ఆ రోజు సాయంకాలం చీకటిపడ్డాక కొద్దిగా ధైర్యం వచ్చింది. ఈ ఆలోచనలు లేకముందు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది. అదేమిటో తెలియదుగానీ ఇప్పుడు ఊర్లోకి వెళ్ళాలంటేనే ఏదోగా వుంది. బహుశా ముఖంలో కలిగే తొట్రుపాటును అందరూ గుర్తిస్తున్నారన్న భయం కాబోలు.
నేరుగా సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లలేకపోయింది. ఇంటికి వెళ్లాక ఎందుకొచ్చావని అడిగితే ఏం చెప్పాలి?
అందుకే వూరకనే అలా వీదంటకొసవరకు నడిచిందిగానీ సుధాకర్ ఎక్కడా కనపడలేదు. అందులోనూ అది పెద్దిల్లు. దాదాపు ఐదు గదులుదాకా వున్నాయి. చుట్టూ కాంపౌండ్. ఉసూరంటూ వచ్చేసింది.
వచ్చేటప్పుడు కూడా అతను కనపడలేదు.
ఇక రాత్రికి ఖచ్చితంగా నిద్రరాదనుకుంది. ఒళ్లంతా ఒకటే నొప్పులు. తలంతా భారంగా తయారయింది. లోలోపల దుఃఖం మరుసటి రోజు ఎక్కడికీ పనికెళ్లలేదు. నిజానికి నాట్లు పుంజుకోవటంతో కూలీల గిరాకీ బాగావుంది. మామూలుగా ఇచ్చే కులీకన్నా ఐదు పది రూపాయలు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు.
ఎంతమంది వచ్చి పిలిచినా రానని చెప్పేసింది. సుధాకర్ ని చూస్తే తప్ప ఈ వ్యాకులత ఈ బాధ పోదనిపించింది. కాని ఏం చేయటం? ఎక్కడా అతని జాడే లేదు. అసలు ఏమాపోయాడు? ఏదయినా పనిమీద ఎక్కడకయినా వెళ్లాడా? ఏమీ తెలియటంలేదు.
పెద్దవాళ్లంతా పనులకు, పిల్లలంతా స్కూల్ కు వెళ్లటంతో అంతా ఖాళీగా వుంది. చూపు ఆనని ముసలివాళ్లు, నడవలేని పెద్దవాళ్లు ఎండకు భయపడి బయటకు రాలేదు. దాంతో కాలనీ అంత కర్ఫ్యూ విదించినట్టు.
ఉమ స్నానంచేసి బట్టలు మార్చుకుంటున్నప్పుడు నెలవారీ కార్యక్రమం మొదలైంది. చిరాకుపడిపోయింది. అప్పుడే స్నానం చేసి రావడంతో. తన చేతుల్లోలేని విషయం కనుక మరోసారి స్నానం చేసింది.
ఇక ఆ మూడురోజులూ మంచిబట్టలు కట్టుకునే వీలులేదు. గనుక పాత కాటన్ చీర కట్టుకుంది. మెరూన్ కలర్ లో వున్న ఆ చీర మెత్తగా హాయిగా వుంటుంది.
రాత్రి మిగిలిన సద్దితోపాటు రెండు గారెలు కూడా వున్నాయి. అవి తిన్న తరువాత ఏం చేయాలో తోచలేదు.
వీధిలోకి వచ్చి చూసింది ఉమ. మొదట్లో మరీ చిన్న పిల్లలు ఏదో ఆటలు ఆడుకుంటున్నారు. మిగిలిన వీధి అంతా జన సంచారంలేక నిర్మానుష్యంగా వుంది.
ఆమె యింటిలోంచి నులకమంచం తీసుకువచ్చి ముందున్న కొట్టాంలో వేసుకుంది.
అది కొట్టాంలా వుండదు. ఇంచుమించు ఇల్లులా వుంటుంది. పెద్ద కాశిరాళ్లమీద గడ్డివాము వేశారు. కింద చుట్టూ ఎదురుదబ్బల తడికలు వున్నాయి. అంతేగాక ముందు రెండు పెద్ద బుట్టలు కూడా వున్నాయి. ఓ బుట్టవెనుక మంచం వేసుకుంది. అక్కడయితే మరీ యింట్లోకి వస్తేతప్ప బయటికి కనిపించదని భావించి అక్కడ మంచం వాల్చింది ఉమ.
ఊరకనే పడుకోవడం ఏదో అనిపించి లోపల్నుంచి ఏదో కాగితము తీసుకొచ్చింది. అది ఏ ఉప్పో పప్పో చుట్టుకొచ్చిన పేపరు. దాన్ని చదువుకుంటోంది.
కొంచెంసేపటికి అదీ బోర్ కొట్టింది.
అలానే పడుకుని కళ్లు మూసుకుంది.
అప్పుడు టైమ్ పది దాటింది.
ఆడుకుంటున్న పిల్లలు కూడా లోపలికి వెళ్ళడంతో కాలనీ మరింత నిశ్శబ్దంగా తయారయింది.
ఆమె అలా మంచంపై పడుకునే వుంది.
ఎవరో కలలో పిలుస్తున్నట్టనిపించింది.
ఎవరో కాదు - సుధాకర్ వచ్చినట్టుంది.
కళ్లు విప్పితే ఆ పిలుపు మరి విడపడదన్న భయంతో కళ్లు మూసుకుని అలానే పడుకుని వుంది.
"ఉమా! ఉమా!" మళ్లీ పిలుపు వినిపించింది.
కలకాదు - నిజమే.
ఆమె దిగ్గున కళ్లు తెరిచి చూసింది.
ఇంటిముందు నిలబడి ఎవరో తనను పిలుస్తున్నారు. ఆమె మంచం దిగేటప్పటికి అతను లోపలికొచ్చాడు. సుధాకర్ - తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. అందుకే కళ్లను నులుముకుంటూ మరోమారు చూసింది.
"మీ ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం కాలేదు. ఎప్పుడో ఒకటి రెండుసార్లు చూశాను. గుర్తుండిపోయింది." అతను ఫ్రీగా వున్నాడు గానీ ఆమె మాత్రం వుండలేకపోయింది. అన్ని రోజుల తరువాత అతన్ని చేరడంతో హృదయంలోంచి సంతోషం ఎగజిమ్ముతోంది.
"కూర్చో" తను అంతవరకు పడుకున్న మంచం అతనికి చూపించింది ఉమ. ఆమె యింట్లో అంతకంటే మంచిది లేదు కూర్చోవడానికి.
అతను దానిపై కూర్చున్నాడు. "మొన్న ఆదివారం రానన్నావట కదా సినిమాకి" అనడిగాడు.
ఆదిలక్ష్మి ఎంత మోసం చేసిందో తెలుస్తోంది.
"నేనా - రానన్నానా?" ఆశ్చర్యంగా అందామె.
"ఆఁ కట్టుకోవడానికి మంచి చీర లేదన్నావంటగా. అయినా రోజూ కూలికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తుంటారుగా -మరి మంచి చీరలు కొనుక్కోవచ్చుగా."
"అదిగాదు."
ఆమె ఏదో చెప్పబోయిందిగానీ ఆ తరువాత ఎందుకని మానేసింది. తనను పిలుచుకు వెళ్ళడం ఇష్టంలేక తను చీరలేక రాలేదని అబద్దం చెప్పిందన్నమాట ఆదిలక్ష్మి.
"తనతో వెళ్ళడం నాకిష్టంలేదు. అందుకే నెక్ట్స్ ఆదివారానికి ప్రోగ్రామ్ వేశాను" అన్నాడతను.
అంటే ఎవరూ వెళ్ళలేదన్నమాట. అప్పుడు ఊపిరొచ్చినట్టు దీర్ఘంగా శ్వాస వదిలింది ఉమ.
"ఇదిగో - ఇదీ నీకు - వచ్చే ఆదివారానికి" అని అతను తన చేతనున్న ప్యాకెట్టు ఆమెకిచ్చాడు.
ఏమిటది?
ఆమె దానిని విప్పి చూసింది.
ఆమె కళ్ళు మరింత వెడల్పయ్యాయి. లోపల చీరలు రెండు. మరందుకు కావాల్సిన మ్యాచింగ్ బ్లౌజులు, పెట్టీకోట్ లు, రెండు బ్రాలు కూడా వున్నాయి.
అంతకుముందు సవాలక్షమంది వచ్చుంటారు ఆమె యింటికి. కానీ ఎవరూ ఇంత భారీ బహుమతి యివ్వలేదు. ఆనందం డబ్బునుబట్టే వుంటుంది. తన చిన్నాన్నో, పిన్నమ్మో వచ్చినప్పుడు పావలా మల్లెపూలు, స్వీట్లూ తెచ్చేవారు. ఆనందం అంతే వుండేది.
ఇప్పుడేమో ఇతను భారీగా తేవటంవల్ల సంతోషం కూడా భారీగానే వుంది. జ్వరాన్ని కొలిచేందుకు థర్మామీటర్ వున్నట్టే, మనుషుల మధ్య నున్న మమతానుబంధాలను కొలిచేది డబ్బే. "డబ్బులో ఏం వుంది అంతా మనసులో వుండాలి" అని కొందరు చెప్పే మెట్టవేదాంతం ఎంత దండగ మారిందో ఇప్పుడు తెలిసిందో.
