరు వంతెనదాకా బండిలో ఎల్లి ఆడ బస్సెక్కుతారంట!" అంటూ జీతగాడు అటు చూస్తూ, క్షణం ఆగి తల గోక్కుంటూ అన్నాడు-
    "దొరసానమ్మగోరు వత్తుండారు. మీరు తప్పుకోండయ్యా!"
    సాంబయ్య కోడలు చావిడిగేటు వెనక్కు వెళ్ళింది.
    సాంబయ్య తలవంచుకొని వస్తుండగా వెంకటపతి ఎదురైనాడు.
    "ఎక్కడికిరా ప్రయాణం?" కొడుకు ముఖంలోకి చూస్తూ అన్నాడు,
    వెంకటపతి తల పక్కకు తిప్పుకొని "బస్తీకి" అన్నాడు.
    "ఎందుకురా ఇప్పుడు?"
    "మామయ్యను చూసాద్దామని."
    "ఏం? ఎట్టా వుంది? పోతాడా ఏం?"
    "అంతా పోతారు ఆ రోజు వస్తే!"
    సాంబయ్య వీపు మీద కొరడా వచ్చి తగిలింది! తాచుపాము పడగమీద కర్రదెబ్బ తగిలింది. వరూధిని సవారి బండి ఎక్కి 'ఎక్కవేం' అన్నట్టు భర్తకేసి చూసింది. వెంటనే వెంకటపతి వెళ్ళి ఎగిరి బండెక్కాడు.
    ఎంత నోటి దురుసు? ఎంతమాటంది? అది బలరామయ్య కూతురుగాదా మరి? ఎంత అహంకారం? తను మామ అన్నమాటే మర్చిపోయిందే! వాడు వాడి పెళ్ళాం తండ్రిని అంత మాటంటే నోరు మూసుకొని పెళ్ళాం వెనకే బండెక్కుతాడా? రానియ్ వాడ్ని ఇంటికి చెప్తా!
    సాంబయ్య ఉడికిపోతూ ఇంట్లోకొచ్చి వాలుకుర్చీలో కూలబడ్డాడు. వరూధిని మాటలు సాంబయ్య తల్లో సుడులు తిరుగుతున్నాయి. పెళ్ళాం వెనకే గొర్రెలా వెళ్ళిన వెంకటపతిని కళ్ళలో తారట్లాడసాగాడు.
    "బాబుగారూ, వడ్డించమంటారా?" వెనకనుంచి బుచ్చమ్మ గొంతు.
    "ఛ! అవతలికి ఫో!" బుచ్చమ్మమీద విరుచుకుపడ్డాడు సాంబయ్య.
    కొడుకు, కోడలు తిరిగివచ్చేదాకా వాళ్ళ ఊసే ఎత్తగూడదనుకున్న సాంబయ్య రెండోరోజు జీతగాడ్ని అడిగాడు.
    "ఎప్పుడొస్తానన్నాడా వాడు?"
    "చిన్దొరగోరా? మూడోరోజు కొస్తామన్నారయ్యా! మొన్నగదా ఎల్లారు? అంటే రేపొచ్చేయొచ్చు." జీతగాడు సమాధానం చెప్పాడు.
    "ఎప్పుడో ఒకప్పుడు చస్తార్లే!" అని మనసులో అనుకోని "ఒరేయ్, కాలవకింద పొలం కలుపు తీయొద్దంటరా?" అని అడిగాడు.
    "ఆఁ రేపో మాపో తియ్యాలి. చిన్దొరగోరు వత్తారుగా రేపు. ఆ రొచ్చాక తీయించుతార్లే!" అన్నాడు జీతగాడు.
    "ఏంట్రా వాడు తీయించేది? రేపు నేనే వస్తా! కూలీలను మాట్టాడు!"
    "తవఁరికి ఒంట్లో వుసుల్లేదుగా! మీరేమొస్తార్లే అయ్యా చిన్దొరగోరు రేపీపాటి కొత్తారుగా!" అన్నాడు జీతగాడు.
    సాంబయ్యకు వళ్ళు మండిపోయింది. ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. రెండు రోజులనుంచి ఆకలి చచ్చిపోయింది. వళ్ళుకూడా ఏ మాత్రమో కాక తగిలినట్టయింది. పుట్టి బుద్దెరిగింతర్వాత రెండురోజులు తను మంచంమీద పడుకొన్నది లేదు. ముప్పూటలా తినంది తను ఉండగలిగేవాడు కాదు! అటువంటిది రెండు రోజులుగా అన్నం మెతుకు చూస్తే మొహం కొట్టినట్టవుతూంది. వళ్ళేకాదు, మనసుకూడా బాగాలేదు. కలుపుతీసే రోజులు దగ్గిర కొచ్చాయి. తను చూస్తే, లేస్తే కళ్ళు తిరిగేట్టున్నాయి. వాడ్ని చూస్తే, వాడిపాటికి వాడు పెళ్ళాన్ని వెంటేసుకెళ్ళి, బస్తీలో కూర్చున్నాడు. అసలు తను పొరపాటు చేసేడేమో ననిపిస్తుంది. కోడల్ని కాపురానికి రానియ్యడంతో మొదలయింది ఇది. అందరి పెళ్ళాలూ కాపురాలు చెయ్యడంలా? మొగుళ్ళంతా పెళ్ళాల కొంగు పట్టుకు తిరుగుతున్నారా? తను వెంకటపతితో గట్టిగా మాట్లాడితే ఇట్టా చేసివుండేవాడు కాదేమో? వాడు తనమాట కాదనడు. తను గీచిన గీటు దాటడు. వాడు వట్టి అమాయకుడు. కొత్త పెళ్ళాం బులపాటంలో పడ్డాడు. అంతే! నా కొడుకు వెంకటపతి నా వాడే--ఆలోచన అలా ఓ కొలిక్కిరావటంతో సాంబయ్య నెత్తిమీదనుంచి బరువు దించినట్టయింది. వళ్ళు చమటలు పోసి, కాసేపటికి కునుకు పట్టింది సాంబయ్యకు.
    సాంబయ్య వేళ్ళమీద రోజుల్లెక్కపెడ్తున్నాడు. వారం రోజులు గడిచినా వెంకటపతి తిరిగి రాలేదు. సాంబయ్యకు వెంకటపతిమీద ఓ వైపున కోపమూ, మరో వైపున ఆందోళనా రోజురోజుకూ పెరగసాగినై.
    మాగాటి చేలల్లో కలుపు బీడుగా పెరిగిపోతోంది. తను లేచి నడిచే స్థితిలో లేడు. వెంకటపతి తన్ను విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ వుండలేదు. తనకు వాణ్ణి చోదోఅకపోతే ఆ రోజంతా ఏదో మనసు పీకుతున్నట్లుగా వుంటుంది. అట్లాంటిది వాడు, ఇన్ని రోజులుగా ఇల్లు వదిలి, ఊరు వదిలి, పొలాలు వదిలి, తండ్రిని వదిలి ఎలా వున్నాడో! ఇంతకీ వాడెలా వున్నాడో! ఆ ఆలోచన రావటంతో సాంబయ్య గుండెలు కదబడిపోయినై. తొమ్మిదోరోజు కూడా వెంకటపతి తిరిగిరాకపోయేసరికి సాంబయ్య నిజంగానే దిగులుపడ్డాడు. బస్తీలోవున్న కనకయ్య దగ్గరకు మనిషిని పంపే ఏర్పాటు చేసి, తను ఓపిక తెచ్చుకొని, లేచి చెప్పులు తొడిగి, కర్రచేతబట్టి, చేలో కలుపు తీయించడానికి బయలుదేరాడు సాంబయ్య. చేతికర్రను భూమికి  తాటిస్తూ వరండా మెట్లు దిగుతోన్న సాంబయ్య, ఇంటిముందుకొచ్చి ఆగిన చిన్నకారును చూసి నిలబడిపోయాడు. గ్లాస్కోపంచె; తెల్లని నిండు చొక్కాతో, బూట్లు నేలమీద బాదుకుంటూ, కారుదిగి ఇంట్లోకి వస్తున్న వెంకటపతిని సాంబయ్య వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. తలకూడా మారిపోయినట్టుంది. క్రాపుకూడా కొత్త తరహాగా వుంది. కొత్త బూట్లు కాళ్ళనునొక్కి మంటపెడ్తూంటే వెంకటపతి కాళ్ళు ఎత్తి ఎత్తి వేస్తూ మెట్లెక్కాడు. అతని వెనకే వరూథిని  కారు దిగి వచ్చింది. సాంబయ్య పక్కకు తప్పుకుంటాడని ఓ క్షణం ఆగి, మామగారు అలాగే నిలబడి వుండిపోవడం చూసి, ఎదురుగా నేరుగానే వచ్చింది వరూధిని. కోడలు కట్టుకున్న చీరలోంచి లంగా, రవికలోనుంచి ఏదో గుడ్డపీలికలా బాడీ కన్పించాయి సాంబయ్యకు. తన పక్కగా కోడలు వెళ్ళినప్పుడు అత్తరు వాస్సనలు గుప్పుమన్నాయి. వెంకటపతికూడా సెంటు రాసుకున్నాడేమోమరి - సాంబయ్య బుర్ర గుర్తు చేసుకోలేకపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS