Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 35

    వెంటనే దేవుడి పటాలవైపు తిరిగి "స్వామి....ఈయనకి ఇంత మంచి ఆలోచన కలిగినందుకు నీకు ఆయన ఎడమకంటి గుడ్డు...."

    శ్రీలక్ష్మి ఇంకా ఏదో అనబోతుండగా ఆమె నోరు నొక్కేశాడు  కమీషనర్ లింగారావ్.


                                                                *    *    *    *


    "హిహిహి...." అన్నాడు రాంబాబు.

    "హ్హహ్హహ్హ...."అన్నాడు చిన్నారావ్.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వాళ్ళవంక అనుమానంగా చూశాడు.

    "ఏరా?....ఎందుకురా నవ్వుతున్నారు?" అడిగాడు.

    "నవ్వా?....ఛ ఛ....మేం నవ్వడం లేదు సార్....ఏంటో....పిచ్చి పిచ్చి సౌండ్స్ అన్నీ మా నోట అలా ఆటోమేటిగ్గా వచ్చేస్తున్నాయ్ సార్. హిహిహి...." అన్నాడు రాంబాబు.

    "ఒరే....నాకు తెల్సురా....మీరు నన్నుచూసేనవ్వుకున్నారు.... ఇన్నాళ్ళు మీ ఇద్దరికీ చేతినిండా పనిలేక బాగా ఎక్కిందిరా. మీరు వెంటనే మా యింటికిరండి....అక్కడ మా ఆవిడ బండెడు బట్టలు ననేసింది. అవన్ని ఉతికితే అప్పుడు కాస్త దిగుతుంది...." అన్నాడు అప్పారావ్.

    ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ తీసి కోపంగా "భౌ...." అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "హలో....అది పోలీస్ స్టేషన్ కాదా? పశువుల ఆస్పత్రా?" అవతలి నుండి కమీషనర్ లింగారావ్ గొంతు ప్రశ్నించింది.

    "ఓ గుడ్....ఆఫ్టర్ నూన్ సార్....నేనే సార్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని మాట్లాడుతున్నా" అన్నాడు అప్పారావ్ సెల్యూట్ చేస్తూ.

    "మరేంటి కుక్క మొరుగుడు వినిపించింది?"

    "సారీ సార్....ఏదో క్రాస్ టాక్ ఏమో సార్!"

    "క్రాస్ టాక్ అయితే నువ్వు సారీ చెప్పడం ఎందుకోయ్....సరే గానీ రాంబాబునీ, చిన్నారావ్ ని తీస్కుని మా యింటికి వెంటనే రా....నీతో అర్జంట్ విషయం మాట్లాడాలి!" అంటూ కమీషనర్ లింగారావ్ ఫోన్ పెట్టేశాడు.

    అప్పారావ్ విషయం రాంబాబు, చిన్నారావ్ లకి చెప్పాడు.

    "మరి మీ యింటి దగ్గర బట్టల విషయం ఏం చేద్దాం సార్?...." నవ్వుతూ అడిగాడు రాంబాబు.

    "అవి నేను ఉతుక్కుచస్తాన్లే!...." కసిగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.


                               *    *    *    *


    పోలీస్ కమీషనర్ లింగారావ్ ఇల్లు....

    లింగారావ్,,శ్రీలక్ష్మి, సోఫాలో కూర్చుని టీవీలో ఏదో సీరియల్ చూస్తున్నారు. ఇద్దరి కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీళ్ళు కారుతున్నాయ్.

    లింగారావ్ బాధగా తల పట్టుకున్నాడు.

    "ఇంక ఏడవడం నావల్లకాదు....దయచేసి ఆ కామెడీ సీరియల్ కట్టెయ్" అన్నాడు.

    శ్రీలక్ష్మి రిమోట్ బటన్ ప్రెస్ చేసి టీవీ ఆఫ్ చేసింది.

    "పోనీ టీవీలో ఎప్పుడూ మంచి సీరియల్స్ రావాలని ఆ వెంకటేశ్వరస్వామికి మొక్కుకోనా?" భర్తని అడిగింది శ్రీలక్ష్మి.

    "ఏం?....ఆ సాకుతో నా చెయ్యో, కాలో స్వామికి సమర్పించుకుందామనా??" పళ్ళునూర్తూ అడిగాడు లింగారావ్.

    ఇంతలో డోర్ బెల్ మోగింది.

    "రాంబాబు, చిన్నారావ్ లే వచ్చుంటారు....!" అన్నాడు కమీషనర్ లింగారావ్.

    "ఏవండీ....పోనీ నేను మొక్కుకుంటానంటే మీకు అభ్యంతరంగా వుంది కాబట్టి పాపక్షేమం గురించి రాంబాబు చెయ్యి, చిన్నారావ్ కాలు మొక్కేస్కోనా?" అడిగింది శ్రీలక్ష్మి.

    ఆ మాట వినగానే లింగారావ్ కి మెంటలెక్కిపోయింది. అతను నెత్తిమీద ఠపా ఠపా ఠపా....మొట్టేస్కోసాగాడు.

    శ్రీలక్ష్మి కంగారుగా అతని రెండు చేతులు పట్టి ఆపింది.

    "పోన్లెండి....మీకిష్టం లేకపోతే వద్దులెండి....అనవసరంగా బుర్రకాయ్ మీద అంత గట్టిగా మొట్టేస్కుని దాన్ని బద్దలు చేస్కోకండి. రేపు మీ బుర్రకాయ్ ని సమర్పించుకుంటా అని నేను మొక్కాలంటే అవి పని కొచ్చే కండిషన్ లో వుండాలికదా?!"

    ఆ మాటలకి కమీషనర్ లింగారావ్ కుమిలిపోయాడు.

    "ఓ భూమాత....నువ్వు నా కాళ్ళక్రింద చీలిపోయి నన్ను నీలో ఎందుకు కలిపేస్కోవు?" అన్నాడు బాధగా.

    శ్రేలక్ష్మి సోఫాలోంచి గబుక్కున లేచి దూరంగా గెంతి, అక్కడ నిలబడి "మీరు నేను మీ ప్రక్కనుండగా అలాంటి కోరికలు కోరితే ఎలా?" అంది చికాకుగా చూస్తూ.

    కమీషనర్ లింగారావ్ మళ్ళీ ఇరిటేట్ అవుతూ బుర్రకాయ మీద మొట్టేస్కోబోయాడు. కానీ మరోసారి డోర్ బెల్ మోగింది.

    వెంటనే మోహంలో ఫీలింగ్స్ అన్నీ మామూలుగా చేసేస్కుని లేచెళ్ళి  వీధి తలుపులు తీశాడు. అతను ఊహించిన విధంగానే రాంబాబు, చిన్నారావ్ లు వచ్చారు. వారితోబాటు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కూడా వున్నాడు.

    కమీషనర్ లింగారావ్ ని చూడగానే ముగ్గురూ సెల్యూట్ చేశారు.

    "రండి....రండి...." అంటూ ముగ్గుర్నీ లోపలికి ఆహ్వానించాడు లింగారావ్.

    అందరూ హాల్లోకి వచ్చారు. శ్రీలక్ష్మికి రాంబాబు, చిన్నారావ్ లని పరిచయం చేశాడు కమీషనర్ లింగారావ్. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఎలాగూ ఎప్పుడూ కమీషనర్ లింగారావ్ ఇంటికి డ్యూటీమీద వస్తుంటాడు కాబట్టి అతను శ్రీలక్ష్మికి తెలుసు.  
    "కూర్చోండి...." అన్నాడు లింగారావ్ తను శ్రీలక్ష్మి పక్కన కూర్చుంటూ.

    "పర్వాలేదు సార్...." అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "నేను కూర్చోమన్నది నిన్ను కాదు....వాళ్ళని!" అప్పారావ్ తో అని "కూర్చోండి!" అన్నాడు లింగారావ్ రాంబాబు, చిన్నారావ్ లతో ఆజ్ఞాపిస్తున్న విధంగా.

    ఇద్దరూ కూర్చున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS