Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 35

 

                                    16
    ఆరోజు నూనెవాడు వచ్చి వాడి బాకీ తీర్చలేదని అడ్డమయిన మాటలూ ఆడి వెళ్ళేడు. ఇలాంటివి నేను ఎంత కని పట్టించుకోకుండా ఉండగలను? ఈ బాకీవాళ్ళు ఈయన ఉండగారారు, మరి ఆ మహానుభావులు అలా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి వేడతారేమో! వీళ్ళతో మరింతగా నా ప్రాణం విసిగెత్తి పోతోంది. ఇలా బాకీలు పెంచుకున్నంత మాత్రాన అవి తీర్చకుండా తెగవేయ్యడం మాత్రం జరగదు. అది తెలుసుండి ఆయనెందుకు కిలా చేస్తున్నారు?
    "ఏమయినా ఈ ఇంటి పద్దతెం బాగులేదు. దీని కేదో చెయ్యాలి' అని మొదటిసారి అనిపించింది. అంతేకాదు ' ఈ విషయంలో ఆయనతో మాటాడి ఏదో ఒక నిర్ణయానికి రావాలి' అని కూడా గట్టిగా నిర్ణయించుకున్నాను.
    అప్పుడప్పుడు తెల్లవారు ఝామున నిద్రలేచి పక్కల మీంచి అలా లేవకుండానే మాట్లడుకోవడం మాకు అలవాటు. ఆవేళప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇరుగూ పొరుగూ వాళ్ళూ వినరు. పిల్లలు లేచి ఉండదు సాధారణంగా, ఆ తెల్లవారుఝామున కదిపి చూశాను.
    "ఏం"
    "ఏమండీ ఈ మధ్య బాకీలు మరీఎక్కువై పోయినట్టున్నాయేమిటి? అప్పులవాళ్ళు నిలబడనీయడం లేదు. ఎప్పుడు లేందీ ఎందుకిలా జరిగింది?'
    'జరిగిపోయినదాన్ని గూర్చి ఆలోచించడం తెలివైన వాళ్ళు చేసే పని కాదనుకుంటాను.'
    'మరి ఏమిటీ తెలివైనవాళ్ళు చేసేపని, చల్లగా అప్పులు చేసేసి బాకీల వాళ్ళని ఇంటికి మీదకు తోలడమా?'
    అయన ఇటువైపు తిరిగారు. నావైపు చూస్తూ అన్నారు.
    'దీనికి జవాబు నీకేం హితవుగా ఉండదు. అందుచేత అడక్కు' నా పెదవులు వణికేయి. అక్కడితో సరిపెడితే బాగుణ్నుమో. నాలో సహజమైన ఆసక్తి నన్ను ఊరుకో నిచ్చింది కాదు.
    'ఇంతవరకు వచ్చాక హితవుగా ఉంటేనేం, లేకపోతేనేం? మనసులో పెట్టుకుని బాధ పడేకన్న ఒకరి మీద ఒకరి కున్న దుఖం పైకి వెళ్ళగ్రక్కుకొడమే మంచిది. కష్టమైనా , కఠినమైనా ఇద్దరికీ హితవు కలిగేటట్లు సంసారం నడుపుకు రావడమే అన్ని విధాల కోరతగినది.'
    'అయితే విను. ఏ పరిస్థితుల్లోనూ సహనం కోల్పోనని మాత్రం నాకు మాట యివ్వు.'
    'సరే చెప్పండి!'
    'తెలిసో తెలియకో నువ్వు చదువుకోడం నాకిష్టం లేదని ఒకమారు నీకు స్పష్టంగా చెప్పెను. జరిగిన విషయాన్నిబట్టి , నా అనుభవాన్ని బట్టి, నేననుకొన్న విషయం సరైనదనే నాకు రుజువౌతోంది. చల్లని సంసారం యిలా తల్లక్రిందు లవడానికి అర్ధం పర్ధం లేని నీ విద్యావ్యామోహమే కారణం!
    అయితే ఈయనకి స్త్రీ విద్య మీద ఉన్న యీ దిరభిప్రాయం యిక తొలగి పోదా? ప్రేమించడమే తప్ప యీయన్ని నేను గౌరవించలేనా?
    'సంసారాన్ని సరిదిద్ది చక్కబరచుకునే సామర్ధ్యం లేక నా చదువు నెందుకు ఎత్తి పెడతారు? మీ అక్కయ్య బట్టల కొట్టులో మీ పేర చేసిన నూట యాభై రూపాయలఅప్పుకీ, మీరు హోటల్లో పెట్టిన తొంబై రూపాయల చిల్లర బాకీకి, సిగరెట్టు దుకాణం లో పెట్టిన అరవై రూపాయల అరువుకీ నాచదువే అడ్డోచ్చిండా?'
    అయన దృడంగా నిశ్చయంగా అన్నారు.
    'అవును అంతేకాదు అదేపనిగా నేను పేకాట ఆడి నూటఎభై ఓడిపోడానికి నీ చదువే కారణం!' నేను కొయ్యబారి పోయాను.
    'అవును, ఆశ్చర్యపోకు. నీకు తెలియని మరి కొన్ని నిజాలు విను. మధురిమా, కామేశ్వరక్కా పడుకున్నాక, రాత్రి తొమ్మిది గంటల వేళ, నిద్ర పట్టక, ఒంటరితనం భరించలేక, మేడ మీద అటూ యిటూ సిగరెట్టు కాల్చి పచారు చేస్తూ ఉండేవాణ్ణి. ఎదురింటి మేడ మీద అప్పలనాయుడు గాడు వస్తూ పోతూ ఉన్నవాళ్ళని అడిగేవాడు. 'బాబూ ఎల్తారా?' అనేవాడు. అంటే సాని వీధికి. 'బాబూ ఏసుకుంటారా ?' అనేవాడు అంటే త్రాగుడు. నా చెవులు మూసుకునే వాణ్ణి. సినిమాకు వెళ్ళి పోయేవాణ్ణి. సగం అట అయిపోయినా సరే క్లబ్బుకి వెళ్ళి పోయేవాణ్ణి. అలా ఏ రెండింటి వరకూ పేకాట ఆడి అక్కడే పడుకునేవాణ్ణి.
    'ఒకసారి నీతో చెప్పేను. నీ చదువుధ్యాసలో పడి యీ దీనుడ్ని మరచిపోకని. కాని నువ్వు మరచిపోయావు. నీకూ నాకూ అడ్డు వస్తున్నది కనుకనే చదువంటే నాకంతగా కసి అని పోల్చుకోలేక పోయావు. ఒంటరి రాత్రులు నీ భర్త అనుభవించే వియోగాన్ని విరహాన్ని ఊహించుకోలేక పోయావు. నేనాశించిన ప్రేమామృతాన్ని నామీద కురిపించ లేకపోయవు!
    ఈ మాటలకు నేను చేసే వ్యాఖ్య ఏముంది? అయన శీల సంపదను అర్ధం చేసుకోలేక పోయినందుకు సిగ్గుపడ్డాను. పశ్చాత్తాప పడ్డాను.
    'అందుకే నే అంటాను. కరిగిన విషయాలు తలుచుకోడం ఎవరికీ హితవుగా ఉండదని, ముందు జరిగిందేదో ముచ్చటించుకోడమే మంచిదని.
    'పాత విషయాలు ముందుంచుకోకపోతే మనం చేసే వాటిలో మంచీ చెడ్డా మనకేం తెలుస్తుంది? వాటి నీడలు వర్తమానంలో పడక ఎలా తప్పుతాయి?'
    'ఏమో నీ గోల నీకే తెలియాలి గాని -- అతి ముఖ్య విషయం ఒకటి నీతో మాటాడుదామనుకుంటున్నాను. నీ మనసులో ఏముందో దాచకుండా చెబుతావా?'
    నా గొంతుకలో తడారిపోయింది. ఇంచుమించు ఈ నెల్లాళ్ళ నుంచీ దాచిన నా నగ విషయం ఈ విధంగా బయట పడుతోందన్నమాట. ఎప్పటి కప్పుడు చెబుదామని నోటి కొసదాకా వచ్చి అక్కడ ఆగిపోయి అనవసరంగా కాలయాపన చేసి దాచిన ఆ రహస్యం ఇక దాగదన్న మాట. కానీ ఎప్పటికైనా తెలియడమే మంచిది.
    'మరేం లేదు, నీ నగ విషయం!'
    ఏమీ లేక పోవడానికి ఏముందీ? అసలైన విషయమే అది. రాబోయే ఉరుముల్నీ, మెరుపుల్నీ తలుచుకుంటూ సిద్దంగానే ఉన్నాను.
    ఇలాంటి విషయాలు ఎంత భార్యా భర్తలైనా ముందుగా సంప్రదించుకుని చేసుకుంటే బాగుంటుంది. కాని ఈ మనస్సున్నది ఉందే అది లేనిపోనివి కల్పించుకుని మాయ తెరలు కప్పుతూ ఉంటుంది.

 

                  
    అన్నిటికీ ఊ కొడుతున్న నా బుద్ది హటాత్తుగా మేలుకుంది. ఈయనకి నేను చంద్రహరాలు అమ్మేనన్న సంగతి ఎలా తెలిసినట్టు? ఆ నగ తీసి పెట్లో పెట్టుకున్నాననుకున్నారో ఏమో ఒక్కసారి కూడా నన్నడిగిన పాపాన బోలేదు. ఈ విషయం ఆయనకు చెప్పకుండా నేను జాప్యం చెయ్యడంలో ఉన్న ముఖ్య కారణాల్లో ఇదొకటి. 'అడగలేదు గనక చెప్పలేదు' అంతే.
    'ఈ లెక్కతో బాకీలన్నీ తీరిపోతాయి గదా అనే ఉద్దేశంతో అలా చేశాను. నిజంగా చాలావరకు తీరిపోయినట్టే. మహా ఉంటె ఇంకో వందో రెండొందలో ఉంటుందేమో. ఇక అయిదు ఆరు నెలలు జాగర్తగా కాలక్షేపం చేస్తే అసలు కాణీ అప్పు లేకుండా చేసుకోవచ్చు. అంతగా అవసరం రాదు గాని వచ్చే పక్షంలో నీ చంద్ర హారాల తాకట్టు పెట్టవచ్చు.'
    ఆఖరి మాట వింటే ఇంతవరకూ నేనెంత గుడ్డిగా ఊహించానో ననుకోవచ్చు. కాని ఈయన మాతాడుతున్నది దేన్నీ గురించో అది మాత్రం పూర్తిగా అర్ధం కాలేదు.
    'అలా తెల్లమొహం వేస్తావెం. నీకు చెప్పకుండా చేశాననా? నీమీద నాకు పూర్తీ నమ్మక ముంది. సబువుకి కట్టుబడతావనీ అనవసరంగా ఆవేశ పడవనీ నాకు తెలుసు. ఇంట్లో ఉండి కూడా ఎందుకు చెప్పలేదంటావేమో. ఆడదానికి నగలు మీదున్న వ్యామోహం అలాంటిది. ఎంతటి సంస్కారమున్నదైనా చూసి చూసి తన నగల్ని మొగుడు అమ్ముతుంటే కాదనకుండా ఉండలేదు. పాత వస్తువైనా , నువ్వు ఫ్యాషను కాదని మూల పడేసినా, తీరా అమ్ముతానంటే గట్టిగా నువ్వు వద్దంటే నేనేం చేసేది? అందుకనే అన్నీ అయిపోయాక నీతో చెప్పడం.'
    కట్నానికి పుచ్చుకున్న సొమ్ముతో ఈయన అప్పులు తీర్చేశాకా మిగిలిన దానితో నా కోక రాళ్ళ నెక్లేసు చేయించారు. ఇలాంటి నెక్లేసు పాతపడి పోయింది గనుక, అదీగాక దాని గొలుసు తెగిపోయింది గనుక నాలుగైదేళ్ళ యి తీసేసి పెట్లో పడేశాను. దాని బంగారం కరిగించి మధురిమకు ఒక గొలుసూ, రెండు జతల గాజులూ చెవికి పొట్టి జూకాలు చేయించాలని ఏనాటి నుండో కోరిక. అది ఈయన అమ్మేశారన్నమాట. నాకు తెలియకుండా ఈయనా, ఈయనకి తెలియకుండా నేనూ వస్తువుల్ని అమ్మడం చిత్రమనిపించింది.
    "ఏం నీ నెక్లేసు నీకు తెలీకుండా అమ్మేనని కోపమా?'
    'లేదు. అవసరం వచ్చినప్పుడు కాకపోతే ఈ నగలు దేగేసుకు వూరేగడానికా? కొంతవరకైనా మన అప్పులు తీరిపోతే అంతకన్న సంతోషించవలసినది ఏముంది? నేనే మీదాన్ని అయినప్పుడు నా ఒంటి మీద బంగారం మీది కాక ఏమవుతుంది? మీ వస్తువు మీరు తీసి వాడుకోడానికి నాతొ చెప్పడం దేనికి?'
    అయన ముఖం మరింత కాంతిమయం అయింది.
    'నువ్వింతటి సంస్కారమున్న దానివని తెలుసు. అందుకే అంతగా సాహాసించాను. పోనీలే ఇన్నాళ్ళూ నీ దగ్గిర ఒక విషయం దాచాననీ అది చెబుతే ఏమనుకుంటావోనని అనేక విధాల సతమతమయ్యేవాణ్ణి. ఇప్పుడు నా మనసెంత తేలికై పోయిందో చెప్పలేను. అయినా అది మళ్ళీ చేయించి నీ మెళ్ళో పడేసేదాకా నాకు తోచదనుకో. ఎటొచ్చీ అది నువ్వు వాడడం లేదని గాని.... అయినా నీ కిష్టమైనా చంద్రహరాలు ఉండనే ఉన్నాయి కదా!"
    ఇంక ఆలశ్యం దేనికీ? నా రహస్యం బయట పెట్టడానికి కూడా ఇంతకుమించి తరుణం లేదు. నేను మాత్రం దాన్ని ఎన్నాళ్ళని దాచి పెట్టగలను, దాచి సుఖపడగలను! అదింకో విధంగా ఖర్మం చాలక అయన చెవిని పడితే?
    నేను లేచి కూచున్నాను.
    'కూచున్నావు దేనికీ? పడుకో అన్నారు అయన.
    'అలా కాదు . నేను కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పకుండా ఉంచాను. అంత దాచవలసిన అవసరం కూడా లేదు నిజానికి. ఏమిటో చేబుదామనుకుంటే కుదరక  అలా అలా అనవసరంగా ఆలశ్యం అయిపొయింది. మీ మంచితనం మీద నా విశ్వాసమూ, ఆ పరిస్థితుల ప్రభావమూ ఆ పని చేసేటట్టు చేశాయి. మీరు సహనంతో వినగలరని సహజమైన విషయంగా తీసుకోగలరని నాకు నమ్మకముంది.'
    'ఏమిటి ఈ సోద? ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు' నేను ఎదురు చూడని ఆయనలోని అలజడి నేను చెప్పబోయే మాటల్ని గొంతుకలోనే మింగేటట్టు చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS