Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 36

 

    "ఒరే పోట్టిలాగు సత్తిపండు....నాకు తెల్సు గానీ, నువ్వేనని బయటికి రారా."


    "నేను పోట్టిలాగుని కాను. పిల్లిని....మ్యావ్.....మ్యావ్.....'


    "ఓహో....నువ్వు మ్యావ్ వా....నేనింకా పోట్టిలాగు సత్తిపండనుకున్నన్లే" అనుకుని శ్రీచంద్ర వెనక్కి తిరిగినట్టు నటించాడు.


    సత్తిపండు పొదలచాటు నుంచి మోకాళ్ళ మీద దేకుతూ బయటకు తలపెట్టి శ్రీచంద్ర వెళ్ళిపోయాడేమోనని చూసాడు.


    అదే సమయంలో శ్రీచంద్ర ఇటు టర్నయి "చూసేశాను గానీ, బయటకు రారా పండు...." అన్నాడు.


    "పండు....గిండు.....అనకు...అవతల నా గర్ల ఫ్రెండ్ ఉంది" మూతి ముడుచుకుంటూ అన్నాడు సత్తిపండు, ఇక తప్పదని బయటకు వస్తూ.


    "నీకింత టాలెంటేక్కడిదిరా? అమ్మో...అమ్మో...."


    "ఊరుకో గురూ! అవతల లామేశ్వరి ఉంది. ఉండు నీకు పరిచయం చేస్తా....." అంటూ పొదల లోపలికి పోయి చెయ్యి పట్టి ఓ అమ్మాయిని లాక్కొచ్చాడు సత్తిపండు.


    ఆ అమ్మాయి బుట్టబొమ్మలా, బొద్దుగా, ముద్దుగా లంగా , వోణిలో కళ్ళద్దాలతో ఉంది.


    కళ్ళద్దాలలో నుంచి శ్రీచంద్రని చూస్తూ ......'ఎవలండి....ఈయన....." అంది రెండు జడలను రెండు చేతుల్తో పట్టుకుని వూపుతూ.


    "నే చెప్తానే నా ఫ్రెండ్ శ్రీచంద్రని.....మా గురువని....అతను.....'


    "అలాగా......నమస్కాలమండి......" అంది చేతులు జోడిస్తూ, శ్రీచంద్ర అవాక్కయి , అప్రయత్నంగా చేతులు జోడించాడు.


    "గురూ....ఈ అమ్మాయి లామేశ్వారని.....మా ఇంటి ఓనరు కూతురు.....అంటే నా లవ్వర్......ఇంకా అంటే సమీర వదిన నికేలాగో , నాకి లామేశ్వరి అలా అన్నమాట" అన్నాడు వివరిస్తూ.

    
    
    "అది సరే గానీ ఒరే సత్తిపండు.....'లామేశ్వరి ఏమిట్రా....."


    "లా మేశ్వరి అంటే "రా' మేశ్వరి అన్నమాట. పాపం! గురూ.....రామేశ్వారికి 'రా' పలకటం రాదు. 'రా' బదులు 'లా' పలుకుతుంది. అన్నాడు.


    "పోనీ తానంటే 'రా' బదులు 'లా' పలుకుతుంది మరి నీకేం మాయరోగం వచ్చిందిరా?" నువ్వు కుడా లామేశ్వరి అంటున్నావ్."


    "అది గురూ! హూ! అదంతా ఓ పెద్ద కధలే. గురూ......చెప్పుకుంటే చేంతాడంతవుతుంది."


    "చెప్పి చావుమరి"


    "నేన్నిజంగా తనని ప్రేమించినట్టయితే నన్ను కూడా 'రా' బదులు 'లా' పలకమని ఈ లమేశ్వారి చెప్పింది. అందుకే నేను తనతో ఉన్నంత సేపూ 'రా' అనే అక్షరాన్ని మాట్లాడనే మాట్లాడను. ఎందుకంటె నేన్నిజంగా తనని ప్రేమిస్తున్నాను కాబట్టి."


    "ఓర్నీ! ప్రేమంటే ఇన్ని త్యాగాలుంటాయన్న నగ్న సత్యం మొదటిసారిగా తెలుసుకున్నాన్రా పండు. ఓకె....కీపిటప్....అయితే నేనిక వెళ్తాను. నువ్వు నీ రామేశ్వరితో.....చీ.....కాదు.....కాదు.....;లామేశ్వరితో ప్రోసిడైపో.....నే వెళ్తాను......బై....." అన్నాడు వెళ్ళడానికి రెడి అయిపోతూ.


    "అరె..... అగు గురూ! లవ్వర్ కోసం ఫ్రెండ్ ని కష్టపెదతానా? నేనిప్పుడే తనని అటో ఎక్కించి వస్తాను. ఇక్కడే వుండు నువ్వు ఇద్దరం కలిసి అలా టాంక్బండ్ కు వెళ్దాం. రామేశ్వరి గురించి నికంతా చెప్పాలిగా"


    "రామేశ్వరి కాదురా లామేశ్వరి"


    "అదే....అదే.....సరే నే వెళ్లి దించేసి వస్తాను."


    "త్వరగా.....రా" అన్నాడు శ్రీచంద్ర.

 

                                                         * * *


    టాంక్ బండ్.....


    టాంక్ బండ్ దగ్గర ఛాట్ బండి వద్ద ఇద్దరూ గప్ చుప్ లు తింటున్నారు.


    తినడం పూర్తయింది.


    సత్తిపండు తన ప్లేటును తిరగేసి శ్రీచంద్ర ముఖానికి దగ్గరగా పెట్టి రౌండ్ గా తిప్పాడు.


    "అదేవిట్రా....అన్నాడు అర్ధం కాక శ్రీచంద్ర.


    "అలా రౌండ్ గా తిప్పితే ప్లాష్ బాక్ అన్నమాట. నా రామేశ్వరి గురించి నీకు ప్లాష్ బాక్ స్టోరి చెప్పాలిగా......" అన్నాడు సత్తిపండు తన్మయత్వంగా.


    "అవున్రా! కనీసం ఇప్పుడు కూడా చెప్పకపోతే నిన్ను హుస్సేన్ సాగర్ లోకి తోసేస్తాను."


    "కదా! నీకంత కోపం వచ్చిందని తెల్సే నేను చెప్పదల్చుకున్నాను."


    "చెప్పు" కుతూహలంగా అన్నాడు శ్రీచంద్ర.


    అది ఒక వర్షం రాత్రి. ఉరుములు మెరుపులు. దడ్.....దడ్.....దడ్.....టప్.......టప్....టప్....చినుకులు" యాక్షన్ చేస్తూ, ఎక్స్ ప్రేషనిస్తూ చెప్తున్నాడు సత్తిపండు.


    
    "ఒరే సత్తిపండు ! మణిరత్నం సినిమాలోలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తూ డిటిఎస్ లో చెప్పక్కరలేదురా, సింపుల్ గా చెప్పు చాలు" చెవులు మూసుకుంటూ అన్నాడు శ్రీచంద్ర.

 

    "ఏంటి గురూ! నా ప్లాష్ బ్యాక్ వినమంటే నీకు ఎగతాళిగా వుందా?"


    "లేదులే. యమా టెన్షన్ గా వుంది గానీ చెప్పు అసలా రామేశ్వరి .....ఛ...ఛ....కాదు లామేశ్వలి నీకెలా తెలుసు?"


    "లామేశ్వలి మా ఇంటి ఓనర్ గారి ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆమెకు ఆ దేవుడెందుకో 'రా ' అనే అక్షరం పలక్కుండా చేసి అన్యాయం చేశాడు. నేను వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో వున్న ఓ రూమ్ లో ఉండేవాడ్ని. ఆ చిన్న రూమ్ కె రెండు వందలు అద్దె వసూలు చేసేవాడు ఆ ఓనర్. అది కూడా కట్టలేని స్థితిలో ఉన్న నేను .....ఓరోజు" మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్ సౌండ్స్ వినిపించబోయిన సత్తిపండు శ్రీచంద్ర మొహం చూసి విరమించుకుని ప్లాష్ బ్యాక్ ని కంటిన్యూ చేసాడు.


    "ఓరోజు హొరున వాన పడుతోంది. అప్పటికే వారం నుండి నా నుండి అద్దె వసూలు చేయాలనుకున్న ఓనర్ గురువారం నా రూమ్ చుట్టూ కుక్కలా కాపలా కాస్తున్నాడు. అతన్నుండి తప్పించుకోవాలంటే నాకు ఒకటే మార్గం కనిపించింది. వాడు నా రూమ్ దగ్గర ఎలాగో తెల్లావారేవరకూ కాపలా ఉంటాడు అనేది కన్ ఫర్మ్ కాబట్టి వాడి నుంచి తప్పించుకోవాలంటే వాడి ఇంట్లో నేనుంటే సేఫ్ గా వుంటాననుకున్నాను. జోరు వానలో తడుస్తూ ఓనర్ ఇంటికి వెళ్లాను. నా పరిస్థితికి జాలిపడి రామేశ్వరి తల దాచుకోవడానికి చోటిచ్చింది. ఆ తర్వాత తన గుండె గదిలో మరికాస్త ప్లేసిచ్చింది. నాలాంటి ఒంటరిగాడ్ని తన జంటగా చేసుకుంది. అంతకంటే ఏం కావాలి గురూ నా జీవితానికి. వున్న 56 అక్షరాల్లో ఓకె ఒక అక్షరం పలకడం రాని రామేశ్వరి నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నాను. నేను. ఏమంటావ్ గురూ!" అంటూ ఎప్పటిలా అడిగాడు.


    "ఒరే అమాయకపు సత్తిపండు. నీ వెనుక ఇంత ప్రేమకధ వుందా? మరెందుకు ఇన్నాళ్ళూ నాకు చెప్పలేదురా ?"


    "విని నువ్వు బాధపడతావేమోనని గురూ!"


    "నేనెందుకు బాధపడతాన్రా?"


    "రా అక్షరం పలకడం రాని అమ్మాయిని ప్రేమిస్తున్నానని తిట్టి చీ కొడతావేమో అనుకున్నాను గురూ!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS