Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 35


    "ఎందుకు సరోజా! అబద్దం ఆడతావు?" అన్నారు.
    "మీతో అబద్దం ఆడక తప్పడంలేదండీ. మీకు నేను భయపడలేదు కానీ మీ మూడ్స్ కి భయపడుతున్నాను. ఏ నిమిషంలో ఏం గొడవ తెస్తారోనన్న బెంగే నాకు" అన్నాను.
    "నీ నీడ చూసి నువ్వే భయపడుతున్నావు. ఒక సారి ఇలా రా" అంటూ నన్ను వరండాలోకి తీసుకువెళ్ళారు.
    "ఇక్కడెవరూ లేరనా మీ ఉద్దేశం? అదిగో ఆర్టిస్ట్ లంతా ఇక్కడే కూర్చున్నారు" అన్నాను.
    "అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కూర్చో" అన్నారు.
    "ఏమిటి? త్వరగా చెప్పండి. టైమవుతోంది".
    "అబ్బబ్బా! నీకెన్నిసార్లు చెప్పాలి సరోజా! నాకు తెలీదా? నువ్వే నా మూడ్ పాడుచేస్తున్నావు" అన్నారు.
    "అబ్బ! సస్పెన్స్ లో పెట్టి చంపక విషయం చెబుదురూ!" అన్నాను.
    "నిన్న లూప్ గురించేనా వాళ్ళు నిన్నడిగారు?".
    "ఏమిటో బ్రహ్మాండం బ్రద్దలయ్యే విషయం చెప్పడానికిక్కడికి తీసుకొచ్చా రనుకున్నా మనకిది పెద్ద సమస్యా? సర్లేండి నేను వెళుతున్నా"నని లేవబోయాను. "కూర్చో సరోజా! ఈ పిక్చర్ మనం ఈ రోజే పూర్తి చేసెయ్యాలి".
    "అదేమిటి?" - అన్నాను ఆశ్చర్యపడుతూ.
    "అదంతే?".
    అప్పుడు నాకు నిజంగానే ఆతృత ఎక్కువైంది.
    "ఎందుకో త్వరగా చెప్పండి" అన్నాను.
    సిగరెట్ తీసి వెలిగించి కావాలనే ఆలస్యం చేస్తున్నారు. ఇక నాలో ఓర్పు నశించింది లేచాను.
    "చెప్తారా' పోనా?" అని అడిగాను.
    "మనకి మరొక పిక్చర్ వచ్చింది. వీళ్ళే చేస్తున్నారు. సుందర్ లాల్ సహతాగారు నాకు ఫోన్ లో చెప్పారు. వీళ్ళకా విషయం  తెలుసు. అయినా మనతో చెప్పడం లేదు. మనం కూడా తెలీనట్టే వుండాలి. ఈ పని పూర్తిచేసి మైసూరు వెళ్ళిపోదాం"
    నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. మా సంభాషణ ఎవరికీ వినిపించదు. అయినా అందరి కళ్ళూ మా మీదే ఉన్నాయి.
    "నువ్వెళ్ళు ఈ సిగరెట్టవగానే వస్తాను" అన్నారు.
    ఏనుగంత బలం వచ్చింది ఆర్ధిక విషయంలో శ్రీశ్రీగారి అంతస్థు పెరుగుతున్నందుకు పొంగిపోయాను.
    వారు కూడా త్వరగానే థియేటర్లోకి వచ్చి, బ్యాలెన్స్ లూప్స్ ఎన్ని వున్నాయో చూసి, అన్నీ ఏరేసి ఓ లిస్ట్ తయారుచేశారు.
    వారి టెక్నిక్కే వేరు. సామాన్యులమాట వదిలేద్దాం. మేం చాలా తెలివైన వాళ్ళం అనుకున్న వాళ్ళకైనా ఆ టెక్నిక్ ఒంటబట్టడం చాలా కష్టం.
    ఆడే మాటలోకానీ, రాసే మాట లేక పాటలో కానీ, చేతలో కానీ వారిని అందుకోవడం, అనుసరించడం అసాధ్యం.
    వారి పద్ధతుల్ని బాటని మనం అనుసరిస్తున్నాం - అమలులో పెడుతున్నాం అనుకునే తృప్తి ఒక్కటే మనకి మిగులుతుంది. కాని నిజానికి 'నాదీ శ్రీశ్రీ బాణి - నేను శ్రీశ్రీ లాగే అన్నీ రాస్తాను. చేస్తాను, అని అనుకోవడం చాలా పొరపాటు వారి బాణీ నీడలో కూడా మనం అడుగు పెట్టలేమన్న విషయం ఇట్టే తేలిపోతుంది.
    "ఇదిగో సరోజా! మనం ఈ రోజు ఈ లూప్స్ నీ తీసేస్తే ఈ పిక్చర్ అయిపోయినట్టే" - అంటూ ఆపరేటర్ ని పిలిచి లిస్ట్ ఇచ్చేశారు.
    "ఈ పిక్చర్ నేనూ నీతో పాటు వుండి పూర్తి చేస్తే నాకేమిటి ప్రజంటేషనిస్తావు?" అని అడిగేరు.
    "సర్లెండి. మీకు ప్రజంటేషన్ ఇచ్చేటంత గొప్పదాన్నా? అయినా అడగండిచూద్దాం" అన్నాను.
    "డబ్బింగ్ పూర్తి అయిపోగానే నాకో విస్కీ కొని ఇవ్వాలి".
    "చచ్చినా ఇవ్వను".
    "ఏం?".
    "మీరు తాగుతోంది చాలక నేను వేరే కొనివ్వాలా? నా కంఠంలో ప్రాణం వుండగా నేనలాంటి పని చెయ్యన"ని అనగానే ఇబ్బందిగా ముఖం పెట్టారు. నవ్వాలో ఏడవాలో తెలీలేదా పరిస్థితిలో.
    గట్టిగా దమ్ములాగి నా వైపు ఎర్రగా చూస్తూ, ఇంజనీర్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. పిక్చర్ లూప్స్ లిస్ట్ దగ్గర పెట్టుకున్నారు. స్పీడంటే ఏమిటో తెలియజేస్తాను. చూడండన్నట్టు తను ఊపిరి తీసుకోలేదు. మమ్మల్ని తీసుకోనివ్వలేదు.
    చకచకా పనిసాగిపోతోంది. నన్ను చూసి ఈర్ష్యపడిన మా కథానాయకురాలు మాట్లాడవలసిన వేషం వచ్చింది. లూప్ వేశారు. పూర్తిగా అవవలసిన పనిలో ముప్పావు వంతు వర్క్ ఆమెదే.
    పుస్తకం ఆమె చేతి కిచ్చాను.
    "రడీ ఫర్ టేక్" అంది. "ఓసారి రిహార్సల్ చెయ్యండి. అనవసరంగా టేకులతో ఫిల్మ్ వేస్ట్" - అన్నాను.
    "అక్కర్లేధండి. ఒకే టేక్ లో చెప్పేస్తానండి" - అంది.
    'అబ్బా! అంత కాన్ఫిడెన్సా? వెరీగుడ్, అని మనసులో అనుకున్నాను.
    'రడీ ఫర్ టేక్' అన్నారు.
    థియేటర్ తలుపులు మూస్తూ వుండగా శ్రీశ్రీగారు వచ్చి ఆ అమ్మాయి డైలాగ్ చెక్ చేశారు.
    
                             *    *    *
    
                                          దుష్టశక్తులపై దండయాత్ర !
    
    శ్రీశ్రీగారు కావాలనే చెక్ చేస్తున్నారని నాకు తెలుసు. ఐనా నోరెత్తలేదు. కానీ చాలా సేపయ్యాక -
    "ఏవండి. చెక్ చెయ్యడం అయిపోయిందా? మీరు లోపలికి వెళతారా? టేక్ చేద్దాం" - అన్నాను.
    "నేనిక్కడే వుంటాను. టేక్ చెయ్యి" అన్నారు.
    గొంతులో వెలక్కాయ పడింది. అలా నాలుగయిదు లూప్స్ అయినా శ్రీశ్రీగారు అక్కడినుండి కదల్లేదు. ఆ అమ్మాయి సంతోషానికి అవధులు లేవు.
    అందువల్ల నాకేమీ హానిలేదు కానీ. వారన్న డిస్ ప్లేనే దెబ్బతింటుంది.
    ఆర్టిస్టులందరి లూప్స్ థియేటర్ లో వుండి ఫాలో అయితే అది వేరే విషయం.
    ఈసారి నేను లోపలికి వెళ్ళి ఇంజనీర్ రూములో కూర్చ్జున్నాను. "ఏమమ్మా మీరిక్కడికి వచ్చేశారేమిట"ని అందరడిగారు.
    "శ్రీశ్రీగారు లోపల వున్నారు కదండీ.  ఇక్కడ నుండి సౌండ్ తోపాటు లూప్ చూడాలని నేను వచ్చాను" అన్నాను.
    "టేక్" - అన్నారు.
    "కాదు. రిహార్సల్స్ కావాల"న్నారు ఇంజనీర్.
    "అక్కర్లేదండీ, టేక్ లో చెప్పేస్తాగా" - అంటోందావిడ.
    "మీరు చెప్పేస్తారమ్మా! మేం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలిగా. ఓసారి మాట్లాడండి" అన్నారు.
    గత్యంతరం లేక ఓ రిహార్సల్స్ ఇచ్చింది. లిప్ సరిగ్గా లేదు.
    "సరోజా" - అని పిలిచారు శ్రీశ్రీగారు వెళ్ళాను.
    "లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎలా?".
    "మీరిక్కడ వున్నప్పుడు నేను కూడా ఎందుకండీ? అంచేత మీ చోటుకి నేను వెళ్ళానన్నా"
    "వీల్లేదు, ఇక్కడే వుండి లిప్ సరిగ్గా ఫాలో అవు" అన్నారు.
    "నేనిక్కడుంటే మీరెందుకు? మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. నేనిక్కడ చూసుకుంటాను" అన్నాను.
    మా సంభాషణ చాలా గమ్మత్తుగా జరుగుతోంది.
    "నేనిక్కడ వుంటే నువ్వు వుండవా?".
    "పొద్దుట నుండి పని  జరుగుతోంది. మీరేదో ఒకటి రెండుసార్లు తప్పితే, లోపలేగా కూర్చున్నారు. ఇప్పుడెందుకు థియేటర్లోకి వచ్చారు?" అని సూటిగా అడిగాను.
    "వారిక్కడుంటే తప్పేం వుందండీ. వుండ నివ్వండి" - అంది ఆవిడ మధ్యలో కల్పించుకుని.
    "మీ అభిప్రాయం ఎవరూ అడగలేదమ్మా! మేమిద్దరం ఏదో అనుకుంటున్నాం. మధ్యలో మీకెందుకులే మా గొడవలు? మీ డైలాగ్స్ సరిగ్గా చూసుకోండి" - అని చురుగ్గా మాటలతో చురక వేశాను.
    ఆమె ముఖం మాడిపోయింది. శ్రీశ్రీగారు లాభం లేదనుకున్నారో ఏమో లోపలికి వెళ్ళిపోయారు. ఆ లూప్ టేక్ అయిపోయిన తర్వాత గ్యాప్ లో నేను కూడా లోనికి వెళ్ళి "ఇలా రండ"ని ఆయన్ని పిలిచాను. బుద్దిగా వచ్చారు.
    "చూడండీ. ఈ రోజు పిక్చర్ పూర్తి చెయ్యాలా? వద్దా?".
    "అదేమిటలా అడుగుతున్నావు?".
    "మీరు ఇందాక థియేటర్ లోపల ఎందుకు తిష్టవేసినట్టు?" అనడిగాను.
    నా ప్రశ్నకి దొంగనవ్వులు నవ్వుతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS