ఒక్క క్షణమాగి రవి ఆయన్ని అనుసరించాడు.
వెళుతున్న ఆ ఇద్దర్నీ చూసి తనలో తనే నవ్వుకుంది స్వప్న.
బయటకి రాగానే "రవీ! స్వప్నని అమ్మమ్మగారు అపురూపంగా పెంచారు. తల్లీ తండ్రీ లేని లోటు తెలియకుండా అనురాగాన్ని వర్షించి పెంచారు ఇప్పుడు స్వప్నకి రెండు దెబ్బలు తగిలేయి. అమ్మగారు, అమ్మమ్మగారు యిద్దరూ ఏక కాలంలో పోయారు. నువ్వు ఆమె మనస్సు గాయపడకుండా నడుచుకో!"
అలాగేనండీ అన్నాడు రవి.
ఆయన వెళ్ళిపోయాడు బెస్టాఫ్ లక్ చెబుతూ.
ఆ తర్వాత ఈ రెండు నెలలూ విచిత్రంగా మలుపులు తిరుగుతూ గడిచేయి. స్వప్న పట్టుబట్టు అతనితో అతను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయించింది.
"రవిగారూ! మీరు ఉద్యోగం చేయటం ఈ యింటి స్థాయికి తగింది కాదు. అందుకే మిమ్మల్ని రిజైన్ చేయమని కోరుతున్నాను!"
స్వప్న మాట ప్రకారం తనకెంత యిష్టంలేకపోయినా రిజైన్ చేశాడు రవి. అలాగే వెంకట్రామయ్యగారినీ అదుపులో పెట్టేసింది.
"చూడండి! మీరు పెద్దవారు. ఈ యింటి స్థితిగతులన్నీ తెలిసిన వారు. అమ్మమ్మగారి మనస్సు. ఆమె నిర్ణయాలు ఎలా వుండేవో మీకు తెలుసు ఈ ఆస్తి అజమాయిషీ అంతా రవిగారికి అప్పగించటం ఆమెయిష్టం. మీరు ఆ పనులన్నీ చేయటం కూడా ఈవృద్దాప్యంలో కష్టం. కాబట్టి ఆయనకి ఆపని అప్పగించండి"
ఆ మాటలు వింటూనే అతని గుండెల్లో రాయి పడింది. "తల్లీ! నువ్వు చిన్న దానివి. నీకు తెలిసో తెలియదో నాకు ఆమె పెద్దమ్మగారు అవుతారు. ఆస్తి అంతాపోయిన స్థితిలో ఆమెని ఆశ్రయిస్తే నాకు ఈ విధంగా బ్రతుకుతెరువు కల్పించింది. ఇప్పుడు నువ్వు నన్ను పంపేస్తే నా గతేం కావాలి."
"మీకు జీతం ఎంతిస్తున్నారు?"
"అకవుంట్స్ లో చూడమ్మా మూడొందలు ఇస్తున్నారు."
"సరే! మీ జీతం ఎందుకు తీసెయ్యాలి. జీతం తీసుకోండి నెల నెలా ఊరికే సలహా దారుగా అప్పుడప్పుడూ వస్తూ చూస్తూ వుండండిచాలు. కానీ వ్యవహారమంతా ఆయనకి నేర్పండి!"
నోరెళ్ళబెట్టాడు వెంకట్రామయ్య.
ఇక వెళ్ళండి అన్నట్టుగా చూసింది స్వప్న.
"అబ్బో! ఈ పిల్ల కృష్ణవేణమ్మగారికంటే అసాధ్యురాలు!" అనుకుని విధిలేక వెళ్ళిపోయాడు.
ఆ విధంగా అన్ని వ్యవహారాలూ సర్దుబాటు చేసి తన అజమాయిషీలోకి తెచ్చుకుంది స్వప్న.
ఆ రోజుకి సరిగ్గా రెండు నెలలు గడిచాయి.
ఈ రెండు నెలలూ రవికి విశ్రాంతే లేదు. ఆపల్లె నుంచి రైతుల నందరినీ పిలిపించాడు. వాళ్ళతో మాటాడాడు. కాగితాలన్నీ స్వప్న పేరు తో తిప్పి రాయించాడు. పత్రాలన్నీ తిరిగి స్వప్నకి రాయించాడు. అందర్నీ ఆపంటతో మొత్తం బాకీలు చెల్లించాలని చెప్పాడు.
ఆ వ్యవహార దక్షత చూసి అందరూ యిలాగా వ్యవహరించింది కృష్ణవేణమ్మ భర్తగారే అనుకున్నారు.
బ్యాంక్స్ కి ఇద్దరూ వెళ్ళి ఫిక్స్ డ్డిపాజిట్ ఎమౌంట్స్ యస్.బి.ఎకౌంట్స్ అన్నీ స్వప్న పేరా మార్పించేరు. అలాగే కొన్ని కంపెనీల్లో వున్న షేర్లన్నీ కూడా స్వప్న పేర ట్రాన్స్ ఫర్ చేయించాడు.
ఇవన్నీ అయ్యాక తహసీల్ దారుకి అర్జీపెట్టి అంతదాకా అమ్మమ్మగారి పేరుతో వున్న భూములన్నీ స్వప్న పేర పట్టా ట్రాన్స్ ఫర్ చేయించాడు.
అన్నీ తెలుసుకున్న లాయర్ ఒకరోజు ఫోనులో రవిని మందలించేడు. రవీ! అమ్మమ్మగారు ఆస్తి మొత్తం మీ యిద్దరికి చెరి సమంగా పంచేరు. ఇదేమిటి నువ్వు అంతా ఆ అమ్మాయి పేర చేయిస్తున్నావ్? తర్వాత విచారిస్తావు!"
నవ్వేడు రవి "సర్! నా కంత ఆశలేదు. నేను యీ వూళ్ళో, యీ యింటి గేట్లో అడుగుపెట్టినపుడు నే కోరుకున్నవి రెండే రెండు! ఒకటి నా చెల్లాయి ఆరోగ్యం. రెండు మా యిద్దరికీ వేళకింత తిండి. అంతే కానీ ఈ అష్ట అయిశ్వర్యాలూ, ఈ భోగభాగ్యాలు ఈ సంపదా ఆశించలేదు. కలలో కూడా నేను స్వప్నకి భర్తని అవుతాననుకోలేదు. ఇక నా కెందుకు ఆశ? ఇదంతా ఆమెదే!"
దానికాయన ఏమీ అనలేదు.
"ఒకవేళ నన్ను యిరకాటంలో పెట్టే రోజు వచ్చినా ఐ డోంట్ ఫియర్. ఏదో మీ వంటి వాళ్ళ పరిచయం, అభిమానం లభించాయి. చాలు!"
"దట్సాల్!"
ఇవన్నీ ముగిశాక యింట్లోని సంపదనంతా ఒకసారి పూర్తిగా చూడాలనుకున్నాడు రవి. ఒకవేళ యింట్లోనూ ప్రామిసరీ నోట్లు లాటివి వుంటే వాటికి కాలదోషం పట్టకూడదు అనుకున్నాడు.
ఆ రోజు అదే అడిగాడు రవి.
ఈ రెండు నెలలుగా ప్రతి క్షణమూ అతన్ని నిశితంగా పరిశీలిస్తోంది స్వప్న, అతన్లో స్వార్ధం అణుమాత్రం కనిపించటంలేదు. "అఫ్ కోర్స్! ఇంత జాగ్రత్తా రేపు తమ పెళ్ళయ్యాక అతనికే ఫలిస్తుంది కదా!" అనుకుంది. మళ్ళీ వెంటనే పెళ్ళి విషయం అతనడుగుతాడా తనని? తనే హెచ్చరించాలా? లేక ఇంకెవరయినా అడగాలా? అనుకుంది.
"చూద్దామా? బీరువాలూ అవీ అన్నీ వెతుకుదాం?"
"ఎందుకు?"
"అందులో ఏవయినా పేపర్సు వుంటే ఆ విషయాలు చూడొద్దూ."
