Previous Page Next Page 
అష్టపది పేజి 35


    
    శీతల్ కి ఒకటి మాత్రం అర్ధమయింది వాళ్ళు తనని గదిదాటి బైటికి పోనీయరు అని.
    
    శీతల్ కి కోపం, ఏడుపు, ఒళ్ళు మంట లాంటి సమస్త లక్షణాలు ఒకేసారి వచ్చాయి.
    
    "ఆడవాళ్ళ గదులముందు కాపలా కాసేవాళ్ళు మగవాళ్ళు కాదు. కొజ్జాలు మాత్రమే. రజియా సుల్తానా సినిమాలో మీలాంటి ముచ్చు మొహాలని చూశాను. మీ సంగతి నాకు బాగా తెలుసు! మీ రాజులంగారితో అర్జంటుగా మాట్లాడాలి. మీలో ఒకరు తక్షణం వెళ్ళి తిమ్మరాజులంగారినో, మహామంత్రి గజపతుల వారినో, సేనాపతి ప్రవరాఖ్య ప్రతాపసేనుడినో నేను చెప్పానని చెప్పి తోడొనిరమ్ము" అని చెప్పి గిరుక్కున తిరిగి గదిలోపలకి వచ్చేసింది శీతల్.
    
    ఎంత ఆలోచించినా ఏమీ అర్ధంకాలేదు శీతల్ కి.
    
    చాలాసేపు అలా ఆలోచిస్తూ కాలుగాలిన పిల్లిలాగా ఆ గదిలో పచార్లు చేస్తూ వుండిపోయింది శీతల్.
    
    సమయం గడిచిపోతున్నది.
    
    మళ్ళీ ఆ గదిలోకి ఎవరూ రాలేదు.
    
                                      21
    
    శీతల్ గ్రహించింది.
    
    శీతల్ చిన్నపిల్ల ఏమీకాదు. ఇదంతా ఒక ప్లాను ప్రకారం జరుగుతున్న నాటకం అని తెలుసుకోగలిగి తనకు తానే నచ్చచెప్పుకుంది ధైర్యం తెచ్చుకుంది.
    
    ఇక్కడ శీతల్ కి అర్ధం కానిది ఒకటే ఎవరైనా అందమైన ఆడపిల్లని చెరపడితే రేప్ చేస్తారు. లేక బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ రెండూ కాకపోతే ఏ గల్ఫ్ కంట్రీస్ కో అమ్మేస్తారు. ఇవేమీ కానివి ఇంకేమైనా అత్యాచారాలు వుంటే అతివలమీద చేయడానికి చూస్తారు.
    
    అంతేగాని....
    
    ఇలా...
    
    రాచమర్యాదలతో ఒక రాకుమారిని సత్కరించినట్లు ఇదేమి అతిధి మర్యాద? పూర్వం కొన్ని దేశాల రాణులు చెరసాలలో పెడితే ఆ రాణి సపర్యలకై ఒక దాసీదాన్ని కూడా రాణి పక్కనే చెరసాలలో వుంచేవాళ్ళట. బందిఖానాలో వుంచినా ఎంతో కొంత రాచమర్యాదలు పాటించేవారు.
    
    ఇప్పుడు మాత్రం?
    
    దొంగలని, నేరస్తులని ఓ విధంగా చూస్తారు. రాజకీయ ఖైదీలను మరో విధంగా చూస్తారు. రాజకీయ పత్రికలకు దినపత్రికల దగ్గరనుంచి రేడియోలో వార్తలు వినే సౌకర్యం వుంది.    

 

    తను ఇప్పుడు వున్నది.
    
    రాజకీయ ఖైదీ రమణీమణా!
    
    కళింగ రాజకుమారి చెరసాలా!
    
    ఆ గదిలోనే అన్ని రాచమర్యాదలు జరుగుతున్నాయి శీతల్ కి. టి.వి. రేడియో,  బుక్స్ లాంటివి లేవు. ఎవరితో నన్నా మాట్లాడదామంటే మాట్లాడే మనిషంటూ కనపడలేదు. నీగ్రోలాంటి మగవాళ్ళు, శూర్పణకలాంటి ఆడవాళ్ళు. వాళ్ళయినా అవసరం వున్నంతవరకే ఆ గదిలోకి వచ్చి కావల్సినవి అందించి వెళ్ళిపోతున్నారు.
    
    శీతల్ వాళ్ళు మాట్లాడారు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కంగాళి భాషలో ఏదో మాట్లాడి (అదైనా చాలా ముక్తసరిగా) పోతున్నారు.    

 

    గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం తప్ప శీతల్ కి పనేమీ కనపడలేదు. గదిలోంచి బయటికి వద్దామంటే గుమ్మం దగ్గర బల్లాలు పట్టుకుని రక్షకభటుల కాపలా'
    
    తిండి, నిద్ర, విశ్రాంతి ఇలా ఎన్నాళ్ళో, ఇదేమిటో శీతల్ కి అర్ధం కాలేదు. లోకేశ్వరర్రావు హస్తం దీనిలో వుందా? ఉండే వుంటుంది. ఉంటే దేనికి వున్నట్లు? లోకేశ్వరరావు హస్తం లేకపోతే ఎందుకు లేనట్లు? లేకుండా ఎలా వుంటుంది? ఆ అపరలంకేశ్వరుడిగారి హస్తం వున్నా, లేక పోయినా దీని వెనుక పెద్ద కారణం వుండే వుంటుంది.
    
    తమ తమాషాగా వెళ్ళి ఏ దేశంలోనన్నా పడ్డదా అనుకోడానికి అలాంటి దాఖలాలు లేవు. బానిసల రాజ్యంలో బందీ అయిన రాకుమారి అనుకుందామా అంటే ఇది బానిసల రాజ్యం కాదు, తను రాకుమారి కాదు. ఆహార పదార్దాలు, వెండి సామాగ్రి, ఒళ్ళు రుద్దుకునే సబ్బు-అన్నీ ఇండియావే. ఇంత చక్కగా తెరచాటున వుండి నాటకం ఆడుతున్న వాళ్ళు, పోనీ ఆడిస్తున్న వాళ్ళు ఇలాంటి కొన్ని విషయాలలో పప్పులో కాలేశారు. ఈ ఐడియా వాళ్లకు రాలేదా?
    
    శీతల్ తెలివిగా ఆలోచించగలిగిందికాని కాస్త మాత్రం ఊహించలేకపోయింది.  

 

    ఈ బందిఖానా ఎన్నాళ్ళు?
    
    ఇదంతా ఏమిటి?
    
    అదీ తెలియదు.
    
    మొదట బాగానే వుంది శీతల్ కి ఆ తర్వాత బోర్ ఫీలయింది. ఆ తర్వాత పిచ్చి పట్టినట్టు అయింది. ఏం జరుగుతుందో చూద్దామని గదిలో వున్న గాజుసామాన్లని మరికొన్ని, విలువైనవాటిని యుద్దంలో వీరవనిత ఎడాపెడా కత్తితిప్పి శత్రువుల తలలు తెగనరికి పారేసినట్లు ఆ వస్తువులని పగలగొట్టి చిందరవందరచేసి పారేసింది.
    
    శీతల్ అలా చేస్తుంటే ఎవరూ గదిలోకి రాలేదు.
    
    చిన్న గాజుపెంకు శీతల్ చేతిలో గుచ్చుకుంది దానిని విసురుగా లాగి అవతల పారేసి, చివరికి తాను విసిగిపోయి వెళ్ళి మంచం మీద పడుకుంది. "రోగం కుదిరింది వెధవలకి. పావుగంటలో పాతికవేలు మటాష్ చేశాను ఏడ్చి చస్తారు" అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS