Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 36

 

    'త్వరగా చెప్పమంటే నీక్కాదా ఏమిటి?'
    'చంద్రహారాలు కూడా అమ్మేశాను అవసరం వచ్చి' చూస్తుండగా అయన కుడి పెడికిలి బిగుసుకు పోయింది. క్రోదాగ్ని జ్వాలలూ వెదజల్లుతూ లేచి కూచున్నారు.
    'ఎందుకు? అది నువ్వు ఎప్పుడు అమ్మినట్టు?'    
    ఆ స్వరమూ మారిన ఆ స్వరూపమూ చూస్తుంటే నాలో మిగిలిన కాస్త వోర్పు హరించుకు పోయింది.
    'ఎందుకంత గట్టిగా అరుస్తారు? తగినంత అవసరం రాకపోతే ఎవరు మాత్రం నగల్ని అమ్ముకొంటారు?'
    'అంటే నేనెందుకు నీ నగని అమ్మేనని అడగడమా?'
    అని నా జవాబుకి ఇంకా వ్యవధి ఇవ్వకుండానే 'అలా అయితే ఆ ముఖ ప్రీతి మాటలు దేనికి? పైకి ఆ తీపి కబుర్లు దేనికి? నీ కడుపులో ఉన్న కల్మషమేదో అప్పుడే వెళ్ళగక్కితే తీరిపోనే!' అన్నారు.
    'మీ రనవసరంగా రెచ్చిపోతున్నారు. ఏవేవో వూహించుకి ఎప్పుడూ ఆడని మాటలు అంటున్నారు.
    'అవును, మాటలు నావి. చల్ల చల్లగా క్రియ లేమో నీవి. వెయ్యి రూపాయల నగ అది. మాట వరసకైనా చెప్పకుండా అమ్మెయ్యడానికి నీకు అధికారం ఎవరిచ్చారో!'
    'అధికారం' అన్న మాట విన్నగానే నా ఒళ్ళు మండిపోయింది. ఇక నా నాలికే నా కంతటికీ ఏలికై కూచుంది.
    'అధికారాలూ, హక్కులూ అన్న ప్రసక్తే వస్తే నాకు లేని హక్కును నేనేమీ దుర్వినియోగం చేసుకోలేదు. ఆ సంగతి లేని అధికారం ఎవరు చేలాయించారో వాళ్ళకే తెలియాలి.'
    అభిప్రాయ బెధాలన్నవి రాకనే పోవాలి గాని వచ్చిన తరువాత మాటల ఈటెలు హృదయాన్ని చేసే పదునైన గాయాలు ఏ మారణాయుధాలూ చెయ్యలేవు. సామాన్యులకు సహితం ఆ సంగతి స్పష్టంగా తెలుసు. కాని ఎన్నిసార్లు ఎంత గట్టిగా పళ్ళతో కరిపించినా, నాలికకి బుద్ది ఉండదు. ఎన్నిసార్లు లెంపలు వాయించుకున్నా, ఎంతటి సభ్యతలూ, సంస్కారాలు ఉన్నాయనుకున్నా , ఎంతగా చదువుకున్న వాళ్లైనా , ఎన్నెన్ని పర్యాయాలు బుద్దులు వచ్చి బుర్రలు బొప్పి కట్టినా నాగరికులు అనబడే మానవులు కూడా ఈ బలహీనతను మానుకోలేకుండా ఉన్నారు. మాటలు రాని జంతువుల్ని, పక్షుల్నీ, పసిపిల్లల్ని, మూగ వాళ్ళనీ ప్రపంచమంతా సానుభూతితోనూ, సాదరం తోనూ చూడ్డానికి కారణమేమో! జవాబు చెప్పని భగవంతుణ్ణి భక్తితో కొలవడానికి అన్ని కారణాలతో పాటు ఇదే ఒకటేమో! 'లేని అధికారం ఎవరు చేలాయించాలో వాళ్ళకే తెలియాలి' అంటే వూరుకోగల మొగాల్లెంత మందుంటారో వాళ్ళకి తెలియాలి. మావారు మాత్రం వూరుకోలేదు.    
    'నీ నగను అత్యవసర పరిస్థితుల్లో నేను అమ్మడం లేని అధికారం చెలాయించడం అయితే నువ్వే నా దానివి అయినప్పుడు నీ ఒంటి మీద బంగారం నాది కాక మరెవరి దవుతుందని ముందుగా నువ్వే శలవిచ్చావే, హక్కులన్నీ ధారాదత్తం చేసినట్టు , ఆ మాటలూ ఈ మాటలూ ఒకే నోటి నుండి వచ్చేయని ఎలా నమ్మడం?'
    'ఎలా నమ్మేనా? చెబుతా వినండి. గతాన్ని మరచిపోయి ముందు సంగతే ముందుంచుకొడం మంచిదని ముందే శలవిచ్చారనే తమరు ఎప్పుడో అమ్మిన నా నగ గురించి ఇప్పుడింత బాధ పడుతున్నా రెండుకో తమరు? ఇంట్లో నేను ఉండగానే ఏమంటానో అని నాతొ చెప్పకుండా తమరు నగ అమ్ముతే సరిపెట్టుకున్నానే, ఇంత కంటే ముఖ్యమైన విషయంలో మీరు దగ్గిర లేని పరిస్థితుల్లో నేను నగ అమ్ముతే - నా సంస్కారాన్ని మెచ్చుకున్న తమరు , ఏమాత్రం సహించలేక బయటపడి పోయారెండుకో? మీరే పరిస్థితుల్లో నగను అమ్మేరో మారు మాట ఆడకుండా విని సానుభూతితో సమర్ధించానే, ఎంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో నే నది ఉపయోగించవలసి వచ్చిందో ఇప్పటికైనా కనుక్కునే కనీస సభ్యత కోల్పోయా రెందుకో తమరు?
    నా కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరిగితే నేనే సిగ్గు పడి తుడుచుకున్నాను. అయన అహంకారం నా మాటల వల్ల పెరిగిందే గాని తగ్గలేదు.
    'ఎవరు చేసిన పనులు వారు సక్రమమైనవని సమర్ధించుకొడంలో అసంబద్ధ మేమీ లేదు. విచక్షణ కోల్పోయిన వాళ్ళతో వాదించీ, ప్రయోజనం లేదు! నేను నీ నగ అమ్మినా అది పూర్తిగా మన సంసార సౌఖ్యం కోసం, మన కుటుంబ గౌరవం కోసం ఉపయోగించాను. నీ నగ నువ్వేం చేసి ఉంటావో వూహించడం నువ్వనుకున్నంత కష్టమైనది కాదు. ఆ దరిద్రపువాళ్ళ కోసం, ఆ రోగిష్టివాళ్ళ కోసం ఉపయోగించి ఉంటావు. అంతకన్న ఏముంది.'
    అపుకుందామన్నా నా కన్నీళ్ళు ఇక ఆగలేదు. జ్ఞాన వైరాగ్యాలను మించిన ఆయురారోగ్యాలు ఉన్నాయేమో నాకు తెలీదు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మంచికే పరిశ్రమించే పరమ యోగులు ఎప్పుడూ ఉంటారు. అస్తికతను మించిన ఆరోగ్యం , సంతృప్తి ని మించిన సౌభాగ్యం ఉంటాయా? మా అన్నయ్య రోగిష్టి వాడూ మా వదిన దరిద్రపుదీ అయితే ఇక లోకంలో ఆరోగ్యం అన్నమాటకు నిర్వచనం ఎటువంటిదో నా వూహకు మాత్రం అందనిది. గంపెడు కష్టాలలో ఉన్నవాళ్ళూ పుట్టెడు రోగాలతో బాధ పడుతున్నవాళ్ళనీ అనవలసిన మాటేనా ఇది? ఆప్తులైన వారిని ఆదుకోవలసినా విధానమేనా ఇది? నా కళ్ళమ్మట నీటి చుక్కలే కాదు, నిప్పురవ్వలూ కురిశాయి.
    'మీ భావాల పరిదీ, మీ ఫడికట్టు రాళ్ళ పరిమితి ఇంతేనా? ఇంతవరకేనా? స్వంత చెల్లెలి కోసం సర్వస్వం సమర్పించిన స్వార్ధ త్యాగి మా అన్నయ్య ఈనాడు రోగిష్టి వాడైనాడా? వినయ సహనాలలో విన్రమ వచనాలతో భర్తను మించే పరమసాద్వి మా వదిన మీకీ నాటికీ దరిద్రపు గొట్టు మొహం ఆయిందా? మీ మానసిక ఆరోగ్యం ఇంతగా దెబ్బతిందా? పరుల ఇంట్లో వందలు వందలు పై ఖర్చు చెయ్యడానికి సందేహించని మీ కామేశ్వరి సిరిసంపదలు చూసి మురిసిపోయే స్థితికి దిగిందా మీ మనసు? భార్య పదిహేను  రోజులపాటు పై వూరికి వెడితే భరించలేక చీట్ల పేక శరణు గోరినంత దృడత్వం గల తమరేనా మంచివాళ్ళైన మావారి గురించి వ్యాఖ్యానిస్తుంట? కొంచెమైన మంచీ, చెడ్డా....'
    'నోర్మూయ్'
    'ఇంతవరకు వచ్చాక, పడకూడని మాటలు పడ్డాక, అనకూడని మాటలు అన్నాక ఇంకా ఎంతకని మూస్తారు నోరు? నా నోరు మూయగలరేమో , నా కన్ను కప్పగలరేమో నా మనస్సు ఆలోచించడాన్ని అపగలరా?'
    'నువ్వింతగా ఎకరువు పెట్టినా నీ తప్పిదాన్ని కప్పుకోలేవు. శాశ్వత సత్యాలను కాదనలేవు. ఎవరు చేసినది వారికి సరీఐనదే. ఎవరి వాళ్ళు వాళ్ళ కేక్కువే.'
    'కావచ్చు. కాని ప్రపంచంలో మంచీ చెడ్డా అంటూ లేవా? మాట మీరన్నది నేనన్నది అని కాక దాని మటుకు దానికి విలువ లేదా?'
    'ఉండొచ్చు . ఉండకపోవచ్చు. అది వేరే విషయం. కాని ఈ వాగ్వివాదం వల్ల ఇవాళ చాలా విషయాలు నేను గ్రహించగలిగాను. అంధకార సదృశమైన నీ అహంకారం స్పష్టంగా చూడగలిగాను. నేను చేసిన తప్పు కూడా గ్రహించగలిగాను. కాని అపరాధం సరిదిద్దుకునే అవకాశం సాధారణంగా నాలాంటి వాళ్ళకు లభించదని రుజువు చెయ్యడానికి నీ విజ్రుంభణే చక్కని ఉదాహరణ. ఇష్టం వచ్చినట్టు నిన్ను ఎదగ నియ్యడమే నేను చేసిన తప్పు. ఆశ్రయాన్ని కూడా ఎదిరించి ఉపేక్ష చేసి అవమానపరిచే అంత ఎత్తుకు ఎదిగేవు నువ్వు.
    ఆకర్షణతోనూ, అందం తోనూ నన్ను వశ పరచుకుని అవుననిపించుకుని ఆకాశ శిఖరాలు అందుకున్నావు నువ్వు. నిన్నిప్పుడేమని ఏం లాభం? నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళ కిచ్చే స్థానం నిన్ను భాగస్వామిని చేసుకుని నీతో జీవితమంతా ముడి పెట్టుకున్న వాళ్ళకి నువ్విక ఎప్పుడూ ఇవ్వలేవు. మీ అన్నయ్యా, వదినా వాళ్ళ ముందు నీ భర్తా సంసారమూ నీకిక కనిపించవు. అన్నిటిని మించి -- ఆఖరికి నిన్ను కూడా మించి నువ్వు చదువు కున్నదాని వయ్యావు. ఇప్పుడు నీ కంటికి మరీ పురుగుల్లా మనుషులు కనపడ్డం లో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు నువ్వు నన్నే లెక్క చెయ్యని స్థితిలో ఉన్నావంటే అదేమని అనుకోడం అవివేకం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలను కూడా బ్రహ్మాండమంత పెద్దదిగా పెంచి మనుషుల మనసుల మీద మరి మాననంతగా గాయాలు చెయ్యడం నీకు తెలుసు. ఎందుచేత ఇలా జరిగింది? నీ చదువుంది. మీ అన్నయ్య ఉన్నాడు. ఇంకేవరేలా పొతే నీకేం?'
    అవివేకంతోనూ అవిద్యతోనూ కూడిన ఇలాంటి ఆరోపణలకు ఎవరు ఏమని జవాబు చెప్పగలరు? 'మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు' అనే ధోరణి లో జరుగుతున్న ఈ సంభాషణ ఎక్కడికి తీసుకెడుతుందో మాత్రం ఎవరు చెప్పగలరు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS