Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 35


    "వీధిలో ముష్టి ఎత్తుకునే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు బాసూ....రిక్షా లాగేవాడు కాపురం చేస్తున్నాడు. వాళ్ళకీ మనకీ తేడా వుండొద్దూ. మనిషెప్పుడూ...ఎప్పుడూ ఏదో ఒక మెట్టు పైకి ఎక్కుతూనే వుండాలి. ఇప్పుడునేనున్న స్థితినుంచి ఒక్క మెట్టుపైకి ఎక్కినా చాలు....అంది శశికళ.
    "నువ్వర్దమవ్వకపోయినా...నీ మాటలు మాత్రం ఇప్పుడు కాస్త కాస్త అర్ధమవుతున్నాయి" అన్నాడు శ్రీచరణ్.
    "ఈలోగా ఎవరో విజిటర్స్ రావడంలో ఆ టాపిక్ అంతటితో కట్ అయింది.
    "మేడమ్....మేనేజర్ గారు పిలుస్తున్నారు" ఫ్యూన్ వచ్చి చెప్పడంతో తన సీట్లోంచి లేచింది ప్రనూష మేనేజర్ ఛాంబర్ వైపు వెళ్ళడానికి.
    కామాక్షి, ప్రసూనాంబలు ఓసారి ప్రనూషవైపు చూసి, తమ పనిలో నిమగ్నమయ్యారు.
    మెల్లిగా దగ్గింది తను వచ్చినట్టు తెలియాలని. "వెల్ కమ్.....వెల్ కమ్.....రండి, కూచోండి. ఈరోజు గంట ఆలస్యంగా వచ్సినట్టున్నారు...." అన్నాడు ప్రభాత్.
    "అయిపోయాను. మళ్ళీ క్లాసు మొదలెడతాడా?" అనుకుంది ప్రనూష.
    "మీకు క్లాస్ తీసుకోవడానికి కాదులెండి పిలిచింది" అన్నాడు ప్రభాత్ నవ్వుతూ.
    "యిదోటి....నేనేది అనుకున్నా వీడికి తెలిసిపోతుంది" మళ్ళీ అనుకుంది.
    "హలో .... అలా మీలో మీరే గొణుక్కోవద్దు" అన్నాడు ప్రభాత్.
    "అబ్బే....ఏమీ లేదుసర్..." అంది.
    సరే....కాఫీ....టీ...." అడిగాడు.
    "వద్దు" అనాలనుకుంది. అప్పటికే కాఫీని కప్పులోకి ఒంపి ఇచ్చాడు.
    "ఎందుకో శుభోదయాలు కావలసిన వాళ్ళతో కలిసి కాఫీ తాగాలని శుభరాత్రులు... కావలసిన వాళ్ళతో కలిసి పంచుకోవాలని కోరిక.... ప్చ్...ఒంటరి వాడిని.... నాకంటూ ఎవరుంటారు? కనీసం ఇలా అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళతో కాఫీ తాగడం...జ్ఞాపకాలుగా మిగుల్చుకునే ప్రయత్నమే..." అతని గొంతులో జీర కనిపిస్తోంది.
    అతని మాటలు అలాగే మంత్రముగ్దురాలిలా వింటోంది ప్రనూష.
    ఎంత చక్కటి పదజాలం....భావాలను ఎంత అందంగా ఆవిష్కరించగలడు. తన కిష్టమైన భావుకత్వం....అతని గొంతులో నుంచి ఎలా వస్తోంది?
    "హలో..... మి.....స్....ప్రనూషగారూ..."
    ఒక్కసారి గుండెనెవరో కత్తితో రెండుగా చేసిన ఫీలింగ్
    "మి.....స్....ఆ పదం వింటూంటే....అది చురకత్తితో చీల్చిన భావన....పెదాలకు తేనెపూసిన ఫీలింగ్..."
    ఇఫ్ యూ డోంట్ మైండ్..." అని ఆగి ప్రనూషమొహంలోకి చూసి..."
    టేబుల్ సొరుగులాగి...ఓ ఫ్రెష్ గులాబి టేబుల్ మీద పెట్టాడు.
    "దిసీజ్ ఓన్లీ ఫర్ యు....అదీ మీకు అభ్యంతరం లేకపోతే..."
    ఒంటరి వాడిని. నా భావాలు పంచుకోవడానికి ఏ తోడూ లేని వాడిని.... అప్పుడప్పుడు తోటలో పచార్లు చేస్తూ.....గులాబీలతో నా బాధలు చెప్పుకుంటాను....అన్నట్టు మీకు చెప్పనే లేదు కదూ....నాకు పూలన్నా, పూలలా స్వచ్చంగా సువాసనలనూ, సుమధుర భావాలను అందించే మీలనతి....ఎస్పెషల్లీ మీలాంటి అమ్మాయిలన్నా ఇష్టం. ఈ రోజు పొద్దున్నే మీ గురించి.... సారీ మీ గురించి మీ పర్మిషన్ లేకుండా ఆలోచించాను.....తప్పుచేసాను కదూ..." అన్నాడు ప్రభాత్.
    ఇంకా అతని మాటల ట్రాప్ లో నుంచి తేరుకోలేదు ప్రనూష....
    అతని మాటలు మంత్రాక్షరాల్లా అనిపిస్తున్నాయి.
    అతని భావాలు మేజిక్కుల్లా తోస్తున్నాయి.
    ముఖ్యంగా తన కోసం అతను ఆలోచిస్తున్నాననడం...
    "హలో ... ఏంటి కోపమొచ్చిందా? సారీ..."
    "అయ్యో....అలాంటిదేమీ లేదు" అంది ప్రనూష.
    "అయితే ఈ రోజు నుంచి మీ గురించి మీ పర్మిషన్ అక్కర్లేకుండానే ఆలోచించొచ్చన్నమాట..."
    "అవునవును..."
    "ప్రామిస్"
    "ప్రామిస్" అంది అసంకల్పితంగా ..... అతని చేతిలో చేయివేస్తూ....
    "అలా అయితే మీరీ గులాబి మీ జడలో పెట్టుకోవాలి.
    "ఆమె మరేమీ ఆలోచించలేదు. వెంటనే ఆ పన్జేసింది. ఆమె జడలో అతనిచ్చిన గులాబీ.
    థాంక్యూ....థాంక్యూ ప్రనూషగారూ..." అన్నాడు ఎక్సయిటింగ్ ఫీలింగొకటి ఇచ్చి "వెల్ కమ్" అంది ప్రనూష.
    "చూసారా...నా మనసిప్పుడు ఎంత ఆనందంగా వుందో....జడలో వున్న గులాబీ కూడా మురిసిపోతోంది..." అన్నాడు ప్రభాత్.
    ప్రనూష ఇంకా ట్రాన్స్ లోనే వుంది.
    ఈలోగా ఫ్యూన్ వచ్చాడు.
    "సార్....మీకోసం ఎవరో డిస్ట్రిబ్యూటర్ వచ్చారు....పంపించమంటారా?"
    కోపంగా ఫ్యూన్ వంక చూసి.....మళ్ళీ ఏమనుకున్నాడో "పంపించు...." అని ప్రనూషవైపు చూసి.
    "థాంక్యూ ప్రనూషగారూ..." అన్నాడు.
    ప్రనూష లేచి, బయటకు నడిచింది ట్రాన్స్ లో వున్నట్టు.
    వెళ్తోన్న ప్రనూషని చూసి నవ్వుకున్నాడు ప్రభాత్. ఆ నవ్వులో క్రూరత్వం ఊపిరి పోసుకుంటోంది.
    
                                                                * * *
    
    ఏయ్ ప్రనూషా....బాస్ ఎందుకు పిలిచాడు?" అడిగింది కామాక్షి, మేనేజర్ ఛాంబర్ నుంచి వచ్చాక ప్రనూషని.
    ఏం చెప్పాలో ఒక్క క్షణం తోచలేదు.
    ఏమని చెప్పగలదు? అతను భావుకత్వం బావుందని చెప్పాలా? అతని మాటలు తనని ట్రాన్స్ లో పడేసాయని చెప్పాలా? అతను తనకిచ్చిన గులాబీ బావుందని చెప్పాలా?
    డైలమాలో నుంచి అంత త్వరగా బయటకురాలేకపోయింది ప్రనూష.
    ఏయ్.....నిన్నే...."ఈసారి ప్రసూనాంబ భుజం తట్టి మరీ అడిగింది ఉలిక్కిపడి అంది. మరేం లేదు. ఏవో ఫైల్స్ గురించి అడిగాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS