Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 34

   
    "నువ్వు మా ఇంటికే వచ్చెయ్యి. ఇటునుండే వెడదాం!" అంది ప్రతిమ.

    సాయంత్రం అయిదింటి నుండే అతడికోసం ఎదురుచూస్తూ కూర్చొంది. ఆరింటికి అరుణ్ వచ్చాడు. అతనొక్కడే రాలేదు. వెంట సంధ్య కూడా ఉంది. ప్రతిమ మనసులో ఈర్ష్య తేలుకొండిలా లేచింది. 'పట్టపురాణిలా వెంటబెట్టుకు తిరుగుతాడేమిటి?' అనుకొంది చిరాకుగా.

    "ఇంట్లోకి వచ్చి కాస్త టీ తీసుకువెళ్ళొచ్చు. దిగరాదూ?"

    "టైం లేదు. ఆలస్యమైపోతుంది." అన్నాడు కారు దిగకుండానే.

    వెడుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చి కారెక్కింది ప్రతిమ.

                        *        *        *
   
    "అమ్మగారూ, శ్రీపతిగారు వచ్చారమ్మా!" నౌకరు వచ్చి చెప్పాడు.

    జానకమ్మ కొంగు భుజాలనిండా కప్పుకొని హాల్లోకి వచ్చింది. "బాగున్నారా, అన్నయ్యా?"

    "ఆఁ, ఆఁ, నీ ఒంట్లో ఎలా ఉందమ్మా?"

    "ఆ మధ్య వారం పదిరోజులు గుండెలో నొప్పితో పక్క దిగలేదు. ఇప్పుడు కొంచెం నయం అనుకోండి."

    "అరుణ్ ఈమధ్య ఏదో అడ్వంచర్ చేసి ఓ అందమైన పిల్లను పట్టుకు వచ్చాడట. ఆ కధేమిటో నీ ముఖతః విందామని వచ్చానమ్మా."

    "కధేం లేదు, అన్నయ్యా! పదహారేళ్ల క్రితం మేం రాజానగరం అనే ఊళ్లో ఉండేవాళ్ళం కదా? మా మామగారు ఆగ్రహించడం, మేము అజ్ఞాతవాసం చేయడం మీకు తెలియని సంగతి కాదుకదా? అక్కడ రుక్మిణి అనే ఆమె నాకు మంచి స్నేహితురాలుండేది. అక్కడికి మేం ఎన్నిసార్లు వెడదామనుకొన్నా ఏదో ఒక అవాంతరం వచ్చేది. మొన్న ఏ అవాంతరం లేకుండా నేనూ, అరుణ్ వెడితే....." జరిగిన సంఘటన వివరించింది. అయితే సంధ్యని అరుణ్ తీసుకువచ్చినట్టుగా కాక, స్నేహితురాలి కూతురన్న అభిమానంతో తనే తీసుకువచ్చినట్టుగా చెప్పింది.

    "తీసుకురావడం వరకు బాగానే ఉంది. ఇకముందేం చేయాలని ఆ పిల్లను?"

    "ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళిచేసేస్తే సరిపోతుంది. మీ ఎరికలో ఏదైనా సంబంధముంటే చెప్పండి."

    "అన్నీ ఉన్నవాళ్ళకే సంబంధాలు కరువైన ఈ రోజుల్లో అనాధలకు సంబంధాలెక్కడ దొరుకుతాయమ్మా?"

    "గంతకు తగిన బొంత అన్నారు కదా?"

    "అలా ఏదో ఒకటి చేస్తే మంచిది. ఆ అమ్మాయిని అరుణ్ వెంటేసుకు త్రిప్పడం నలుగురూ చూడడానికి బాగాలేదు మనసులో వేరే ఉద్దేశాలు లేకపోవచ్చు. కాని, పెళ్ళికాని పిల్లవాడు, పెళ్లి కావలసిన పిల్ల ఒకటిగా తిరిగితే చూసేవారికి స్ఫురించే భావం ఒకటేకదా? పనిగట్టుకొని ఇంతదూరం వచ్చి ఎందుకు చెబుతున్నానంటే పిల్లనివ్వబోతున్నవాడిని కాబట్టి నాకీ శ్రమ తప్పదు."

    "అలాంటిదేం లేదు, అన్నయ్యా! చిన్నప్పుడు వాళ్లిద్దరూ ఒకచోట ఆడుకొన్న చనువు తప్ప ఇంకేం లేదు."

    "చిన్ననాటి స్నేహాలు పెద్దయ్యాక ప్రణయాలుగా మారడం మనం ఎన్నికథలు వినలేదు?"

    "ఛ! అరుణ్ అలాంటివాడు కాదు. ప్రతిమ మీద వాడికున్న ప్రేమను మరీ అంత తక్కువగా అంచనా వేయకూడదు"

    "మా మగాళ్ళ హృదయాలు పుష్పకవిమానాలు, అక్కగారూ!" ముసిముసిగా నవ్వుతూ లేచాడు శ్రీపతిరావు. "త్వరలో ముహూర్తాలు పెట్టుకోబోతున్నాం! ఈలోగా ఏ అపశ్రుతీ పలక్కుండా చూడు! సాధ్యమైనంత త్వరగా ఆమె సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది." అని వెళ్ళిపోయాడు.

    'ఈలోగా ఏ అపశ్రుతి పలక్కుండా చూడు.'

    నిజంగా సంధ్య తమ మధ్యకు ఒక అపశ్రుతి ప్రవేశించినట్టుగానే అనిపిస్తూంది జానకమ్మకు. సంధ్య కారణంగా శ్రీపతితో సంబంధం చెడితే మళ్లీ అలాంటి సంబంధం తలక్రిందులు తపస్సు చేసినా తమకిరాదు. శ్రీపతి కోటీశ్వరుడు! ప్రతిమ అతడికి ఒక్కగానొక్క కూతురు. ప్రతిమని అరుణ్ కివ్వాలని చాలా రోజుల క్రిందటే అనుకొన్నారు. కాబోయే అల్లుడన్న ఇదితో చాలా కంపెనీల్లో అరుణ్ కి షేర్లిచ్చాడు శ్రీపతి. బిజినెస్ లో మెళుకువలు శ్రీపతినుండే నేర్చుకొన్నాడు అరుణ్. అదలా ఉంచి, తన మామగారుపోయిన సమయంలో బిజినెస్ అంతా దివాళాతీసే ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ శ్రీపతి ఎంతో సాయం చేశాడు. ఆ రోజు అతడి సాయమే లేకపోతే తాము ఇవాళ ఈ స్థితిలో ఉండేవాళ్ళుకాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS