మైసూరు నుండి ఊటీకి పోయే మార్గం చాలావరకు నిర్మానుష్యమైన అడవి ప్రదేశం లోనే ఉంది. బాట కిరువైపులా దట్టంగా పెరిగిన పచ్చని చెట్లు, వెదురు పొదలు , ఆ వెనుక కొండలు, అవన్నీ తాము చూడబోయే ఊటీలోని అందాలను గూర్చి సూచన ప్రాయంగా ముందే చూపుతున్నట్లు తోస్తోంది. అడవి లో అక్కడక్కడ ఫారెస్టు ఆఫీసర్ల బంగళాలు. చెదురు మదురుగా ఉన్నా చిన్న చిన్న గ్రామాలలోని నిరాడంబర ప్రజలు కనపడినప్పుడు తప్ప మిగతా ప్రయాణమంతా పచ్చని ప్రకృతి మధ్యగా సాగిపోతుంటే ఏదో నూతన ప్రపంచంలో ఉన్నట్టుగానే అనిపిస్తోంది.
వాళ్ళు ఎక్కిన బస్సులోనే రాజస్థాన్ యూనివర్శీటి కి చెందిన పదిహేను మంది విద్యార్ధులు, వాళ్ళను బొటానికల్ ఎక్స్ కర్షన్ కు తీసుకు వస్తున్న ఒక బోటనీ ప్రొఫెసరు కూడా ఉన్నారు.
ఆ ప్రొఫెసరు ను చూడగానే కాంతారావు కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎన్నాళ్ళ తరువాతనో ఒక బాల్య మిత్రుని కలుసుకున్నట్లు సంబర పడిపోయేడు.
తనని తాను పరిచయం చేసుకుని, వెళ్ళి ప్రొఫెసరు పక్కనే కూర్చున్నాడు. అంతవరకు దిగులుగా, ఒంటరిగా ఫీలవుతూ కూర్చున్న ఆ ఏభై ఏళ్ళ ప్రొఫెసరు తన డిపార్ట్ మెంటు కు చెందిన వాడే అయిన ఒక యువకుడి ని చూడగానే ముఖం చాటంత చేసుకున్నాడు.
అతను భార్యాతోనూ, పిల్లల తోనూ కలిసి ప్రయాణం చేస్తున్నాడని తెలిసిన తరువాత కొంచెం చిన్న బుచ్చుకున్నాడు. ఈ 'కోతి మూక' ను వెంట బెట్టుకుని రావటం వల్ల భార్యని, పిల్లలను తీసుకు రావటానికి ఆయనకి వీలుపడలేదు. తన కూతురు సునీత, కొడుకు అనిల్ తన వెంట వస్తానని మారాం చేసేరు కాని తమ కుటుంబాన్ని కనుక తీసుకు వస్తే వాళ్ళ ముందు పొరపాటున యీ అల్లరి విద్యార్ధులు తన నేప్పుడైనా ఆటలు పట్టించేరంటే యింక తన పరువు కాస్తా పోతుంది. ఆ భయంతోనే ఫామిలి ని తన వెంట తీసుకు రాలేదు ఫ్రోపెసర్. కాని ఆ సంగతిని కాంతారావు తో మాత్రం చెప్పలేదు.
కాంతారావు విద్యార్ధు లందరినీ ఓసారి పరికించి 'మీ శిష్యులు చాలా బుద్ది మంతుల్లా ఉన్నారే! ఏమీ చప్పుడు చెయ్యకుండా కూర్చున్నారు.' అన్నాడు.
'ఆ మరే! అని పళ్ళు బయట పెట్టి నవ్వేడు ప్రొఫెసరు. మనసులో మాత్రం 'వీళ్ళా! బుద్ది మంతులా! ఇంకా నయం' అని అనుకున్నాడు.
'మేము చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ ఒకసారి కాశ్మీర్ ఎక్స్ కర్షన్ కు తీసుకు పోయేడు. అప్పుడు మేమంతా ఆయనను ఎంతగా ఆటలు పట్టించేమని! పాపం ఇప్పుడు ఆయనను తలుచుకుంటే జాలి వేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉన్నాం కనుక అయన అప్పుడు ఎంత అవస్థ పడ్డాడో అర్ధమవుతోంది. అప్పుడు మాత్రం అలాటి ఆలోచనలే వచ్చేవి కావు.' అన్నాడు కాంతారావు బిగ్గరగా నవ్వుతూ.
కాని ప్రొఫెసరు గారు మాత్రం మనస్పూర్తిగా నవ్వలేక పోయేరు. 'వీళ్ళ సంగతి అప్పుడే యేమయింది? ముందు ముందు వీళ్ళు ఎంత బుద్ది మంతులో మీరే చూద్దురు గాని' అని మనసులోనే కసిగా అనుకున్నాడు.
'ఆరోజులు నిజంగా బంగారు రోజులండీ! ఏ బాధ్యతలూ, చింతలూ లేని నిర్మలమైన ఆ విద్యార్ధి జీవితం తలచుకుంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ జీవితాన్ని అనుభవించాలని పిస్తోంది నాకు' అన్నాడు కాంతారావు.
ప్రొఫెసరు అతని వంక ఓ పిచ్చివాణ్ణి చూసినట్టు చూసేడు. 'ఏమిటి ? మీరు -- విద్యార్ధి అవాలని కోరుకుంటున్నారా? ఈ రోజుల్లో 'విద్యార్ధి ' అనే పదానికి అర్ధం యేమిటో తెలుసా? సీమటపాకాయ లేదా పచ్చి గూండా!' అన్న మాటలను పైకి అనలేక మనసులోనే దాచేసుకున్నాడు. అయన యిరవై ఏళ్ళ ఉపాధ్యాయ వృత్తిలోనూ అయన ఎదుర్కొన్న సంఘటనలూ, విద్యార్ధులు, ఆయనకు విద్యార్ధి లోకం యెడల ఒక సినికల్ యాటిట్యూడ్ ని యేర్పరచుకునేట్లు చేసినాయ్.
ఒక దీర్ఘ విశ్వాసం విడిచి ప్రొఫెసర్ అన్నాడు. 'మీతరం వారికీ విద్యార్ధి జీవితం బంగారు జీవితమే. ఇప్పటి విద్యార్ధులకైతే మరీ జీవితం వడ్డించిన విస్తరిలా ఉంది. వీళ్ళకు చదువుకోవటానికి ఎన్నో అవకాశాల నేర్పరస్తూన్నారు ప్రభుత్వం వారు. ఫీజు లేకుండా, పుస్తకాలు, కొనుక్కోకుండా అద్దెకు తెచ్చుకున్న పుస్తకాల నైనా ఒక్క సారైనా చదవకుండా, కనీసం క్లాసులకు అటెండయి పాఠాలన్నా వినకుండా, ఈ రోజుల్లో విద్యార్ధులు పరీక్ష లలో సునాయాసంగా ప్యాసవుతున్నారు. వీళ్ళను చూస్తుంటే నాకు నిజంగానే అసూయగా ఉంటోందండీ! మా రోజుల్లో టీచర్లంటే యెంత భయపడేవాళ్ళం! ఈ రోజుల్లో టీచర్లే విద్యార్ధులను చూసి భయపడవలసి వస్తోంది . ఏం చేస్తాం ఖర్మ!' అన్నాడు విరక్తి గా ప్రొఫెసరు.
కాంతారావు కి ఆయనని చూస్తె జాలి వేసింది. ఆయన విద్యార్ధులతో ఎంత అవస్థ పడుతున్నాడో అయన ముఖమే చెప్తోంది. చివరకు ఆయనను ఒదార్చాలనే ఉద్దేశ్యంతో 'మీరు మరీ విద్యార్ధులనంతగా తీసి పారేయకండి. కాలేజీ లలో ఉండగా కాస్త ఆకతాయిగా ఉంటారు కాని, యూనివర్సిటీ లోకి వచ్చిన తరువాత ప్రోఫేసర్లంటే భయం భక్తీ చూపిస్తారండీ , పైగా ఆయనకు కూరగాయలు కొనుక్కురావటం, క్యూలో నిలబడి ఆయనకు రేషన్ తెచ్చి పెట్టటం, పిల్లలకు సాయంత్రం పూట షికారుకు తీసుకు పోవటం మొదలైన పన్లన్నీ ఎంతో శ్రద్దగా చేస్తారండీ! లేకపోతె మార్కులు రావని వాళ్ళకీ బాగా తెలుసు.' అని కొంచెం అతని మీదకు వంగి ' మనలో మన మాట నాకు ఎమ్మే లో ఫస్టు క్లాసు ఎలా వచ్చిందనుకున్నారు? నేను ఎమ్మే చదువుతున్న రెండు సంవత్సరాలు మా ప్రొఫెసరు గారికి పని మనిషి లేకుండానే గడచి పోయింది. చెప్పుకుంటే సిగ్గు చేటు. ఒకసారి మా ప్రొఫెసరు సతీసమేతంగా సినిమాకి వెళ్ళి తమ రెండేళ్ళ పాపకు నన్ను కాపలాగా ఉంచితే ఆ పిల్ల దొడ్డి కి కూడా కడగవలసి వచ్చిందండి. అందుకే వట్టి ఫస్టు క్లాసే కాక యూనివర్శిటీ ఫస్టు కూడా వచ్చెను నేను' అన్నాడు.
ఆ మాటలు వింటూనే ప్రొఫెసరు మతి పోయినంత పనయింది. ఈయనకి గాని నిజంగా పిచ్చి లేదు గదా? లేకపోతె నిజంగా జరిగిన దాన్ని గురించి యింత నిస్సంకోచంగా చెప్పుకుంటారా ఎవరైనా? లేక పరోక్షంగా తనని వెక్కిరించటం లేదు కదా యీయన? తను విద్యార్దులకు ఫస్టు క్లాసు లేలా యిస్తాడో తన స్టూడెంట్ల దగ్గిర కూపీ తీసి తెలుసుకుని తనని బెదర గోట్టటానికి ప్రయత్నించటం లేదు కదా?' అలా పరి పరి విధాల ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ప్రొఫెసర్ గారు.
ఆ ప్రొఫెసర్ గార్ని చూస్తె పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది కాంతారావు కి. అయన ముఖం లో తానాశించిన మార్పు కలిగినందుకు సంతోషించినా, పైకి మాత్రం గంబీరంగా ముఖం పెట్టి, కూర్చున్నాడు.
నిజానికి కాంతారావు చెప్పిన దాంట్లో సత్యం కొంతవరకు మాత్రమే ఉంది. ప్రొఫెసర్ గారి పనిమనిషి లా రెండు సంవత్సరాలు వ్యవహరించటం వల్ల తన బాచ్ లో ఒక విద్యార్ధి కి యూనివర్శిటీ ఫస్టు వచ్చిన మాట నిజమే! కాని ఆ విద్యార్ధి మాత్రం తాను కాదు. తను అలాటి పనులేవీ చెయ్యక పోవటం వల్ల ఎంత కష్టపడి చదివినా తనకు వచ్చింది సెకండ్ క్లాసే!
తరువాత కాంతారావు 'మీ యూనివర్శిటీ లో కాఫీలు గట్రా కొడ్తారండీ విద్యార్ధులు?' అనడిగేడు.
'అబ్బే! కాఫీలా! అవి కొట్టేరంటే వాళ్ళ పీకలు పిసికి వెయ్యటమే! మేమంతా చాలా స్ట్రిక్టు గా ఉంటాం పరీక్షల టైములో' అన్నాడు గంబీరంగా ప్రొఫెసర్.
ఐతే ఒకసారి ఒక స్టూడెంట్ కాఫీ కొడ్తుంటే పట్టుకున్నందుకు గాను తాను తిన్న దెబ్బల తాలూకు మచ్చలింకా వీపు మీద అలాగే ఉన్నాయన్న సంగతిని అతను తనమనసులోనే రహస్యంగా ఉంచేసుకున్నాడు.
బస్సు కొండ మీద ప్రయాణం చేస్తోంది. ఎత్తుకుపోయిన కొలదీ హటాత్తుగా వాతావరణం చల్లబడి పోవటం ప్రయాణీకులందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. రెండు వైపులా, ఎదురుగా ఎగుడుదిగుడు గా ఉన్న పర్వతాలు. వాటి మీద సరుకు చెట్లు, కాఫీ తోటలు విరివిగా కనిపిస్తున్నాయ్. కాఫీ తోటల 'మడులు' చూస్తుంటే చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం లో 'కాఫీ, తేయాకు పండు ప్రదేశము లేవీ? ' అన్న ప్రశ్న గుర్తు కొచ్చింది కళ్యాణికి.
ఆ తోటలను ఒకరోజు స్వయంగా కళ్ళతో చూస్తానని తానా పసితనం లో ఎన్నడూ అనుకోలేదు.
