వచ్చాడు, వాడి మొహంలో ఎక్కడా కళాకాంతీ లేదు. ఆ మొహం చూస్తె విపరీతమైన భయం వేసింది. వస్తూనే వాడు అన్నమాట ఏమిటో తెలుసా?
'నువ్వూ చదువుకున్నావు, ఆ మంజులా చదువు కుంది. కానీ, ఎంత తేడా! అది ఆమె సహజ స్వభవమో, సహజన్మ ప్రభావమో -- నీ సర్వస్వాన్నీ కాపాడింది. ముందామేకు కృతజ్ఞత సహప్రాలు తెలియజెయ్యి.'
"ఏమిట్రా యిది? నువ్వెళ్ళినపని ఏమయింది?' అమ్మ మామ్మా, ఒక్కసారే అడిగారు.
'అలాగే చెబుతాను. మీరు లోపలికి వెళ్ళండి. ముందు దీన్తో మాట్లాడే పనుంది.' అన్నాడు అన్నయ్య. వాళ్ళు అయిష్టంగా లోపలికి వెళ్ళిపోయారు. 'బాగుంది సంబంధం' అంటూ.
'ఇంతమందిమి ఉండి ఏమీ చెయ్యలేకపోయాం. మనకి సాధారణ పరిచయమున్న ఒక వ్యక్తీ నిన్ను రక్షించింది, ఎంత చిత్రం! దైవ సహాయం అంటే యిదే కాబోలు ' అన్నాడు.
నేను యింక ఆగలేకపోయాను.
'అసలు ఏం జరిగిందిరా?'

"లోకంలో ఎంతలేసి దుర్మార్గులేనా ఉంటారు. డబ్బు యిస్తే లభించే వేశ్య లుండగా అయినింటి పడుచును నాశనం చేస్తే వాళ్ళకేం వొస్తుందో!వీడికి ఎలా బుద్ది చెప్పడమో నాకు అర్ధం కావడం లేదు.'
'ఎవరికిరా?'
'ఇంకెవరికి? ఆ కేశవరావుగాడికి! వాడికి ఎనిమిదేళ్ళయి పెళ్ళయింది. రెండేళ్ళ కొడుకు కూడాను!'
నా చుట్టూ భూమి గిరగిర తిరిగినట్లనిపించింది. ఆగిపోయేటంత వేగంతో నా గుండె కొట్టుకోడం ప్రారంభించింది. నా శరీరంలోని రక్తమంతా ఒక్కసారి తలలోకి ప్రవహించినట్లయింది. అవమానంతో, కోపంతో నా హృదయం భగ్గున మండింది.
'నువ్వు సరిగ్గా కనుక్కున్నావా? నీకు తెలిసింది రుజువు చేసుకున్నావా?'
'వాళ్ళ సవతి తల్లినే కలుసుకున్నాను. ఆవిడే చెప్పింది. కోడలూ, మనుమడూ కూడా ఆవిడ దగ్గిరే ఉన్నారు. అతను రాసిన ఉత్తరం ఒకటి వాళ్ళింట్లో కనిపించింది. నిన్న యిక్కడ చూసిన రైటింగే , సందేహం లేదు! ఇరుగూ, పొరుగూ కూడా బాగా వాకబు చేశాను. తెలిసిన విషయాలన్నీ యదార్ధమే. నేను ఫలానా కారణం చేత వచ్చానని వాళ్ళ కింకా చెప్పలేదు. తలెత్తుకోలేక పోయాను' నా మనసక్కడ లేదు.
అందాల రాశి ఆ వారణాశి. అందిన జాబిల్లి ఆ గంగమ్మ తల్లి. అరుదైన చెంగల్వ అలనాటి ఆ పడవ. అంతా వృధా! దగా!!
రెండు మూడు రోజులు భోజనం చెయ్యలేదు. నాలుగైదు రోజులు నిద్ర పోలేదు. ఇప్పుడన్నీ యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. మామూలుగా స్కూలు వర్కు చేసుకుంటూనే ఉన్నాను. అన్నయ్య ఉండబట్టలేక తల వాచేటట్టు చివాట్లు పెడుతూ ఆయనకి ఉత్తరం రాశాడు. దానికి జవాబు రాయడానికి కూడా ఎంత సిగ్గులేకపోయిందో చూడండి.
మధురా.
మీ అన్నగారి ఉత్తరం యిప్పుడే అందింది. నేను మీరనుకున్నంత దుర్మార్గుడ్ని మాత్రం కాదు.
పదిహేడేళ్ళప్పుడు, నాలో ఏ భావమూ వికసించనప్పుడు నాకు పెళ్ళి చేస్తే అది భార్య అవుతుందా? నువ్వే చెప్పు. నాలో ప్రేమ అనేది కలిగింది అంటే అది నిన్ను చూసినప్పుడే. వివాహమైన వాడు ప్రేమకు అనర్హుడని ఏ శాస్త్రంలో ఉందొ నాకు తెలీదు. ఇప్పటికీ , ఇంకా నువ్వు కదన్నప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇంతకీ మన న్యాయశాస్త్రం ఒప్పుకోనంత మాత్రాన మన వివాహం ఆగిపోతుందా, చెల్లక పోతుందా?
ప్రేమకి మతాలూ, దూరాలు లేవు. అని మనమిద్దరం అనుకోగలిగితే సమ్మతమైన మరో మతం పుచ్చుకుని మరుక్షణం మనం పెళ్ళాడవచ్చు. లేకపోతె మరో మార్గముంది. నాకు ఫారెన్ స్కాలరు షిప్పు ఎలాగా వస్తుంది. ఎం.ఎ అయిపోయే నీకూ అదేమంత కష్టం కాదు. దేశం పొలిమేరలు దాటిన తరువాత మనం ఏ విమానంలో వివాహం ఆడినా అడిగేవాడు లేడు.
మధురా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఒక్కొక్కరికి మనకి తెలిసినంతవరకు - ఒక్కొక్కటే జన్మ. ప్రేమానందానుబంధం లేని బ్రతుకు వృధా.
నీ మనసెరిగి నిద్రపోయిన -- కేశవ .
గాయపడిన హృదయాన్ని మరింత కేలికినట్టున్న ఈ ఉత్తరాన్ని చదవగానే నాకు మరింత రోషం పెరిగింది. అది పట్టుకెళ్ళి అన్నయ్యకు చూపించాను. 'నేను జవాబు చెప్తాను రాయి' అన్నాడు మండుతున్న హృదయంతో. నేను అన్నయ్య చెప్పినట్టు రాశాను. కేశవకు.
నీకు తగిన జవాబు రాయకుండా ఎలా ఉండగలను?
ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటే జన్మ అని జ్ఞాపకం చేసిన ఓ కేశవం! నిన్ను కట్టుకున్న నీ భార్యది కూడా ఒక్క జన్మే అని మరచిపోయావా? కొంచెమైనా ' లా' తెలియక న్యాయశాస్త్రం మీద అదోలా విసుర్లు విసిరిన ఓ కేశవం!
పదిహేడేళ్ళప్పుడు ఏ భావం వికసిన్చినప్పుడు పెళ్ళి చేసుకున్న ఓ ఓ ఓ కేశవం! ఆ భావంతోనే కొడుకుని కన్నావా?
మనుషుల్ని మరికొంచెం జాగ్రత్తగా అంచనా వెయ్యి.
నీ తెలివినీ, ప్రేమనీ సమీపంలోనే ఉన్న గంగా ప్రవేశం చెయ్యి.
నీ కపట మెరిగి మేల్కొనిన -- మధుర.
మంజుల గారూ! మీ దగ్గిర దాచలేదు, దాచలేను కూడా. అన్నీ జరిగినవి జరిగినట్టు మీకు రాసుకుంటే గాని నాకు తోచలేదు. 'ఇంట్లో మందు మరచిపోయావు. రైల్లో ప్లాస్కు మరచి పోయావు . అంతకన్నా ముఖ్యమైన దేదీ వెళ్ళేలోగా యిక్కడ పారేసుకోవుగా?' అన్న మీ మాటలు మరచిపోలేను. ఆనాడు అలహాబాదు వెళ్లుంటే ఆ నమ్మకద్రోహి వలన అంత అపకారమూ జరిగి ఉండేది.
మా నాన్నగారు నాకు సంబంధాలు వెతుకుతున్నారు. ఈసారి నేను అడ్డు చెప్పడం లేదు!
మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతా సహస్త్రాలతో,
మధుర స్నేహ.
ఇంతకీ నేనేం చేశాను! పాపం సహృదయుడైన ఆ కృష్ణమూర్తి చేసిందిదంతా. ఆ ఉత్తరం అతనికి పంపిస్తే ఎంత సంతోషించునో! ఎంత వెతికినా అతని ఎడ్రసు మాత్రం దొరకలేదు. తమ్ముడూ , కృష్ణమూర్తి నువ్వెక్కడున్నావు? నీ చెల్లెలు చెడిపోయినా లోకంలోని నీ తక్కిన చెల్లెళ్ళు చేడిపోతారేమోనని నువ్వు పడిన ఆవేదన ఎలా మరచిపోను! నీకెలా తెలుపుకొను!
నిర్మలకి ఉత్తరం రాసి ఎన్నాళ్ళో అయింది. జవాబు లేదు. ఏరోజు కారోజు ఉత్తరాల కోసం చూడడం తోనే రోజులు వారాలు గడిచిపోతున్నాయి. అలా డాబా చివర కుర్చీలో కూచూనే దాన్ని. పొద్దుట ఎనిమిదిన్నరా, తొమ్మిదీ మధ్య ఆ వీధి చివర పోస్టు మేన్ దర్శన మయేది. గుండె వేగంగా కొట్టుకోనేది. ఒక్కొక్క యింటికి వెళ్ళి పోస్టు మేన్ ఏ మనియార్దరో రిజిష్టరు లేటరో పట్టుకువెళ్ళి యివతలికి రావడానికి ఆలస్యమైతే కొన్ని యుగాలు అయినట్లుండేది. ఇంకా నా మనసు ఆ యింటి వాళ్ళను ఎన్ని శాపనార్ధాలు పెట్టేదో చెప్పలేను. అతడు మా యింటికి రాకుండానే అల్లంత దూరం నుంచే 'ఏం వోయి నాగన్నా మాకేమన్నా ఉత్తరాలున్నాయా?' అని కేకేసేదాన్ని. 'లేవు తల్లీ" అనేవాడు.
'అ, చూడకుండా నీకేలా తెలిసిందీ? ముఖ్యమైన ఉత్తరం ఒకటి రావాలోయ్... రాకుండా ఎలా ఉంటుందీ? చూడుచూడు' అనేదాన్ని. 'అవును తల్లీ, ఏదో ఉన్నట్టుంది, పెద్ద కాలమై పోయిందా కళ్ళు సరిగ్గా కనపడవు-- పనిమనిషి కిచ్చి పైకి పంపమని శెలవా? తమరే దిగోస్తారా?' 'ఎందుకూ నేనే వస్తాను' నాలుగేసి మెట్లు ఒక్కొక్కసారే గెంతెస్తూ ఇంచుమించు పరుగెడుతూ వచ్చేసరికి తోలు సంచీలోంచి వెతికి నాగన్న నాకిచ్చే ఉత్తరం ఎటువంటిదనీ ? ఓ మనియార్డరు రసీదు! తప్పుతే యిన్సూరెన్సు డిమాండు నోటీసు!
ఇక మా యిద్దరి సంభాషణ ఇంచుమించు యిలా నడిచేది.
'ఏమండీ, మా వాళ్ళ దగ్గిర్నించి ఉత్తరం రాలేదండీ.'
'అయితే ఏమంటావ్?'
'మా అన్నయ్య ఒంట్లో ఎలా ఉందండోనండి.'
'కులసాగానే ఉండి ఉంటుంది. లేకపోతె తెలియబరచరూ?
'అలా తెలియబరిచే వాళ్ళయితే అనుకోడం దేనికండి.'
'తెలియబరిస్తే మాత్రం నువ్వు నమ్మేవు గనుకనా?'
'లేదనుకోండి.'
'మరి?'
'ఏమిటో నాకేం తోచడం లేదండి. మా అన్నయ్య జబ్బెక్కువాయిందేమోనని భయంగా ఉందండీ.'
'అబ్బబ్బబ్బ ...ఎప్పుడూ లేంది యిలా భయాలూ ఆందోళనలూ నీకెలా పట్టుకున్నాయ్? అలాంటి దానివి మరో నాలుగు రోజులుండి రాలేకపోయావా?
'అప్పటికే ఆలస్యమై పోయింది. మిమ్మల్ని, మధురిమనూ వదిలి యింకెన్నళ్ళూ ఉండగలను చెప్పండి?'
'అయితే యిప్పుడెం చేద్దాం అంటావ్?'
'మరేం లేదు. వాడేలా ఉన్నాడో అని నా బెంగ . పోనీ, వో టెలిగ్రాం యిస్తే?'
'దానికి మాత్రం వాళ్ళు సరైన సమాధానం యిస్తారని నమ్మకం ఏముంది ?'
'పోనీ, మీరు ట్రంక్ టెలిఫోన్ లో మాట్లాడి చూస్తె?'
'అబ్బబ్బ ....అదే ధ్యాస....అదే గోల.'
'పోనీ వెళ్ళి నాలుగు రోజులు ఉండి వస్తానండీ?'
'నీ యిష్టం, నాకు తెలీదు. ఏకంగా అక్కడే ఉండి పోవలసింది.'
ఈ మాట పట్టుకు నేనెక్కడ బయలుదేరను! అదిగాక, ఆయనకి ఆఫీసుకి ఇనస్పెక్షను అవడం వల్ల బొత్తిగా తీరుబడి అవడం లేదు. నేను కదలడానికి అవకాశమూ లేదు! అయన అన్నారని కాకుండా నా మాటుకు నేను ఆలోచించుకున్నా మాట్లాడితే ఇల్లు కదిలి వెళ్ళడం ఏమీ సబబుగా కనిపించలేదు. వచ్చి ఇరవై రోజులున్నా కాలేదు. ఆ కామేశ్వరి వచ్చి వెళ్ళిన తరువాత ఎక్కడి సామాను అక్కడ సర్దుకోడానికే మొన్న మొన్నటి దాకా సరిపోయింది. పాలవాడికీ, చాకలవాడికి, హోటల్ వాడికీ వందలికి వందలు కాతాలు చూస్తుంటే మతే పోతోంది. ఎంతసేపూ పక్కింటి పిల్లలతో ఆడుకుంటూ కూచుని ఒక క్షణం చదవని ఆ మధురిమను చూస్తె నయానో భయానో చెప్పవలసింది ఎంతైనా ఉందని పోస్తోంది. కాని దేనిమీదా నా మనస్సు లేదు. ఇక్కడ ఉండనూ లేను. తెగించి అన్నయ్య దగ్గిరకు వెళ్ళనూ లేక పోతున్నాను!
ఆ మరునాడు అన్నయ్యకు ఆఖరి ప్రయత్నంగా మరొక ఉత్తరం రాశాను.
ఒరే అన్నా,
నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లెల్ని ఎందుకురా ఇలా ఎదిపిస్తావ్? పదిహేను రోజుల క్రిందట వదిన చేత ఉత్తరం రాయించావు, నీకు రోజురోజుకి ఆరోగ్యం చేకూరుతుందని , ఏమో ఎంత ఆలోచించినా ఇది నిజమని నా మనస్సు నమ్మలేక పోతున్నది. పోనీ మళ్ళీ మీ దగ్గిరనుంచి ఉత్తరామేమైనా ఉందా అంటే అదీ లేదు. నేను వచ్చేటప్పుడు రెండ్రోజుల కోక ఉత్తరం రాయమనీ, లేకపోతె నాకు తోచదని చేతిలో చెయ్యి వేయించుకుని మరీ వచ్చాను. ఏదీ నేను వచ్చి ఎన్ని రోజులయింది, నాకు వచ్చిన ఉత్తరాలేన్ని? వచ్చిన ఉత్తరం ఒకటీ కూడా ఏమాత్రమూ నమ్మశక్యం కానిది.
చిన్నప్పుడు, నాన్నగారు ఒక మంచం మీద పడుకుంటే మరొక పక్క మీద మనిద్దరం ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని పడుకున్న రోజులు అప్పుడే మరచి పోయావా అన్నయ్యా? ఒకరి చేతులో ఒకరు చెయ్యి వేసుకుని చేసుకున్న శపధాలు నువ్వు మరిచి పోయావని నన్ను నమ్మమంటావా అన్నయ్యా? చేతులు విడిపోయినా, మరొకరితో చెయ్యి కలిపినా మన మనసులు ఒకటే అన్న విషయం నన్ను మరిచి పోమంటావా అన్నయ్యా?
నీ భార్య అందరి లాంటిది కాదు. నాకు తెలుసు. నా భర్త కూడా అందరి లాంటి వారూ కారు. అది నీకు తెలుసు? అన్నీ తెలిసుండి నన్నెందుకిలా వేధిస్తావు? వేధించి నువ్వేమిటి సాధిస్తావు?
ఈ ఉత్తరం అందిన పది రోజుల్లో నాకు సంతృప్తి కలిగించే సరి అయిన సమాధానం రాకపోయిందో -- నేను మాత్రం వచ్చేస్తాను, నా భర్తా, పిల్లా ఏమయిపోయినా సరే. నీకు పూర్తిగా ఆరోగ్యం కలిగేదాకా అక్కడే ఉండిపోతాను, నువ్వూ నీ భార్యా పిల్లలూ తన్ని తగిలేసినా సరే.
ఉత్తరం నేనే స్వయంగా పోస్టు చేసి వచ్చాను. వస్తుంటే సరళ మా ఇంట్లో కూచుని ఉండడం కనిపించింది.
'ఎండుకక్కా అనవసరంగా కలవరపడతావు? జబ్బు ఎక్కువవడంగాని తగ్గడం గాని మన చేతుల్లో ఏముంది? నువ్వు ఒకవేళ వెడితే మాత్రం ఏం చెయ్యగలవు? తెలిసిన భోగట్టాల్ని బట్టి కులాసాగా ఉందనే నమ్ముదాం. మా నాన్నగారికి మళ్ళీ తిరగబెట్టిందని నిన్న మళ్ళీ ఉత్తరం వచ్చింది. తెలిసి నేను చేయగలిగింది ఏమిటి చెప్పు? మాటాడితే అంతంత దూరం అయన పంపగలరా, నేను వెళ్ళగలనా?' అని కళ్ళనీరు తుడుచుకుంది.
