"అడుగో ఇప్పుడోస్తున్నాడు బాబాయ్" అంది జయంతి.
"రోజు ఇదే వేళకొస్తున్నడా?' అడిగింది దాక్షాయణి.
"లేదే! ఎనిమిది గంటలకు వచ్చేస్తాడు" అంది జయంతి.
"మరి ఈరోజు ఇంత ఆలస్యమైందంటే" సాలోచనగా తనలో తానే అనుకుంది దాక్షాయణి.
"ఏవో పనులు వుండివుంటాయి పిన్నీ! కంట్రాక్టరుకదా" అంది జయంతి నవ్వుతూ
"అవున్లే! అదే అయివుంటుంది" అంది దాక్షాయణి.
"గిరిజ, సురేంద్ర సినిమాకెళ్ళారుకదావచ్చారా?" అడిగింది దాక్షాయణి.
"ఆ! ఇందాకే వచ్చారు" అంది జయంతి.
"ముచ్చటైన జంట" అంది దాక్షాయణి.
"ఎంటో పిన్నీ! గిరిజక్క నాతో ఇదివరకులా వుండటంలేదు" అంది జయంతి దిగులుగా.
"అంటే?" అంది దాక్షాయణి.
"ముభావంగా వుంటుంది. పలకరిస్తేనే పలుకుతుంది. తనకై తానూ జయంతి అని పలకరించటంలేదు" అంది జయంతి సీరియస్ గా.
"కొత్త పెళ్ళి కూతురుకదా! బిడియంగా వుంటుందిలే" అంది దాక్షాయణి తేలిగ్గా నవ్వేస్తూ.
"ఇంకా కొత్తేమిటి.....? రెండు నెలలవుతుంటేనూ..." అంది జయంతి.
"నిజమే కదా! గిరిజ పెళ్ళయి అప్పుడే రెండు నెలలు అయిందా నిన్న మొన్ననే అయినట్లుంది" అంది దాక్షాయణి ఆశ్చర్యంగా.
"ఆ నెలరోజులు భలే బాగుంది కదా పిన్ని!" అంది జయంతి.
"అవును జయంతి! మళ్ళి మనింట్లో శుభకార్యం ఎప్పుడు జరుగుతుందా అనిపిస్తుంది నాకు" అంది దాక్షాయణి జయంతినే చూస్తూ.
"అమ్మో అయితే వద్దులే. మళ్ళి శుభకార్యం అంటే నేనేగా. నాకు ఇప్పుడే పెళ్ళోద్దు బాబోయ్" అంది జయంతి కంగారుగా.
"ఎందుకు జయంతి పెళ్ళంటే అంత భయపడుతున్నావు?" అంది దాక్షాయణి.
"భయంకాదు పిన్ని! అప్పుడే పెళ్ళి చేసుకుని ఏంటి లాభం! పదిహేనేళ్ళు రాగానే పెళ్ళి చేసుకోవటం, ఆ తర్వాత పిల్లల్ని కనటం ఇదేనా జీవితం?" అంది జయంతి సీరియస్ గా.
"నీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా వుంటుందే నాకు. చిన్నపిల్లవైనా ఎంతో లోతుగా ఆలోచిస్తూ మాట్లాడతావు" అంది దాక్షాయణి ఆశ్చర్యంగా.
"అవును పిన్ని! నేను అన్నదానిలో నిజముందా లేదా! నీ విషయమే తీసుకో. నీకు ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి చేశారు?" అడిగింది జయంతి.
"పదమూడు సంవత్సరాలకి" నవ్వుతూ.
"అసలు ఆ వయసులో నీకు పెళ్ళంటే సరయిన అవగాహన వుందా?" అంది జయంతి.
"ఏమో! పెళ్లన్నారు. నా ప్రేమేయం లేకుండానే చేసేశారు" చెప్పింది దాక్షాయణి.
" ఆ కాలం అలా వుంది. ఇప్పుడు కాస్త ఫర్వాలేదు. పదేళ్ళలో కాస్త మార్పు వచ్చినట్లుంది. గిరిజక్కకు పదహారు ఏళ్ళు వచ్చాక చేశారు. నేను ఇప్పుడే పెళ్ళి వద్దుఅంటే కాస్త అగుతున్నారు" అంది నవ్వుతూ.
"ఆ విధంగా మీరు కాస్త అదృష్టవంతులేకదా. మాతో పోలిస్తే అంది దాక్షాయణి.
"ఖచ్చితంగా" అంది జయంతి.
"అందుకే ఇచ్చిన అలుసును మరోలా ఉపయోగించుకోకుండా నువ్వు సరైనా నిర్ణయం తీసుకో. బావగారు వచ్చే ఏడాది నీ పెళ్ళి ఖచ్చితంగా చేయాలంటున్నారట. అక్క చెప్పింది" అంది దాక్షాయణి.
"నా దిగులు అదే కదా! నాకైతే కనీసం ఇరవైఏళ్ళు వచ్చేవరకు పెళ్ళి చేసుకోకూడదనిపిస్తుంది" అంది జయంతి.
"అమ్మో! ఇరవై ఏళ్ళ?!" అంది దాక్షాయణి.
"ఎందుకు పిన్నీ! అంత ఆశ్చర్యం?' అంది జయంతి నవ్వుతూ.
"జయంతి...జయంతి...." అంటూ కిందనుంచి కస్తూరి కేకేసింది.
"ఏంటమ్మా?" పైనుంచే అడిగింది జయంతి.
"కిందకురండి మీ బాబాయ్ పిలుస్తున్నాడు" అంది కస్తూరి.
"అరె! అయన లేచారనుకుంటా జయంతి! పద వెళదాం....పాపం ఆకలివేసి వుంటుంది" అంది దాక్షాయణి కంగారుగా.
"అరెరె! మెల్లగా దిగు పిన్ని-పడిపోతావు. అంత కంగారెందుకు?" అంది జయంతి నవ్వుతూ.
"నీకు అన్ని నవ్వులాటలే తల్లీ! అంది దాక్షాయణి నవ్వుతూ.
"ఇద్దరూ కిందకు దిగారు.
"ఎంటండి! భోజనం పెట్టమంటారా?" అదిగింది ఆతృతగా దాక్షాయణి.
"నువ్వు భోంచేయలేదా?" అడిగాడు మాధవరావు.
"లేదు. చెప్పానుకదా...! ఇద్దరం కలిసి చేద్దామని...." అంది నవ్వుతూ.
"నీ పంతం నేదేకదా. సరే పెట్టు నాతోపాటు నువ్వు కూడా కడుపు మాడ్చుకోవటం దేనికి?" అన్నాడు నిశ్శబ్దంగా నవ్వుతూ.
దాక్షాయణి గబగబా వంటగదిలోకి వెళ్ళి ప్లేటు కడిగి, అన్నం పెట్టుకుని హల్లోకి వచ్చింది.
"నేను తినకుండా పడుకుంటే నువ్వు కూడా అలానే పడుకుంటావా దాక్షాయణి?" అడిగాడు మాధవరావు ఆశ్చర్యంగా.
"అంటే.....నేనెప్పుడైనా మీరు భోంచేయకుండా నేను భోజనం చేశానా?" అంది దాక్షాయణి నవ్వుతూ.
"ఎంటో-నిది పిచ్చి ప్రేమ" అన్నాడు తనూ నవ్వుతూ.
"సరే! అలాగే అనుకోండి...."అంటూ ప్లేటు అతనికి అందించింది.
