ఇన్స్ పెక్టర్ అప్పారావ్ నెత్తిమీది క్యాప్ తీసి రెండు చేతుల్తో జుట్టు పీకేస్కుంటూ బాధగా అరిచాడు.
ఆ డాక్టర్ గాడి ఒళ్ళు పచ్చడి చేస్తా" అన్నాడు పళ్ళు నూరుతూ.
"ఆ పని మేడంగారు మీకు ఆపరేషన్ అయినరోజే చేశారు సార్" గుర్తు చేశాడు చిన్నారావ్.
"అవునవును....నేనైనా డిస్చార్జ్ అయ్యానుగానీ వాడింకా బెడ్ మీదే వున్నాడు. కానీ వాడు కోలుకుని మామూలుగా తిరిగేరోజున నా సర్వీస్ రివాల్వర్ తో వాడిని షూట్ చేస్తా."
"చాలాకాలంగా వాడనందుకు మీ సర్వీస్ రివాల్వర్ తుప్పు పట్టిందేమో కద్సార్?"
అమాయకంగా అడిగాడు రాంబాబు.
"అలాగా? ఆ తుప్పుపట్టిన రివాల్వర్ తో ముందు నిన్ను పేల్చి ఆ తర్వాత ఆ డాక్టర్ గాడిని పేలుస్తా. ఉండండి....ఇప్పుడేవచ్చి మీ పనిచెప్తా" అంటూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ సీట్లోంచి లేచి టాయిలెట్స్ లోకి వెళ్ళాడు.
రెండు నిముషాల తర్వాత టాయిలెట్స్ లోంచి భయంకరంగా ఏడుస్తూ బయటికి వచ్చాడు అప్పారావ్.
"ఏంటి సార్....ఏమైంది సార్....?" కంగారుగా అడిగాడు రాంబాబు.
"నాకు ఘోరమైన అన్యాయం జరిగిపోయిందిరా దేవుడో...." ఏడుస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
చిన్నారావ్ ఆలోచనగా మొహం పెట్టాడు.
"మీరు టాయిలెట్స్ లోకి వెళ్ళి....ఘోరమైన అన్యాయం జరిగిపోయిందని ఏడ్చుకుంటూ బయటికొచ్చారంటే నాకో భయంకరమైన అనుమానం వచ్చింది సార్....కిడ్నీతోబాటు కొంపదీసి వేరే పార్టులేవీ తీసెయ్యలేదుకదా?" అనడిగాడు చివరికి.
ఆ మాట వినగానే అప్పారావ్ ఏడుపాపి మండిపడ్డాడు.
"ఏం?....అలా చేస్తే మీ ఇద్దరూ ఆనందంతో కేరింతలు కొట్టుదామనా? నువ్వనుమానించేదేమీ కాదు!"
"మరి ఎందుకు సార్ అంతగా గోలెట్టేశారు?" అడిగాడు రాంబాబు.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కుమిలిపోతూ ఏడ్చాడు.
"చెప్పండి....మీ మనసులోని బాధేంటో చెప్తే సగంభారం తీరిపోతుంది."
ఏడుపాపి, క్షణం పాటు ఆ ఇద్దరివంకా సందేహంగా చూశాడు అప్పారావ్.
"మీరీ విషయం ఎవరికీ చెప్పరుకదా?"
చెప్పం అన్నట్టు ఇద్దరూ తలలు అడ్డంగా ఊగించారు.
"నేను పాస్ పోస్కుంటుంటే నా కుడికాలు తొంభై డిగ్రీల యాంగిల్ లో ఆటోమాటిక్ గా పైకి లేచింది!...." ఘోల్లుమన్నాడు అప్పారావ్.
అది విన్న రాంబాబు, చిన్నారావ్ లు నేలమీదపడి పొర్లి పొర్లి నవ్వారు.
14
పోలీస్ కమీషనర్ లింగారావ్ ముక్కుపుటాలకి అగరవత్తుల వాసన సోకింది.
అంతే....లింగారావ్ గుండె పీచు పీచుమంది.
అగరరొత్తుల వాసనొస్తుందంటే శ్రీలక్ష్మి పూజ చేస్తుందన్నమాట. శ్రీలక్ష్మి పూజ చేస్తుందంటే ఏదైనా కోరి మొక్కు తీరుస్తానని దణ్ణం పెట్టుకుని తన ప్రాణం మీదికితెస్తుందని కమీషనర్ లింగారావ్ భయం.
గణగణ....మంటూ పూజ గదిలోంచి గంట మోగడం లింగారావ్ కి వినిపించింది.
"బాబోయ్....ఇప్పుడు శ్రీలక్ష్మి ఏమైనా మొక్కేస్కుంటుంది" అని గుండెలు బాదుకుంటూ పూజగదిలోకి పరుగుతీశాడు లింగారావ్.
శ్రీలక్ష్మి భక్తిగా కళ్ళుమూస్కుని దేవుళ్ళముందు చేతులు జోడించి ఉంది.
"స్వామీ....నా పాపకు ఎవరూ ఏ రకమైన కీడూ చెయ్యకుండా చూడు స్వామీ....అది కలకాలం క్షేమంగా ఉండాలి....అలా చేస్తే మా ఆయన కుడికాలుని...."
మొక్కుకోబోతున్న శ్రీలక్ష్మి నోటిని పరుగున వెళ్ళి మూసేశాడు కమీషనర్ లింగారావ్.
"ఏంటే....నా కాలు కూడా దేవుడికి సమర్పించేస్కుంటావా నీ భక్తి మండా...." పళ్ళు నూరాడు కమీషనర్ లింగారావ్.
శ్రీలక్ష్మి లింగారావ్ చేతిని నోటిమీంచి లాగేసింది.
"ఏంటండీ....దేవిడికి మొక్కుకుంటుంటే నోరుమూసేశారు! అలా చేస్తే చాలా పాపం తెల్సా?...." అని, లింగారావ్ చెంపలు చెళ్ళు చెల;చెళ్ళున వాయించింది.
"ఏంటే బాబూ....ఇలా కొట్టావ్?" బిత్తరబోతూ చెంపలు రుద్దుకుంటూ అడిగాడు లింగారావ్.
"రామ రామ....మిమ్మల్ని కొట్టడం ఏంటండీ...." చెంపలు వేస్కుంది. "మీరు నేను మొక్కుకోకుండా ఆపారు కదా....అందుకని న్యాయంగా మీరు చెంపలు వేస్కోవాలి! మీరు వేస్కోలేదని నేనే వేశా."
"దాన్ని చెంపలు వేయడం అనరు!....చెంపలు వాయించడం అంటారు....అయినా దీప క్షేమం గురించి నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీస్కున్నా....కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు!" అన్నాడు కమీషనర్ లింగారావ్.
"ఏంటా నిర్ణయం?!...." అడిగింది శ్రీలక్ష్మి.
"మన దీపని గజదొంగ మంగులు నుండి కాపాడిన రాంబాబు, చిన్నారావులకే దీప సెక్యూరిటీ బాధ్యత మొత్తం అప్పగించాలని నిర్ణయించుకున్నా!"
"ఆ!....ఎంతమంచి నిర్ణయం తీస్కున్నారండీ!...." శ్రీలక్ష్మి ఆనంద భాష్పాలు రాల్చింది.
