"అలాంటప్పుడు సినిమాల్లో పాటల్ని ప్రేక్షకులు ఎలా ఆమోదిస్తున్నారు? అలా పాడుకునే జనం మనకి నిజ జీవితంలో కనిపించరుగా?"
"పొరపాటు పడుతున్నారు శెట్టిగారూ! సినిమాలలోలా ఖచ్చితంగా యుగళగీతాలు పాడుకోకపోయినా సంగీతమన్నది మనిషి జీవితంలో ఓ భాగం. నిద్రపోని పసికందుని నిద్ర పుచ్చటానికి తల్లి జోలపాట పాడుతుంది. నిజ జీవితంలో కూడా.....చేస్తున్న కష్టం మరచిపోవడానికి జానపద పాటలు పాడుతూ శ్రమిస్తుంటారు. పెళ్ళిలో కాని పూజలో కాని, ముత్తయిదువలు పాటలు పాడుతుంటారు. అవి మంగళగీతాల్లా, పేరంటం పాటలా అన్నది కాదు. సంగీతం జనరంజకమైనదన్న విషయం మనం అంగీకరించాలి. కాబట్టే వాస్తవాన్ని కాస్త డ్రమిటైజ్ చేసి చూపిస్తుంటే వాళ్ళూ ఆనందిస్తారు."
"గూడ్" అభినందనగా చూశాడు శెట్టి.....ఫర్వాలేదు. వయసంత ఎక్కువ లేకపోయినా వాస్తవాన్ని బాగానే జీర్ణించుకున్నాడు. అది కాదు శివలో అతడికి వచ్చింది. మెప్పుకోలుకోసం కాక తను నమ్మిన విషయాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నాడు.
"నీతో ఓ సినిమా ప్లాన్ చేయాలనుకుంటున్నాను శివా అందుకే నిన్ను పిలిపించింది కూడా! సాలోచనగా అన్నాడే తప్ప అసలు ఈ అవకాశం యిస్తున్నది సుకృతి మూలంగా అని చెప్పలేదు. అలా చెప్పకూడడన్నది సుకృతి అభ్యర్ధన.
"వెంటనే ప్రారంభించాలి."
విస్మయంగా చూశాడు శివ. ఈ సినిమా రంగంలో యిలాంటి విచిత్రమైన ప్రపోజల్సు మామూలేకాని నారాయణశెట్టి స్థాయికి చెందిన వ్యక్తి అడగడాన్నే యింకా జీర్ణించుకోలేకపోతున్నాడు.
"నువ్వు సిద్దమేనా?"
"అరుదైన ఈ అవకాశానికి సిద్దం కానని ఎలా చెప్పను శెట్టిగారూ! కానీ నేనేమిటీ అన్నది తెలియకుండా మీరు నామీద ఈ ప్రయోగం ఎలా చేయగలుగుతున్నారూ అన్నది నాకు అర్ధంకాని విషయం."
నవ్వేశాడు శెట్టి. ఆ నవ్వులో గర్వం లేదు. సుదర్శనరావులాంటి వ్యక్తుల్ని ఓడించాలన్న కసి వుంది. "సినిమారంగం ఏ ఒక్కడి సొత్తు అంటే నేను అంగీకరించను శివా! కొత్త నీరు రావాలి. అందుకే నీకు అవకాశం యిస్తున్నది. నిజానికి నేను నీ మీద ప్రయోగం చేయడం లేదు. వ్యాపారమే చేయాలనుకుంటున్నాను. అదీ బాగా ఆలోచించాకనే చెప్పు......వెంటనే సినిమా మొదలు కావాలీ అంటే నీకు పెద్ద ఆర్టిస్ట్ ల కాల్ షీట్స్ దొరకవు. బి గ్రేడు నటులతో ప్రారంభం కావాలి. నీ దగ్గర కథ సిద్దంగా వుందా?"
"ఉంది" నిశ్చలంగా అనడమే కాదు క్లుప్తంగా చెప్పాడు తను అనుకుంటున్న కథ గురించి. "మధ్య తరగతికి చెందిన యిద్దరు అమ్మాయిలు..... ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు. మంచి స్నేహితులు కూడా అయినా జీవితాన్ని విభిన్న కోణాలనుంచి చూస్తుంటారు. ఓ అమ్మాయి ఆడపిల్లకి పెళ్ళి కావడం సమస్యంటుంది. మరో అమ్మాయి పెళ్ళి కాదు, మంచి భర్త దొరకడం ముఖ్యమంటుంది. ఇద్దరూ ఒకే అబ్బాయికి దగ్గరవుతారు. పెళ్ళి కావడమే సమస్యనుకునే అమ్మాయి అతడికి ఏదోలా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటే అతడేమిటో తెలిసేదాక దూరంగా వుండాలనుకుంటూంది రెండో అమ్మాయి. ఇలా ట్రయాంగ్యులర్ సాగిన ప్రేమ కథలో మొదటి అమ్మాయి అదే అబ్బాయి మూలంగా శీలాన్ని కోల్పోతుంది. అది తెలిసిన రెండో అమ్మాయి మొత్తం పురుష జాతి మీదనే ద్వేషాన్ని పెంచుకుని పెళ్ళే చేసుకోకూడదన్న అభిప్రాయానికి వస్తుంది. మన సంఘంలోని వివాహ వ్యవస్థ ఆ వ్యవస్థ మధ్యతరగతి అమ్మాయిల ఆలోచనా సరళిపై చూపించే ప్రభావం గురించి వివరంగా చెప్పే కథ యిది."
శివ చెప్పిన కథ గురించి యిక లోతుగా వెళ్ళలేదు శెట్టి సినిమా లకి సిసలైన కస్టమర్స్ అయిన అమ్మాయిల్ని ఆకట్టుకునే కథ అది. అంతకుమించి చెప్పే పద్దతిలో కొత్తదానం చూపించగలడని శివపై నమ్మకం వుంది. శివలాంటి తపనగల వ్యక్తి తొలి అవకాశం సద్వినియోగపరుచుకోటానికి ఎంత శ్రమించేదీ తెలీని విషయం కాదు.
"పాయింటు బాగుంది శివా! డిటైల్స్ నాకు అవసరం లేదు. బడ్జెట్ ఎంతా, ఏమిటీ అన్నది అడగదలచుకోలేదు. అది నా స్థాయికి తగని పని. అందుకే నీకు తోచిన టెక్నిషియన్స్ తో సినిమా ప్ర్రారంభించు ఒకే షెడ్యూల్ లో సినిమాని పూర్తిచెయ్. నువ్వు నన్ను అడగాల్సింది డబ్బు మాత్రమే మిగతా విషయాలలో నేనూ జోక్యం చేసుకోను" చెప్పాల్సిందంతా చెప్పిన శెట్టి చివరగా అన్నాడు. "నువ్వనుకుంటున్న ఆర్టిస్టులెవరో చెబితే అడ్వాన్సులు పంపిస్తాను."
తొలి అవకాశమైనా యింతగా స్వేచ్చనిచ్చే నిర్మాతలు దొరకడం డైరెక్టరు అదృష్టమే. "మీరన్నట్టు ఈ కథకి పెద్ద నటులు అవసరం లేదు. బి గ్రేడ్ ఆర్టిస్టులు చాలు. హీరోగా ఈ మధ్య పైకివస్తున్న నరేంద్రయితే బెటరనిపిస్తూంది."
