Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 36

    "మా పాప ప్రాణాలు కాపాడారు....మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబు...." అంది శ్రీలక్ష్మి.

    "అయ్యో....అంత మాటలెందుకు మేడం....అది మా డ్యూటీ" అన్నాడు రాంబాబు సిగ్గుపడ్తూ.

    "మీరు మాట్లాడ్తుండండి....నేను కాఫీ చేసుకువస్తా" అంది శ్రీలక్ష్మి లోపలికి వెళుతూ.

    "నువ్వేంటి చాలా రోజులు లీవ్ లో వున్నావు....?" ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని అడిగాడు లింగారావ్.

    "అంటే ముందు మామూలు జ్వరం వచ్చి, అది మలేరియాగా మారి చివరికి టైఫాయిడ్ లోకి దించింది సార్!" అన్నాడు అప్పారావ్.

    "ఓహ్....!" అన్నాడు లింగారావ్.

    కమీషనర్ కి నిజం చెప్పారో....చంపుతా అన్న విధంగా ఓ లుక్కేశాడు రాంబాబు, చిన్నారావ్ ల వంక అప్పారావ్.

    "నువ్వు వంట గదిలోకెళ్ళి అమ్మగార్కి సాయం చెయ్" అన్నాడు లింగారావ్ అప్పారావ్ తో.

    అప్పారావ్ లోపలికెళ్ళాడు.

    కమీషనర్ రాంబాబు, చిన్నారావ్ లని చూస్తూ "మా పాప దీప విషయం మాట్లాడాలని మిమ్మల్నిప్పుడు యిక్కడికి పిలిపించా...." అన్నాడు.

    "చెప్పండి సార్....!" అన్నారు రాంబాబు, చిన్నారావ్ లిద్దరూ కోరస్ గా.

    సరిగ్గా ఆ సమయంలోనే దీప బయటినుండి ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చి "డాడీ...." అంటూ కమీషనర్ లింగారావ్ ఒళ్ళోకి ఎగిరి గంతేసి కూర్చుని అతని మెడచుట్టూ చేతులు వేసింది.

    లింగారావ్ పాప బుగ్గలమీద ముద్దులు పెట్టి "ఎక్కడికెళ్ళావు చిట్టితల్లీ?" అని అడిగాడు.

    "బోరుకొట్టి పక్కింటికెళ్ళా డాడీ....అక్కడ చక్కగా ఇల్లంతా పరుగులుతీస్తూ, సోఫా ఎక్కి దూకుతూ కాస్సేపు ఆడుకున్నా....అప్పుడు ఆంటీ ఏమో నాకు తల్నొప్పిగా వుంది....ఇంక మీ ఇంటికెళ్ళి ఆడుకోమ్మా అని పంపించేసింది...." అంది దీప కళ్ళుతిప్పుతూ.

    "రేపట్నుండి నీకేం బోరు కొట్టదులే....ఈ అంకుల్స్ ఉన్నారుగా...." అని రాంబాబు, చిన్నారావ్ లని చూపించాడు కమీషనర్ లింగారావ్.

    వాళ్ళని ఎగాదిగా చూసింది దీప.

    "అంకుల్స్ కి హలో చెప్పు" అన్నాడు కమీషనర్ లింగారావ్.

    "నేను చెప్పను పో...." అని లింగారావ్ ఒళ్లోంచి క్రిందికి దూకి లోపలికి పరుగుతీసింది దీప.

    "మా పాప చాలా చిలిపి" అన్నాడు లింగారావ్ నవ్వుతూ.

    "అవును....నేను కూడా అదే అనుకుంటున్నా సార్" అన్నాడు రాంబాబు.

    "నేను కూడా సార్" అన్నాడు చిన్నారావ్.

    శ్రీలక్ష్మి ట్రేతో కాఫీలు పట్టుకు వచ్చింది.

    "నువ్వు తెచ్చావేంటే....? అప్పారావ్ ఏడీ?" చికాకుగా అడిగాడు పనివాడు ఏడీ అని అడిగినట్టు.

    "దీప అతనితో గుర్రం ఆట ఆడుతుంది!" అని సమాధానం చెప్పి ముగ్గురికీ కాఫీలు అందించింది.

    అప్పుడే లోపలినుండి దీపని వీపుమీద  ఎక్కించుకుని, నేలమీద మొకాళ్ళతో దేకుతూ బైటికి వచ్చాడు అప్పారావ్. దీప చేతిలోని బెత్తంతో ఛల్ ఛల్ గుర్రం అంటూ అతని వీపుమీద  ఛెళ్ ఛెళ్ అని కొట్టసాగింది.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బాధతో మూలుగుతూ కమీషనర్ వంక చూసి ఇబ్బందిగా నవ్వాడు.

    "అంకుల్ ని కాఫీ తాగానివ్వు పాపా....తర్వాత కావాలంటే గుర్రం ఆట ఆడుదువుగాని" అన్నాడు రాంబాబు.

    దీప ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని వదిలిపెట్టేసింది.


                                         15


    ఆ రోజే రాంబాబు, చిన్నారావ్ లకి దీప డ్యూటీ మొదటిరోజు.

    ఇద్దరూ ఉదయం అయిదు గంటలకే కంగారుగా నిద్రలేచి గబగబా కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఏడుకల్లా రెడీ అయిపోయారు. ఇద్దరూ మోపెడ్ మీద కమీషనర్ లింగారావ్ ఇంటికి బయలుదేరారు.

    "కొంపదీసి మనతో కూడా దీప గుర్రం ఆటో, ఉయ్యాల ఆటో ఆడదు కదూ?" భయంగా అన్నాడు రాంబాబు.

    "ఆడ్తానంటే నోర్మూస్కుని ఆడించాల్సిందే! మరి ఆడ్తానంటుంది కమీషనర్ పాప కదా?" అన్నాడు రాంబాబు.

    "అయితే నేను గుర్రం ఆట ఆడిస్తా, నువ్వేమో ఉయ్యాల ఆటాడించు" అన్నాడు చిన్నారావ్.

    "నోర్మూస్కో....హెడ్ ని  నేనా నువ్వా? నేనేది చెప్తే అదే ఫైనల్....నేనే గుర్రం ఆటాడిస్తా....నువ్వు ఉయ్యాలాట ఆడించు...." అన్నాడు రాంబాబు.

    పది నిముషాల్లో వాళ్ళు కమీషనర్ లింగారావ్ యింటిని సమీపించారు.

    దీప అప్పటికే స్నానంచేసి, టిఫిన్ చేసి రెడీగా వుంది. స్కూల్ డ్రెస్ వేస్కోడానికి వాళ్ళమ్మని అటూ ఇటూ పరిగెత్తిస్తుంది.

    రాంబాబు, చిన్నారావ్ ని చూడగానే శ్రీలక్ష్మి సాదరంగా ఆహ్వానించింది.

    "చూడండి....దీనికి స్కూల్ డ్రెస్ లేద్దామంటే ఓ పట్టాన దొరకడం లేదు. దీన్ని పట్టుకోండి....నేను డ్రెస్ వేస్తా" అంది శ్రీలక్ష్మి.

    ఆ మాట వినీ వినగానే దీప ఒక్కసారిగా పెరట్లోకి పరుగులంఘించుకుంది. రాంబాబు, చిన్నారావ్ లు కూడా ఆ అమ్మాయి వెనకాల పరుగుతీశారు. దాదాపు ఓ పావుగంట సేపు పెరట్లోనూ, ఇంటి చుట్టూరా ఇద్దర్నీ పరుగులు తీయించి ఆ తర్వాత వారి చేతికి దొరికింది దీప.

    "ఈ టైపులో పాపని స్కూలుకి తీస్కెళ్ళాలంటే మనకి రోజూ మంచి ఎక్సర్ సైజే...." దీపని రెండు చేతుల్తో ఎత్తుకుని హాల్లోకి వస్తూ అన్నాడు రాంబాబు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS