కోటేశ్వర్రావు కళ్లు తుడుచుకుని వెక్కాడు.
"నువ్వు ఓ పని చేస్తే మంచిది. నువ్వు పరమానందయ్య అనీ సికింద్రాబాద్ లో ఉన్నాడు ఆయన దగ్గరెళ్ళు" సలహా ఇచ్చాడు శ్రీరాములు.
"పరమానందయ్యా?... ఆయనెవరు?... మన రాష్ట్రపతా?..."అడిగాడు కోటేశ్వర్రావు.
"పరమానందయ్య ఓ సీనియర్ రాజకీయ నాయకుడులే... ప్రస్తుతం రాజకీయాలనుండి రిటైర్ అయ్యాడు. ఆయన నీలా రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకునేవాళ్లకి మంచి సలహాలు ఇచ్చి మార్గం చూపిస్తారు... అవసరం అనుకున్నవాళ్లకి కోచింగ్ కూడా ఇస్తారు... నీకు కోచింగ్ అవసరమేలే... అని పరమానందయ్య అడ్రసు కోటేశ్వర్రావుకి ఇచ్చి శ్రీరాములు వెళ్లిపోయాడు.
ఆ మర్నాడే కోటేశ్వర్రావు పరమానందయ్య ఇల్లు వెతుక్కుని వెళ్లాడు.
"ఊ... నువ్వు రాజకీయాల్లో చేరాలని ఎందుకనుకుంటున్నావు?..."అడిగాడు కోటేశ్వర్రావుని పరమానందయ్య.
"మరేమో నేను మినిష్టర్ ని అయిపోయి బోల్డన్ని ఆస్తులు సంపాదించాలని అనుకుంటున్నా... హిహి...హిహిహి... సంబరంగా అన్నాడు కోటేశ్వర్రావు.
"ఊ... ఆలోచన బాగానే ఉంది..." అతన్ని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు పరమానందయ్య."ఇంతకీ నువ్వేం పార్టీలో చేరాలని అనుకున్నావ్?..."
"ఏమోనండీ... జంబలకిడిపంబా పార్టీలో చేరాలో, అద్దిరబన్నా పార్టీలో చేరాలో తేల్చుకోలేక చస్తున్నా... మీరేం పార్టీలో చేరమంటే ఆ పార్టీలో చేర్తా..."
"ఆ రెండు పార్టీలూ వద్దులే... నువ్వు లబ్జులకిడి పార్టీలో చేరుదువుగాని!... ఆ పార్టీలో అయితే చక్కగా అందరూ గూండాలే ఉంటారు... వాళ్ల దగ్గర బోల్డన్ని తుపాకులూ, కత్తులూ, బాంబులూ ఉంటాయ్ ఇంచక్కా..."చెప్పాడు పరమానందయ్య కళ్లు మూస్కుని ఆలోచిస్తూ.
"అలాగేనండీ... మీరెలా చెప్తే అలానే... హిహి..." హుషారుగా అన్నాడు కోటేశ్వర్రావు.
"సరేగానీ... రాజకీయాల్లో చేరడానికి నీ అర్హతేంటి?..."
"నాకు బోల్డంత డబ్బుంది..."చెప్పాడు కోటేశ్వర్రావు.
"బోల్డంత డబ్బుంచుకుని మరి రాజకీయాల్లో ఎందుకు చేర్తున్నట్టు?"
"బాగానే ఉందే! నా దగ్గర లక్షలే ఉన్నాయ్?... వాటిని కోట్లకి పెంచొద్దూ?..."
"శభాష్!..."కోటేశ్వర్రావుని మెచ్చుకున్నాడు. పరమానందయ్య.
"ఇంకా ఏమేం అర్హతలున్నాయ్?"
"మీరోసారి నా మొహంమీద ఉమ్మెయ్యండి...ఊ... త్వరగా... మొహం ముందుకు పెడ్తూ అన్నాడు కోటేశ్వర్రావు.
పరమానందయ్య అతని మొహంమీద తుపుక్కున ఉమ్మూశాడు.
కోటేశ్వర్రావు జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని పకపకా నవ్వాడు.
"చూసారా... మొహం మీద ఉమ్మూసినా నవ్వుతూ తుడిచేస్కున్నా..."అన్నాడు కులాసాగా.
"ఊ... పరవాలేదుగానీ... ఇవన్నీ పాత స్టాండర్ట్స్...సరేగానీ నీకు బూతులు వచ్చా..."
"ఏదో కొద్ది కొద్దిగా వచ్చు!..." సిగ్గుపడ్తూ అన్నాడు కోటేశ్వర్రావు.
"కొద్ది కొద్దిగా అంటే ఎలా రేప్పొద్దున అసెంబ్లీలో అమ్మనాబూతులు తిట్టుకోవద్దూ?" మందలింపుగా అన్నాడు పరమానందయ్య.
"పోన్లెండి... మన తెలుగు సినిమాలు చూసీ, వారపత్రికలు చదివీ మరికాసిన్ని బూతులు నేర్చుకుంటా... అన్నట్టూ అసెంబ్లీలో మైకులూ, బల్లలూ విరక్కొడ్తారటగా?... నేను కూడా బోల్డన్ని విరక్కొడ్తా... ఎమ్మెల్యే అయ్యాక..." జబ్బలు చరుస్తూ అన్నాడు కోటేశ్వర్రావు.
"సర్లేనయ్యా... ఇవన్నీ సెకండరీ విషయాలు... ఇప్పుడంతా హత్యా రాజకీయాలు... మైకులూ, బల్లలూ విరక్కొట్టడం కాదు... కాళ్లూ చేతులూ విరక్కొట్టేయాలి!! తెల్సిందా?..."
"అమ్మా... నాకు రక్తం చూస్తేనే కళ్లు తిరుగుతాయే... ఎట్టాగబ్బా మరి?... బుర్రగోక్కుంటూ అన్నాడు కోటేశ్వర్రావు.
"మరేం పర్లేదు... నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేనున్నానుగా?!..."అభయం ఇచ్చాడు పరమానందయ్య.
పరమానందయ్య కోటేశ్వర్రావుకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడో చెప్తే మీరు గుండెలు బాదుకుంటారు... కేర్ బేర్ మంటారు... అందుకనే చెప్పడంలేదు.
మొత్తానికి కోటేశ్వర్రావు పరమానందయ్యకి ప్రియశిష్యుడయ్యాడు. పరమానందయ్యకి వీరాంజనేయులు అని మరో ప్రియశిష్యుడు ఉన్నాడు.
పరమానందయ్య తనకంటే వీరాంజనేయులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కోటేశ్వర్రావుకి అనుమానం వచ్చింది. ఎలక్షన్ లో పోటీ చెయ్యడానికి లబ్జులకిడి పార్టీ టికెట్ పరమానందయ్య వీరంజనేయులికే ఇప్పిస్తాడేమోనని కోటేశ్వర్రావుకి అనుమానం వచ్చింది.
ఒకవేళ వీరాంజనేయులే లేకపోతే?... అనుకున్నాడు కోటేశ్వర్రావు.
అంతే!... ఓ రోజు రాత్రిపూట వీరాంజనేయులు ఇంటిమీద బాంబు వేసేసాడు కోటేశ్వర్రావు.
ఆ విధంగా అతని రాజకీయ జీవితం ప్రారంభం అయింది.
* * *
