Previous Page Next Page 
చదువు పేజి 34

   

   ఆ తరువాత తాను వచ్చినపని కూడా చెప్పాడు. ఇంకో వారంరోజుల్లో తానూ, మరికొందరూ చేరి జాతీయ విద్యాలయం నెలకొల్పుతున్నారు. వాళ్ళ ఊళ్ళో. దానికి సీతమ్మ గారూ, పిల్లలూ రావాలి.

    సీతమ్మగారు ముక్కుమీద వేలేసుకుంది. తన అన్న తన జీవితంలో ఎంత పెద్దమార్పు తెచ్చిపెట్టుకుంటున్నాడో ఆవిడకి కొంచెంకొంచెంగా అర్ధంకాసాగింది. ఈ పరిణామం ఎక్కడికి దారితీసేది ఆమె ఊహించులేకపోయింది. శేషగిరి ఇల్లు దర్జాగా ఉద్యోగస్తుడి ఇల్లల్లే ఉండేది. ఆ కళ ఇకముందుంటుందా? ఎట్లా ఉంటుంది? ఎవరో శపించినట్టుగా ఆయన ఎందుకీ పనులు చేస్తున్నాడు.

    డిసెంబరు శలవలు గనుక సుందరం చదువు చెడుతుందన్న భయంలేదు. సీతమ్మగారూ, సుందరం వాడి చెల్లెలు జానికీ కలసి శేషగిరి వెంట వెళ్ళారు.

    సీతమ్మ పుట్టింటివారి గ్రామం చాలాచిన్నది. అంతా చేరి రెండొందల గడప. పెద్దకాలవకిందనేఉన్నది. గనక ఊరుచుట్టూ సుక్షేత్రమైన మాగాణీభూములు . ఊరికి నాలుగుమిద్దెలున్నాయి. మిగిలినవాటిలో సగం పెంకుటిళ్ళూ , సగం పూరిళ్ళూనూ. ఊరికి తగ్గట్టు పశుసంపదకూడా ఉన్నది. సుభిక్షమైన గ్రామాల్లో ఇదొకటి. అయినప్పటికీ ఈ ఊరి కింతవరకు ఒక ఆసుపత్రిగాని, బడిగాని, లైబ్రరీగాని లేదు. ఇటీవలనే ఊరికి దినపత్రిక రావటం నలుగురూ జేరి పత్రికాపఠనం చెయ్యటం ప్రారంభమైంది.
 
    సీతమ్మ పెత్తండ్రిగారు ఏనాడో ఒక సత్రం కట్టించాడు. కాని ఆ వూళ్ళో సత్రం ఆటే ఉపయోగకరమైనదిగాదు. రహదారి వూరికి అయిదారు ఫర్లాంగులదూరంలోఉంది. దానినుంచి వూళ్ళోకి ఒక కంకరరోడ్డు వూళ్ళోవాళ్ళే వేసుకున్నారు. అది వూళ్ళోవాళ్ళకూ వారిని వచ్చిచూసేవాళ్ళకూ మాత్రమే, ఉపయోగపడుతుంది. అందువల్ల సత్రానికి తాకిడేమీలేదు_ ఎప్పుడన్నా పెళ్ళి విడిదిగా ఉపయోగపడటం తప్పిస్తే.

    వూరిమధ్య చెరువు గట్టువున్న ఈ సత్రంలో శేషగిరీ, వూళ్ళోగల ఇతర విద్యావంతులూ, ధనవంతులైన  ఆసాములూ  చేరి ఒక లైబ్రరీ, జాతీయ విద్యాలయమూ పెట్టాలని నిర్ణయించారు. ప్రేరేపణ శేషగిరిదే, దీనికి వూళ్ళోవున్న భజనమందిరం వాళ్ళు అభ్యంతరం చెప్పారు, (వాళ్ళు ప్రతీ శనివరమూ అక్కడ భజనచేస్తూ ఉంటారు.) అయితే వాళ్ళ అభ్యంతరాలను పెద్దవాళ్ళు సాగనివ్వలేదు. భజనల మీద పెద్దవాళ్ళకు విశ్వాసం పోయింది. మామూలు మనుష్యులకు ఇంకా పోలేదు. గనుక శనివారం భజనసత్రం లైబ్రరీలోనే జరగవచ్చునన్నారు.
 
    శేషగిరికిప్పుడు వూళ్ళో మిద్దెతప్ప చెప్పుకునే సంపద ఆటే లేక పోయినప్పటికీ మూడుతరాలుగా వస్తున్న పెద్దరికానికి మాత్రం ఏ లోపమూలేదు. అదివరకల్లా ఆయన ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకుంటుంటే పరాయివాణ్ణిగా  భావించిన  గ్రామస్తులు తిరిగి ఆయన గ్రామములో కాపురంపెట్టగానే ఆప్తుణ్ణిగా స్వీకరించారు. శేషగిరి తమ గ్రామాన్ని ఎంతోపైకి తీసుకురానున్నాడని కూడా వాళ్ళు అర్ధం చేసుకున్నారు.

    శేషగిరికి తోడుగా వకీలు సీతారామయ్యకూడా ఉన్నాడు. జాతీయ విద్యాస్థాపనకూ, లైబ్రరీకీ ఆయనకూడా అయిదువందలిచ్చాడు. సీతారామయ్యా ఈ గ్రామంవాడే. కాని ఆయన బస్తీలో ప్లీడరు వృత్తిలో పాతుకు పోయినవాడు. శేషగిరితో  కలసి ఈ పనిచేస్తున్న మిగిలిన నలుగురైదుగురూ గ్రామంలోని మోతుబర్లు. వాళ్ళు విద్యావంతులుకారు. శేషగిరి చెప్పినమాట శిరసా వహించేవారే. అందుచేత ఈ ఉద్యమంలో శేషగిరి గ్రామానికి ఏకైకనాయకుడై పోయినాడు.
   
                                     *    *    *    *   

    సుందరం ఈ గ్రామానికి వెనుక ఒక్కసారే వచ్చాడు. అదికూడా చాలా చిన్నతనంలో. అయినా వూరు కళ్ళకు కట్టినట్టే ఉంది. దీనికి కారణం ఇన్ని ఏళ్ళలోనూ గ్రామంలో ఆవగింజంతైనా మార్పులేకపోవటమే.
 
    శేషగిరి భార్య కామేశ్వరి జానికినిచూసి ముందు గుర్తుపట్టలేదు. తరువాత ఆశ్చర్యపోయి "ఓసీ, ఎంతపెద్దదానివైనావే?" అన్నది. సుందరం కృష్ణవేణిని గుర్తించలేదు. తల్లి జ్ఞాపకం చేసిన తరువాత దాన్ని పలకరించటానికి కాస్సేపు బిడియపడ్డాడు.
 
    "ఏం రా, నీ పెళ్ళాన్ని చూసుకున్నావా?" అన్నది కామేశ్వరత్తయ్య.

    "ఛాఁ!" అన్నాడు సుందరం.

    ఆ సమయంలో వాడికొకమాట జ్ఞాపకం వచ్చింది. తన క్లాసులో తన ఈడువాడే, పన్నెండో ఏడు జరుగుతున్నవాడు. ఒకడున్నాడు. వాడికప్పుడే పెళ్ళయి ఏడాది అయింది. పెళ్ళానికి తొమ్మిదోఏడు! వాణ్ణిచూస్తే సుందరానికి ఏమిటో దిగులుగా ఉండేది.

    సరుసుమాత్రం పది నిమిషాలసేపు బెట్టుగాఉండి చివరకు తనంతట తనే జానికితో స్నేహంచేసుకుని దాన్ని అవతలింటోకి తీసుకుపోయి తనకు రాటంమీద నూలువడకడం ఎంత బాగా చాతవునో చూపించసాగాడు. జానకి కెవ్వున ఏడిచే దాకా ఈ సంగతి ఎవరూ గమనించలేదు. తిరిగే కదురు మొనమీద జానకి వేలుపెట్టింది. జానకి ఏడుస్తుంటే సరుసు బిక్కమొహం వేశాడు.
 
    పిల్లలిద్దరి చదువూ మానిపించారు గదా!" అన్నది కామేశ్వరి. "సరుసు ఇంకా రెండేళ్ళకల్లా స్కూలు ఫైనలు పేసు కావలసినవాడు ఇదేమిటండీ  అంటే, 'స్వరాజ్యం వచ్చినాక ఈ చదువువెందుకే?" అంటారు. ఆడపిల్ల చదివేమిటి? ఈ  స్వరాజ్యం వచ్చేదెప్పుడో, వాడు కొత్తచదువు నేర్చుకునే దెప్పుడో?  ప్రస్తుతం ఈ గంతలు మొయ్యలేక ఛస్తున్నాం, నేనూ పిల్లలూనూ."

    "ఈ పెట్టే బళ్ళో వాడికి చదువుండదా ఏం?" అన్నది సీతమ్మగారు.

    "నయం! ఇప్పుడు మూడు క్లాసులు పెడుతున్నారు, మేష్టర్లు కావద్దా, అదీగాక ఈ కొత్తచదువు పెద్ద క్లాసులదాకా రావద్దా?  యీ స్వరాజ్యం బళ్ళలోచెప్పే చదువు వేరుగా మరీ!"

    సీతమ్మగారికి "స్వరాజ్యం చదువు" అంతు చిక్కలేదు. నిజాని కావిడకు హైస్కూలు చదువుగురించికూడా తెలీదు. కాని దాన్నిగురించి తెలీకుండానే దానియందావిడకు విశ్వాసం ఉన్నది. ఆ చదువు చదివి తన కొడుకు పరీక్షలు పాసయినట్టూ, డిగ్రీలు పొందినట్టూ, చదువుకున్న వాడుగా అందరిచేతా గుర్తించ బడినట్టూ, పెద్ద ఉద్యోగాలు సంపాదించినట్టూ సీతమ్మగారు వూహించుకోగలిగింది. కాని ఈ స్వరాజ్యం చదువుమాట? దాన్ని గురించి శేషగిరి చాలా చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS