Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 35


    "నీవు హత్య చేస్తుండగా చూశానుకాని, నేను ఫోటోస్ తీయలేదు. ఎందుకంటే ఆ సమయంలో నా దగ్గర కెమేరా లేదు కాబట్టి. నువ్వు ఎలాగూ నేరం చేసి వున్నావు కాబట్టి. ఆ భయంతో నేను చెప్పింది నీవు నమ్ముతావని ఒక పాచిక వేశాను. అది నీ మీద చాలా చక్కగా పని చేసింది. నాదగ్గర హత్యకు సంబంధించిన ఏ సాక్ష్యం లేదు. నేనే పెద్ద సాక్షిని. అయితే, నీ దగ్గర తీసుకున్న డబ్బుతో లక్షాధికారిణి అయ్యాను కాబట్టి. నీపై జాలి తలచి నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంక నీవు హాయిగా జీవించవచ్చు."
    "ఇలా అని ఫోన్ చేశాడు. చూశావా కిరణ్! వాడి దగ్గర ఫోటోస్ లేవు. మరేరకమయిన సాక్ష్యమూ లేదు. అయినా తప్పు చేసిన వాడిని గుప్పెట్లో బిగించి భలే ఆడించాడు కదూ! తప్పుచేసిన వాడి భయం అలాగే వుంటుంది. అది తప్పులో వుండే మహత్యం" నవ్వుతూ అన్నాడు జగదీష్.
    "అన్నింటికన్నా ఈ కేసు బాగుంది" నవ్వుతూ అన్నాడు కిరణ్.
    జగదీష్ చెప్పిన స్టోరీస్ అన్నింటిలొ ఈ విషయం చాలా నచ్చింది కిరణ్ కి.
    ఒక గంట అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.
    ఆ తరువాత వేగంగా టైమ్ గడిచిపోవటం, ఇరువురూ కలసి లైట్ గా డ్రింక్ త్రాగడం జరిగింది.
    ఎనిమిది పదికి కిరణ్ బయలుదేరాడు.
    "ఈ తఫా ఒక రాత్రంతా వుండాలి. జగదీష్ అన్నాడు ఖాళీగా వున్నప్పుడు నేను ఫోన్ చేస్తాను. వెంటనే రావాలి సుమా! జగదీష్ అన్నాడు.
    "మన ఇద్దరం కలిసి ఒకే టైమ్ లో ఆనందాలు జుర్రుకోవటం ఈ మధ్యకాలంలొ జరుగలేదు. ఫోన్ చెయ్యి. తప్పకుండా వస్తాను. నాకు వీలయితే నేను ఫోన్ చేస్తాను నువ్వు రావాలి" కిరణ్ అన్నాడు.
    "అలాగే" మాట యిచ్చాడు జగదీష్.
    మిత్రులిద్దరూ మరోసారి వీడ్కోలు చెప్పుకుని విడిపోయారు.
    జగదీష్ ని కలుసుకున్నందుకు మార్గం అంటూ కనపడకపోయినా, ఒక కొత్త విషయం తెలుసుకోగలిగాడు. ఆ చిన్న విషయానికే కిరణ్ ఉప్పొంగిపోయాడు.
    ఉషారుగా బైక్ మీద ఇంటికి బయలుదేరాడు.
    
                                 21
    

    "ఎంత డబ్బు తగలేస్తావ్?" కోపంగా అడిగాడు కిరణ్.
    "నేను డబ్బు తగలేస్తున్నానా! ఎవరయినా వింటే నవ్విపోతారు" ఆశ్చర్యంగా అడిగింది కామిని.
    "నీవరకు నువ్వు డబ్బు ఖర్చుపెట్టుకుంటే ఫరవాలేదు. నేను ఏమీ అనుకోను."
    "నావరకే కదా నేను ఖర్చుపెట్టుకోవడం."
    "నీ బాబాయ్ కి అడిగినప్పుడల్లా ఇస్తున్నదాని సంగతి నేను చెప్పేది."
    "నా బాబాయ్ నాకు పరాయివాడుకాదు" కామిని కోపంగా అంది.
    డబ్బులిస్తున్నంతవరకూ అంతా మనవాళ్ళే. ఒక్కసారి అడిగినపుడు డబ్బులివ్వనని చూడు. మీ బాబాయ్ సంగతి తెలిసిపోతుంది."
    ఇవ్వకపోయినా ఏమీ అనుకోడు. అనవసరంగా ఆయనని ఆడిపోసుకోవటం కనిపిస్తున్నది. ఇక్కడ మూలిగే లక్షల్లో వెయ్యి కాని, రెండువేలుకాని, ఆయన అడిగినపుడు ఇస్తే నీ ఆస్థి ఏమీ తరిగిపోదు". అంది కామిని.
    "నువ్వు చెప్పింది నిజమే కామినీ! నేను నీ మాట లతో ఏకీభవిస్తున్నాను. నీవు నన్ను పెళ్ళిచేసుకున్నావన్న మాట మరచిపోయినట్లున్నావ్. ఇకక్డ నీ డబ్బూ, నా డబ్బూ అన్న ప్రసక్తిలేదు. ఈ మొత్తం ఆస్థికి వారసుడిని నేను. ఈ డబ్బుమీద నాకు ఎంత హక్కు వున్నదో, నా భార్యగా నీకూ అంతే హక్కున్నది. నీ డబ్బుని నీవు పాడు చేసుకుంటానంటే పాడుచేసుకో. నాకేమీ అభ్యంతరం లేదు."
    కిరణ్ అలా అనగానే ఆలోచనలో పడింది కామిని.
    తన పాచిక పారినందుకు కిరణ్ తనలో తాను నవ్వుకున్నాడు.
    ఒక మనిషిలో చిన్న విషబీజంనాటితే అది క్షణాలలో మొలకెత్తి అనుమానం మహావృక్షమై అలా అలా పెరిగి పోతుంది అని కిరణ్ గ్రహించాడు. అతను ఓ పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. పధకంలో మొదటి భాగంగా తనంతట తానుగా మొదట ఈ విషయం ఎత్తాడు. అది ఎంతోకొంత కామినీమీద పనిచేయనేచేసింది.
    కిరణ్ ని ఏడిపించడానికి వాళ్ళ బాబాయ్ అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తున్నది కాని, అలా ఇవ్వడం కామినీకి నిజముగా ఇష్టంలేదు. తాగి తందనాలాడి, పేకాడి, గుర్రప్పందాలు ఆడి ఆ డబ్బుని అన్ని విధాలా సర్వనాశనం చేస్తున్నాడు బాబాయ్. కిరణ్ చెప్పినట్లు ఈ ఆస్థిమీద ముందు ముందు సర్వాధికారాలూ వుంటాయి. ఈ ఇంటి కోడలు తను.
    కామినీ ఆలోచనలు పసిగట్టాడు కిరణ్.
    "కామినీ నేను ఎన్నో తప్పులు చేశాను నిజమే. తప్పులుచేసిన తరువాతనే తప్పుని తప్పుగా తెలుసుకున్నాను. ఇంక నా జీవితంలో మరోసారి తప్పుచేయనని మాటఇచ్చాను అలాగే మెలుగుతున్నాను. మనిద్దరం ఒక్కమాట మీద వుంటే ప్రతి పైసా మనకే వుంటుంది ఆలోచించు." అన్నాడు కిరణ్.
    ఉన్నట్లుండి కిరణ్ యింత సానునయంగా మాట్లాడుతూ వుంటే చిన్న అనుమానం వచ్చింది కామినీకి. "నీవు నాతో సరీగా వుంటున్నావా!" అని అడిగింది.
    "అదేమిటి నువ్వు చెప్పినట్లల్లా వింటున్నాను కదా కామినీ!"
    "వింటున్నావా? కాస్త  ఆలోచించి చెప్పు."
    "దీనికి ఆలోచన ఎందుకు కామినీ! నీవు ఏ నగ కావాలంటే ఆ నగ చేయించిపెట్టాను. ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులుఇచ్చాను. నీకేకాదు, నీ బాబాయ్ కి కూడా ఇచ్చాను. నీవు మీ బాబాయ్ తోపడి అణా కాని వెధవ లతో కలసి పేకాడుతుంటే ఈ ఇంటి పరువు తెలిసికూడా మందలించకుండా వూరుకున్నాను. ఇవన్నీ నేను నీ మాట వినటం కాదా?"
    "మాట వినటమంటే అదేనన్న మాట!"
    "అది కాక మరేమిటి?
    "నా బలవంతంమీద పెళ్ళిచేసుకున్నావు. ఇంటికితీసుకువచ్చావు. ఇదివరకు లాగా ప్రేమగా నాతో మాట్లాడుతూ దగ్గరకి తీసుకున్నావా! కవ్విస్తూ నవ్విస్తూ వున్నావా! ఎప్పుడూ మన్ను తిన్న పాము ఫోజులో  నెత్తిన చేతులు పెట్టుకుని కూచోడమే కదా! నీవు చేసింది. నన్ను చూసినప్పుడల్లా నీ మొహములో క్రోధపు ఛాయలు, ఏవగింపు, చాలా చక్కగానే కనిపెడుతూనే వున్నాను. కుదరకగాని కుదిరితే నా పీక పిసక డానికి సిద్దంగా వున్నావు. అవునా కిరణ్!" భర్త మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది కామిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS