Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 34

    భార్గవ మాట్లాడుతూ పదేపదే చూస్తున్నాడు!

    ఆ చూపుల్లో ఏమిటది??

    నిఖిల్ అంచనా వేయలేకపోతున్నాడు__

    ఆ చూపులు...వాటిల్లో కనిపిస్తున్నది....

    ఆర్ద్రత కాదు....

    ఆప్యాయత కాదు....

    ఆతృత కాదు....

    ఆవేశం కాదు....

    ఆవేదన కాదు....

    అనురాగం కాదు...

    అమాయకత్వం కానే కాదు...

    ఏమిటి? మరేమిటది?? ఆ....క....లి...

    అవును! అతని చూపుల్లో ఏదో తెలీని ఆకలి! అదే కనిపిస్తోంది నిఖిల్ కు. పంజా విప్పే ముందు కరినాగు కోరల్లో కనిపించే ఆకలి!!!!

    అతడు చెపుతున్న దానికి నిర్లిప్త గలగలా నవ్వుతోంది. భార్గవ నవ్విస్తున్నాడు. మౌనంగా వున్న సముద్రాన్నై చూడాలనిపిస్తుంది. క్షాళనమై పోయిన ఏరు గలగలా సంగీతాన్ని విన్పించినా వినాలనిపించదు. నిఖిల్ కు అదే కలిగింది. ఆమె ఆ కళ్ళలోని ఆకలిని గుర్తించలేదా? చాలామంది ఆడవాళ్ళు రైటర్ల ట్రికి ట్రాప్ కి ఇట్టే ఆకర్షింపబడతారు.

    అతని మెదడు పొరల్లో ఏదో తొలచినట్టయింది...అది అనుమానం తాలూకు భయంకరమైన పురుగని గ్రహించ లేకపోయాడు. నిర్లిప్త నవ్వులు....భార్గవ చూపులు....

    నిఖిల్ గబుక్కున తలుపు త్రోసుకొని వచ్చాడు. వాళ్ళేం ఆశ్చర్యపోలేదు...అదే అతనిలో కలిగించిన బాధ....మామూలుగానే నిఖిల్ ని విష్ చేసి....కొద్దిసేపయిన తర్వాత వెళ్ళిపోయాడు భార్గవ. నిఖిల్ సూటిగా నిర్లిప్త కళ్ళలోకి చూశాడు. అయినా ఆమె కళ్ళలో ఎలాంటి__

    ఉబలాటం లేదు....

    ఉత్సుకత లేదు....

    ఉద్వేగం లేదు...

    ఉద్రేకం లేదు....

    ఉద్విగ్నత లేదు....

    ఆమె కళ్ళలో కనిపిస్తుందొక్కటే....ఊరట!!

    అలసొచ్చిన హృదయానికి అనురాగం పంచే ఊరట!!

    గుండెల్లోంచి ఊటలా ఉబికి వచ్చిన ఊరటను సేదదీర్చడానికి దాచివుంచి నట్లు....నైర్మల్యత నిండిన విశాలమైన కళ్ళు. ఆ కళ్ళే ఆలోచనలకు కళ్ళెం వేసేయి.

    చెదలు పురుగు మొదట తాటిచెట్టు పాదాలకు నమస్కరించినా తర్వాత్తర్వాత ప్రాకి ప్రాకి తాటిచెట్టు తలపైన గూడు కడ్తుంది. అనుమానం కూడా అలాంటిదే. అతడు అప్పటికది మర్చిపోయాడు.

    "ఆ చూపుల్లోని దాహమంతా మరో గంటలో తీర్చుకుంధువుగాని, ముందు అన్నం తిందురుగాని రండి" కవ్విస్తూ కదిలింది నిర్లిప్త.

    __అతడికి వడ్డిస్తూ...

    "ఏమండీ! నేనో ప్రశ్న వేస్తున్నాను" అంది కళ్ళతోనే నవ్వుతూ.

    "అడుగు. జవాబు ఠక్కున చెప్పేస్తా" అన్నాడు నిఖిల్.

    "నిప్పు లేకుండా వచ్చే పొగేమిటి?"

    అనుకోకుండా వచ్చిన ఆ ప్రశ్నకు అతడు ఖంగుతిన్నాడు. నిమిషం తర్వాత తన తడబాటును తమాయించుకుని... "నిప్పు లేకుండా అసలు పొగనేదే వుండదు" అన్నాడు నిర్లిప్త వైపు చూస్తూ. కాని ఆమె చూపుల్లో కన్పిస్తున్న ఏదో నైర్మల్యత. అది చూడలేక సిగ్గుతో తల వంచి అన్నం కెలుకుతున్నాడు.

    "ఉంటుంది. మీకసలు జవాబు రాదు." అంది అతని తలను ప్రేమగా నిమురుతూ.

    నిఖిల్ మౌనంగా వుండిపోయాడు.

    "చెప్పమంటారా?" అంది__

    "చెప్పు. నిప్పు లేకుండా వచ్చే పొగకు...అనుమానం అన్న జవాబు కావచ్చు" అన్నాడు నిఖిల్ తలెత్తకుండానే.

    "కాదు. కానేకాదు. నిప్పులేకుండా వచ్చే పొగ....మంచు పొగ!!" గలగలా నవ్వింది నిర్లిప్త.
    ఆమె ఆ ప్రశ్న ఆ సమయంలో అడగాలని అడిగిందో, వూరికే అడిగిందో అర్ధం కాలేదు. కాని తన ఆలోచనలకు తానే సిగ్గుపడ్డాడు నిఖిల్.


   
                            *    *    *    *    *


    మర్నాడు....

    "అమ్మగోరూ! మిమ్మల్ని సుగాత్రమ్మగోరు బేగిరం పిల్చుకు రమ్మన్నారు. అయ్యగారు బెంగుళూర్ ఎల్లిపోయిండంట. రేపటికి గాని రారేమో? పరమ బోరుగా వుందని మిమ్మల్ని రమ్మంటున్నారు" అని రంగి వచ్చి చెప్పగానే, నిర్లిప్త ఇంట్లో అన్నీ సర్ది నిఖిల్ కు చెప్పి వెళ్ళింది.

    నిర్లిప్త వెళ్ళేసరికి సుగాత్రి వరండాలోనే కూచునుంది. చేతిలో ఓ మాస పత్రిక. ఆమె కళ్ళ కింద నల్లచారలు. గుండెల్లోని వేదనకు గుర్తుగా రోజురోజుకూ స్పష్టమవుతున్నాయి. నిర్లిప్తకు తెలుసు. ఆమెలోనూ, తనలోనూ ఒకటే బాధ!!

    మృదువుగా నవ్వింది సుగాత్రి. నా నవ్వులోని బాధను నువ్వే అర్ధం చేసుకోగలవ్ అన్నట్టుగా.

    నిర్లిప్త ప్రతిస్పందనగా నవ్వుతూ వచ్చి "చెస్ ఆడదామంటారా" అంటూ మరో కుర్చీలో కూచుంది.

    "వద్దులే...ఏదయినా చెప్పు" అంది మూడీగా.

    "ఏం చెప్పమంటారు?"

    "అన్నట్టు...ఈసారి ఈ మాస పత్రికలో 'తూర్పు పడమర ఎదురెదురు' సీరియల్ చదివారా? ఫెంటాస్టిక్ గా వుంది. కాకపోతే మరో సంచలనంగా ఆ రైటర్ కు ఓ విచిత్రమయిన హెచ్చరిక వచ్చిందట. ఈ సంచికలో వేస్తారు" అంది సుగాత్రి పత్రికను చూపిస్తూ.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS