Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 35


    
    ఇంతలో మగతనిద్ర కమ్మేసింది. ఏవేవో కలలు, తనూ సుధాకర్ కలిసిపోయి చేస్తున్న అల్లరీ, తమాషాలు, ఏది కలో, ఏది నిజమో ఆమెకి తెలియడంలేదు.


    సాయంత్రం నాలుగు గంటలకి తల్లి నిద్రలేపి అన్నం తినకుండా ఉన్నందుకు కేకలేసింది.


    ఇక తప్పదని అన్నంముందు కూర్చుంది ఉమ.


    సాయంకాలాలప్పుడు ఎదురింటికి పక్కింటికి వెళ్ళడం కూడా మానేసింది ఈ మధ్య.


    సుధాకర్ ను గురించి ఆలోచించడంకన్నా మరేదీ హాయిగా అన్పించదనిపించింది. ఒకసారి అలా వూర్లోకెళ్ళి సుధాకర్ ని చూసి రావాలని మనసు ఒకటే పీకుతోంది. అయినా వెళ్ళాలంటే ఏదో సిగ్గుగా వుంది.


    మరుసటిరోజు పనికి వెళ్ళింది. ఒంటరిగా వుంటే అవే ఆలోచనలు వస్తాయని పనికి వెళ్ళింది గానీ అక్కడా అదే ధ్యాస. కాస్త తెలివైన అమ్మాయిలు ఆమె వైఖరిని కనిపెట్టేసి తమాషాలు కూడా ప్రారంభించారు.


    "ఏమిటి కథ! వ్యవహారం కళ్ళదగ్గరే ఆగిందా? లేక....?" అంటూ మధ్యలోనే ఆపి మిగిలింది సంజ్ఞలు చేస్తున్నారు. అలాంటప్పుడు చచ్చేంత సిగ్గేస్తోంది ఉమకి. ఏం చెప్పాలో తెలియక తనకే అర్థం కాని నవ్వు నవ్వుతోంది.


    రెండు రోజులు గడిచిపోయాయి. మూడోరోజు శనివారం. మరుసటి రోజే ఆదివారం. సినిమాకెళ్ళాల్సిన రోజు. ఆదిలక్ష్మి ఆ వూసే ఎత్తలేదు. ఇంతకీ ప్రోగ్రామ్ వున్నట్టా? లేనట్టా? ఏమీ తెలియడం లేదామెకి.


    ఆదిలక్ష్మి ఆ రోజు సాయంకాలం వచ్చింది పనిలోంచి- ఎక్ స్త్రా కూలీ ఇస్తాననడంతో పనిచేసినట్టుంది. మనిషి అదోరకంగా వుంది.


    "రేపు మనం సినిమాకి వెళుతున్నామా?" ఆదిలక్ష్మి ఇంటికెళ్ళి అడిగింది ఉమ.


    వెళ్ళడానికి వుండడానికి నేనేమైనా నీలాగా తాడూ బొంగరం లేని మనిషినా? పెళ్ళయినదాన్ని. పనికొచ్చేవాడో పనికిరానివాడో ఎవడో మొగుడంటూ వున్నాడు కదా. మరి వాడ్ని అడగొద్దూ. వాడు వూర్లో లేడాయె. మరెలాగ? కాబట్టి రేపు సినిమా ప్రోగ్రాం కాన్సిల్" అంది కాస్తంత స్పీడ్ గా ఆదిలక్ష్మి.


    మొత్తానికి ఆమెకి తనను తీసుకుని వెళ్ళడానికి ఇష్టంలేదనీ, అందుకే ఈ ట్రిప్ ను వద్దంటోందని ఉమకి అర్థమైపోయింది. సినిమాలకి, టౌన్ లో సరుకులు కొనుక్కోవడానికి తమ కాలనీలో ఏ ఆడదీ మొగుడ్ని ముందుగా పర్మిషన్ అడగదు. ఏదో ఇలా సాకులు చెప్పడానికి తప్ప ఆ ఆచారం ఇక్కడ లేదు.


    మొత్తానికి ఆదివారం సినిమాకెళ్ళలేకపోయింది ఉమ. మరో రెండు రోజులు గడిచిపోయాయి. మరిక తట్టుకోలేకపోయింది. అతన్ని చూడాలన్పించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS