Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 34

    "మనిద్దరం మనువాడ్ధాం గోపీ" అతని గుండెలమీద వెంట్రుకలు పీకుతూ గోముగా అంది సీతాలు.
    గోపి "కెవ్వు"మని గట్టిగా అరిచి సీతాలును విడిచిపెట్టాడు.
    "ఏంటి గోపీ-వెంట్రుకల్ని గట్టిగా పీకానా?" కిలకిలా నవ్వుతూ అడిగింది సీతాలు.
    "కాదు సీతాలూ-" ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి.
    "మరెందుకు గోపీ అట్టా అరిశావ్ - పుల్ గ్యాసున్న సోడా కొట్టినట్టు?"
    "అదే సీతాలూ! నువ్వు మనువాడ్దాం అన్నావ్ కదా? నన్ను నువ్వు అపార్థం చేస్కున్నావ్ సీతాలూ - నీ మీద నాకెప్పుడూ అలాంటి దృష్టిలేదు సీతాలూ - ఎప్పుడూ లేదు" అతను మెడ పైకెత్తి కళ్ళు మూస్కుని జుట్టు పీక్కున్నాడు.
    "గోపీ" ఆక్రోశిస్తూ అంది ఆమె.
    "నువ్వు నాకు చెల్లెల్తో సమానం సీతాలూ."
    "గోపీ! మా నాన్న ఇదివరకు మీ వూరు వచ్చినట్టు నాకు తెలీదు గోపీ" బాధగా అంది ఆమె.
    "ఛ - అదేంకాదు! మా అమ్మ చాలా పతివ్రత సీతాలూ - నాకే ఎందుకో నిన్ను చూడగానే పోయిన జన్మలో నువ్వే నా చెల్లెలు అయివుంటావని అనిపించింది సీతాలూ."
    సప్త సముద్రాలూ పొంగినట్టూ, పర్వతాలు బ్రద్దలయినట్టూ అనిపించి ఆమె కుప్పకూలిపోయింది.
                                                                 28
    "బాబుగారూ! బాబూగారూ" కంగారుగా అరుచుకుంటూ వచ్చి వగరుస్తూ నిలబడ్డాడు సంతానం.
    "ఓరి నిన్ను ఏ కలరానో, టీబీయో ఎత్తుకుపోనూ - ఆ అరుపులేంటి? అయినా నిన్ను ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చెయ్యొద్దన్నానా!'
    "అబ్బో! పెద్ద ఇక్కడ తమరేదో పొడిచేస్తున్నట్టు డిస్టర్బెన్స్ అట" మూతి వంకర్లు తిప్పుతూ అంది చిత్రాంగి.
    "హబ్బా! నువ్వట్టా నీ మాటల్తో నన్ను కుళ్ళబొడిచెయ్యకు - నీకు దణ్నం పెడతా!"
    రాయుడు నెత్తి పట్టుకుంటూ అన్నాడు.
    "అంతే... దణ్ణాలుకాక ఇంకే పెడ్తార్లే నా బొంద!"
    "హబ్బా!" రాయుడు బాధగా అన్నాడు.
    అది చూసి సంతానం "హి హి హి" అని నవ్వాడు.
    "ఏంటా ఇకిలింపు - మూతిమీద కొట్టానంటే" సంతానం వంక కోరగా చూస్తూ అన్నాడు రాయుడు.
    సంతానం చేత్తో నోటిని మూస్కున్నాడు.
    "మళ్ళీ ఆ వేషాలేంటి? ముందు నోటిమీంచి ఆ చేతిని తియ్."
    సంతానం నోటినుంచి చేతిని తీసేశాడు.
    "ఇప్పుడు చెప్పు! అసలు ఏం కొంపలు మునిగాయని ఇక్కడికి, అదీ ఇంత రాత్రివేళ వచ్చావ్? రేపు పొద్దున రాలేకపోయావా" అడిగాడు రాయుడు.
    "ఏం... రాత్రొస్తే మీ కడ్డేంటి? ఇప్పుడు మీరేం రాచకార్యం వెలగబెడుతున్నారని?" అంది చిత్రాంగి.
    "హిహి" మళ్ళీ నవ్వాడు సంతానం.
    "నువ్వు కాస్సేపు నోర్మూసుకుంటావా?"
    చిత్రాంగివంక చిరాగ్గా చూస్తూ అన్నాడు రాయుడు.
    చిత్రాంగి మూతి అష్ట వంకర్లు తిప్పింది.
    "ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో ఏడు!" అన్నాడు రాయుడు సంతానంతో.
    "పట్టేశాను బాబూ! పట్టేశాను!" సంతోషంగా అరిచాడు సంతానం.
    "ఎవర్తిని పట్టావ్?"
    "చాల్లెండి బాబుగారూ! మీ కెప్పుడూ ఆ ధ్యాసే! నేనోరహస్యం పట్టేశా!"
    "ఏంటా రహస్యం?"
    "గూడెంలో సీతాలు వుందికదండీ! అదేనండీ బాబూ - అప్పుడు దానివెనకాల పడితే దాని ఆవు గంగో మంగో వుంది దానిచేత మీరు కుమ్మించుకున్నారూ.... గోపీ కూడా మిమ్మల్ని సుబ్బూ సర్ఫూ లేకుండా ఉతికేశాడూ..."
    "హబ్బా - ఆ వివరాలన్నీ ఇప్పుడెందుకయ్యా! సీతాలేకదా? గుర్తుందిలే! అసలు విషయం త్వరగా చెప్పేడు" పళ్ళు నూరుతూ అన్నాడు రాయుడు.
    "అదేనండీ! ఆ సీతాల్ని, గోపీని ఇందాక నేను పార్కులో చూశా.... సీతాలు ఛెంగుఛెంగున దూకి ఓ పాట కూడా పాడింది."
    "హమ్మనీయమ్మ-" ముక్కుమీద వేలేస్కుంటూ అన్నాడు రాయుడు.
    "ఇంకో విషయం ఉండండి బాబుగారూ! పాటంతా అయిన తర్వాత ఆమె గోపిని లటుక్కున కౌగిలించుకుందండీ - గోపీకూడా ఆమెను కౌగిలించుకున్నాడండీ... ఆ తర్వాత ఆమె గోపీతో ఏదో అందండీ - గోపీ ఆమెతో ఇంకేదో అన్నాడండీ - అంతే... ఆమె నేల మీద కూర్చుండిపోయి భోరున ఏడ్చిందండీ" అన్నాడు సంతానం.
    "హమ్మనీయమ్మ... ఇన్నాళ్ళకి దొరికాప్ రా గోపీగా-సంతానం! ఇప్పడు నువ్వు చెప్పిన సంఘటనకి అర్ధం ఏంటో తెల్సా?" మీసాలు దువ్వుకుంటూ అడిగాడు రాయుడు.
    "లేదండీ-కానీ మీకు ఉపయోగపడ్తుందేమోనని చెప్పనండి!"
    "మంచిపని చేశావ్ - నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తే గోపికి, ఆమెకు మధ్య కనెక్షన్ ఉందన్నమాట! ఆమె గోపీని పెళ్ళి చేస్కోమని అడిగి ఉంటుంది. వీల్లేదని గోపి అని వుంటాడు. లేకపోతే హుషారుగా పాట పాడ్తూ డ్యాన్స్ చేసిన ఆమె హఠాత్తుగా నేలమీదపడి ఎందుకేడుస్తుందీ?"
    "అబ్బ...అబ్బ మీది ఏం బుర్రండీ బాబుగారూ?" మెచ్చుకున్నాడు సంతానం.
    "ఇప్పుడు గనుక ఆమెను సఫా చేస్తే నా కసి తీరుతుంది! దానితో గోపీకి కనెక్షన్ వుంది కాబట్టి పోలీసులకు గోపీమీద అనుమానం వచ్చి వాడిని బొక్కలో తోసేస్తారు - ఆ విధంగా వాడిమీద నాకున్న పగ తీరుతుంది - ఒకే ఒక దెబ్బకి రెండు పిట్టలు! హ హ హ..."" పగలబడి నవ్వాడు రాయుడు.
                                                                 * * *
    గోపీ మంచంమీంచి లేచి కూర్చుని నోరంతా తెరిచి ఆవుళించాడు.
    అంతే... పాచికంపుతో గదంతా గుప్పుమంది.
    అప్పుడే గదిలోకి హారతి పళ్ళెంతో వచ్చిన రాధ ముక్కు మూస్కుంది.
    "ఏంటండీ మీరు... ఇంకా లేచి మొహం కడగలేదా?ఊఁఊ... హారతి కళ్ళకి అడ్డుకోండి" అంది రాధ.
    గోపి కళ్ళకి హారతి అద్దుకుంటుండగా హారతి ఆరిపోయింది.
    "ఆఁఏమిటీ అపశకునం?" బాధగా అన్నాడు గోపి.
    "అపశకునం ఏమీ కాదండీ! ఇప్పుడే కిటికీలోంచి గాలి రివ్వున వీచింది కదా... ఆ గాలికి హారతి ఆరిపోయి ఉంటుంది ఊఁ - ప్రసాదం తీస్కోండి."
    అతను హారతి పళ్ళెంలోనే ఉన్న కొబ్బరి ముక్కల్లోంచి ఒక ముక్క తీస్కుని పచపచా నములుతూ అన్నాడు "కాదు రాధా!... తప్పకుండా ఇది అపశకునమే... ఓసారి లోపలికెళ్ళి చూచిరా రాధా, మా అమ్మ ఉందో - గుండాగి చచ్చిందో."
    రాధ కిలకిలా నవ్వింది.
    "భలేవారే! మీ అమ్మకేవండీ - చక్కగా గుండ్రాయిలా ఉంది. ఈ గదిలోకి వచ్చేముందే చూశాగా?"
    "అవునా? మరెందుకబ్బా హారతి అలా ఆరిపోయింది?" ఆలోచిస్తూ అన్నాడు గోపి.
    "ఎందుకోలే... మీరింక మాట్లాడకుండా బాత్రూంలోకెళ్ళి పళ్ళుతోముకోండి. పాడుసంత! అంది రాధ ముక్కు మూస్కుంటూ.
    గోపి మంచంమీంచి లేచి మొహం కడుక్కున్నాడు. రాధ గోపికి కాఫీ ఇచ్చింది.
    కాఫీ చప్పరించిన గోపీ  కళ్ళు పెద్దవిచేసి రాధవంక చూసాడు.
    "ఏంటిరాధా - ఎప్పుడూ లేనిది కాఫీ ఇంత అద్భుతంగా కాచావ్?" అన్నాడు.
    "ఈవేళ కాఫీ కాచింది నేను కాదండీ... అత్తయ్యగారు!" చెప్పింది రాధ.
    అప్పుడే సరస్వతి గదిలోకి వచ్చింది.
    గోపి తల్లివంక ఆరాధనగా చూసాడు.
    "హమ్మా!... నువ్వు దేవతవమ్మా... నువ్వు అమృతమూర్తివి!.... అందుకే నీచేత్తో ఏమిచ్చానా అమృతంలా ఉంటుంది" అన్నాడు.
    "బాబూ!..." ఆర్ర్థంగా పలికింది సరస్వతి.
    "హమ్మా!..."గోపి మరింత ఆర్ర్థంగా పలికాడు.
    "బాబూ..."
    "హమ్మా..."
    "అబ్బబ్బ... ఓ ప్రక్క కాఫీ చల్లారిపోతుంటే ఏంటండి మీరూ?తర్వాత ఆర్ర్థంగా, పిలుచుకోవచ్చునుగానీ ముందు కాఫీ తాగండి...." అంది రాధ విసుగ్గా మొహంపెట్టి.
    గోపీ కాఫీ మొత్తం త్రాగేసి కప్పు రాధకి అందించాడు.
    గోపీ చేతిలోంచి కప్పు అందుకుంటూ అతని మొహంవంక చూసిన రాధ సిగ్గుతో చితికిపోయింది. గోపి కన్ను టప టపా కొట్టుకుంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS