హత్య చేయాలి !
వసుంధర
వచ్చిన అభ్యర్ధులను లెక్క పెట్టాను.
అరవయ్యేడుగురున్నారు. మొత్తం ఆరు పోస్తులున్నాయి.
ఆరూ ఆరు రకాలు. నేనొచ్చిన పోస్టుకి పధ్నాలుగురిని పిలిచేరుట. పదిమంది వచ్చారు.
నా క్వాలిఫికేషన్స్ ను బట్టి ఈ ఉద్యోగం తప్పక వస్తుందని ఆశ పడ్డాను. అయితే ఇప్పుడు నా అవకాశం పదింట ఒక వంతుకు తగ్గిపోయింది.
ఆ పదిమందినీ పలకరించాను. వారిలో ఏ ఒక్కరూ అర్హతలలో నాకు తీసిపోరు. ప్రతి ఒక్కరూ తనకు తప్పక ఉద్యోగం వస్తుందని ధైర్యంగా వున్నాడు. ప్రతి వాడిలోనూ తనకుద్యోగం రాదేమోనన్న భయం కూడా వుంది.
మేమందరం స్నేహితుల్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కడిలోనూ మిగతా వాళ్ళ మీద పీకెల దాకా కసి వున్నదని నా అనుభవాన్ని బట్టి అనిపించింది.
ఊసుపోకగా మాట్లాడుతున్నట్లే కనిపించినా -- ఎదుటి వాడిలో ఏయే లోపాలున్నాయి అన్నది అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను. అందువల్ల ఉద్యోగం రావడానికి నాకున్న అవకాశాల గురించి మరింత ఖచ్చితమైన అంచనా వేయగలుగుతాను నేను.
మిగతా వాళ్ళ సంగతి తెలియదు గానీ ఉద్యోగం ఎంతో అవసరం నాకు.
గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను. నాన్నగారు రిటైరై పోయారు. అమ్మకు రోగం. చెల్లెలి పెళ్ళి చేయాలి. ఇద్దరు తమ్ముళ్ళు చదువు కొనసాగించాలి.
ప్రస్తుతం నాన్నగారి పెన్షన్ డబ్బులు తప్ప మరే ఆధారం లేదు. ఆ పెన్షన్ డబ్బులు మేముంటున్న ఇంటి అద్దెకు కూడా చాలావు. గత ఆరు మాసాలుగా మేము కేవలం అప్పు చేసి బ్రతుకుతున్నాం. అప్పు దొరకని నాడు పస్తు.
నాకు ఆశయాలు, ఆదర్శాలు లేవు. ఏదోవిధంగా డబ్బులు సంపాదించడమే నా ఉద్దేశ్యం. పిరికివాణ్ణి కాబట్టి దొంగతనానికి పాల్పడలేదు.పట్టుబడనన్న గ్యారంటీ వుంటే దొంగతనం చేయడానికీ సిద్దమే నేను! అలాగే -- ఉయోగం ఇప్పిస్తానంటే రోడ్లు తుడిచేవాడి కాళ్లయినా పట్టుకుందుకు సిద్దమే నేను.
ఆఖరికి లంచమిచ్చి ఉద్యోగం సంపాదించాలని కూడా కొన్ని విఫలయత్నాలు చేశాను.
నా దురదృష్ట మేమిటో చెప్పలేను కానీ - ఎన్ని తీవ్ర ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం లభించలేదు.
ప్రతి మనిషీకీ ఎంతో కొంత అభిమాన మంటూ ఉంటుంది. ఉద్యోగం లేకపోవడం వల్ల క్రమంగా ఆ అభిమానాన్ని కోల్పోతున్నాను. అప్పులవాళ్ళు వచ్చి రోజూ నానామాటలూ అని పోతుంటే -- ఇంకా అభిమాన మేక్కడుంటుంది?
అయితే అభిమానం నాకు ఉన్నదనే అనుమానం కూడా నాకు వుంది. లేకపొతే ఉద్యోగం కోసం ప్రయత్నించడం తప్పితే కాయకష్టం చేయాలని ఎన్నడూ అనుకోనేం?
డబ్బు సంపాదించాలంటే కూలి పని చేయవచ్చు. కిళ్ళీ కొట్టు పెట్టవచ్చు. వేరుశనక్కాయలు అమ్ముకోవచ్చు. కానీ ఇవేమీ నా దృష్టికి రావు. డబ్బు ఉద్యోగం వల్లనే రావాలి.
నేనొకసారి నిజంగానే కూలి పని చేయాలనుకుని బస్ స్టాండు కి వెళ్ళి నిలబడ్డాను. నా వేషాన్ని చూసి ఎవ్వరూ ఏయ్ కూలి అంటూ పిలవలేదు. తెగించి నేను "కూలీ సార్!" అంటూ వెళ్ళ లేకపోయాను. చాలాసేపు అలా నిలబడి చివరికి విసిగి -- మొండి ధైర్యంతో అప్పుడే వచ్చి ఆగిన బస్సు వైపు వెళ్ళబోయాను.
ఇంతలో నన్ను ఎవరో పేరుపెట్టి పిలిచినట్లై వెనక్కు తిరిగి చూశాను.
ఒకప్పటి నా క్లాస్ మెట్ నీరజ చంకలో పిల్లాడితో ఒక టాంకు బెడ్డింగు ల పక్కన నిలబడి వుంది. నేను కూలిపని కోసం బస్సు స్టాండు కు వచ్చానన్న విషయం స్పురించగా -- సామానుతో వున్న నీరజ నన్ను పిలవడంతో నా అభిమానం కొంత దెబ్బతిన్నట్లయింది.
అయినా వెళ్ళి "ఏం -నీరజా! ఏ బస్సులో దిగావేమిటి?" అన్నాను.
"దిగి అప్పుడే అరగంట అయింది. ఎక్కడా ఓ కూలి వెధవ కనిపించడం లేదు. సామాను పట్టుకు బయటపడదామంటే -- " అంది నీరజ .
నీరజ అన్న కూలి వెధవ అన్నమాట నాకు కొరడా దెబ్బలా తగిలింది.
తాత్కాలికంగా ఆమెకు సహాయం చేసి బస్ స్టాండు బయట వున్న రిక్షా లోకి ఆమె సామానులు మర్చగాలిగాను. చేసినది కూలిపనే అయినా డబ్బులు తీసుకోలేదు. కాబట్టి నేను కూలి వాణ్ణి కాలేదు.
నీరజ లాంటి ఆడవాళ్ళ దృష్టిలో "కూలి వెధవను" కాలేక మరి కూలిపని గురించి ఆలోచించలేదు నేను."
నన్ను ఇంటర్వ్యూ కి పిలిచారు. అప్పటికి నలుగురికి ఇంటర్వ్యూ పూర్తయింది. ఒక్కొక్కర్నీ కనీసం పదేసి నిముషాలు ప్రశ్న లడుగుతున్నారు. ప్రతి ఒక్కడూ సంతృప్తి కరమైన ముఖంతోనే బయటకు వస్తున్నారు. నేను కూడా ఇంటర్వ్యూ చాలా బాగా చేశాననే చెప్పుకోవచ్చు. వాళ్లు ప్రశ్నలడిగిన విధానమూ, నా సమాధానం విన్నాక నా ముఖ కవళికల్లో కలిగిన మార్పులూ చూడగా ఈ ఉద్యోగం ఇంచుమించు నాకు వచ్చినట్లే తోచింది.
అందుకే ఇంటర్వ్యూ కాగానే అక్కడి ఆఫీసులోని గుమస్తాను కలిసి - "సార్ ! ఈ ఉద్యోగం మీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. సాయంకాలం మీ ఇంటికి వస్తాను. ఎలాగో అలా మీరు సమాచారం సేకరించి ఉద్యోగం నాకు వచ్చినది లేనిది చెప్పాలి-" అన్నాను. అదోరకంగా చూసిన అతని చేతిలో అయిదు రూపాయల నోటుంచి --"మీరు తప్పక నాకు ఈ ఉపకారం చేసి పెట్టాలి !" అన్నాను.
అవును మరి- నా ఆత్రుత నాది! మాములుగా అయితే ఈ సమాచారం తెలుసుకోడానికి ఒకటి రెండు నెలలు పట్టినా పట్టవచ్చు. లోపాయి కారీగా తెలుసుకుంటే ఆ ధైర్యం వేరు!
గుమస్తా అంగీకార సూచకంగా తలూపి ఒక కాగితం మీద తన చిరునామా రాసి ఇచ్చాడు. ఆ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అతని ఇంటికి వెళ్లాను.
అతను నాకు సగౌరవంగా కాఫీ ఇచ్చి -- "సమాచారం తెలిసింది గానీ వేరీసారీ అండీ-- మీరు సెలక్టు కాలేదు. ఎటొచ్చీ ఒక శుభవార్త ఏమిటంటే పానెల్ పెట్టారీసారి. అందులో రెండు పేర్లున్నాయి. మీది మొదటిది. ఏ కారణం వల్లనైనా సెలక్టయిన అతను ఉద్యోగంలో చేరనట్లయితే - మీకు ఉద్యోగం వస్తుంది. మీరూ చేరకపోతే మరో అతనికి వస్తుంది. అతనూ చేరకపోతే మళ్ళీ పోస్ట్ అడ్వర్టైజింగ్ చేసి ఇంటర్వ్యూ జరుపుతారు -" అన్నాడు.
అర్ధమైంది నాకు. అదృష్టం అతి సమీపంలోకి వచ్చి జారిపోతోంది. ఉన్నది ఒక్కటే పోస్టు. ముగ్గుర్ని సెలక్టు చేశారు. నేను రెండో వాడిని. మొదటి వాడు రాకపోతే నాకు పోస్టు వస్తుంది.
నా వెర్రి గానీ మొదటి వాడు రాకుండా ఎందుకుంటాడు? ఈ రోజుల్లో వచ్చిన ఉద్యోగాల్ని వదులుకునే మూర్ఖుడెక్కడైనా వుంటాడా?
ఏమో- అతనికి మరో ఉద్యోగం వచ్చి వుండవచ్చు.
అప్పుడే నాకో చిత్రమైన ఊహ వచ్చింది. వెంటనే గుమస్తా నడిగి సెలక్టయినా మిగతా ఇద్దరి పేర్లూ , వివరాలూ అడిగి తీసుకున్నాను. పేర్లు చూస్తూనే వాళ్ళెవరో అర్ధం చేసుకో గలిగాను నేను. ఉదయం చాలాసేపు మాట్లాడుకున్నాం కదా మరి.
సెలక్టయినతాని పేరు ప్రసాదరావు. అతను అప్సరా హోటల్లో మకాం చేశాడు. ఇప్పుడు తక్షణం వెళ్ళి అతన్ని కలుసుకోవాలి. అతనింకా ఏయే ఉద్యోగాలకి అప్లై చేశాడో కనుక్కోవాలి. వాటిలో ఈ రోజు దాని కంటే మంచి ఉద్యోగముందేమో కనుక్కుని....
ఆ ఉద్యోగం వచ్చినట్టుగా రాంగ్ ఆర్డర్ ప్రిపేర్ చేసి అతని పేరున పోస్టు చేయాలి.
ఇంకా నా ఆలోచనలకు సరైన రూపలక్పన చేసుకోలేదు. నా పధకం ప్రకారం అతనీ ఉద్యోగాన్ని నిరాకరించాలి. నాకిది రావాలి. ఈ రెండూ ఎలా జరగాలో -- అతన్ని కలుసుకున్నాక సరైన నిర్ణయం చేసుకోవచ్చు.
ఈ ఉద్దేశ్యంతో అతన్ని అప్సరా హోటల్లో కలుసుకున్నాను. అతనికి కడుపు నొప్పిగా ఉన్నదట. రూమ్ లోనే వున్నాడు. మర్నాడు ఇంటికి ప్రయాణమై పోదామనుకుంటున్నాడుట. ఇంటర్వ్యూ చాలా బాగా చేశానని నమ్మకంగా చెప్పాడు.
"ఇంకా ఏమైనా ఉద్యోగాలకి అప్లయి చేశారా?" అనడిగాను.
"లేదండీ ఇదే నా ఫస్టు అప్లికేషను -- " అన్నాడు.
నా తల తిరిగిపోయింది . ఎంత అదృష్టం! ఒకే ఒక అప్లికేషన్ పెట్టి ఉద్యోగం కొట్టేస్తున్నాడు.
"ఒకవేళ ఉద్యోగం వస్తే ఏం చేద్దామనుకుంటున్నారు?" అన్నాను.
"తక్షణం జాయినవుతాను....." అన్నాడతను నవ్వుతూ.
నాకు మాత్రం ఏడుపు వచ్చింది.
* * * *
రాత్రి హోటల్లో నా రూములో పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ప్రసాదరావు కాదంటే ఉద్యోగం నాకు వస్తుంది. ఇంత దగ్గిర అవకాశం నాకెప్పుడూ రాలేదు. ఈ అవకాశం పోగొట్టుకోకూడదు.
ఏం చేయాలి?
హటాత్తుగా ఏదో స్పురించింది. ఆ ఆలోచనకు నా శారీరం జలదరించింది. ప్రసాదరావు నీ లోకంలో లేకుండా చేయగలిగితే...."
ముందు నా మనస్సంగీకరించలేదు. కానీ క్రమంగా నా ఆలోచన బలపడసాగింది. ఎలాగో అలా ప్రసాదరావు మరణించేలా చూడాలని తీవ్రంగా అనిపించసాగింది.
చీమకు కూడా హాని తలపెట్ట లేని వాడుగా పేరు పొందిన నేనీ రోజు ఒక వ్యక్తీ మరణానికి కారకుడు కావాలను కుంటున్నాను. పరిస్థితులు ఎటువంటి వాడినైనా మార్చేయగలవు.
అయితే ప్రసాదరావు ఎలా మరణిస్తాడు?-- హత్య చేయాలి!
కానీ నేను హత్య చేయగలనా?
ఆలోచన ముందుకు నడిచిన కొద్దీ హత్య చేయడం అంత కష్టం కాదనిపించింది. ఎటొచ్చీ నాతెలివి ఉపయోగించి ఎవ్వరూ కనుక్కోలేని విధంగా హత్య చేయాలి.
