జీన్సు పాంటు, షర్టు, చిన్న హెయిర్ కట్ తో వున్న శారదని చూస్తే నవ్వొచ్చింది రామానికి - అయినా తనకేం శారద, ఎవరూ - తనెవరూ - ఎవరికి ఎవరూ - రామం రామనాథం కార్లో కూర్చున్నాడు.
'జడ్జిమెంటు ఎప్పుడు చెప్తారూ" - రామం మాటలకి నవ్వాడు రామనాథం - జడ్జిమెంటుతో పనేమిటి - ఇప్పుడు జడ్జిమెంటు చెప్పినట్టే - మీ రిద్దరూ ఈ క్షణం నుంచి స్వేచ్చాజీవులు - నువ్వూ పెళ్ళి చేసుకోవచ్చు, ఆ అమ్మాయీ పెళ్ళి చేసుకోవచ్చు - ఆ అన్నట్టు ఆ ఫోటో విషయం ఏం చేశావూ 'రామనాథం కారు దిగుతూ అన్నాడు, "చెప్తాను. త్వరలోనే" - రామం నమస్కారం పెట్టి బయటకొచ్చేశాడు అక్కడ నుంచి.
'ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయాత్' 'ఓహో - చిత్రం - భార్యని కొడుకుల్ని కూడా పశువుల జతలోచేర్చేశాడే - బాగుంది - తలుపుతీసి లోపల ప్రవేశించారు రామం.
కోర్టునుంచి ఇంటికి రాగానే శారదకి దుఃఖం ఆగలేదు.
'అయిపోయింది' -
'ఏమై పోయిందీ - తనుకోరుకున్నదేగా' మనసు ఎదురు ప్రశ్నవేసింది ఒకవేళ ఇలా అవకపోతే ఎంత చిక్కులో పడేది తను - తన ఆశలన్నీ నిరాశలయ్యేవి - మళ్ళీ తన బతుకు మొదట్లోనే వుండేది - అంతా మన మంచికే - ఈ విషయం వెంటనే నీరజకి చెప్పాలి. ఈ పాటికి దినేష్ వచ్చేవుంటాడేమో - ఇంట్లో కూచుంటే ఎలాగ - శారద ముఖం కడుక్కుంది. తనకి చాలా ఇష్టమైన ఎర్రని అద్దాలబ్లౌజు వేసుకుంది షిఫాను చీరకట్టుకుంది. ఎర్రని స్టిక్కర్ బొట్టుముఖాన. ఎగిరేగిరిపడుతున్న జుట్టు - అద్దంలో ముఖం చూచుకుంది. చాలా బావుంది - మనసునిండా ఆనందం వుంటే ముఖం అందంగా వుండదు మరి!!.
శారద స్వీట్ షాపు దగ్గర స్వీట్సుకొంది. ఆటోలో ఎక్కి కూచున్నాక ఆలోచించింది. రెండురోజుల్లో బొంబాయి వెళ్ళిపోతుంది - ఇంటి వాళ్ళకి ఏం చెప్పాలీ - చెప్పకుండా వెళ్ళిపోతే - ఏదో నోటికి వచ్చిన మాట చెప్పేయచ్చు - కంపెనీవాళ్ళు ట్రయినింగుకి పంపిస్తున్నారని చెప్తే సరిపోదూ - ఆటో ఆగింది. ఎంతో హుషారుగా దిగింది శారద.
తలుపుకి తాళం - ఏమిటిది ? - ఫోను చేస్తే ఎవరూ ఎత్తలేదు - తీరా వస్తే తలుపుకి తాళం - ఏం చేయాలీ - నీరజ తల్లి ఎలావుందో, - తనకి ఎలా తేలుస్తుందీ - ఎక్కడున్నారో - శారద ఆమెట్ల దగ్గర నిలబడింది - దొడ్డి గుమ్మంలోంచి లోపలకెళ్ళి లోపల ఎవరైనా వున్నారేమో చూడాలనుకుంది శారద - పనివాళ్ళో ఎవరో ఉండక పోతారా - చూద్దాం - శారద లోపలకెళ్ళింది.
'ఎవరూ' - ఓ ఆడగొంతు. కుక్క భౌ భౌ మని అరుస్తోంది - కట్టేసేవుంది. శారద ధైర్యంగా లోపలకెళ్ళింది.
'ఎవరమ్మా' - శారద వెంటనే గుర్తుపట్టింది - ఈ ఇంటికి మొట్ట మొదట వచ్చినపుడు పెద్ద టేబులు ముందు కూచుని పేకాట ఆడ, మగ కలసి ఆడారు. అందులో వున్న ఒకామె ఈమె.
'నీరజ వుందా' - శారద దిక్కులు చూస్తోంది.
'నీరజ ఎవరూ'-
'నీరజ - ఈ ఇల్లు గల వాళ్ళమ్మాయి"
'ఏమిటీ - ఆవిడకి శారద ఏమంటుందో అర్ధంకావటంలేదు. ఇంతలో లోపల నుంచి ఒక మధ్యవయస్సున్న అతను, ఆమె వచ్చారు ఈవిడ కొడుకూ, కోడలూ వాళ్ళు - వీళ్ళు కూడా ఆరోజు పేకాట ఆడిన వాళ్ళలోవున్నారు.
'ఈ ఇంటి వాళ్ళమ్మాయి నీరజ. అమ్మాయితోవుండే అబ్బాయి' 'ఏమిటీ - మీరు పొరబాటు పడుతున్నారు. మీరు ఒక ఇంటికి వెళ్ళాల్సివుంది. తెలియక ఈ ఇంట్లోకి వచ్చారు' అన్నాడు ఆయన 'కాదండీ ఈ ఇల్లు నీరజది కదా' -
'అమ్మా - ఈ ఇల్లు నాది. నాదికాదు మా అమ్మదీ, నాన్నది - నువ్వు చెప్పే నీరజ ఎవరూ ఎప్పుడూ ఇక్కడ లేదు. దయుంచి మీరు ఎడ్రసు సరిగ్గా చూసుకోండి' - అతని మాటలకి తికమకపడి పోయింది శారద. కుక్క ఒకటే మొరుగుతోంది.
తను పొరబాటు ఎక్కడపడిందీ - ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందీ - శారద బయటకొచ్చేసింది - ఏం చేయాలీ - అలాగే నుంచుంది - ఆ, మళ్ళీ అడుగుతాను - శారద గబగబాలోపల కొచ్చింది 'అమ్మా గదితాళం వేసుందిగా. ఈ గదిలో వుండే అమ్మాయీ. అబ్బాయీ, అదే నీరజ, దినేష్' - ఈ మాట శారద గొంతు వణికింది. ఆయన మొత్తుకున్నాడు.
'డాడీ గదిలోవుండే దీప్తి, రాజుకదా - ఆ విషయం చెప్పండి' - ఓ పధ్నాలుగేళ్ళ అమ్మాయి లోపల్నుంచి వచ్చింది.
"దీప్తి, రాజా - ఇదేమిటి - నీరజ, దినేష్ కాదా" శారద తలతిరిగి పోతోంది. ఆయనకి శారదపై జాలేసింది.
"కూర్చో - ఖంగారుపడకు" - టీ తెచ్చి యిచ్చింది అమ్మాయి.
"అమ్మాయి గురించి ఇంకేం తెలుసోచెప్పుముందు" - శారద టీ తాగింది.
"ఆ అమ్మాయి నా ఫ్రెండు అండీ. వాళ్ళనాన్నకి సింగపూర్ లో పెద్ద హోటళ్ళు రెండున్నాయి. అమ్మాయిదే ఈ ఇల్లు ఇంకా' ఇక - ఆయనకి నవ్వొచ్చింది.
"చూడమ్మా - నువ్వు చెప్పినదాంట్లో కొంత దారిదొరికింది. అమ్మాయి నాన్నకి సింగపూర్ లో హోటళ్ళున్నాయి నిజం. మా నాన్నకి సింగపూర్ లో హోటళ్ళున్నాయి.....అయితే, మా నాన్న మాకు వీళ్ళని పరిచయం చేసాడు - ఎలాగంటే 'నా ఫ్రెండు కూతురు దీప్తి, తల్లి ఇక్కడ కొస్తున్నారు - వాళ్ళకి ఏదో బిజినెస్ పనులు వున్నాయట, మన ఇల్లు చాలా పెద్దది కనక ఇంట్లో వుండనియ్యండి ఓ గది విడిగా ఇచ్చేయండి. రెంట్ విషయం మీరేమీ మాట్లాడద్దు' అని అప్పటి నుంచీ దీప్తి, రాజు ఇక్కడుంటున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ కాలేజీలో ఒక్క సంవత్సరం చదువుకుంది. అంతలో రాజు అనే ఆ అమ్మాయి, కజినట వచ్చాడు బొంబాయినించి లెన్నోవాళ్ళ బిజినెస్ లూ వ్యవహారాలు - అంతే, నువ్వు చెప్పే నీరజ, దినేష్ ఎవరో మరి మాకేం అర్ధం కావటం లేదు - 'ఆయన శారదవంక చూస్తూ కూచున్నాడు. శారద, నీరజ, దినేష్ ఒకసారి ఎగ్జిబిషన్ కు వెళ్ళి అక్కడ ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో అప్పుడు తన బాగ్ లోనే వుంటుంది. శారద ఆ ఫోటో బయటకి తీసింది.
'ఈ అమ్మాయి' అంది ఫోటో చూపిస్తూ.
'ఆ, ఈ అమ్మాయి దీప్తి, ఇతను రాజు -
అంటే పేర్లు మార్చి చెప్పారాతనకి - ఎందుకూ - శారద అలానే కూచుంది. ఎప్పుడొస్తారో చెప్పారా' శారద ముఖం వాడిపోయింది.
'ఇంక రారు. ఇద్దరూ బొంబాయి వెళ్ళిపోయారు. వాళ్ళమ్మ, అదే ధనంజయరావుగారి ఆ, ఆయన ఆగాడక్కడ
"భార్యా అండీ' - శారద అంది వెంటనే.
'భార్యోకాదో మరి దీప్తికి మాత్రం తల్లి - నవ్వాడు ఆయన
'ఆవిడ సింగపూర్ వెళ్ళిపోయింది - రేపు ఆ గది తాళం తీసి మేము వాడుకుంటాం.
శారద కాళ్ళకింద భూమి కదిలిపోయింది. ఎందుకు అన్ని అబద్దాలు చెప్పారు తనతో నీరజ, దినేష్ - కాదు, దీప్తి, రాజు ఏది సత్యం ఏద సత్యం - ఓ మహాత్మా - శారద కళ్ళనిండా నీళ్ళు గబగబా బయటకొచ్చేసింది. గుండెబరువుగా వుంది. ఇది నిజమేనా - ఏ కారణం చేతనైనా వెళ్ళినా, ఎక్కడ నుంచయినా తనకి ఫోను చేస్తారు - దినేష్ తనకి చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు తనని మోసం చేయడు - వాళ్ళ నిజం పేర్లు నీరజ, దినేష్ - వీళ్ళకి దీప్తి, రాజు అని ఎందుకు చెప్పారో. వీళ్ళెలాంటి వాళ్ళో - వీళ్ళ బిజినెస్ లు ఎలాంటివో వీళ్ళ మాటల్లో నిజం లేదు - శారద వీళ్ళ మాటలు పూర్తిగా నమ్మలేదు - బహుశా వీళ్ళు ఆ నీరజ తండ్రిని ఏదో మోసం చేసి ఈ ఇల్లు కొట్టేసి వుంటారు. లేకపోతే నీరజ ఇల్లు అని ఇన్నాళ్ళు అనుకుని ఇవాళ ఇదేమిటి వీళ్ళే దొంగలు, మోసగాళ్ళు. నీరజ దినేష్ లను ఏం చేశారో. తప్పకుండా తను ఇవాళ కాకపోతే రేపయినా నిజం తెలుసుకోగలదు - దినేష్ ఎలాగైనా తనని కలుసుకుంటాడు - ఈ ఇంట్లో వాళ్ళ విషయమే కనిపెట్టాలి తను!! - వీళ్ళంతా ఏదోదాస్తున్నారు - ఏదో కుట్రచేస్తున్నారు - ఇది నిజం, ఇదే నిజం, దినేష్ వీళ్ళలాటి అల్పుడు కాదు - వీళ్ళ ఇల్లు తన ఇల్లని చెప్పుకోడానికి - వీళ్ళింట్లో వాళ్ళు అద్దెకున్నారా, వీళ్ళమోసాలు బయటపడవా - దినేష్ బయటపడతాడు - శారదకి ఆ ఇంట్లో వున్న ముసలమ్మ మీద, ఆ అబ్బాయి కోడలు మీద, ఆఖరికి ఆ పధ్నాలుగేళ్ళ పిల్లమీదకూడా ఒళ్ళుమండిపోయింది. తను వీళ్ళమీద పోలీస్ రిపోర్టు యిస్తే -ఏమవుతుందీ - వీళ్ళు ఈ ఇంట్లో వుండే నీరజ దినేష్ అనే వాళ్ళని కిడ్ నాప్ చేసారని, వాళ్ళను వీళ్ళబారినుంచి విడిపించమనీ - ఏం, తను పోలీసు రిపోర్టు యివ్వలేదా వీళ్ళమీద ! - శారద చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
